మన మత సామరస్యం


Sun,April 21, 2019 04:07 AM

దేశం సర్వమత సమ్మేళనం. అన్ని మతాల మధ్య సామరస్యత కనిపిస్తుంది. హిందువులు నిర్మించిన దర్గాలు, ముస్లింలు వెళ్లే ఆలయాలు, యేసు కనిపించే హిందూ దేవాలయాలు దేశంలో మత సామరస్యతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు మతసామరస్యతకు చిరునామాగా కనిపిస్తాయి. హిందూ పండగలకు ముస్లింలు హాజరవుతారు. దర్గాలకు వెళ్లి హిందువుల సైతం పూజలు చేస్తారు. ఆలయాల గోడలపై బైబిల్ సూక్తులు, ప్రవక్తా బోధనలు, శివుని శ్లోకాలు కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రాంతాల్లో అల్లాను, శివున్ని, యేసును మతాలకతీతంగా కలిసి ఆరాధిస్తారు.

యేసు, శివుడు ఒక్కచోటే

కర్ణాటకలోని బేల్గావి ప్రాంతానికి 28 కిలోమీటర్ల దూరంలో దేశనూరు అనే గ్రామం ఉంది. ఆ ఊరి గుడిలో యేసు, శివుడు పూజలు అందుకుంటారు. అక్కడ చర్చిఫాదర్, పూజారి కూడా ఇరు మతాల వారికి సేవలందిస్తారు. ఇరువురూ మెడలో రుద్రాక్ష మాలలు, క్రాస్ సింబల్ వేసుకొని నుదుట విభూతితో కనిపిస్తారు. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే చర్చిలా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లే కొద్ది హిందూ దేవాలయంలా దర్శనమిస్తుంది. అక్కడే శివలింగం, యేసు ప్రతిమ కనిపిస్తాయి. ఆ గ్రామంలోని ప్రజలు ఈ రెండు మతాల దేవుండ్లకు పూజలు చేస్తారు. 16వ శతాబ్దం నాటి నుంచి ఈ ఆలయంలో ఇలా పూజలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతారు. ఆ ఆలయాన్ని చర్చిగుడి అని పిలుస్తారు అక్కడి ప్రజలు. దీంతోపాటు సంక్రాంతి, దసర, క్రిస్మస్ వంటి పండగలను కూడా కలిసే చేసుకోవడం గమనార్హం. ఇంకా ఇతర మత వివాహాలు కూడా వీరు ఆమోదిస్తారు. ఎవరి ఇష్టమైన మతంలో వారు కొనసాగవచ్చు. మత మార్పిడి మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటారు. మతం కన్నా ప్రేమ గొప్పది, మానవత్వం గొప్పదని చెబుతారా గ్రామస్తులు.
rajastan title=

హైదరాబాద్ దర్గాలు

హిందూ ముస్లింలు భక్తి శ్రద్దలతో వెళ్లి ఫాతెహాలను సమర్పిస్తారు. దేవునికి మొక్కుకుంటారు. హిందువులు తమ పూజా విధానంలోని పద్ధతులను పాటిస్తారు. పూలను సమర్పిస్తారు. దీపాలు, ఆగరొత్తులు వెలిగిస్తారు. ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇవన్నీ హిందువులు ముస్లింల దర్గాల్లో భక్తిశ్రద్దలతో నిర్వహించే కార్యక్రమాలు. అంతే సమానంగా ముస్లింలు హిందువులను స్వాగతిస్తారు. హైదరాబాద్‌లోని మౌలాలీ దర్గా,పహాడీ షరీఫ్, జహంగీర్, యూసుఫియాన్ దర్గా, హుస్సేన్ షావలితో పాటు ఎన్నో దర్గాల్లో ఇలాంటివి మనం చూడవచ్చు. పవిత్రమైన ప్రదేశంలో హిందువులు, ముస్లింలు కలిసి భక్తి భావంతో మెలుగుతారు. వీటితోపాటు సూర్యాపేట జిల్లా పాలకవీడులోని ఉన్న జాన్‌పహాడ్ దర్గాలో కూడా హిందువులు, ముస్లింల ఐకమత్యాన్ని చూడవచ్చు. వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆ దర్గాలో ఇరు మతాల వారూ పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు నుంచి కూడా సందర్శకులు వస్తుంటారు. ముస్లింల పవిత్రస్థలం అయినప్పటికీ ఇక్కడ హిందువులు కూడా తమ పూజాకార్యక్రమాలు నిర్వహించడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది.

హిందువులు కట్టిన దర్గా

అరేబియా నుంచి వచ్చిన ఓ ముస్లిం సూఫీ సాధువుకు హిందువులు దర్గా కట్టించారు. అదే హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ దర్గా. క్రీ.శ. 1250 ప్రాంతంలో ఆ దర్గా శివారు గ్రామానికి బాబా షర్ఫొద్దిన్ అనే అరేబియన్ సూఫీ సాధువు అక్కడికి వచ్చాడు. అరేబియా నుంచి రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆయన ఢిల్లీలోని ఓ సూఫీ తత్వవేత్త దగ్గర శిష్యునిగా చేరాడు. ఆయన ఆదేశాల మేరకు కాలినడకన ఇప్పుడున్న పహాడీ షరీఫ్ దగ్గరకు చేరుకున్నడు. అక్కడి గుట్టపై చిన్న నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు తెలిసిన వనమూలికలతో ఔషధాలను తయారు చేసి ప్రజలకు అందించేవాడు. స్థానిక భాష రాకపోయిన సైగలతో ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ గుట్ట ప్రాంతానికి వెళ్లే పశువుల కాపర్లు అతనికి పండ్లు, పాలు అందించేవారు. ఒక రోజు గుట్ట కిందకు వచ్చి అతనికి సాయం చేయాలని అక్కడి స్థానికులను సైగల ద్వారా అభ్యర్థించాడు. దాన్ని అర్థం చేసుకున్న స్థానికులు ఆయనతో పాటు గుట్టను ఎక్కారు. అక్కడికి వెళ్లే సరికి ఓ అవు మృతి చెంది, దాని మీద తెల్లటి వస్త్రమొకటి కప్పి ఉంది. దాన్ని తెరిచి చూస్తే ఆ బాబా ముఖం కనిపించింది. స్థానికులకు అర్థమైంది. చనిపోయిన ఆవు ఆ బాబా అని అక్కడే సమాధి కట్టారు. దర్గా నిర్మించారు. అదే ఇప్పటి పహాడీ షరీఫ్ దర్గా అని స్థానికులు అంటారు.

అయోధ్యలో సర్వమత ప్రార్థనాలయం

రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్యలోని సత్యార్ ఆలయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సర్వమత పూజలకు కేంద్రంగా, అన్ని మతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నది. అయోధ్యలోని దంత్‌ధావన్ కుంధ్ రోడ్‌లోని ఈ ఆలయంలో అన్ని మతాలకు చెందిన దేవుళ్లు, చిత్రపటాలు కనిపిస్తాయి. రాముడు, మక్కా మదీనా, గౌతమ బుద్ధ, యేసుక్రీస్తు చిత్రాలను చూడవచ్చు. అన్ని మతాల పండుగలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మొదట తమ దేవున్ని పూజించి అనంతరం ఇతర మతాల దేవుండ్లకు కూడా పూజలు చేస్తారు.

మరికొన్ని ప్రాంతాలు

-అమృత్‌సర్‌లోని సిక్కు మతస్థుల ప్రార్థనాలయం హర్ మందిర్ సాహిబ్ నిర్మాణానికి ఒక ఇస్లాం మతస్థుడు పునాది వేశాడు. సూఫీ సాధువు మియామీర్‌తో ఆ ఆలయానికి శంకుస్థాపన చేయించారు. సిక్కు మతస్థులే స్వయంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
-కశ్మీర్‌లోని పుల్వామాలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ముస్లిం పవిత్ర స్థలంలో ఒకపక్కహోమం, మరోపక్క నమాజు చేస్తారు.
-గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలోని పిరానా గ్రామంలో ఆరు శతాబ్దాల నుంచి హిందూముస్లింలు కలిసి పూజలు చేస్తారు.
-హైదరాబాద్‌లో జరిగే అన్నిమతాల పండుగల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సర్వమతస్తులూ పాల్గొంటారు. రంజాన్, క్రిస్మస్, వినాయకచవితి, శ్రీరామనవమి పండగలు కలిసి చేసుకుంటారు. ఒక మతంలో పుట్టినప్పటికీ చాలా మంది ఇతర మతంలోని అధ్యాత్మికత పట్ల గౌరవంగా ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఇలా సర్వమతస్థులు కలసిమెలసి జీవిస్తారు.

504
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles