మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం


Sun,August 28, 2016 01:50 AM

తెలంగాణ వచ్చాకే తెలుగు వెలుగుకు హోదా!
2006లో కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చింది. కానీ, తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ గాంధీ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో దీన్ని అడ్డుకున్నారు. అయితే, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో తన వాదన వినిపిస్తూ అఫిడవిట్ సమర్పించింది. కానీ, అటు తర్వాత ఈ విషయంలో స్తబ్దత ఏర్పడగా దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఛేదించి ప్రాచీన హోదాకు మార్గాన్ని సుగమం చేయగలిగింది.
కాగా, ప్రాచీన హోదాకు కావాల్సిన అర్హతలను కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఇలా నిర్దేశించింది.

1. ప్రాచీన హోదా పొందాలంటే ఆ భాషకు వెయ్యేళ్లకు పైగా సాహిత్య చరిత్ర ఉండాలి. 2. ఆ భాషకు 15 వందల ఏళ్ల భాషా చరిత్రా ఉండాలి. 3. అది ఎక్కడినుంచి కూడా అరువు తెచ్చుకున్న భాష కాకుండా స్వతంత్రమైంది కావాలి.
telugu
ఈ మూడు విషయాల్లో ఆంధ్రప్రదేశ్ వాదనకై శ్రీమదాంధ్ర మహాభారతాన్ని తెనుగించిన నన్నయ్యను ఆధారం చేసుకోవడం వల్ల, ఆయన పదకొండో శతాబ్దానికి చెందిన వారైనందున భాషా సాహిత్య చరిత్ర తొమ్మిది వందల ఏళ్లకే పరిమితమై మన వాదన వీగిపోయింది.

రెండవది, తొలి కావ్యంగా వాదించిన నన్నయ్య కావ్యం కూడా స్వతంత్ర రచన కాకపోవడం, అది సంస్కృతంలో వ్యాస భారతానికి అనువాదమే కావడం వల్ల స్వతంత్ర రచన కాదని! మూడో పాయింట్ ప్రకారం అరువు తెచ్చుకున్న భాషనుంచి ప్రాచీన హోదా సాధ్యం కాదని! దీంతో ఆనాటి వాదన వీగిపోయింది.

అప్పటి నుంచి నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో మరే ప్రయత్నమూ చేయలేదు. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో మనం మేలుకున్నాం. మనదైన వాదనని తెలంగాణ మూలాలనుంచి దేవులాడి ముందుకు పెట్టి ఇప్పటి దాకా స్వయంగా అడ్డుపడ్డ అడ్వొకేట్ గాంధీనే కాదు, మహా మహా ఉద్ధండులను సైతం మేలుకునేలా చేశాం. పక్కా వాదనతో మనం ముందుకు రావడంతో కోర్టు సైతం అంగీకరించే పరిస్థితి రావడం, చివరాఖరికి మన భాషకు ప్రాచీన హోదాకు మార్గాన్ని సుగమం చేసుకోగలగడం తెలంగాణ సాధించిన మరొక అపూర్వ విజయంగానే చెప్పుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 2015 ఏప్రిల్‌లో మన ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి సూచనతో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెన్నైకి చెందిన రవీంద్రనాథ్ అనే అడ్వొకేట్ ద్వారా కౌంటర్ అఫిడవిట్ నమోదు చేశారు. మాజీ అడ్వొకేట్ సాలిసిటర్ జనరల్ అయిన వి.టి.గోపాలన్‌ను మన తరఫున కోర్టులో వాదనల్ని వినిపించుకునేందుకు నియమించుకున్నాం.
ఇలా- మన ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ చేసిన కసరత్తుతో మొత్తానికి మద్రాస్ హైకోర్టు తుది వాదనల్ని ఈ సంవత్సరం జూలై 13న వింది. కాగా, ఈ ప్రయత్నంలో మనతో పాటు ఉన్నది చెన్నై తెలుగు ప్రకాశం సంపాదకులు తూమాటి సంజీవరావు. వారు కూడా తెలుగుకు ప్రాచీన హోదాను సమర్థిస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఐతే, ఈ తుది వాదనలు కూలంకశంగా, ప్రాచీన హోదా మనకు లభించేలా చేయడానికి మనం పెట్టిన వాదన ఏమిటంటే, తొమ్మిదవ శతాబ్దానికి చెందిన మన ఆదికవి పంపనని ప్రస్తావించడం. అలాగే, పురావస్తు శాఖా తవ్వకాల్లో బైటపడ్డ మన కోటిలింగాల, ధూళికట్ట ఆనవాళ్లను ఆధారం చేసుకుని క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచే మన భాషకు చరిత్ర ఉందని వాదించగలగడం.

క్రీ.శ. 931 ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన పంపన ఆది పురాణం, విక్రమార్జున విజయం రచించారు. దీన్నిబట్టి మన భాషా సాహిత్యానికి 1,070 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉన్నట్టే. అలాగే, పురావస్తు శాఖ తవ్వకాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన కోటిలింగాలలో లభించిన ఆధారాలను బట్టి అవి క్రీస్తుపూర్వం రెండు, మూడు శతాబ్దాలకు చెందినవని, అంతేకాక, పెద్దపల్లి సమీపంలోని ధూళికట్టలో కనుగొన్న బుద్ధుడి స్తూపం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దానికి చెందిందని, వీటిని బట్టి మన భాషా చరిత్రకు పదిహేను వందల ఏళ్లకు పైగానే చరిత్ర ఉందని గట్టి ఆధారాలు చూపగలిగాం. ఇక పంపన తెలుగులోనే రచనలు చేయడం వల్ల అరువు తెచ్చుకున్న భాష మనది కానే కాదనీ చెప్పగలిగాం.
ఈ వాదనలు విన్న హైకోర్టు బెంచ్‌లోని చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మాహదేవన్‌లు ఆగస్టు 8న తీర్పు చెబుతూ, కేంద్ర ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా సంస్కృతం, తమిళ భాషలకు ఎలాగైతే ప్రాచీన హోదా దక్కిందో తెలుగుకు కూడా ప్రాచీన హోదా దక్కనున్నట్టు, అందుకు ఇక ఎటువంటి అడ్డంకీ లేదని తేల్చి చెప్పింది.
telugu2
బెంచ్ ఇప్పటిదాకా ఉన్న రిట్ పిటిషన్లను కొట్టి వేయడమే గాక ఆలివర్ వెండిల్ హోమ్స్‌ను కోట్ చేస్తూ, ప్రతి భాషా ఒక దేవాలయం. అందునా ఆ భాష మాట్లాడే వారి ఆత్మ గర్భగుడిలా కొలువబడుతుంది అని చెప్పడం విశేషం.
నిజమే. ఇక ముందు మన భాషను, మన సాహిత్యాన్ని, మన చరిత్రను సగర్వంగా కొలుచుకుందాం. తెలంగాణ పునర్నిర్మాణంలో మన అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకుందాం. విస్మృతిలో ఉన్న మన సాహిత్యకారులను, వారి రచనలను ప్రాచుర్యంలోకి తెస్తూ తేనెలొలికే తెలుగు భాషను వెలుగులోకి తెద్దాం.

మన భాషకు 2 వేల ఏళ్ల చరిత్ర


-ఆచార్య ఎస్వీ రామారావు
తెలుగు భాషకు 2,000 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తుకు పూర్వమే తెలుగు ప్రజల వ్యవహార భాషగా వున్నట్లు పై సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ.5వ శతాబ్దంలోని గద్య శాసనాలు, క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి కనిపిస్తున్న పద్య శాసనాలు తెలుగు భాష క్రమ పరిణామాన్ని చాటుతున్నాయి. దేశభాషలందు తెలుగులెస్స అని ప్రాచీనాంధ్ర కవులు (శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు) సగర్వంగా ప్రకటించారు.
ఆంధ్రత్వం ఆంధ్రభాషాచనాల్పస్య తపసః ఫలమ్ ఆంధ్రుడిగా పుట్టడమే అదృష్టంగా భావించాడు లాక్షణికుడైన అప్పయ దీక్షితులు. ఈస్టిండియా కంపెనీ యుగంలో మన దేశానికి వచ్చిన ఆంగ్లేయులు సైతం అనంతమైన మన భాషా మాధుర్యానికి ముగ్ధులై ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా అభివర్ణించారు. సి.పి.బ్రౌన్ తదితరులు తెలుగు భాషపై అమితమైన అభిమానంతో ముత్యాల కోవలాంటి తెలుగు అక్షరాల ముద్రణలో ఎంతో జాగ్రత్త వహించే వారు. 19వ శతాబ్దంలో ప్రారంభమైన ఆధునిక వాజ్మయం వివిధ ప్రక్రియా రూపాలలో సుసంపన్నమై విలసిల్లుతూ ప్రపంచ భాషా సాహిత్యాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది.

జనాభా దృష్ట్యా మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య మిగతా భాషలవారి కన్నా ఎక్కువే. అంతేకాదు, ఇతర రాష్ర్టాలలోని అల్పసంఖ్యాక వర్గాల జనసంఖ్యలో కూడా తెలుగు భాషీయులదే పైచేయి. ఇవాళ హైటెక్ ప్రభావంతో విదేశాలకు వలస వెళుతున్న వారిలో తెలుగువారి సంఖ్యే అగ్రగణ్యంగా వుందన్న విషయం సర్వ విదితం. అయితే, గత చరిత్రను తవ్వుకొని సంఖ్యా ఆధిక్యాన్ని చాటుకొని కాలం వెళ్లదీసుకొంటున్నామే కాని, నేటి సమాజంలో తెలుగు భాషా స్థితిని తల్చుకుంటే మాత్రం తలలు దించుకొని కృంగి పోవలసి వస్తుంది.

భాషారాష్ట్ర ప్రాతిపదికపై 1956 నవంబర్‌లో సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ అవతరించిన నాటి నుంచీ తెలుగును అధికారభాషగా రూపొందించే ప్రయత్నాలు కొనసాగినా అవి నేటి వరకూ సాఫల్యం కాలేదు. 1955లో అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. 10 సంవత్సరాల తర్వాత 1966 మే 14వ తేదీన తెలుగును అధికార భాషగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
దీనిని అమలు చేయడానికి తెలుగులో శాస్త్ర గ్రంథాలు, పారిభాషిక పదజాలం అవసరమైనాయి. వీటిని రూపొందించడానికి 1968లో తెలుగు అకాడమీ ప్రత్యేకంగా నెలకొల్పబడింది. శాస్త్ర గ్రంధాల అనువాదాలు మొదలైన కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మాండలిక వృత్తిపద కోశాలు రూపొందాయి.

అధికార భాషా సంఘం


అధికార భాషను పటిష్టంగా అమలు చేయడానికి ఆనాటి రాష్ట ప్రభుత్వం 1971లో అధికార భాషా సంఘాన్ని కూడా ఏర్పరచింది. తెలుగును అధికార భాషగా చేయటంలో సాధించిన ప్రగతిని సమీక్షించటం, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం, అధికార భాషా స్థాయిని కలిగించటానికి అనువైన పరిభాష రూపకల్పనకు కృషి చేయటం భాషా సంఘం పరిధిలోని కార్యక్రమాలు. ఈ సంఘం కృషి ఫలితంగా 1971 తర్వాత జిల్లా స్థాయిలోనూ పరిపాలనా వ్యవహారాలు తెలుగులోనే కొనసాగాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కానీ, ఎన్ని సంఘాలు ఏర్పడినా, కమిటీలు ఎన్ని నివేదికలు సమర్పించినా తెలుగు పరిపాలనా భాషగా ఎదగలేదు. దానికి కారణం సమైక్యపాలనలోని ప్రభుత్వపరంగా చిత్తశుద్ధి కొరవడటమే. పట్టుదల, చిత్తశుద్ధి లోపించిన నాడు ఎన్ని శాసనాలు చేసినా నిష్ప్రయోజనమే అవుతాయి. శాస్త్ర గ్రంథ నిర్మాణానికి కావలసిన పారిభాషిక పదజాలం ఏర్పడ లేదని, ప్రామాణిక భాష రూపకల్పన జరగలేదని మీనమేషాలు లెక్కపెడుతూ కూచుంటే ఏళ్లూ, పూళ్లు గడచినా వున్నచోటే వుండిపోతాం తప్ప ఏ మాత్రం ప్రగతి సాధ్యం కాదు.

సంకోచం ఎందుకు?


ప్రజల వ్యవహారమే ఏ భాషకైనా ప్రమాణం. పరిపాలనా యంత్రాంగం నిర్వహించే అన్ని వ్యవహారాల్లోనూ తెలుగు వాడుకను నిర్బంధంగా అమలు చేసిన నాడు ప్రామాణిక భాషగా తనంతట తానే మన తెలుగు రూపు దిద్దుకుంటుంది. సాంకేతిక పదాలను తెలుగులోకి అనువదించేటప్పుడు సమస్యలు ఉత్పన్నమైతే పరభాషా పదాలను స్వీకరించడానికి సంకోచించకూడదు. తెలుగు భాషలో అన్యదేశ్యాల చేరిక ప్రాచీనకాలం నుంచీ వస్తూనే వుంది.

ఇంగ్లీషు నుంచి స్ఫూర్తి పొందాలి...
అంతర్జాతీయ భాషగా వ్యవహారంలో వున్న ఇంగ్లీషు అన్యభాషా పదాలను అత్యధికంగా స్వీకరించటమే దాని వ్యాప్తికి కారణం అన్న నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. Telugu can be looked upon as the northern most member of southern languages or the southern most of the northern languages అని డా॥ హోంఫీల్డ్ మెక్లాయిర్ పేర్కొన్న మాటలు ఈ సందర్భంగా గమనించదగినవి.

ప్రాంతీయ భాషలు పరిపాలనా భాషలుగా రూపొందాలంటే అది విద్యారంగం ద్వారానే సుసాధ్యమవుతుంది. ఏ భాష అయినా బోధనా భాషగా అమలులో వున్నప్పుడే అధికార భాషగా వ్యాప్తిలోకి వస్తుందన్న సత్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని గుర్తించటం వల్లే 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు లార్డ్ మెకాలే ప్రణాళిక ద్వారా ఆంగ్ల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. దాని ఫలితంగానే ఆంగ్ల భాష మన దేశంలో బలంగా నాటు కొనడమే కాక దేశభాషా వికాసానికి అవరోధంగా కూడా తయారైంది. దీన్ని నిరోధించడానికి స్వాతంత్య్రానంతరం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ భాషా మాధ్యమంగా విద్యాభ్యాసానికి అవకాశాలు కల్పిచాయి.
telugu3
తెలుగు మాధ్యమంలో బోధన...
సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొంది. 1969 నుంచి ఇంటర్మీడియెట్ స్థాయిలోనూ, 1971 నుంచి డిగ్రీ స్థాయిలోనూ, 1985 నుంచి పి.జి స్థాయిలోనూ తెలుగు మీడియంలో విద్యాబోధనకు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కూడా తెలుగులో సమాధానాలు రాయడానికి 1970లో సౌకర్యం ఏర్పడింది. తెలుగు మీడియం ద్వారా డిగ్రీలు పొందిన వారికి ఉద్యోగార్హత కల్పిస్తూ నాటి ప్రభుత్వం జీ.వో.లూ జారీ చేసింది. ఇన్ని చేసినా నాటి పరిపాలకులు మాతృభాష అయిన తెలుగును నిర్భంధ పఠనీయ భాషగా మాత్రం అమలు చేయలేక పోయారు. అసలు లోపమంతా అక్కడే ఉంది. విద్యాసంస్థల్లో మరీ ముఖ్యంగా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగుకు రాష్ట్రభాషగా గుర్తింపు లేకపోవటం పెద్ద పొరపాటు.

ఇవాళ అన్ని స్థాయిల విద్యార్థులు తప్పించుకోవడానికి వీలు లేకుండా నిర్భంధంగా చదువుకుంటున్న భాష ఇంగ్లీషే. కానీ, మన మాతృభాష కాదు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు తెలుగును నిర్బంధంగా చదవాలన్న నియమం ఈనాటి వరకూ లేదు. మాతృభాషా పఠనం ఐచ్చికంగా (0ptional) మాత్రమే కొనసాగుతోంది. హైస్కూలు వరకూ ప్రథమ భాషగా తెలుగును చదివిన విద్యార్థులు సైతం కాలేజీ స్థాయిలో మార్కుల వలలో పడి ఇతర భాషల వెంట పరిగెత్తుతూ మాతృభాష అయిన తెలుగును పూర్తిగా విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలు మాట్లాడే భాషను ఇతర మైనారిటీ భాషలతో సమానంగా పరిగణిస్తూ అధిక సంఖ్యాకుల భాషకు గల ప్రత్యేక స్థానాన్ని గుర్తించలేని దయనీయ పరిస్థితి బహుశా ఒక్క మన రాష్ట్రంలోనే నెలకొని ఉండడం దురదృష్టకరం.

మాతృభాషతోనే వికాసం


మన రాష్ట్రంలోని తెలుగువారు మాతృభాషకూ, ఇతర భాషలకూ వున్న వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించక పోవటం వల్ల తెలుగు భాష స్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. వినిమయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు మూడూ సమానమై ఏ భాషకూ ఎలాంటి పరిధులు, పరిమితులూ వుండడం లేదు. దీనివల్ల పరభాషల వినియోగం విస్తృతమై తెలుగు భాష వాడుక కుంచించుకు పోతోంది. నిరక్షరాస్యులైన, ఇతర భాషలలో ప్రావీణ్యం లేని అత్యధిక శాతం తెలుగు ప్రజలు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కాలేక ఎంతో వెనుకబడి పోతున్నారు. ఫలితంగా తెలుగు భాషా సంస్కృతుల వికాసం మందగిస్తోంది.
సాంఘికాభివృద్ధికి విద్యారంగం పునాది వంటిది. ఆ రంగంలో మాతృభాషకు సముచితమైన స్థానం లభించినప్పుడే సమాజాభివృద్ధి ప్రజాస్వామ్య బద్దంగానూ, శక్తివంతంగానూ కొనసాగుతుంది. కాబట్టి, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకూ తెలుగు చదవకుండా, విద్యాభ్యాసం కొనసాగించే దారుణమైన ప్రస్తుత విద్యావిధానానికి స్వస్తి చెప్పాలి. ఇకనైనా మన తెలంగాణ ప్రభుత్వమూ, ప్రజలూ చిత్తశుద్ధితో ఈ దిశలో నిర్మాణాత్మకమైన కృషి జరపాలి.

తిలింగ శబ్దం...


వేద పురాణేతిహాసాలలో ఆంధ్ర, అందక శబ్దాలు జాతి వాచకపరంగా తిలింగ శబ్దం దేశ వాచకపరంగా ప్రాస్తావితమయ్యాయి. కాగా ఆంధ్రం, తెలుగు సమానార్థకంగా ప్రాచీన కాలం నుండీ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు భాష, తెలుగు జాతి ప్రాచీనతను నిరూపించటానికి శాసనాలు బలమైన ప్రమాణాలుగా ఉన్నాయి. క్రీ.పూ. 3వ శతాబ్ది నుంచి లభ్యమవుతున్న శాసనాల్లో ఆంధ్రదేశంలోని గ్రామ నామాలు, వ్యక్తుల పేర్లు గోచరిస్తాయి. మౌర్య అశోకుని కాలం నాటి ప్రాకృత శాసనాలు, బౌద్ధ స్తూపాలు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లభించాయి. అశోకుని 13వ ధర్మలిపి శిలాశాసనంలో (క్రీ.పూ. 256-254) ఆంధ్ర, పుళింద జాతుల ప్రస్తావన ఉంది.

నాగబు- తొలి పదం!


అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలకల మీద (3వ శ.) కనిపించిన నాగబు తెలుగు లిపిలో లభ్యమవుతున్న తొలి పదంగా భాషా వాజ్మయ పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. ఇందులోని బు తెలుగు ప్రథమావిభక్తి ముకు ప్రాచీన రూపం. ఇది ఆ కాలపు శాసనాల్లో ప్రయుక్తమైన నాగబుధనికా పదంలోని భాగమై ఉంటుందని. కానీ అనంతర శాసనాల్లోని వక్రబు పట్టణబు పదాల ఆధారంగా అది నాగము పదరూపమే అని చెప్పవచ్చు. శిల్పంలోని బొమ్మ కింద దాని పేరును చెప్పటం మౌర్యుల కాలం నాటి సంప్రదాయంగా ఉండటం కూడా దీన్ని బలపరుస్తూంది. అశోకుని 14వ శిలా శాసనంలో ఏనుగు బొమ్మకింద గజతము (ఉత్తమ గజం) అన్న మాట కనిపిస్తుంది. శాతవాహనుల తర్వాతి వారైన విష్ణుకుండిన రాజుల కీసరగుట్ట శాసనంలోని వ్రాసిన వాన్ణు (వాండ్రు వారు) పదం కూడా తెలుగు భాష ప్రాచీనతను సూచిస్తుంది.

బంగారు తెలంగాణలో మన భాష


telugu4
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కె.జి. నుంచి పి.జి. స్థాయి వరకు మన విద్యా విధానంలో నూత్నమైన మార్పులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే, అంతకు ముందున్న వలస పాలనలోని విద్యా విధానాన్ని పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు అప్పగించటంతో మన పిల్లల విద్యాస్థాయి పడిపోయింది. ఈ దుస్థితి తొలగాలంటే కొత్త ప్రభుత్వం విద్యార్థుల స్థాయి పెరగడానికి తీవ్రంగా కృషి చేయాలి. ఎస్సెస్సీ విధానం కానీ, సీబిఎస్‌ఈ విధానం కానీ అమలు చేయాలంటే ప్రాథమిక విద్యాదశలో 1 నుండి 5వ తరగతి వరకు విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి.
ప్రస్తుతం హైస్కూలు విద్యార్థులు కూడా ఇటు తెలుగు కానీ, అటు ఇంగ్లీష్ కానీ సరిగ్గా చదివి, రాయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి కారణం ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా విధానమే. విద్యార్థుల భాషా నైపుణ్యాలు మెరుగు పరచక పోతే ఏ విధానంలోనైనా వారి స్థాయి పెరగదు. కనుక ఇప్పటికైనా పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల భాషా నైపుణ్యాలు, పరీక్షా విధానం మొదలైన వాటిపై స్పష్టమైన, నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించాలి.

లభ్యమైన నాణాలే చెబుతాయి


నాణాలు దేశ చరిత్ర, సంస్కృతులకు నిలువుటద్దాలు. తెలుగు జాతి ప్రాచీనతకు ఆనవాళ్లుగానూ నిలిచిన నాణాలకు 2,000 సంవత్సరాల కిందటి చరిత్ర ఉంది. గుంటూరు జిల్లా అమరావతి, కృష్ణా జిల్లా సింగవరం, కరీంనగర్ జిల్లా పెద బంకూరు, కోటిలింగాల, మెదక్ జిల్లా కొండాపురం మొదలైన ప్రాంతాలలో సీసం, వెండి, రాగి, బంగారు నాణాలు అసంఖ్యాకంగా లభించాయి. కోటిలింగాలలో లభ్యమైన నాణాల ఆధారంగా క్రీ.పూ. 6, 5 శతాబ్దాల నాటికే ఈ ప్రాంతంలో నాగరికత ఏర్పడి ఉన్నట్లుగా పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు.
శాతవాహన రాజు హాలుని ఆస్థాన కవి అయిన గుణాఢ్యుని ఇతివృతాన్ని ఇక్కడ ప్రస్తావించవచ్చు. గుణాఢ్యుడు శర్వవర్మతో చేసిన ప్రతిజ్ఞలో ఓడిపోయి, సంస్కృత ప్రాకృత భాషలను - దేశభాషను పరిత్యజించాక, పైశాచిప్రాకృతంలో బృహత్కథను రాసినట్లుగా ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. ఇందులో ప్రస్తావితమైన దేశభాష నాడు జనవ్యవహారంలో ఉన్న తెలుగు భాషేనని చరిత్ర పరిశోధకులందరూ అంగీకరిస్తున్నారు.
రాజు తన కృతిని ఆదరించలేదన్న దుఃఖంతో గుణాఢ్యుడు కావ్యహోమం తలపెడతాడు. వారిబృహత్కథలోని కొన్ని తాటాకులు దగ్ధం కాగా మిగిలిన భాగాన్ని క్షేమేంద్రుడు (బృహత్కథామంజరి), సోమదేవసూరి (కథా సరిత్సాగరం) సంస్కృతీకరించారు. గుణాఢ్యుని ప్రతిజ్ఞకు సంబంధించిన గాథ వీటిలో గ్రంథస్థమైంది. గుణాఢ్యుని తల్లి బ్రాహ్మణ స్త్రీ, తండ్రి నాగప్రభువు అని తెలుస్తోంది.
ఆ వాడుక భాష తెలుగే!
హాల శాతవాహనుని సంపాదకత్వంలో కూర్చబడిన 700 ప్రాకృత గాథా, (ఛందోరూపం) పద్యాల సంకలనం గాథాసప్తశతిలో (క్రీ.శ 1వ శ.) తెలుగు పదాలు- అత్తా, అమ్మ, పొట్టం (పొట్ట), రుంప (రంపం), అద్దామే (అద్దం), బొణ్డి (పంది) మొదలైనవి చోటు చేసుకోవడం కూడా నాడు ప్రజల వాడుక భాష తెలుగేనన్న అంశాన్ని ద్రువీకరిస్తోంది.
అగత్తియంలో తెలుగు...
తమిళ వ్యాకరణ గ్రంథం తొలికాప్పియం (క్రీ.శ. 1వ శ.)కు తెయ్ పచ్చియార్ వ్యాఖ్యానంలో అరవ దేశం చుట్టూ కొల్లం (కేరళ), సింగళం (సింహళం), కూపకం, కన్నాడం, వడుగం, తెలింగం, కొంకణం, తుళువం, కుడుకం, కాన్టకం నాడులు ఉన్నట్టు చెప్పబడింది. 5వ శతాబ్దానికి చెందిన ఆగత్తియంలో కూడా కొంగనం, కన్ననిం, కొల్లం, తెలుంగం భాషలు ప్రసక్తమైనాయి.

3442
Tags

More News

VIRAL NEWS