మనిషి కోసం మనిషి అన్వేషణ


Sun,December 9, 2018 02:15 AM

man
కంప్యూటర్ల యుగంలోనూ రాతియుగం నాటి మనుషుల రూపురేఖలు, ఆచార వ్యవహారాలు, జీవనశైలిని ఆచరిస్తూ ఇప్పటికీ ఈ భూమ్మీద కొన్ని జాతులున్నాయంటే కొందరు నమ్మలేదు. కానీ.. మొన్నటికి మొన్న జాన్ అనెన్ చౌ అనే అమెరికన్ యాత్రికుడిని అండమాన్ నికోబార్ దీవుల్లోని సెంటినల్ అనే ఆటవిక తెగ చేతుల్లో హతమయ్యాక నమ్మక తప్పలేదు. ప్రపంచమంతా హాట్ టాపిక్ అయిన ఆ సెంటినల్ తెగ గురించి, ఈ భూమ్మీద ఉన్న అలాంటి మరిన్ని ఆటవిక తెగల గురించి మనిషి కోసం మనిషి సాగిస్తున్న అన్వేషణనే ఈ వారం ముఖచిత్ర కథనం.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412
Bathukamma
వారు అడవుల్లో ఉంటారు.. ఆకలేస్తే వేటాడుతారు. దొరికిన దాన్ని తింటారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. కాదు.. కాదు.. వాళ్లే సంబంధం పెట్టుకోరు. ప్రపంచమంతా అభివృద్ధి వైపు ఊపిరి బిగపట్టి పరుగులు తీస్తుంటే.. వారికి మాత్రం అభివృద్ధి అవసరం లేదు. పుట్టుక.. బతుకు.. చావు అంతా అడవిలోనే. కొత్తవారెవరైనా వారి దగ్గరికెళ్తే తిరిగి ప్రాణాలతో రావాలనుకోవడం అత్యాశే. అసలు ఈ భూమ్మీద ఎన్ని రకాల ఆటవిక తెగలున్నాయి. వారు ఇంకా ఆటవిక జీవితాన్నే ఎందుకు గడుపుతున్నారు?
Bathukamma1

సెంటినల్

సెంటినరీల గురించి తెలుసుకుందామని పరిశోధన చేసిన వారందరూ చేదు అనుభవాలే మూటగట్టుకున్నారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వస్తే.. కొందరు అవిటివాళ్లయ్యారు. కొందరు ఆ దీవికి వెళ్లడమే కానీ.. తిరిగి రాలేకపోయారు. అసలు సెంటినల్ తెగకు చెందినవారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని ఆరా తీస్తే.. 1880లో ఓ బ్రిటీష్ నేవీ అధికారి సెంటినల్ దీవిలోని ఓ జంటను, నలుగురు పిల్లలను అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకొచ్చాడు. ఆ భార్యభర్తలిద్దరూ వాతావరణంలోని మార్పులు తట్టుకోలేక మరణించారు. వెంటనే ఆ పిల్లలను వారు తిరిగి దీవికి పంపించివేశాడు. 1896లో అండమాన్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు. అతడిని వెతుక్కుంటూ పోలీసులు సెంటినల్ దీవికి వెళ్లారు. పోలీసులు తమ దరిదాపుల్లోకి వచ్చారన్న అలికిడి కాగానే.. ఒక్కసారిగా బాణాల దాడి మొదలైంది. వర్షపు జల్లుల్లా దూసుకొచ్చిన బాణాలు ఖైదీని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసుల శరీరాలను జల్లెడలా మార్చేశాయి. అప్పటి నుంచి చాలాకాలం వరకు ఆ దీవి వైపు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. కానీ.. కొంతకాలం తర్వాత 1974 ప్రాంతంలో ఓ సినిమా బృందం షూటింగ్ నిమిత్తం అండమాన్ దీవుల్లోకి వెళ్లింది. అందమైన దీవిలా కనిపిస్తే సెంటినల్ దీవి సమీపంలో షూటింగ్ చేసుకుందామని వెళ్లింది. ఆ సినిమా బృందం అటువైపుగా ప్రయాణం మొదలుపెట్టిందో లేదో.. ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి. ప్రాణభయంతో పడవలెక్కి అందరూ వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత 1960లో సెంటినల్ తెగ గురించి తెలుసుకోవడానికి ఆంత్రోపాలజిస్టు త్రిలోక్‌నాథ్ పండిట్‌ని పంపింది భారత ప్రభుత్వం. టీమ్‌తో పాటు వెళ్లిన ఆయన అక్కడికి వెళ్లి కొన్ని కానుకలు అక్కడ పడేసి తిరిగి వచ్చేశారట. అలా మూడుసార్లు వెళ్లి అదే పని చేశాడు త్రిలోక్‌నాథ్.

ఆ తర్వాత 1991లో సెంటినలీలు త్రిలోక్‌నాథ్‌తో ఎలాంటి ప్రమాదం లేదని నమ్మారు. అతడిని తమ నివాస స్థలాలకు తీసుకెళ్లారు. ఇదంతా తెలుసుకున్న అండమాన్ నికోబార్ ప్రభుత్వం వారి మీద పరిశోధనలు చేయడానికి ఓ బృందాన్ని పంపింది. వారి మీద కూడా ఆ తెగ ప్రజలు బాణాల దాడి చేసి పరుగులెత్తించారు. అంతే.. అప్పటి నుంచి ఆ దీవి మీద ప్రభుత్వం నిషేధం విధించింది. అలా ప్రమాదకరమైన దీవిగా, ఏ మాత్రం అలికిడి వినిపించినా బాణాల దాడితో ప్రాణాలు తీసే ప్రమాదకరమైన ఆటవిక తెగగా సెంటినల్ దీవిని, సెంటినల్ తెగ ప్రపంచానికి పరిచయమైంది. అప్పటి నుంచి ఎవరూ అటు వైపు వెళ్లే సాహసం చేయలేదు. 2004లో సునామీ బాధితులకు సహాయం చేయడానికి అండమాన్ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా దీవుల్లోని బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా సెంటినల్ దీవి మీదుగా ఎగురుతున్న హెలికాప్టర్ మీద కూడా బాణాలతో దాడి చేసింది సెంటినల్ తెగ. వీరు 60వేల యేండ్ల క్రితం ఆఫ్రికా అడవుల నుంచి వచ్చి అండమాన్ దీవుల్లో స్థిరపడినట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీరి ఆకారం, రంగు కూడా భయంకరంగానే ఉంటుంది. వేట వీరి ప్రధాన జీవనాధారం. విల్లు, బాణం వీరి ప్రధాన ఆయుధాలు. వీరు మాట్లాడే భాష గురించి ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం కూడా బయటపడలేదు. సెంటినలీ దీవిలో ఆ తెగ ప్రజలు 400 మంది ఉన్నారని అంచనా. హెలికాప్టర్ల ద్వారా సెంటినలీ తెగ ప్రజల జనాభాను లెక్కించడానికి చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. సెంటినల్ దీవిలో ఉంటున్నారు కాబట్టి వీరిని సెంటినలీ తెగ అంటున్నారు కానీ.. వారి తెగ పేరేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సెంటినలీ దీవిలో తప్పి వేరే వాతావరణంలో వారు మనుగడ సాగించలేరు.
Bathukamma2

కొరోవాయి

1970 సమయంలోనే ఈ తెగ గురించి ప్రపంచానికి తెలిసింది. పుపువా న్యూగినియాకు ఆగ్నేయ దిశలో ఉన్న దట్టమైన అడవుల్లో ఈ తెగ వారు జీవిస్తున్నారు. మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వీరి జనాభా ఉంటుంది. ప్రపంచంలోనే పూర్తి ఆటవికులుగా జీవిస్తున్న తెగల్లో వీరి సంఖ్య ఎక్కువ. ఖఖ్వా అనే గిరిజన తెగ మాంత్రికుడి సమక్షంలో మనుషులను చంపి తింటారు. యుద్ధంలో, పోరాటంలో తమ చేతిలో మరణించిన శత్రువును ఖఖ్వా ఆధ్వర్యంలో ఏ మాత్రం ఆనవాలు లేకుండా తినేస్తారు వీరు. శత్రువుల ఆనవాలు కూడా లేకుండా చేయడంలో భాగంగా ఈ ఆచారం పాటిస్తారట. గాయాలకు, రోగాలకు వీరు ఎలాంటి మందులు వాడరు. వీరి జీవిత కాలం కూడా ఎక్కువే.
Bathukamma3

డానీ

పుపూవా న్యూగినియా అడవుల్లో నివసించే ఈ జాతి ప్రజలకు బాహ్య ప్రపంచం గురించి ఏమాత్రం తెలియదు. అమేజాన్ అడవుల్లో సంచరిస్తూ వేట ద్వారా దొరికిన ఆహారాన్ని తింటారు. దుస్తులు ధరించరు. సంతానాన్ని పెంచుకుంటూ, గిరిజన సంప్రదాయాలను అత్యంత కఠినంగా పాటిస్తారు.
Bathukamma4ఫిజి తెగనలుపు, తెలుపు రంగులతో శరీరాన్ని భయంకరంగా అలంకరించుకుంటారు వీరు. మెలస్సానియా, సెబాగి, పాలినేషియా ప్రాంతాల్లో ఈ తెగ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరు నరమాంస భక్షకులే. చూడగానే తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు, అందరూ ఒకేలా కనిపించేందుకు, శత్రు తెగ తమను గుర్తించడానికి వీలు లేకుండా అందరూ ఒకేలా శరీరాన్ని అలంకరించుకుంటారు. ఈ తెగకు చెందిన సోరాంగ్ అనే బృందం ఇప్పటి వరకు 785 మంది మనుషులను తిన్నారని ఓ బృందం సర్వేలో తేలింది. లెక్కకు మించి ఇంకా ఎంతమందిని తిన్నారో?
Bathukamma5

మాశ్చో - పైరో

అమేజాన్ వర్షారణ్యాల్లో జీవించే ఆటవిక తెగ వీరు. బ్రెజిల్ సరిహద్దులో ఉన్నా.. వీరు నగర జీవనానికి, పౌర జీవనానికి చాలా దూరంగా ఉంటారు. అమేజాన్ అడవుల్లో చెక్కతో నిర్మించిన నివాసాల్లో జీవిస్తారు. వెదురు, కొన్ని రకాల అడవి పండ్లు, కుండలను ఉపయోగించి నాటుసారా తయారుచేస్తారు. దాన్ని అందరూ ఇష్టంగా సేవిస్తారు. ఈ తెగ వారు వారి ప్రైవసీని దెబ్బతీస్తున్నట్టు సందేహం వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా చంపేస్తారు.
Bathukamma6

ఫ్లెచరిస్

వీరిని బాణాల తెగ అని కూడా పిలుస్తారు. బ్రెజిల్‌లోని జావరి కాలువ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం వీరి నివాసం. శత్రువుల మీద బాణ ప్రయోగం చేయడంలో వీరు సిద్ధహస్తులు. విషం పూసిన బాణాలు వీరి ప్రధాన ఆయుధాలు. వారి ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే విషం పూసిన బాణాలతో దాడి చేస్తారు. వీరుండే ప్రాంతంలో అత్యంత విలువైన రత్నాలు, బంగారు గనులు ఉంటాయి. వాటి కోసం ఎవరైనా ఆ అటవీ ప్రాంతంలో అడుగుపెడితే ప్రాణాలతో బయటపడడం కష్టమే.
Bathukamma7

జార్వాన్

అండమాన్‌లోని బారాటంగ్ అనే దీవిలో ఈ తెగలు జీవిస్తున్నాయి. వీరు వర్షం వస్తే బయటకు రారు. ఒంటి మీద దుస్తులు కూడా ధరించరు. ప్రకృతిని చూడడానికి అక్కడికి వచ్చే పర్యాటకులు వీరిని చూడడానికి ఆసక్తి చూపిస్తారు. పర్యాటకుల కంటే ముందు ఒక వ్యక్తి వారి నివాసాల దగ్గరికి వెళ్లి వారిని బయట నిల్చోబెడుతాడు. పర్యాటకులు తమను చూస్తున్నప్పుడు ఈ తెగ మహిళలు తమ దేహాన్ని చేతులతో దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బహుశా నాగరికులు తమ దేహాన్ని చూస్తున్నారు. తాము నగ్నంగా ఉన్నామన్న భావన వారికి కలుగుతుందేమో. పర్యాటకులు నిత్యం ఈ దీవికి రావడం వలన వారికి పాన్ అలవాటయింది. అక్కడికి వచ్చే పర్యాటకులను పాన్ దో అని అడుగుతారు. వీరికి తెలిసిన పదం ఇదొక్కటే. వారి భాష, వారి వ్యవహారం, ఆచారం అంతా ఆటవిక తెగల్లాగే ఉంటాయి. వారిని ఎంతసేపు చూసినా ఏమీ అనరు. కానీ.. ఫొటో తీస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనంలో ఉండి ఫొటో తీసినా అంత వేగంతో పరుగెత్తి వచ్చి మొహం మీద ఉమ్మేస్తారు.
Bathukamma8

కరోవాయి

ఇండోనేషియాలో కనిపించే అరుదైన ఆటవిక తెగ ఇది. ఎత్తైన ప్రదేశాల్లో, చెట్ల మీద నివాసాలు ఏర్పరుచుకుంటారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే చాలు.. వారిని నరబలి ఇస్తారు. సొంత తెగ సభ్యులు సైతం తేడాగా ప్రవర్తిస్తే వారిని కూడా చంపేస్తారు. తాజాగా, వేడిగా ఉండే మెదడును ఇష్టంగా తింటారు.
Bathukamma9

అవా తెగ

తూర్పు బ్రెజిల్‌లోని అమేజాన్ అడవుల్లో ఈ తెగ ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం అంతరించిపోతున్న దశలో ఈ తెగ ఉన్నది. ఒకప్పుడు వేలల్లో ఉన్న ఈ తెగ జనాభా సంఖ్య ప్రస్తుతం మూడు వందలకు పడిపోయింది. వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. జంతువులను మచ్చిక చేసుకుంటారు. ఈ తెగ మహిళలు సాధు జంతువులను, తమ సంతానాన్ని సమానంగా భావిస్తారు. జంతువులకు సైతం స్తన్యమిచ్చి సాకుతారు.
Bathukamma10
అజ్టెక్ తెగ: చూడడానికి అందంగా, రంగురంగుల ఈకలతో, బట్టలతో, పూసలతో అలంకరించుకుంటారు. కానీ వీరు కూడా భయంకరమైన ఆటవిక తెగకు చెందినవారే. నాగరిక మానవులను అస్సలు నమ్మరు. ఆటవిక తెగ సంప్రదాయాలను అత్యంత గౌరవ శ్రద్ధలతో అవలంబిస్తారు. ప్రతీ అమావాస్య, పౌర్ణమి రోజులలో సూర్యచంద్రులకు నరబలులు ఇస్తారు. ఆ తర్వాత ఆ నరమాంసాన్ని ప్రసాదంగా భావించి ఉడికించి తింటారు.

గోండులు: భారతదేశానికి చెందిన అడవిబిడ్డలు వీరు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బస్తర్ లాంటి ప్రాంతాల్లో వీరు ఉన్నారు. వీరి జీవనశైలిలో నాగరికత ప్రవేశించింది. లేకపోతే వీరు స్వచ్ఛమైన ప్రకృతి బిడ్డలుగా కనిపిస్తారు. వీరి జీవనశైలి, సంప్రదాయాలు, ఆచారాలు ప్రత్యేకం. మట్టిగోడలు, ఆకులతో వేసిన ఇంటి పైకప్పు, మట్టిపాత్రలు, పూసలు, ఈకలు వీరి జీవనశైలిని ప్రత్యేకంగా చూపిస్తాయి. ఎక్కువగా తృణధాన్యాలతో, పిండితో చేసిన వంటకాలు ఎక్కువగా భుజిస్తారు. మంచి మాంసాహార ప్రియులు కూడా.

భిల్లులు: ఆరావళి పర్వతాలు వీరి ఆవాసం. కాలక్రమేణా మహారాష్ట్ర, త్రిపుర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాలకు విస్తరించారు. ఘుమర్ నృత్యం వీరి ప్రత్యేకం. వీరిది ఇండో ఆర్యన్ భాష. పూర్తిగా నాగరికులుగా కాదు.. ఒంటినిండా బట్టలు ధరిస్తారు. కాళ్లకు, మెడకు కడియాలు ధరిస్తారు.

మవోరి తెగ: న్యూజిలాండ్‌లో ఈ తెగ ప్రజలంటే తెలియని వారుండరు. తమ సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలు, కళలను కాపాడుకుంటూ వారి జీవనశైలిని ఏమాత్రం మార్చుకోకుండా మనుగడ సాగిస్తున్నారు. వీరిని చూడడానికి వచ్చే పర్యాటకులకు తమ జాతి పద్ధతుల గురించి, పుట్టు పూర్వోత్తరాల గురించి వర్ణిస్తారు. వారి తెగకు సంబంధించిన వారితో మాత్రమే బంధుత్వాలు కలుపుకొంటారు. ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకుంటారు.

కొలాములు లేదా కొలవార్ తెగ: మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో నివసించే ఆదిమజాతి తెగ ఇది. వీరినే మన్నెవాళ్లు అని కూడా అంటారు. మహాభారతంలోని పాత్రలైన భీముడు, హిడింబిల సంతానమే వీరని అంటారు. హిడింబిని, భీముడిని కులదేవుళ్లుగా పూజిస్తారు. వీరు మాట్లాడే భాష మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందనది. ఇది ఆటవిక జాతుల భాష అయిన గదబ, నాయికీ, పర్జీ భాషలకు దగ్గరగా ఉంటుంది. రోజురోజుకూ నాగరికత విస్తరించడం వల్ల కొలామీల తెగ అంతరిస్తున్నది. అందుకే ఆటవిక జాతి ప్రజలు నాగరికులను తమ దరిదాపుల్లోకి కూడా రానీయరేమో!

కారిబ్ తెగ: కరీబియన్ దీవుల్లో కనిపించే అత్యంత భయంకరమైన ఆదిమ జాతి తెగ ఇది. రూపురేఖలతో సహా వీరి ప్రవర్తన కూడా ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంటుంది. ఒంటి మీద దుస్తులు ధరించరు. పూసలు, ఈకలు అలంకారంగా ధరిస్తారు. ఒళ్లంతా ఎర్రటి రంగును పూసుకొని భయకరంగా అరుస్తారు.

మనదేశంలో దాదాపు 35 తెగల ఆటవిక తెగలున్నాయి. మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర సిక్కిం, అస్సోం, ఉత్తరప్రదేశ్, నాగాల్యాండ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, నీలగిరి, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లోని కొన్ని అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం మనదేశంలో 461 ఆటవిక జాతులున్నాయి. భారత దేశానికి చెందిన కొన్ని ఆటవిక తెగలు, ఆదివాసీ జాతులు వేగంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. బంజారా, నాగ, జరావా, కాశి, హుంజా, అగారియా, అబుజ మారియా, గారో, సంతాలు, అంగామి, మూండా, భూటియా, కొడవ, ఇరుల, న్యిషి, వార్లి, కురుంబన్, సోలిగ వంటి దేశీ ఆదివాసీ తెగలు నాగరిక జీవనానికి అలవాటు పడి క్రమంగా కనుమరుగవుతున్నాయి. వేగంగా జరుగుతున్న అభివృద్ధి కూడా ఈ మార్పుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

2022
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles