మాఊరుబడి


Sun,March 11, 2018 01:05 AM

తార్రోడ్డు పై కారు సాఫీగా పోతుంది. నా మనస్సు నన్ను విడిచి పాత జ్ఞాపకాలను, మధురస్మృతులను తిరగతోడుతోంది. మనస్సు ఎప్పుడెప్పుడు అక్కడ వాలుదామా అని వేగిర పడుతోంది. ఎన్నాళ్ళో వేచిన హృదయం....ఈనాడే ఎదురౌతుంటే..... .... ఇంకా తెలవారదేమి.... అన్నట్లు ఇంకా దరికి చేరదేమి...ఈ దూరం తరిగిపోదేమి.... అని నా మనసు పేరడీ పాడుకుంటోంది. పార్వతి, వనజ, సరస్వతి , లత అంతా అలాగే ఉన్నారా... ఎవరేం చేస్తున్నారో...ఎక్కడున్నారో... ఎన్నో సార్లు మనసులో అనుకుంది, చిన్ననాటి ఆ బాల్యం మళ్ళీ తిరిగి వస్తే బావుండని ఆ నాటి సోపతిగాల్లను మళ్లొకసారి కలిస్తే బావుండని...... కాని ఎలా.... ఉరుకులు పరుగుల జీవితం ... సొంత పిల్లల్ని, ఇంటి విషయాల్ని, కుటుంబ సమస్యలనే పట్టించుకునే తీరిక లేదు. అప్పుడు ఈ సెల్ ఫోన్ లు గట్రా ఉన్నా అందరి నంబర్లు ఉండేవేమో.... వారం కిందట +చీ7(మధు) నే ఫోన్ చేసిచెప్పేంత వరకు ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారని తెలీలేదు. +చీ7 అంటే మధు... అప్పట్లో అన్నింటికీ కూపీ లాగే వాడు. అందుకే గూఢచారి నంబర్ 786 నుంచి అ7 అని పెట్టాం. అప్పటి నుంచి అతని అసలు పేరే మర్చిపోయాం. చీమిడి ముక్కు లత, పిల్లికళ్ళ పార్వతి, పుస్తకాల పురుగు సరస్వతి, గూఢచారి మధు, పొగడపూల వనజ, చిర్రగోనే శివ, వంగోని (ఆట ఇష్టపడే) వెంకన్న ఇలా అందరినీ వేరే పేర్లతో పిల్చేవాళ్ళం. అప్పుడు క్లాస్‌లో తనే పెబ్బే. అంటే లీడర్ అన్నమాట. టీచర్ అందర్నీ అల్లరి చేయకుండా కూర్చోబెట్టమనేది. ఎవ్వరల్లరి చేసినా, వారి పేర్లు రాసి టీచర్ కిస్త అని భయపెట్టేది. ఎవ్వరికీ కనబడకుండా కాపీలో(నోట్ బుక్) తెరిచి పట్టుకొని సీరియస్‌గా ఎవ్వరు మాట్లాడినా వారి వైపు చూసి కాపీలో రాసినట్లు చేసేదాన్ని.

వాళ్ళు వెంటనే భయంతో నోటిపై వేలేసుకునేవారు. నేను చూడకుండా నోటిపై వేలువేసుకునే పక్కవాళ్ళతో చిన్నగా మాట్లాడేవాళ్ళు. టీచర్ వస్తే ఎవ్వరూ అల్లరి చేయకుండా బాగా చూసుకున్నానని మెచ్చుకునేది. అల్లరి చేసినవాళ్ళు వారి పేరు చెప్పనందుకు ఆరాధనగా చూసేవారు. మా కాపీలు దిద్దడానికి అందరివీ కలెక్ట్ చేసి స్టాఫ్‌రూమ్‌లో పెట్టమనేవారు క్లాస్ టీచర్ వెంకటేశం మాస్టారు. నేను ఆ కాపీలన్నీ అటు ఇటు పోకుండా పెట్టి సార్ తేలిగ్గా గుర్తు పట్టడానికి వాటిపై పెద్ద అక్షరాలతో తెల్ల కాగితంపై క్లాసు, సెక్షన్, ఎ సబ్జెక్ట్ అలా అన్నీ వివరంగా చూడగానే తెలిసిపోయేలా రాసేదాన్ని. నిజానికి స్టాఫ్ రూమ్‌లో అన్ని క్లాస్‌ల వాళ్ళవి చాలా ఉంటాయి కాబట్టి, సార్ ఒక్కో కాపీ తెరిచి అవి ఎ క్లాస్ వాళ్ళవి, ఎ సెక్షన్ వాళ్ళవి, ఎ సబ్జెక్ట్ వాళ్ళవి అని చూసుకునే శ్రమ తప్పేది. టీచర్ ఆ విషయం చెప్పి మెచ్చుకుంటూ క్లాస్ లో అందరితో చప్పట్లు కొట్టించేది. ఎప్పుడు గణితంలో 25కి 25 రావాల్సిందే నాకు. అలా తెచ్చుకొని అందరితో చప్పట్లు కొట్టించుకోవడం నా కిష్టం. అందుకు బాగా శ్రమ పడి చదివేదాన్ని. నిజంగా ఏ బాధా తెలియని ఆరోజులెంత మధురమైనవో...

ఒకసారి సరస్వతికి మలేరియా జ్వరం వస్తే మేము రోజు వెళ్లి జరిగిన పాఠాలు చెప్పి నోట్స్ ఇచ్చేవాళ్ళం. పొగడపూలంటే పడి చచ్చే వనజతో కల్సి పూలన్నీ ఏరి పొడవాటి కాడతో జడలల్లి మాల తయారుచేసి ఆ ప్రాంగణంలో ఉన్న సరస్వతి దేవికి వేసేవాళ్ళం. ఇక పరీక్షలయిపోయి ఒక్కపూట బడులొచ్చినా, మొత్తానికే పరీక్షలయిపోయి సెలవులు వచ్చినా చాలు ఆటలే ఆటలు... అమ్మ పిలిచేవరకు అన్నం తినాలని కూడా తెలిసేది కాదు. అమ్మ కుట్టే బట్టలలో కత్తిరించిన చిన్న చిన్న కొత్త గుడ్డలతో గుండ్రటి తల దానికి పసుపు బట్ట కట్టి మంచి బొమ్మ తయారు చేసేవాళ్ళం. బట్టతో ఉన్న ముఖానికి చీపురు పుల్లకి కాటుకతోనో, కలర్ పెన్‌తోనో కళ్ళు, తిలకం నోరు, చెవులు అన్నీ దిద్దేవాళ్ళం. అబ్బాయి బొమ్మ కూడా చేసి రెండింటికి పెళ్లి చేసేవాళ్ళం. చిన్న చిన్న కర్రలను నాలుగు వైపులా పాతి దానిపై పెద్ద ఆకులతో పందిరి వేసేవాళ్ళం. మాంసం అమ్మే నరసయ్య దగ్గర బక్కి (పలచగా ఉండే మాంసం, కొవ్వు) తీసుకొచ్చి రౌండ్ గా ఉండే గూన పెంక రెండు వైపులా అంటించేవాళ్ళం. దానిపై చేతులతో కొడుతూ అది మంగళ వాయిద్యాలలాగా వాయించే వాళ్ళం. చిన్న చిన్న మట్టి గురిగెలు అమ్మతో కొత్త కుండకు వెళ్లి కుమ్మరి సారయ్య దగ్గర తీసుకొచ్చి వాటిలో అన్నం వండేవాళ్ళం. ఇంట్లో నుండి పుట్నాలు, సమ్మక్క బెల్లం తీసుకొచ్చి పంచేవాళ్ళం. ఇవొక్కటేనా ఎండాకాలం వస్తే అమ్మ ఇంటి ముందున్న చింత చెట్టు దులిపించేది. కాయలన్నీ రాలేవి. అవన్నీ గింజలు తీసి చింతపండు కొట్టేవాళ్ళం. ఎవరెన్ని కొడితే అన్ని చింత గింజలు వారివే అన్నమాట.
SchoolMaster

ఆ గింజలతో ఒనగుంటలు, ఊదుడు ఆడేవాళ్ళం. దానికోసం సాయితగాల్లందరినీ పట్టుకొచ్చి మనిషికో బండ ఇచ్చి కొట్టించేదాన్ని. ఇంకా గచ్చకాయలాట. చిన్న చిన్న కంకర రాళ్ళు కొంచెం గుండ్రంగా ఉండేవి, చెరువు దగ్గర చాలా సాపుగా (నున్నంగా) ఉన్నరాళ్ళు ఏరుకొచ్చి అయిదు రాళ్ళతో కచ్చకాయలాట తెగ ఆడేది. ఒక్కొక్క కచ్చకాయ పైకెగరేసి అది కింది కోచ్చేలోగా ఎడమచేయి గోపురంలా నేలపై పెట్టి, కింద నేల మీద ఉన్న మిగతా కచ్చకాయల్ని చూపుడువేలు, బొటనవేలు మధ్యనున్న సందు గుండా లోనికి తోయాలి, పైనున్న కచ్చకాయ కిందకు వచ్చేలోగా తోసి పైనున్న కాయ పట్టుకోవాలి. ఇంకా పైకేగరేసిన కచ్చకాయ కిందకు వచ్చేలోగా కింద ఉన్న కచ్చకాయలన్నింటినీ అరచేతిలో తీసుకొని పై నుండి వచ్చే కాయ పట్టుకోవాలి... ఓ.. అలా వాటితో ఎన్నో ఆటలు... దాదాపు ఇప్పుడన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పటి పిల్లలకి రెండు చేతులతో ఆ కీ బోర్డ్ నొక్కుతూ టీవీతో కారుతో గుద్దడం, మోటార్ సైకిల్ తొక్కడం తప్ప ఆ ఆటల పసనే తెలీదు.

అంతే కాదు. నల్ల బండ, తెల్ల బండ ఆడుతూ, నీ బండంత అరిగరిగి కరిగిపాయే అంటూ కవ్వించడం, జంటటో క్కి పేరుతొ దొంగకు అందకుండా స్నేహితురాలి మరో చేయి అందుకోవడానికి మోసపోస్తూ పరుగెత్తడం... కాళ్ళు చాపి ఒక చేయి పై మరో చేయి పెట్టిఅవి తాకకుండా దూకడం కొంచెం కొంచెం ఎత్తు పెంచుతూ వంగబెట్టి దూకటం...అది మగవాళ్ళు ఆడనివ్వక పొతే లంగా ను గోచిలా చెక్కి మగవాళ్ళకు దీటుగా ... ఇలా ఎన్ని ఆడేవాల్లో... పిల్లికుప్పలు, పున్జీతం, డాడీ, పచ్చీసు ఎలా ఎన్ని ఆటలాడే వాళ్ళం. కుంటుడు, తొక్కుడు బిళ్ళ, అగ్గిపెట్టె ఆడుతూ పెంకాసు ముద్దిచ్చుకుని దేవుణ్ణి తల్చుకుని వెనక్కి విసురుతూ ఇల్లు కట్టడం అబ్బో... ఆ ఆటలేవేరు. శారీరక శ్రమ బాగా ఉండేసరికి ఆకలిబాగా అయ్యేది. అమ్మ కొత్తగా పెట్టిన మామిడికాయ తొక్కుతో ఒకటే బేసిన్‌లో అందరికీ నూనె వేసినూకల అన్నం కలిపి ముద్దలు పెట్టేది. ఎంత కమ్మగా ఉండేదో... ఒకసారి సబ్జాకు గింజలు అమ్మ తెచ్చి రాగి చెంబులోని నీళ్ళలో రాత్రి నానేసి తెల్లవారి ఉబ్బిన ఆ గింజలు షర్బత్ లో వేసి ఇచ్చేది . ఎంత కమ్మగా ఉండేదో.... ఒసారిలా చూసి తాను కూడా నానబోసింది.

కానీ ఎన్ని గంటలు నానబెట్టినా గింజలు ఉబ్బవు. నిజానికి తను నానా బెట్టినవి తులసి గింజలు . అవి సబ్జాక్ గింజలు ఒకేలా ఉండేవి. ఆలోచనల మధ్య కారు మా ఊరుదారి పట్టేసరికి ఎత్తుల వంపుల మట్టి రోడ్డు కుదుపులతో ఆత్మీయ స్వాగతం పలికింది. పెరిగిన నాగరికత గుర్తుగా అప్పటి పెంకుటిల్ల స్థానంలో చిన్న చిన్న బంగళాలు వచ్చాయి. నాన్న చనిపోవడంతో, ఇళ్ళు అమ్మేసి తమ్ముడు అమ్మను తనతోపాటు పట్నం తీస్కెళ్లాడు. దాంతో ఊరితో బంధం తెగినట్లయ్యింది. ఈ వేళ మళ్ళీ +చీ7 పుణ్యమాని హడావుడి ప్రపంచం నుంచి మనసు పొరల్లో మసకబారిన గోడలను కడిగి అడుగున పడిపోయిన జ్ఞాపకాలు తిరగదోడుతుంటే నిన్నమొన్న జరిగినట్లనిపిస్తున్నాయి. అప్పుడే నలబై ఏళ్ళు గడిచాయంటే నమ్మబుద్దికావడం లేదు.

చిరపరిచితమైన దారి ఎన్ని ఏళ్లయినా మర్చిపోను అనుకున్న నాకు అక్కడ మారిన చుట్టుపక్కల ఆనవాల్ల వల్ల అడుగుతూ స్కూల్ కెళ్ళాను. బయటగేటుకి, 1981 బ్యాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం అని రాసిన బ్యానర్ కనబడింది. దాని కింద పదవ తరగతిలో మేమంతా కల్సి బ్లాక్ అండ్ వైట్‌లో తీయించుకున్న గ్రూప్ ఫోటో ఎన్లార్జ్ చేసి ఉంది. కళ్ళ నిండా నీల్లొచ్చాయి. అన్ని ఏళ్ల తర్వాత ఆత్మీయులందరినీ కలుస్తున్న సంతోషం ఉరకలు వేస్తోంది. కారు దిగి ఆ ఫోటోను ఆప్యాయంగా చేతులతో తడిమాను. కళ్ళు చమర్చాయి. విశాలమైన గ్రౌండ్లో వేసిన షామియానా నుండి గోల గోలగా మాట్లాడుతున వాళ్ళలో కొందరు అటు వచ్చారు. వయసు మీద పడినా ఆ పోలికలు మర్చి పోలేను. మా బాపు దగ్గర డబ్బుల్లేక ఫీజు కట్టడం లేదని నేనేడిస్తే తను కట్టిన షావుకారు అమ్మాయి జానకి, జంటటోక్కి ఆడుతూ బోర్లా పడితే మోకాళ్ళు, చేతులు కొట్టుకు పొతే ఊదుతూ, వాళ్ళింటి నుండి అయోడిన్‌లో అద్దిన దూది తెచ్చి పెట్టిన డాక్టర్ ఆచారి కూతురు లత, జ్వరం వస్తే ఇంటి కొచ్చి టీచర్ చెప్పిన పాఠాలు రాసి ఇచ్చిన సుజాత, జామకాయల్ని, మామిడి కాయల్ని గౌను కింద పెట్టి కాకెంగిలి చేసి కొరికి తినడానికిచ్చిన వనజ.. వాళ్ళ నేలా మరుస్తాను. అంతా ఆప్యాయంగా వచ్చి చుట్టేశారు, అరె.. మనశారదే.. అంటూ. కళ్ళ నిండా నీళ్ళతో మసగ్గా కనబడుతున్న వాళ్ళని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాను.

+చీ7 వచ్చి పలకరించి కార్యక్రమం మొదలయ్యిందంటూ లోనికి రమ్మని తొందరపెట్టి లాక్కేల్లాడు. అందరం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు... ఏం చేస్తున్నారు విశేషాలడుగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ లోనకు నడిచాం.లోన కూడా అందరం ఒకరికొకరు విజిటింగ్ కార్డు, సెల్ నంబర్లు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఉండగానే కార్యక్రమం మొదలయ్యింది. వేదికపై అ7 తో పాటు ఇప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రక్కకు ఎవరో ముసలతను కూర్చొని ఉన్నాడు. పరీక్షగా చూసాను.

పళ్ళు ఊడిపోయి మొహం పోల్చుకోకుండా ఉంది కాని అతను మరెవరో కాదు మా వెంకటేశం మాస్టారు. దగ్గరకెళ్ళి నమస్కారం చేసాను. నవ్వుతూ ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరి పేరు వారి కుటుంబ పరిచయం, ఇప్పటి వివరాలు క్లుప్తంగా ఎవరిదీ వారు పరిచయం చేసుకున్నారు. తర్వాత కొన్ని వన్ మినట్ ఆటలు ఆడించారు. గెలిచిన వాళ్లకు బహుమతులు, అది కాక అందరికీ ఒకే రకమైన బహుమతులు అలా చాలా సరదాగా జరిగింది. భోజనాలు అయ్యాక తర్వాత +చీ7, అందరి సెల్ నంబర్లు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడిందీ... అప్పటి విశేషాలు అన్నీ చెప్పాడు. ఇప్పుడు స్కూల్ చాలా పాతబడిందని తాము గ్రౌండ్‌లో ఉన్నాం కాబట్టి తెలియలేదని, గోడలు శిథిలం అయ్యాయని, కప్పు కూలడానికి సిద్ధంగా ఉందని తలో చెయ్యి వేసి స్కూల్ నిలబెడదామన్నాడు. మాస్టారుగారి భార్య కాలం చేసినందున మాస్తారుకి ఏదైనా వ్యాపకం పెట్టాలన్నాడు. ఇప్పుడు అందరి సెల్ నంబర్లు ఫీడ్ చేసి ఈ సందర్బంగా ఒక చిన్న పుస్తకం చేస్తున్నానని అందులో అందరి నంబర్లు పొందుపరిచానన్నాడు. మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడాక నన్ను మాట్లాడమన్నారు. వెంకటేశం మాష్టారు నాతో, అందరి ముందు ఎప్పటికీ పాడించే పద్యం పాడాను... గోప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ...... కఫము కుత్తుక జొచ్చి నీ నామ స్మరణ కలుగునో కలుగదో.. నాటికీనాడే నే చేసేద నీ నామ స్మరణ దాశరధీ.. దయాపయోనిదీ....... మాస్టారితో సహా అందరి కళ్ళు చమర్చాయి. మాస్టారు చేయెత్తి నిండు మనస్సుతో ఆశీర్వదించారు. వెళ్ళగానే ఎవరి గోలలో వాళ్ళు పడి పోతాం, మన ఈ స్నేహబంధం ఇలాగే కొనసాగాలంటే ఏం చేయాలో చెప్పమన్నాను. అందరూ చెప్పినవి క్రోఢీకరించి ఒక ప్రణాళిక తయారు చేసాం.

1. దాదాపందరూ బాగానే ఉన్నందున తలా కొంత డబ్బు వేసుకుని, విరాళాలు సేకరించి ఆ పాఠశాల బాగుచేయించాలి.
2. అందులోనే కొంత డబ్బు బ్యాంక్‌లో ఫిక్స్ చేసి దాని వడ్డీతో ప్రతి యేడూ పేదపిల్లలకు పుస్తకాలు పంచాలి.
3. మా స్నేహితుల్లో ఉన్న పీడీ ఒకతను నిధులు ప్రభుత్వం నుండి అందేలా సహాయం చేస్తానని మాటిచ్చాడు.
4. మాస్టారికి అదే ఆవరణలో ఒక గదిని బాగుచేసి అందరి దగ్గరున్న పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి .
5. కనీసం ఏడాదికోసారయినా ఇప్పుడు ఎన్నుకున్న కార్యవర్గం సమావేశమయి అందరికీ జరిగిన విషయాలను సంక్షిప్తంగా తెలుపాలి. అయిదేళ్లకోసారి అయినా అందరూ కలువాలి.
ఇంతలో లోపల నుంచి వచ్చినట్లున్నారు స్కూల్ పిల్లలు. వాళ్ళ టీచర్లు తీసుకోచ్చినట్లున్నారు. అంతా ఒకే రకమైన ఆకుపచ్చ, తెలుపు యూనిఫాంలో ఉన్నారు. వాళ్ళంతా లయబద్ధంగా చప్పట్లు కొట్టారు. అవి మా బాధ్యతను మరింత పెంచాయి. ఆ పిల్లల్లో నాకు ఒక సరస్వతి, ఒక లత, ఒక వనజ కనబడ్డారు. ఎన్నుకున్న కార్యవర్గం తమవంతు బాధ్యత సక్రమంగా నిర్వహిస్తామని ప్రమాణం చేసింది. వందన సమర్పణ అయ్యాక జనగణమన.... పాడుతూ అంతా లేచి నిల్చున్నాం. మా రోజులల్లో ఏ కార్యక్రమం అయిపోయినా, కనీసం సినిమా అయిపోయినా చివరగా జనగణమన వేస్తే అందరం నిలబడి పాడి బయటకు వచ్చేవాల్లం. క్రమేనా హడావిడి ప్రపంచంలో ఎవరూ నిలబడక పోవడం తో గీతాన్ని అవమాన పరచినట్లు అవుతుందని వేయడం మానేశారు .
పడమట సూర్యుడు అస్తమిస్తున్నట్లు సంధ్య వెలుగు పరుచుకుంది. మేమంతా వాలే పొద్దులో అంటే దాదాపు యాభైలో ఉన్నవాల్లమే. చుట్టూ ఉన్న విద్యార్థులంతా పొడుస్తున్న పొద్దుల్లా ఉన్నారు. ఇప్పుడు అస్తమించినా సూర్యుడు రేపు మళ్ళీ తప్పక ఉదయిస్తాడు అని చెప్పకనే చెబుతున్నట్లుంది ఆ సన్నివేశం.కథలకు ఆహ్వానం

మనమంతా నగర యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతున్నాం. కొందరు అర్బన్.. సెమీ అర్బన్ కల్చర్‌కు అటూ ఇటూ తిరుగుతుంటే.. ఇంకొందరు అర్బన్ రూరల్ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ జీవనయానంలో ఎన్నో కథలు, వ్యథలు.. అర్బన్ కల్చర్‌తో ముడిపడి ఉన్న మానవ సంబంధాలు.. జీవన విధానాలు, వైవిధ్యాల చుట్టూ అల్లుకున్న కథలకు బతుకమ్మ స్వాగతం పలుకుతున్నది. కథనంలో వైవిధ్యం, పాఠకులను ఏకబిగిన చదివించగలిగే బిగువూ ఉండాలి. ఆధునిక కథన శిల్పం ఉన్న కథలకు ప్రాధాన్యం.

మీ కథలు పంపాల్సిన చిరునామా..
కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9,
కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034.
ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

875
Tags

More News

VIRAL NEWS