మనిషి తనువే ఎరువు!


Sun,March 17, 2019 01:35 AM

death-history
మనుషుల శవాలు ఎరువుగా మారనున్నాయా? శాస్త్రవేత్తల పరిశోధనలు విజయవంతమయ్యాయా? మనిషి చనిపోయి మరొక జీవికి పునర్జన్మ ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా? ఒక మంచి చేయడం కోసం మనిషి శవం సాయపడనున్నదా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని ఆసక్తికరమైన వివరాలతో ఓ ప్రత్యేక కథనం..

జంతువుల వ్యర్థాలు, మనుషుల వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం యేండ్ల నుంచి వస్తున్న ప్రక్రియ. ఒక అడుగు ముందుకు వేసి జంతువుల కళేబరాలు, మనిషి తిని పడేసిన ఆహారంతో కూడా ఎరువులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేసి మనుషుల శవాలతో కూడా ఎరువులు తయారు చేస్తున్నారు.

మనిషి ప్రకృతికి మంచి చేస్తున్నాడా? చెడు చేస్తున్నాడా? అంటే సమాధానం.. మంచి కన్నా ఎక్కువ చెడు చేస్తున్నాడు అని కొందరంటారు. ప్రకృతి మానవ సమాజానికి, మనిషి మనుగడకు అన్ని విధాలా సాయం చేస్తున్నా దాని రుణం మాత్రం మనిషి తీర్చుకోవడం లేదు. కనీసం మంచి చేయకపోయినా, చెడు చేయకుండా ఉండలేకపోతున్నాడు. కొందరు మనుషులు బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ప్రకృతికి సాయం చేయబోతున్నారు. ప్రాణాలు పోయాక దేహాన్ని బూడిద చేయకుండా ఎరువుగా మారనున్నారు. ఆ రోజులు రాబోతున్నాయి. అందుకు సంబంధించిన ప్రయోగాలు అమెరికాలోని వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ప్రారంభించారు. దాదాపు పాజిటివ్ రిపోర్ట్‌తో ఉన్న ఈ ప్రయోగం అతి త్వరలో పూర్తవబోతున్నది. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పూర్తి చేసి అక్కడి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ప్రయోగం విజయవంతం అయి అక్కడి అసెంబ్లీ కూడా అనుమతి ఇస్తే ప్రపంచంలో మానవ కళేబరాలతో ఎరువులు తయారు చేసే మొట్ట మొదటి రాష్ట్రంగా వాషింగ్టన్ కొత్త రికార్డును బద్దలు కొట్టనున్నది.

మనిషి కళేబరాన్ని కూడా దహనం, ఖననం చేయడం ఎందుకు అని ఆలోచించి మానవ శవాల నుంచి ఎరువుల తయారీ చేయొచ్చని నిరూపించడానికి ప్రయోగం మొదలుపెట్టారు. మనిషి శరీరం త్వరగా కుళ్లిపోయి భూమిలో కలిసిపోవడానికి బ్యాక్టీరియా దోహదం చేస్తుంది. మనుషుల శవాలను కాల్చడం వల్ల గాలిలో కార్బన్‌డై యాక్సైడ్ శాతం పెరుగుతుంది. ఒక మనిషి శవాన్ని కాల్చడం ద్వారా మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు గాలిలో కలిసిపోయి కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఎరువులు తయారు చేయడం వల్ల అటు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మంచి చేయడం, ఎరువులుగా చేసి పంటలకు కాపాడటం రెండు పనులు అవుతాయని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే మనుషులను దహనం చేయడానికి మరో కారణం జనాభా బాగా పెరుగుతుండడంతో పూడ్చడానికి కూడా స్థలం దొరకకపోవడం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ గంటకు 6,316 మంది, రోజుకు 1,51,600 మంది, సంవత్సరానికి 55.3 మిలియన్ల మంది చనిపోతున్నారు. వీరిలో 70 శాతం మందికి పైగా దహనం చేయగా మిగిలిన వారిని పూడ్చి పెడుతున్నారు. ప్రపంచంలో ఉన్న అన్నీ వ్యర్థాలను రీసైకిల్ చేసి పనికొచ్చేలా మార్చుకుంటున్నాం.

శవాలను కాల్చడం వల్ల, సరైన పద్ధతిలో పూడ్చిపెట్టకపోవడం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం జరగుతుందని వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారమార్గంగా శవాలను చెక్కపొట్టుతో కలిపి పూడిస్తే 30రోజుల్లోపే బ్యాక్టీరియా సహాయంతో మంచి ఎరువుగా మారుతుందని ఇప్పటికే నిరూపించారు. అయితే దీన్ని అలాగే వాడలేం. 55 ఫారన్ హీట్ ఉష్ణోగ్రతలో వేడి చేసి వాడితే అంటువ్యాధులు కూడా రావని సూచిస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా శవాలను పూడ్చిపెట్టిన చోట ఒక బెడ్‌లాంటి డబ్బా పెట్టి వాటిలో మొక్కలు ఉంచారు. అవి 30రోజుల్లో ఎలాంటి ఎరువు అవసరం లేకుండా బాగా పెరిగాయి. కుళ్లిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తే ఎరువు తయారీ ప్రక్రియ ఇంకాస్త తొందరగా అవుతుందని చెబుతున్నారు.

ఈ పరిశోధన మీద సర్వే నిర్వహిస్తే 90 శాతం మంది నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇప్పటికే కొందరు తాము చనిపోతే తర్వాత ఎరువుగామారి ప్రకృతికి సహాయపడడానికి సిద్ధమని పత్రాల మీద సంతకాలు చేసి ఇచ్చారు. ఈ పరిశోధన ప్రయోగాత్మక దశలోనే ఉంది. పూర్తిస్థాయిలో ఎరువుగా మార్కెట్‌లోకి వస్తే డిమాండ్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది.
death-history1
శవాలను కాల్చడం వల్ల, సరైన పద్ధతిలో పూడ్చిపెట్టకపోవడం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం జరగుతుందని వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారమార్గంగా శవాలను చెక్కపొట్టుతో కలిపి పూడిస్తే 30రోజుల్లోపే బ్యాక్టీరియా సహాయంతో మంచి ఎరువుగా మారుతుందని ఇప్పటికే నిరూపించారు.

- అజహర్ షేక్ సెల్: 9963422160

1230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles