మలీద ముద్దలు కోరే.. బడాపహాడ్ దర్గా!


Sun,April 15, 2018 01:46 AM

దేవుడు ఏ రూపంలో ఉన్నా.. నిష్టతో తలిస్తే బాధల్ని దూరం చేస్తాడు. ఇష్టంతో కొలిస్తే కోరింది ఇస్తాడు. మనకు ఫలాలు ఇచ్చే ఆ దేవుడు కొబ్బరికాయ.. పరమాన్నం వంటి చిరు నైవేద్యాలను మాత్రమే కోరుతాడు. భక్తులిచ్చే ఈ చిరు నైవేద్యాలంటే దేవుడికి ఇష్టమట. అలా మలీద ముద్దలనే మహా ఇష్టంగా భావిస్తూ.. భక్తులు కోరింది నెరవేరుస్తూ ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నాడు బడాపహాడ్ హజ్రత్ హుస్సేనీ. ఈ దర్గాను బడాపహాడ్ అనీ.. పెద్దగుట్ట అనీ అంటారు. దర్గానే అయినా మత సామరస్యంతో సర్వమత ఆరాధ్య క్షేత్రంగా విలసిల్లుతున్న బడాపహాడ్ విశిష్టతే ఈ వారం దర్శనం.


ఎక్కడ ఉన్నది?:

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో ఉన్నది.

ఎలా వెళ్లాలి?:

హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునే వాళ్లు నిజామాబాద్ చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ 175 కిలోమీటర్లు. నిజామాబాద్ నుంచి వర్ని 31 కిలోమీటర్ల దూరం. వర్ని వెళ్లకుండా నేరుగా జలాల్‌పూర్ కూడా చేరుకోవచ్చు. దీని దూరం 24 కిలోమీటర్లు. నిజామాబాద్ బస్టాండ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. బోధన్ నుంచి కూడా చేరుకోవచ్చు. ఇక కామారెడ్డి నుండి వచ్చేవారు గాంధారి నుంచి కోనపూర్ మీదుగా చేరుకోవచ్చు.
Darga

దర్గా విశిష్టత:

సుమారు 700 యేండ్ల కిందట ఆలంగిర్ అనే సామంతుడు ఉండేవాడు. అతని దగ్గర నల్గొండ జిల్లాకు చెందిన హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ అనే వ్యకి తహసీల్దార్‌గా పనిచేసేవాడట. అతనికి రామన్న అనే వ్యక్తి సహాయకుడిగా ఉండేవాడట. ఇదిలా ఉండగా ఓ యేడాది ఈ ప్రాంతంలో తీవ్ర కరువు నెలకొంది. దీంతో ప్రజలకు తినడానికి తిండి కూడా దొరుకని పరిస్థితి ఏర్పడింది. ప్రజల కష్టాలు చూసి చలించిన షాదుల్లా.. డబ్బులు ప్రజలకే పంచేశాడు. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పంపిణీ చేశాడని తెలుస్తుంది. దీనికి ఆగ్రహించిన అధికార పెద్దలు షాదుల్లాను బంధించేందుకు ప్రయత్నిస్తారు. అప్రమత్తమైన షాదుల్లా రామన్నతో కలిసి జలాల్‌పూర్ అటవీ ప్రాంతంలోకి పారిపోతాడు.
Darga1

గొల్లసాయమ్మ సాయం:

గొల్లసాయమ్మ అనే ఆవిడ జలాల్‌పూర్ అటవీప్రాంతంలో పశువులను మేపుతూ షాదుల్లా ఉన్నచోటుకు వెళ్లింది. మహా దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న షాదుల్లాను చూసిందట. ఆయనకు సేవలు చేసిందట. రోజూ అన్నం, పెరుగు, పాలు అందించేదట. షాదుల్లా కోసం వెతుకుతున్న సైనికులకు సాయమ్మ గురించి తెలుస్తుంది. ఆమెను వెంబడించి మొత్తానికి షాదుల్లా ఆచూకీ తెలుసుకుంటారు. అదును చూసి బంధించగా షాదుల్లా తన దగ్గర ఉన్న కర్రతో భూమిపై ఒక దెబ్బ కొడుతాడట. భూమి ఒక్కసారిగా రెండుగా చీలిపోయి అందులోకి షాదుల్లా.. రామన్న.. వారితో ఉన్న కుక్క.. పిల్లి.. గుర్రం సమాధి అవుతాయట. దీనికి నిదర్శనంగానే గుట్టపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

మలీద ముద్దలు:

ఒకరోజు ఒక పశువుల కాపరి అడవిలో నిద్రిస్తుండగా పశువులు అదృశ్యమవుతాయట. వాటికోసం వెతుకుతుండగా ఆ దారిలో ఈ దర్గా కనిపిస్తుంది. అది చూసి అతడు తన పశువులు దొరికితే కానుకలు చెల్లిస్తానని, కందూర్ చేస్తానని మొక్కాడు. అలా మొక్కిన కొద్దిసేపటికే పశువులు దొరుకడంతో సంతోషించిన అతడు షాదుల్లా బాబాకు మలీద చేసుకొని కుటుంబంతో వచ్చి కందూర్ చేస్తాడు. ఇది ఊరంతా తెలియడంతో అందరూ పూజించడం మొదలుపెట్టారు. ఇలా మొక్కుతూ మలీద ముద్దలు సమర్పిస్తూ కందూర్ చేస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు.

చూడాల్సిన ప్రదేశాలు:

ఈ పెద్దగుట్టలో ఎన్నో దృశ్యాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సుమారు 1000కి పైగా ఒంపులు తిరిగిన మెట్లు, వాటి వెంట గుట్టపైకి ఎటు చూసినా గుంపుగా కనిపించే కొండముచ్చులు, వీటిని చూస్తూ గుట్టపైకి ఎక్కుతుండగా కనిపించే ఈ అడవి అందాలు చూడడానికి మనకు రెండు కళ్ళు చాలవు. ఇక వర్షాకాలంలో తప్పకుండా చూడాల్సిందే. ఇలా గుట్టపైకి చేరుకున్నాక షాదుల్లా దర్గా.. రామన్న గుడి.. గొల్ల సాయమ్మ సమాధి అన్నీ సందర్శించొచ్చు. ఈ దర్గా నుంచి బయటకి వచ్చి తూర్పువైపున అడవిలోకి కొద్దిదూరం వెళ్తే షాదుల్లా దగ్గర ఉన్నట్టుగా చెప్పే పులి నివాసమున్న గుహ.. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్తే సంవత్సరం పొడుగునా కిందకి జాలువారే నీటి ఊట, గుర్రం విగ్రహంతో పాటు ఈ గుట్టలపై నుంచి కనిపించే చెరువులు అద్భుతంగా దర్శనమిస్తాయి.

ఉర్సు ఉత్సవాలు:

రంజాన్ మాసంలో షాదుల్లా సమాధి అయ్యాడు. అందువల్ల ఇదే నెలలో మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ముంబైల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. మొదట ఉత్సవంలో భాగంగా జలాల్‌పూర్‌లోని ముజాఫర్ గఫర్ ఇంటివద్ద ఒంటె, గుర్రానికి పూజలు నిర్వహించి గంధం, నెయ్యితో ప్రత్యేక నైవేద్యం తయారుచేసుకొని గ్రామంలోని చావిడి వద్ద కవ్వాల్ నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి పెద్దగుట్ట వరకూ పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు చూసేవారిని ఆకట్టుకుంటాయి.

శ్రీకాంత్ మంచాల, msyadav456@gmail.com (కువైట్ నుంచి)

2658
Tags

More News

VIRAL NEWS

Featured Articles