మన సాంస్కృతిక కూడలి


Sun,August 28, 2016 01:09 AM

హైదరాబాద్ రాజ్యంలో తెలుగు భాష, సంస్కృతి, సాహితీవేత్తలకు, రచనలకు మొత్తంగా తెలుగు వారికి తగినంత గౌరవం, పోషణ, ఆదరణ దక్కాలనే ఆలోచనలతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పడింది. 1901 సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకు పాల్వంచ సంస్థానాధీశులు, నిలయ పోషకులు అయిన రాజ పార్థసారధి అప్పారావు బహదూర్ అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. ఈ నిలయ స్థాపకుల్లో హైదరాబాద్ మన్సబ్‌దార్, సంఘసంస్కర్త రావిచెట్టు రంగారావు, మునగాల జమీందార్, తెలంగాణ భూమిపుత్రుడు రాజా నాయని వెంకటరంగారావు, ఆయన దివాన్, చరిత్రకారుడు, సాహితీవేత్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తదితరుల పూనిక మేరకు ఈ నిలయం పురుడు పోసుకుంది. ఈ ప్రారంభ సమావేశంలో కవి పండితులు ఆదిపూడి సోమనాథరావు, మైలవరం నరసింహశాస్ర్తులు తమ కవితలను వినిపించారు. అలాగే, ఈ సమావేశంలో అప్పటి హైదరాబాద్ ప్రముఖులు ముత్యాల గోవిందరాజులు నాయుడు, మహబూబియా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న బ్రహ్మసమాజీయులు రఘపతి వెంకటరత్నం నాయుడు, కొఠారు వెంకటరావు నాయుడు తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. రావిచెట్టు రంగారావు ప్రాపకంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న ఆదిరాజు వీరభద్రరావు సమావేశంలో పాల్గొన్న వారందరికీ తాంబూలాలు అందించారు.
Srikrishnadevarayandhra
తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసంలో ఈ గ్రంథాలయ స్థాపన ఒక మైలురాయి. దాదాపు తెలంగాణ వైతాళికులందరికీ దీనితో సన్నిహిత సంబంధాలున్నాయి. రావిచెట్టు రంగారావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నాయని వెంకటరంగారావు, కొత్వాల్ వెంకటరామారెడ్డి, మాడపాటి హనుమంతరావు తదితరులందరూ ఈ నిలయం అభివృద్ధిలో భాగస్వాములే!
ఈ గ్రంథాలయ స్థాపన మైలురాయి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పుస్తకాలు, ముద్రణ, పాఠశాల, స్త్రీల సమావేశాలు, నాటక కంపెనీ, ఆరోగ్య పరిషత్, పరిశోధక మండలి, గ్రంథమాల స్థాపన -అన్నీ ఈ గ్రంథాలయానికి అనుబంధంగా నడిచాయి. తెలంగాణ సమాజం అభ్యున్నతికి ఇది కూడలిగానూ పనిచేసింది. తెలంగాణ వారి సాహితీ ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియజేయడమే గాకుండా మనోహర్ బర్వే, ద్వారం వెంకటస్వామి నాయుడు, కోడి రామ్మూర్తి నాయుడు, కావ్యకంఠ గణపతి ముని, సుసర్ల శ్రీరామమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణ -ఇలా ఎందరో ప్రముఖుల ప్రతిభను హైదరాబాదీయులకు పరిచయం చేసింది. అలాగే 1990 వరకు ఈ గ్రంథాలయంలో సన్మానం అందుకోని ప్రముఖ తెలుగు సాహితీవేత్త లేడంటే అతిశయోక్తి కాదు. పోతన మొదలు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాడ, కందుకూరి, పూండ్ల రామకృష్ణయ్య, చెలికాని లచ్చారావు, వంగూరు సుబ్బారావు, పురాణపండ మల్లయ్య, కోపల్లె హనుమంతరావు, చిలకమర్తి, శివశంకరశాస్త్రి, పానుగంటి, రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిరుపతి వేంకటకవులు, కట్టమంచి, జాషువా, మాడపాటి -ఇలా కొన్ని వందల మంది తెలుగు ప్రముఖుల జయంతి, వర్థంతి సభలు ఈ గ్రంథాలయంలో జరిగాయి. కాళోజీ, దాశరథి తదితరుల షష్ఠిపూర్తి ఉత్సవాలను కూడా ఈ సంస్థ నిర్వహించింది. భువన విజయ సప్తాహం (1942), రెడ్డియుగ సారస్వత సప్తాహం (1941), రామాయణ కల్పవృక్ష సప్తాహం (1950), సంపూర్ణ రామాయణ హరికథా సప్తాహం (1950) తదితర వారోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. 1901 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సాహిత్య, సామాజిక, రాజకీయ సభలు, సదస్సులు, సమావేశాలు ఈ నిలయంలో జరిగాయి. ఇప్పటికింకా జరుగుతున్నాయి.
ఈ గ్రంథాలయం తెలుగునాట సాంస్కృతిక, రాజకీయోద్యమాలకు దారి దీపమైంది. రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం (1904, హన్మకొండ), ఆంధ్రసంవర్ధినీ గ్రంథాలయం (సికింద్రాబాద్ 1905), మహబూబియా ఆంధ్రభాషా నిలయం (1911, ఎర్రుపాలెం), శ్రీ సిద్ధిమల్లేశ్వర గ్రంథాలయం (రేమిడిచర్ల 1913), శ్రీ ఆంధ్రవిజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయం (సూర్యాపేట 1917), ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం (నల్లగొండ 1918), శబ్దానుశాసనాంధ్ర భాషానిలయం (1918) తదితర గ్రంథాలయాలన్నీ హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రభావంతో ఏర్పడినవే!

తెలంగాణలోని వివిధ ప్రదేశాల నుంచి హైదరాబాద్‌లో విద్యాభ్యాసానికై వచ్చే వారందరూ ఇక్కడి సభలు, సమావేశాల్లో పాల్గొనడమే గాకుండా, తమ చదువు పూర్తి చేసుకొని సొంత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గ్రంథాలయాలను స్థాపించారు. ఈ గ్రంథాలయాల స్థాపకులు లేదా నిర్వాహకులు తమ ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలను బయటి ప్రాంతాల వారికి తెలియజేసేందుకు తొలిదశలో ఆంధ్ర ప్రాంతంలోని పత్రికలు ముఖ్యంగా ఆంధ్రపత్రికపై ఆధారపడ్డారు.
1902లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి ఆంధ్రప్రకాశిక, రవి, శశిరేఖ, దేశోపకారి, కృష్ణాపత్రిక, మంజువాణి, సరస్వతి, జనానా, హిందూ సుందరి పత్రికలు వచ్చేవి. అలాగే రావిచెట్టు రంగారావు తదితరులు తమ ఇంటికి వచ్చే దక్కన్ పోస్టు ఇండియా రివ్యూ, కళావతి తదితర పత్రికల్ని గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చేవారు. మహబూబ్‌నగర్ నుంచి వెలువడ్డ హితబోధిని (1913) పత్రికతో ఈ గ్రంథాలయంలో తెలంగాణ పత్రికల పరంపర మొదలైంది. ఇప్పటికీ ఈ గ్రంథాలయం అరుదైన పాత పత్రికలకు, పుస్తకాలకు నెలవు.

ఈ గ్రంథాలయానికి అనుబంధంగా 1906లో విజ్ఞానచంద్రికా గ్రంథమాల రావిచెట్టు, కొమర్రాజు, నాయని వెంకటరంగారావుల పూనికతో ఏర్పాటైంది. తెలుగు వారికి మొట్టమొదటిసారిగా అబ్రహాం లింకన్‌ని పరిచయం చేసిన ఘనత ఈ గ్రంథమాలకు దక్కింది. నవలలు, విజ్ఞానశాస్త్ర విషయాలను, జీవిత చరిత్రలు తదితర అంశాలపై దాదాపు 30 విలువైన పుస్తకాలను ఈ గ్రంథమాల ప్రచురించింది. మొదట హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రచురణ ప్రారంభమైనప్పటికీ తర్వాతి కాలంలో హైదరాబాద్ పోస్టల్ స్టాంపులు, బ్రిటీష్ వారి పోస్టల్ స్టాంపుల్లో తేడాలుండి, పుస్తకాల బట్వాడాలో ఇబ్బందులు తలెత్తాయి. అలాగే హైదరాబాద్‌లో గ్రంథమాల నిర్వహణ, ప్రచురణ ఇబ్బంది కావడంతో దాని కార్యాలయం మద్రాసుకు మారింది. అక్కడ వీరికి ఆచంట లక్ష్మీపతి, గాడిచర్ల హరిసర్వోత్తమరావులు తోడ్పడ్డారు.

శేషాద్రి రమణకవులు 1920వ దశకంలో తెలంగాణలోని మారుమూల పల్లెలు సైతం పర్యటించి కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు సేకరించారు. వీటినన్నింటినీ ఈ భాషానిలయంలోనే భద్రపరిచేవారు. వీటికి తోడు ఆంధ్రపరిశోధక మండలిని ఏర్పాటు చేసిండ్రు. దీని తరఫున అనేక కొత్త శాసనాలు సేకరించి పత్రికల్లో ప్రచురించేవారు. తర్వాతి కాలంలో అంటే 1923లో ఈ సంఘం కొమర్రాజు మరణానంతరం ఆయన పేరిట లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మారింది. తెలంగాణ శాసనాలు మొదటి భాగాన్ని ఆదిరాజు వీరభద్రరావు ఈ సంఘం తరఫున్నే వెలువరించారు.
Srikrishnadevarayandhra2
ఈ గ్రంథాలయానికి అనుబంధంగా 1907లోనే తెలుగు మాధ్యమంగా బోధించే ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే 1908లో మూసీకి వరదలు రావడంతో లైబ్రరీతో పాటు సగం హైదరాబాద్ మునిగిపోయింది. దీనికి తోడు మద్రాసులోని అర్బత్తునాట్ కంపెనీ(బ్యాంకు) దివాళ తీయడంతో అందులో దాచుకున్న లైబ్రరీ సొమ్ముకూడా పోయింది. దీంతో ఈ పాఠశాల కేవలం 14 నెలలు మాత్రమే సాగింది.

ఈ గ్రంథాలయం తెలంగాణలో మహిళా చైతన్యానికి పాదులు వేసింది. వివిధ సభలు, సమావేశాలు జరిగినప్పుడు స్త్రీలు కూడా వినేందుకు వీలుగా వారికోసం ప్రత్యేకంగా ఒక బాల్కనీని నిర్మించారు. తన భర్త మరణానంతరం గ్రంథాలయం నిర్మాణానికి ఆర్థికంగా ఆదుకుంటామని వాగ్దానం చేసిన వారు ముందుకు రాకపోవడంతో రావిచెట్టు లక్ష్మీనరసమ్మ పూనుకొని మూడు వేల రూపాయల్ని విరాళంగా లైబ్రరీ కమిటీకి అందించింది. ఈ సొమ్ములో 1700ల రూపాయలని వెచ్చించి ఇప్పుడున్న స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ 1918లో గ్రంథాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అది 1921లో పూర్తయ్యింది. ఈ భవనాన్ని కట్టమంచి రామలింగారెడ్డి 29 సెప్టెంబర్ 1921 నాడు ప్రారంభించారు. నాటక రంగానికి చేయూత నిచ్చేందుకు గ్రంథాలయానికి అనుబంధంగా ఆంధ్రభాషోజ్జీవని నాటక మండలిని ఏర్పాటు చేశారు. దీని తరఫున రామదాసు నాటకాన్ని ప్రత్యేకంగా రాసి ప్రదర్శించారు. తొలిదశలో ధర్మవరం రామకృష్ణచార్యులు, ఆయన సోదరులు గోపాల కృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవులు ఈ మండలి తరఫున అనేక ప్రదర్శనలిచ్చాడు.

ఇంగ్లండ్‌లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసి హైదరాబాద్‌కు వచ్చిన వేలూరి రంగధామనాయుడు తాను స్వయంగా ప్రముఖుల పెయింటింగ్స్‌ని వేసి లైబ్రరీకి బహూకరించారు. అంతేగాదు, ఈ గ్రంథాలయం నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. అలాగే ఈ గ్రంథాలయం వృక్షంగా నిలబడి నీడనీయడానికి, పండ్లు ఇవ్వడానికి నీరు పోసిన వారిలో అనేక మంది ఉన్నారు. వారిలో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, వడ్లకొండ నరసింహారావు, ఆదిరాజు వీరభద్రరావు, భాగ్యరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కె.వి.రంగారెడ్డి, బిరుదురాజు రామరాజు, కాళోజీ, కోదాటి, దాశరథి కృష్ణమాచార్యులు, నందగిరి ఇందిరాదేవి, ఎం.ఎల్. నరసింహారావు, కె.వి. రమణాచార్య ఇట్లా అనేకమంది ఉన్నరు.

ఇటీవల ముంబైలో డేవిడ్ సాన్సున్ లైబ్రరీకి పునర్వైభవం కల్పించేందుకు అక్కడి ప్రజలు, ప్రముఖులు కంకణబద్ధులై ప్రయత్నిస్తున్నారు. 1847లో ప్రారంభమైన ఈ లైబ్రరీ గురించి ప్రచారం చేసేందుకు చాయ్‌పే చర్చలు చేస్తున్నరు. ప్రభుత్వం అండదండలు దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకున్న మన చారిత్రక గ్రంథాలయాన్ని కూడా అందరూ ఓన్ చేసుకోవాల్సిన అవసరముంది. ఇది మాది... మా సాంస్కృతిక పతాక అని తెలంగాణ సోయితో వ్యవహరించాలి. ఇందులోని పాత పత్రికలన్నీ డిజిటలైజ్ చేశారు. కానీ, అవేవి పాఠకులకు అందుబాటులోకి రాలేదు. లైబ్రరీలోని అరుదైన పుస్తకాలు, పత్రికలు అందరికీ అందుబాటులోకి రావాలంటే వాటన్నింటినీ భాషానిలయం తమ వెబ్‌సైట్‌ని ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న పరిశోధకులకు ఈ సమాచారం అందుబాటులోకి వచ్చినట్లయితే మరింతగా తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై కొత్త వెలుగులు ప్రసరింప జేయడానికి వీలవుతుంది.

ఇప్పుడీ లైబ్రరీ పేరు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంగా మారింది. పేరులోని ఆంధ్ర మాయమైంది. అయితే, ఆ ఆంధ్ర స్థానంలో తెలంగాణ సోయిని నింపుకొని లైబ్రరీ మరింతగా పాఠకులకు చేరువ కావాల్సిన అవసరముంది. తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది. దీన్ని కాపాడుకోవాలె!
వ్యాసకర్త ప్రముఖ పరిశోధకులు.
వారి ఈ మెయిల్: [email protected]
- సంగిశెట్టి శ్రీనివాస్

2452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles