మార్కండేయుడి తపోవనం వికారాబాద్!


Sun,October 8, 2017 05:01 AM

గ్రామ స్వరూపం

ఊరు: వికారాబాద్
మండలం: వికారాబాద్
జిల్లా: వికారాబాద్
పిన్‌కోడ్: 501101
జనాభా: 53,185
పురుషులు: 26422
స్త్రీలు: 26,763
అక్షరాస్యత: 64శాతం

సరిహద్దులు

తూర్పు: చేవెళ్ల
పడమర: ధారూర్
ఉత్తరం: నవాబ్‌పేట
దక్షిణం: పూడూర్
వృత్తి: వ్యవసాయం
ANANTAGIRI-HILLS

ఎక్కడ ఉన్నది?: హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ గ్రామం ఉన్నది.

ఎలా చేరుకోవాలి?: హైదరాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా నేరుగా వికారాబాద్ వెళ్లవచ్చు.

విశిష్టత ఏంటి?: ప్రఖ్యాతిగాంచిన అనంతగిరి వికారాబాద్‌లో ఉంది. వికారాబాద్ నుంచి అనంతగిరి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కండేయుడి తపోవనంగా చరిత్రకారులు చెబుతారు.

పేరెలా వచ్చింది?:

క్రీస్తుశకం 1893 కాలంలో ఐదవ పైగా అమీర్ నవాబ్ సర్ వికార్-ఉల్-ఉమ్రా-బహద్దూర్ ఆధీనంలో ఈ ప్రాంతం ఉండేది. ఆయన అక్కడి ప్రజలపై.. పాలనపై తనదైన ముద్ర వేశారు. అందుకే ఈ ప్రాంతానికి వికారాబాద్ అనే పేరొచ్చిందని చెప్తున్నారు గ్రామస్తులు. నాటి కట్టడాలు, వికార్ మంజిల్ ప్యాలెస్, సుల్తాన్‌మంజిల్ ఇప్పటికీ ఉన్నాయి.

ప్రకృతి అందాలు:

వేల సంవత్సరాల నుంచి అనంతగిరి కొండలు వివిధ రకాల ఔషధ, వృక్ష సంపదతో అలరారుతున్నాయి. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణంలో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయంటారు. దేశంలోనే అతిపెద్ద టీబీ శానిటోరియం క్రీస్తుశకం 1945లో ఇక్కడ స్థాపితమైంది. పూర్వకాలంలో రుషులు అనంతగిరి కొండల్లో తపమాచరించేవారు. వివిధ రకాల వనమూలికలను సేకరించి చుట్టు పక్కల ప్రజలకు వైద్యం చేసేవారని అంటారు.
BHAVNASI-GUNDAM

ప్రచారంలో కథ:

వేల సంవత్సరాల క్రితం మార్కండేయుడు శివసాక్షాత్కారం పొందిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి భూమండలంలో ఆదిశేషునకు పుచ్చభాగమైన అనంతగిరులలో ప్రశాంత వాతావరణమని భావించి ఇక్కడ అనంతగిరి కొండల్లో తపమాచరించాడు. అదే సమయంలో ముచకుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. దేవేంద్రునితో ప్రశంసలందుకొని భూలోకమున అలసట తీర్చుకునేందుకు ఇక్కడకు వచ్చాడు. ద్వాపర యుగంలో కాల యవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని నాశనం చేసి మధురానగరం స్వాధీన పరుచుకున్నాడు. అతని విజృంభణకు బలరామకృష్ణులు భయపడుతున్నట్టు నటిస్తూ ముచుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండ గుహలోకి వచ్చారు. కాలయవనుడు బలరామ కృష్ణులను ముచకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వచ్చి నిద్రాభంగం కావించాడు. కాలయవనుడిని కోపదృష్టిచే భస్మం కావించాడు. బలరామకృష్ణులు సంతోషించి ముచకుందుడికి సాక్షాత్కరించారు.

దివ్యదర్శనం:

కలియుగ ప్రారంభంలో మార్కండేయ మహామునికి తపోఫలంగా అనంత పద్మనాభుడు దివ్యదర్శనం ఇచ్చాడు. మార్కండేయ క్షేత్రంగా వెలిసింది. మార్కండేయుడు గంగాదేవిని తన సరోవరానికి రప్పించుకున్నాడు. ఇక్కడ గుండాన్ని భవవాసి తీర్థమని పిలుస్తారు. అనంతగిరి క్షేత్ర మహాత్యము విష్ణు పురాణంలో వివరించబడింది.

2524
Tags

More News

VIRAL NEWS

Featured Articles