మాదే.. మొదటి మొబైల్‌స్టోర్!


Sun,February 11, 2018 01:06 AM

పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాదు. పరిస్థితులు, అవసరాలు వ్యక్తిలోని ప్రతిభను, శక్తిసామర్థ్యాలను బయటకు తీస్తాయి. తమ స్వీయశక్తిని అంచనా వేసుకొని శక్తిమేరకు కృషి చేస్తే తివిరి ఇసుమున తైలమ్ము దీయవచ్చు అనే మాట నిజం చేయవచ్చు. సామాన్యులుగా పుట్టి, ఇబ్బందులతో, కష్టాలతో సహజీవనం చేస్తూ ఇప్పుడు విజయానికి ఇంటిపేరుగా మారిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారంతా నేటి తరానికి స్ఫూర్తిప్రదాతలు. వారిలో ఒకరు సంగీత మొబైల్స్ ఎం.డి. సుభాష్ చంద్ర. తండ్రి స్థాపించిన సంస్థను దినదినాభివృద్ధి చేస్తూ దేశమంతటా విస్తరించి వ్యాపార దిగ్గజంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
MD-Subhash
-ప్రవీణ్‌కుమార్ సుంకరి,
సెల్ : 9701557412


ఏంటండీ ఎలా ఉన్నారు? మీరు.. మీ మొబైల్స్ బాగున్నాయా? మీ ఫోన్ ఎక్కడ కొన్నారు? సంగీతలోనేనా? ఇన్ని ప్రశ్నలడుగుతున్నాడు.. ఈయనెవరా? అని డౌటొచ్చిందా? నేనండీ సంగీత మొబైల్స్ ఎం.డి. సుభాష్ చంద్రని. మీలో చాలామంది ఆన్‌లైన్‌లో ఫోన్ కొంటే తక్కువ ధరలో, ఆఫర్లో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ సంగీతలో మొబైల్ కొంటే అంతకంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది తెలుసా? ఈ మాటలేవో.. సంగీతలో సేల్స్ పెరుగడానికి కాదు. ఒక మొబైల్ కొన్నందుకు అమ్మిన వాళ్లే కాకుండా కొన్నవాళ్లు కూడా లాభపడాలనే ఆలోచన మాది. ఆ ఆలోచనతోనే ప్రైస్ చాలెంజ్ పెట్టాం. ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన మొబైల్ ఎంత ధరకు కొనాలనుకుంటున్నారో.. అదే ధరకు మేమిస్తాం. మా దగ్గరకు రండి. ఒకవేళ మీరు కొన్న తర్వాత ఆ ఫోన్ ధర తగ్గితే బిల్ తీసుకొని రండి. ఎంత తగ్గిందో ఆ డబ్బులు మీకు చెల్లిస్తాం. ఇది ఇప్పుడు కాదు.. రెండళ్ల కిందటే ప్రైస్ డ్రాప్ ప్రొటెక్షన్ పేరుతో పరిచయం చేశాం. ఫోన్ డ్యామేజ్ అయితే 30 రోజుల లోపు మా స్టోర్‌కి వస్తే పగిలిన ఫోన్ తీసుకొని ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకే మీకు కొత్త ఫోన్ ఇస్తాం. మిగిలిన డబ్బులు మీకే ఇస్తాం. ఇలాంటి ఆఫర్లు ఇప్పటి వరకు దేశంలో ఎవరూ ప్రవేశపెట్టలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేమేదో లాభాలు సాధించాలని కాదు. గత 45 ఏళ్లుగా మీకు సేవ చేస్తున్నాం. మా సేవల ద్వారా మీరు లాభపడాలన్నదే మా ఆశ.

నాకు పదిహేడేళ్ల వయసున్నప్పుడు నాన్న వ్యాపార బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటి నుంచి కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశాను. నాన్న నా మీద ఉంచిన నమ్మకాన్ని ఏనాడూ వమ్ము కానీయవద్దు అనుకున్నాను. పెద్దగా చదువుకోకపోయినా నాన్న చెప్పే మెళకువలు, సలహాలు పాటిస్తూ సంగీతను లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నంచేశా. 2002 వరకు బెంగళూరులో సంగీత మొబైల్ స్టోర్ మాత్రమే ఉండేది. 2002లో అక్కడే రెండో షోరూం, 2005లో హైదరాబాద్‌లో, 2007లో తమిళనాడులో, 2017లో గుజరాత్‌లో ప్రారంభించాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా 430 సంగీత మొబైల్ స్టోర్స్ విస్తరించాం. నాన్న ఒక్కరే మొదలుపెట్టిన సంగీత స్టోర్స్‌లో ఇప్పుడు మూడువేల మంది ఉద్యోగులున్నారు. 2002లో సొంత బ్రాండ్‌తో యూరోటెల్ పేరుతో దేశీ మొబైల్స్ తయారుచేసి అమ్మినం. మేం తయారుచేసిన మొబైల్ మొట్టమొదటి దేశీ మొబైల్. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. 2007లో వచ్చిన మైక్రోమ్యాక్స్ మొబైల్ తొలి దేశీ మొబైల్ అనుకుంటారు. కానీ దాని కంటే ఐదేళ్ల ముందే మేం తయారుచేసి అమ్మాం. కాకపోతే అప్పుడు మేం తయారుచేసిన మొబైల్స్ సీడీఎంఏ ఫార్మాట్‌లో ఉండేవి. అప్పటికీ ఇండియాలో ఆ ఫార్మాట్ సక్సెస్ కాలేదు. జీఎస్‌ఎం ఇచ్చి ఉంటే దేశీ మొబైల్స్ అమ్మకాల్లో యూరోటెల్ మొదటిస్థానంలో ఉండేది. యూరోటెల్ ప్లాన్ ఫెయిల్ కావడంతో అదే సంవత్సరం అను డిస్ట్రిబ్యూషన్స్ పేరుతో సౌత్ ఇండియాలో మొబైల్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ స్టార్ట్ చేశాం. సోనీ మొబైల్స్ ఇండియా మొత్తం మేమే పంపిణీ చేశాం. 2007లో స్పైస్ మొబైల్స్, 2008లో మైక్రోమ్యాక్స్ మొబైల్స్ పంపిణీ మేమే చేశాం.

2008, 2009, 2010 వరుసగా మూడు సంవత్సరాలు వెయ్యికోట్ల టర్నోవర్ సాధించగలిగాం. ఈ సమయంలో చెన్నైలో వేవ్‌టెల్ అనే మొబైల్ కంపెనీ బాగా నడుస్తున్నది. మొదటి స్థానంలో సంగీత ఉంటే.. రెండో స్థానంలో 21 స్టోర్స్‌తో వేవ్‌టెల్ అనే మొబైల్ స్టోర్స్ నడుస్తుండేది. వేవ్‌టెల్‌ని కొనేస్తే మనకు పోటీగా ఉండదని భావించాం. 13 కోట్లకు వేవ్‌టెల్ కొన్నాం. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బెలగాణీ ఫాంథర్స్ పేరుతో ఒక క్రికెట్ టీమ్ కొన్నాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల నాన్న సంగీత స్టోర్స్‌ని సక్సెస్ బాటలో నడిపించగలిగారు. కానీ వేవ్‌టెల్ కొనడం, యూరోటెల్ మొబైల్ తయారుచేయడం, క్రికెట్ టీమ్ కొనడం అనే నిర్ణయాలు ఆ సమయంలో తీసుకోదగినవి కావు. ఫలితంగా నష్టాలు చవి చూడాల్సివచ్చింది. అయినా నాన్న ఏమీ అనలేదు. వ్యాపార బాధ్యతలు నాకు అప్పజెప్పిన తర్వాత వ్యాపారంలో పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదు. ఆయనిచ్చిన మోరల్ సపోర్ట్ నాకు ధైర్యం చెప్పింది. ఆయన జీవితమే నాకు ఆదర్శం. ఆయన జీవితమంతా త్యాగాలమయమే. వ్యాపారంలో అన్నిసార్లు లాభాలు సాధించడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొంత నష్టపోయాం. ఆ తప్పులు మాకు కొత్త పాఠాలు నేర్పాయి. నెగెటివ్ ఆలోచనలు రానీయలేదు. నువ్వు నమ్ముకో.. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకెళ్తే ఫలితం వెతుక్కుంటూ వస్తుంది అనే సూత్రాన్ని నమ్మాను.

కుటుంబ పరిస్థితుల కారణంగా పెద్దగా చదువుకోలేదు. ఇంటర్ వరకే ఆపేశా. అప్పటికే మేం బెంగళూరులో స్థిరపడ్డాం. నాన్న పేరు నారాయణరెడ్డి. అమ్మ హనుమాయమ్మ. నాన్న ఉద్యోగరీత్యా రెండేళ్లు మేం చెన్నైలో ఉన్నాం. విజయ్ కంపెనీస్‌లో నాన్న మేనేజర్‌గా ఉద్యోగం చేసేవారు. 1972లో నాన్నకు చెన్నై నుంచి బెంగళూరుకు బదిలీ అయింది. రెండేళ్లు విజయ్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తర్వాత ఎందుకో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అన్నీ నాన్నే అయ్యాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాక బెంగళూరులో 1974లో సంగీత పేరుతో గ్రామ్‌ఫోన్ రికార్డులు ఫేజర్లు, కంప్యూటర్లు, టీవీలు అమ్మే ఎలక్ట్రానిక్ పరికరాల స్టోర్ పెట్టారు. సంగీత అనే పేరు పెట్టడానికి కారణం గ్రామ్‌ఫోన్ రికార్డులకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. అందులో వచ్చే సంగీతాన్ని అందరూ ఆస్వాదించేవాళ్లు. గ్రామ్‌ఫోన్ రికార్డు అంటే సంగీతానికి కేరాఫ్ అడ్రస్ అన్నమాట. అందుకే మా స్టోర్‌కి సంగీత అనే పేరు పెట్టారు నాన్న. అప్పుడు మాకు ఇల్లు లేదు. నాన్న, నేను రోజంతా షాపులోనే ఉండేవాళ్లం. అమ్మ లేదు కాబట్టి.. హోటల్ నుంచి భోజనం తెప్పించుకునేవాళ్లం. రాత్రి షాపులోనే పడుకునేవాళ్లం. అప్పట్లో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక స్టోర్ పెట్టి కంప్యూటర్లు అమ్మిన ఘనత నాన్న గారిదే. అప్పట్లో ఒక్కో పేజర్ ధర పదివేల రూపాయలకు పైగా ఉండేది. ఒక్కో నెలలో పదికి పైగా పేజర్లు అమ్మేవాళ్లం. చాలా కొద్దిరోజుల్లోనే సంగీతకు మంచి పేరొచ్చింది. దాదాపు ముప్పైయ్యేండ్లు బెంగళూరులో మాదొక్కటే స్టోర్ ఉండేది. ఆ తర్వాత మొబైల్ వాడకం పెరిగింది. అప్పటి వరకు నెట్‌వర్క్ ఏజెన్సీ వాళ్లు సిమ్‌కార్డు మాత్రమే అమ్మేవారు.
MD-Subhash2

సంగీత అనే పేరు పెట్టడానికి కారణం గ్రామ్‌ఫోన్ రికార్డులకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. అందులో వచ్చే సంగీతాన్ని అందరూ ఆస్వాదించేవాళ్లు. గ్రామ్‌ఫోన్ రికార్డు అంటే సంగీతానికి కేరాఫ్ అడ్రస్ అన్నమాట. అందుకే మా స్టోర్‌కి సంగీత అనే పేరు పెట్టాడు.

సిమ్‌కార్డ్ కొన్న తర్వాత మొబైల్ కోసం ఎక్కడెక్కడో తిరుగాల్సి వచ్చేది. అప్పటికీ ప్రత్యేకంగా మొబైల్స్ అమ్మే సంస్థ కానీ, స్టోర్ కానీ లేదు. బర్మా మార్కెట్, జగదీష్ మార్కెట్‌లాంటివి మాత్రమే మొబైల్స్ అమ్మేవి. వాటికి బిల్లు ఉండేది కాదు. దొంగలు అమ్మిన ఫోన్లు, స్మగ్లింగ్ చేసి అక్కడ అమ్మిన ఫోన్లు వాళ్లు అమ్మేవాళ్లు. వాటికి వారెంటీ, గ్యారెంటీ ఉండేవి కావు. అక్కడ కాకుండా వేరే చోట కొనే ప్రత్యామ్నాయం కూడా ఉండేది కాదు. ఈ సమయంలో 1997లో మొట్టమొదటిసారిగా ఇండియాలో సంగీత మొబైల్ స్టోర్ ఏర్పాటు చేశాం. దేశంలో ఒక స్టోర్ పెట్టి బిల్లు, వారెంటీ ఇచ్చి కొత్త మొబైల్ అమ్మిన సంస్థ ఏదైనా ఉన్నదంటే అది సంగీత మొబైల్స్ మాత్రమే. ఒకవేళ మొబైల్ పోయినా, దొంగిలించబడినా పూర్తి మొబైల్ విలువను చెల్లించే ఇన్సూరెన్స్ సౌకర్యం 1997లోనే కల్పించాం. అప్పటికి ఈ సాహసం ఎవరూ చేయలేదు. అంతేకాదు.. ఇప్పుడిప్పుడు ఆన్‌లైన్ స్టోర్లు రకరకాల రూల్స్ పెట్టి ఈఎంఐ మీద ఫోన్లు అమ్ముతున్నారు. కానీ మేం మొబైల్ ఇన్సూరెన్స్‌తో పాటే ఈఎంఐలో మొబైల్ కొనుక్కునే వీలు కల్పించాం. ఇప్పటి వరకు మాకు లక్షా రెండువేల మంది కస్టమర్లు ఉన్నారు. మా సేవలు గమనించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టడీస్ సంగీతకు ఉద్యోగ రతన్ అవార్డు ఇచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్లు ఎక్సలెన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ అవార్డు ఇచ్చారు.

గతేడాది జరిగిన సౌత్ ఇండియా రీటైలర్ సమ్మిట్‌లో కూడా అవార్డు ఇచ్చి గౌరవించారు. ఇప్పుడిప్పుడే మా బాబు చందురెడ్డి వ్యాపారంలోకి వచ్చాడు. గత మూడేళ్లుగా సంగీత బాధ్యతలు చూసుకుంటున్నాడు. నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు మా నాన్న జోక్యం చేసుకోనట్టే.. నేను కూడా జోక్యం చేసుకోవద్దనుకుంటున్నాను. ఒకరు చెప్తే నేర్చుకోవడం ఈ తరానికి అవసరం లేదు. టెక్నాలజీ సాయంతో ఏదైనా సాధించగల సత్తా ఈ తరానికి ఉంది. ఇప్పటి తరానికి నేర్పాల్సింది ఏమీ లేదు. జస్ట్ విలువలు నేర్పాలి అంతే. మీ సమయాన్ని సేవ్ చేసేందుకు త్వరలో షాప్‌నెంబర్ 47 డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నాం. గతంలో ఉండేది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ రీలాంచ్ చేయాలనుకుంటున్నాం. ఈ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన 47 నిమిషాల్లోనే మీ దగ్గరకు మొబైల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. బెంగళూరులో మేం పెట్టిన షాప్ నెంబర్ 47. అందుకే ఈ సైట్‌కి షాప్‌నెంబర్47డాట్‌కామ్ అని పెట్టాం. ఇప్పటికే మొబైల్ కొనడానికి బెస్ట్ ప్లేస్ ఏది అని సెర్చ్ చేస్తే వందకు తొంభై శాతం సంగీత అని వస్తుంది. రాబోయే రోజుల్లో ఏ వెబ్‌సైట్‌లో మొబైల్ కొనాలి? అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.. మీ అందరి సపోర్ట్‌తో.

748
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles