మన కవుల కవితాసాగు కొత్తసాలు


Sun,July 26, 2015 02:19 AM

మన రాష్ట్రం మనకు సిద్ధించిన నేపథ్యంలో వచ్చిన తొలి ఉగాది (2015) పండగ వేళ మన కవులు తమ కలాల నాగళ్లతో చేసిన కవితాసాగు రైతన్నల కొత్త పంటల సంబురాన్నే తలపించింది. ఈ చారిత్రాత్మక ప్రక్రియకు అద్దం పట్టిన పుస్తకమే కొత్తసాలు. దీర్ఘకాలిక ఉద్యమం ఫలించగా, సకలజనులంతా ఆనందోత్సాహాలలో తేలియాడుతున్న తరుణంలోనే మన కవుల హృదయాకాశ దృశ్యాల్ని ఇలా కవిత్వరూపంలో అక్షరబద్ధం చేయాలనుకోవడం ఒక విలక్షణ ప్రయత్నం. మన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సంపాదకులుగా, ప్రముఖ కవులు డా॥ నందిని సిధారెడ్డి, డా॥ అమ్మంగి వేణుగోపాల్, డా॥ మసన చెన్నప్ప, డా॥ నాళేశ్వరం శంకరం, అయినంపూడి శ్రీలక్ష్మి, యాకూబ్, జూపాక సుభద్రలు సలహా మండలి సభ్యులుగా వెలువడిన ఈ పుస్తకంలో మొత్తం 60 మంది కవుల కవిత్వాన్ని పొందుపరిచారు.

Kotha-salu

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం (2015 జూన్ 2 నుండి 7వ తేదీ వరకు)లో భాగంగానే, గడచిన ఉగాది (21-3-2015) పండగ పూట సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆహుతుల సమక్షంలో వీరంతా ప్రత్యక్షంగా ఆలపించిన కవితలే ఇవన్నీ కావడం మరో ప్రత్యేకత. ఒక కవితా సమ్మేళనం నాటి కవితల్ని ఇలా పుస్తకంగా వేయడం సాహిత్యరంగంలో చాలా అరుదు. అంతేకాదు, అసలు కవితా పఠనాలకు నిలువెత్తు వేదికగా తెలుగునాట ఉగాది పండగ వెల్లివిరిసిన క్రమంలో జరిగిన ఆనాటి ఈ కార్యక్రమానికి మరో విశేషమూ (ఆ వేళ ప్రపంచ కవితా దినోత్సవం) తోడు కావడం ఈ విలువైన పుస్తక ముద్రణకు దోహదపడిందని మామిడి హరికృష్ణ ముందుమాట (కొత్తసాలు ముచ్చట)లో వెల్లడించారు. కాబట్టి, ఇది మరింత సందర్భోచితం. ఇక, ఇటీవలి కాలంలో మన తెలంగాణపై వచ్చినన్ని కవితాపుష్పాలు మరే వస్తువుపైనా రాలేదేమో అన్న మన ప్రభుత్వ సలహాదారు డా॥ కె.వి.రమణాచారి (కొత్త ఆకాంక్షల సంతకం) అభిప్రాయం అక్షరసత్యం.

పుస్తకంలోని కవితలన్నీ తెలంగాణ వారివే కావడం అత్యంత ఆసక్తికరం. సంపాదకులు, సలహామండలి సభ్యులందరి కవిత్వంతోపాటు మరెందరో ప్రముఖ కవుల కవిత్వాన్ని కూడా పాఠకులు ఇందులో చదవవచ్చు. వారిలో డా॥ దామెర రాములు, దర్భశయనం శ్రీనివాసాచార్య, దేశపతి శ్రీనివాస్, డా॥ దేవరాజు మహారాజు, డా॥ గండ్ర లక్ష్మణరావు, డా॥ జె.బాపురెడ్డి, జింబో, జూకంటి జగన్నాథం, జూలూరి గౌరీశంకర్, డా॥ తిరుమల శ్రీనివాసాచార్య, డా॥ తిరునగరి, డా॥ వడ్డేపల్లి కృష్ణ, వఝుల శివకుమార్ ప్రభృతులు ఉన్నారు. అయితే, చాలావరకు కవితలు తెలంగాణ ఉద్యమ సారాన్ని, సాఫల్యతను విడమరిచి చెప్పాయి. మన వారి తత్వాన్ని, తెలంగాణ సామాజిక కోణాల్ని, జీవన విధానాలను ఒకింత గట్టిగానే ఆవిష్కరించాయి. కవిత్వంలో గాఢతకంటే వస్తుచిత్రణకే ఎక్కువమంది ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. సందర్భం ఎంత అపురూపమో పుస్తకాన్ని అంతే కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇది ప్రశంసనీయం.
వాక్యం పచ్చపచ్చని వ్యవసాయం/ కవిత్వమొక కిరణజన్య సంయోగక్రియ (అన్నవరం దేవేందర్ కవిత్వం, పే:13), నిద్ర లేచిన విత్తనం/ సుప్రభాతంతో మమేకమైనట్టు (డా॥ యస్.చెల్లప్ప దక్షిణాయనం, పే: 29), కూలిపోతున్న చెలిమెలో/ కూరిమి తోడాలె/ రాత్రిని వెలిగించేది/ సాహసం ఒక్కటే (నందిని సిధారెడ్డి తలంపు, పే: 107)- వంటి ప్రయోగాలు రైతన్నల కొత్తసాలుతోపాటు యావత్ తెలంగాణ బిడ్డల భవిష్యత్ బాధ్యతలనూ గుర్తుచేస్తాయి. అగరొత్తుల పొగలా/ ఆనందించడం అలవాటైంది/ సంబురం కూడా నటనైంది/ కప్పి పుచ్చుకుంటే మాత్రం/ జీవితం ఆగుతదా (డా॥ పులిపాటి గురుస్వామి తొక్కుడు బిల్ల, పే: 128), పరిపాలన పచ్చడి (ఉగాది)లా కనిపిస్తున్నది/ అధికారం బెల్లంలా అగుపిస్తున్నది (డా॥ తిరుమల కవన పవన తరంగాలు, పే: 147), కలుపు మొక్కలు చేలల్లోకి అడుగు పెట్టకుండా/ కనిపెట్టాల్సిన సమయం (వఝుల కాల చైతన్య స్వరం, పే: 160)- అంటూ మానవీయ విలువలను, నైతిక ప్రవర్తనను ప్రబోధించేవి, మన వైభవాన్ని ఆవిష్కరించేవి అయిన కవితా పాదాలు సామాన్యులను సైతం విధిగా ఆకట్టుకొంటాయి.

పోతే, చేర్యాలకు చెందిన సుప్రసిద్ధ నఖాషీ చిత్రకారుడు వైకుంఠం గీసిన కవర్‌బొమ్మ ఒక్క చూపులోనే పాఠకులను కట్టి పడేస్తుంది. పుస్తకానికి ఇదొక అదనపు ఆకర్షణ. కవుల ఫొటోలతోపాటు కవిత్వాలకు బొమ్మలు కూడా ముద్రిస్తే మరింత నిండుతనం వచ్చేది. అయితే, ఇటువంటి ప్రోత్సాహం కోసం ఎదురుచూసే మరెందరో మన కవుల కవిత్వాన్ని కూడా రాబోయే సాళ్లలో మన ప్రభుత్వం ఇలాగే పుస్తకాల్లోకి ఎక్కిస్తే ఇంకెంతో మంచిగుంటది.

దోర్బల
కొత్తసాగు (కవితా సంపుటి), పేజీలు: 196, వెల: అమూల్యం, ప్రతులకు: డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్ లేదా అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

1096
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles