మట్టిబండి


Sun,June 10, 2018 09:41 AM

రాఆరి లచ్చి జీతగాన్ని పిలిచిండు సత్తి.అయారాన్రాను యెండలు ముదురుతానయి.. చెరువు మట్టి తోలరార.?తోలాలయా..మట్టిబండ్లు యెప్పటినించి మొదలు బెడుదామంటరు..?బండ్లు బాగున్నయా.?లేదుండి.. పట్టాలు గట్టియ్యాలె...పెద్దబండిది వొలపటి గిర్ర లుకలుకమంటాంది.పట్టాలరిగినయి.దాపటి గిల్ల దసిలిపోయింది. గిల్లబుడ్డి వదులయింది. ఆకులు పలిగి శీర్కలొచ్చినయ్. తొట్టికర్రలిరిగినయ్...కమ్మరోల్లెంకన్న మావ కొలిమి మీద వున్నడో లేడో చూసిరాపో..ఆనించి వొడ్లోల్ల బమ్మచారి బావోల్లింటి దాక పోయిరా..శిన్నబండిని గూడ సదిరిద్దాం..మల్ల మల్ల గాకుంట.సరేనుండ్రి.

ఉగాదెన్నడే... అమ్మావచ్చే సోమారం..రా..ఉగాదెల్లినంక బుధారం నుంచి శెర్వు మట్టి దోలాల్నే..మన రొండు బండ్లకు తోడు... కాకరాయినించి మామ యెడ్లను గూడ తోల్కరమ్మని శెప్పరాదె.. వారం రోజులపాటు. అమ్మా.నువ్వడిగితె మాత్రం కాదంటాడుర..మీ మామ.
పిలగాండ్లు అమ్మమ్మోల్లింటికి పోదాం పోదాం.. అంటాండ్రయా.. వీల్ల పరీచ్చలు అయిపోయినయి. అట్లనే మమ్ములాడ దించినట్టుంటది. బండెడ్ల తోలుకొచ్చుకున్నట్టుంటది.యీమెదోటి. అబ్బ బలె సందుగనిపెడుతవే.. నీ తెలివికి మొక్కాలమ్మ.. అమ్మగారింటి మీద గుంజుతాంద పానం.బాపు.. బాపు.. నేను, అక్క, అమ్మ పోయొత్తమే తాతోల్లింటికి.. యెల్లుండి పోతం లచ్చిగాన్ని తోలిరమ్మనరాదు..మన బండ్లె. బాపు శెప్పే.సర్లే బేటా..మంచిగ రాసిండ్రా పరీచ్చలు.మంచిగ రాసినం బాపు. తమ్ముడెట్ల రాసిండట.నేను గూడ మంచిగనే రాశినా..అమ్మమ్మోల్లింటికి పోవాలే..పోదువులేవోయ్ మొనగా..ఉగాదెన్నడే... అమ్మా.వచ్చే సోమారం..బుధారం నుంచి శెర్వు మట్టి దోలాలె..మూడు బండ్లను రడిబెట్టాలె.. కాకరాయినించి మామనడిగి వాల్ల యెడ్లను గూడ తోల్కరమ్మంట వారం రోజులు.పొలమడుగు రొండెకురాలు... పాటిమీద శెల్క ఐదెకురాలు నింపాలె శెరువు మట్టి...నేనుగూడ వత్తపా...దాని దంటకు ఈ పాలి నాలుగైదు పెంటలు గూడ కొందాని.. నీయక్క జానడెత్తు నింపాలె శెల్కను.
VillageMatti

అమ్మా..తొక్కిన జొన్నలున్నాయె...వున్నయి..యెందుకురా..మట్టి బండ్లు గడితే గట్కకు గావాల్నే..మామిడికాయె శింతకాయె తొక్కున్నదిగా.. మొన్న జొన్న శేన్ల తెంపుకొచ్చిన దోసకాయలున్నయా.. పంచినవా..? కుతిడిబోసెటోల్లకు యింటి ముందల శాలోల్లకు గిట్ల..యెండలకు కూరగాయలంటె దొరుకవు మల్ల.వున్నయి..వున్నయి. దోసకాయలు కోసి వొరుగులు గూడ జేశి పెట్టిన. గుమ్మడికాయలు కోసి వొడియాలు జేసిన.సల్లగూడ కావాలె గట్కలకు. మన బర్లపాలు సరిపోతయా.? మరింత గావాలె సల్ల. మట్టిదోలి పోరగాండ్లు యెండల బడొత్తరు. దూప మీదుంటరు. మట్టితోలినన్ని రోజులు నేను గూడ గట్కేతింట. యెండలల్ల మట్టి తోల్తాంటె యీ వరిబువ్వ వొక్క మల్కకే అరిగి పోద్దని గటక తెచ్చిన.

యేమన్నర్రా...లచ్చి..యెంకన్న వున్నడు గని.. గాలి తిత్తి నిప్పురవ్వలు పడి కాలిపోయిందట.. పెద పీరన్నకాడికి పోయి అతుకేయించుకొస్తడట.. నాల్రోజులాగినంక మొదలు బెడుదామంటున్నడు మన పని. వారం దాక కొలిమి కాలీ లేదట.యేం జేద్దామి..లచ్చీఅప్పటోరకు బమ్మశారన్న తోని వడ్లపని చేయిద్దాం. బుడ్డి పట్టిచ్చుడు ఆకులు కట్టిచ్చుడు కాని గడుగొయ్యలు గిట్ల శేపిద్దాం.ఆ తొట్టి తాడు అంత శీకి పోయినట్టుంది గదరా.. బండి సట్టం గట్టిగున్నదా? యిరుసు బిర్రుగున్నదా?యిరుసు నల్లతుమ్మదేనాయె.. సట్టం గట్టిగనే వున్నది.
పోలు గట్టిగున్నదా? యెన్నడో మా నాయిన చేయించిననాటి పోలు. నర్సంపేట వాల్ల అల్లుని అదేరా మా పెదబావ లేడు, ఆల్లూరుకు బోయినప్డు చేయించుకొచ్చిండు, మంచి టేకు చెట్టును బడేసి. వాల్లుండేది అడివిల గద. యింటి సుట్టు టేకుశెట్లేనాయె. సలికాగుదానికి గూడ టేకు కర్రేరా ఆ దేశంల..లచ్చి.మంచి మంచి టేకు కల్రు మంటల్లబడి కాలుతాంటె నా పానం గోస్కపోయేది.మర్నెట.. మొన్న మా మామ వచ్చినప్పుడు గూడ అంటాండె.అయితాంగని...

పెద్ద బండ్లె తొట్టి తాడు అంత శీకి పోయి యేడికాడికి తెగిపోయినట్టుంది గదరా..మరే.. గొడ్ల పగ్గాలు గూడ తెగిపోయి తుంటలు తుంటలు అయినయుండ్రి..నాతోని చెప్పుడెందుకు రా గా ముచ్చెట్లు గూడ. మీరు జేయించుకోలేరా..? మన తాడెక్కే సత్తెయ్య బావను మాపడిజాం రమ్మని తాటి కమ్మలు బడేపియ రాదుర. యెడ్ల కొట్టం కప్పిద్దాని. అట్లనే మట్టలు కోపియిరి. తాటి నార జీరురి. తొట్టి తాల్లకు లేగదూడెల పలుపులకు గిట్ల బనికొత్తయి. పొద్దడిజాం మోటయిడిసి నంక మన రాములును అదే పనిమీద వుండమను.యేమంటాన?
సత్తెయ్య మామ.. పాల్వంచ బోయినట్టున్నడుగా.. దేశం బోయిన అల్లుడు బిడ్డకాడికి. రొండు రోజులసంది పుల్లయ్యతాతే యెక్కుతాండు తాల్లు.పుల్లయ్యకాకనే కొయ్యమనరాదు... మరిముసలోడు గన్ని తాల్లు యెక్కిదిగుతాడున్రి? యెల్లుండి వస్తడట.. వచ్చినంక కోపిద్దాం.. లేరాదు.సరే అట్లనే కానియ్యి..మరి సత్తెయ్య వచ్చేలోపట.. ఆ శెర్ల నానేశిన గోగ్గట్టె తెచ్చి ఆరబెట్టరాదు. నార జీరితె.. పలుపులు పగ్గాలు గూడ లేవు.. పేన్దురు. అవునయా.. పగ్గాలు పేనాలె.. శాన్రోజులాయె.. అనుకోబట్టి. మాకేమె తీరుతలేదాయె.. మీనాయిన గారు చంద్రయ్యగారిని పేనమని చెప్పరాదురి తాల్లు. మీము నార తెచ్చిత్తం గని.యేమొ మీరే అడిగి సూడుండ్రి రా.. ఆయినెకు గాలాలేసుకొని శెర్ల శాపలు పట్టుడే సరిపోతాండె.. యెండల వూకె పోకే అంటె యింటలేడాయె. యేం జెప్పాలె రా..
అయితాంగని... పోద్దాల్లెప్పుడు కోత్తడటరా మన సత్తయ్య.రాయిలు కుంటల రెండు శెట్లు కోషిండు.. గీత్తాండెగా..ఒరిత్త... యెన్రోజులయిందిరా..

వారమాయె..పాపం పాడుగాను.. వొక్కనాడన్న ముంతడు కల్లు పోయెక పోతిరేమిరో.. లచ్చియాడనుండ్రి.. నాలుగు సీసాలయితె.. మీ నాయిన గారు ఆ పెద్దమనిషికింత బోసి.. మేమింత తాగితిమి. మాకే సాల్తలేదు.. నాల్రోజులాగురి.. కుండల కుండలయితది గని కల్లు..
పట్టాలు కట్టిద్దామంటున్నవు గని... పిడకలెట్లరా.. ఐదారు బస్తాలు లేంది యీరయ్య మామ వూకోనే వూకోడు. ఆయినకు సలసల యెర్రగ కాలంది పట్ట కట్టనే కట్టడు. యేరుక రావాల్నుండీ...యెన్నడేరుతరు..యెప్పుడు జమయితయి.. రా.. యింక కంపగొట్టే పని ఆన్నే వుండె.
మరేం జేయమంటరు.. మీ కత ముద్దుగున్నది గదా.. ముగ్గురం వుంటే మా పనే మాకు సరిపోతాండె.. నాలుగు రోజులు శెల్క పని ఆపితే యియన్ని అయితయి.ఆ రాగోల యెటుబాయె... మల్లయ్య తీస్కపాయె తెచ్చిండా.. వాడేది అడుక్కపోయినా అటే.. మల్ల మనం పోయి తెచ్చుకుంటె తప్ప వానంతట వాడు తెచ్చి కొట్టంల బెట్టడు..మాపడిజాం బోయి తెత్త. నిన్న మొన్న కొట్టిన కంప జమజేసి కాలబెట్టాలె.. గొడ్లిశిడే యాల్లయితాంది నేను శెలుక్కాడికి పోతాన.. ఓపాలి యెంకన్న కాడికి బమ్మశారి కాడికి పొయ్యిరారి.. మీరు పోకుంటే రేపు మాపు అంటరు.. తిప్పుతాంటరు. కశె యెంకయ్య మావకు లైను జేయాలె.యిగ లైనేందయ్యో... మనకెరుక లేందా.. యీ కమ్మరోడు కల్లుతాగురా అంటె తాగడు. పోద్దాడు కల్లు నాలుగు ముంతలు దాగినా.. అబ్బ కడుపుబ్బె అని మొకం జూత్తడు.. పాకిట్ గావాలె ఆయినెకు..
నీయవ్వ కత కూన వారేతు. వీల్లతోనో కత.. పనిచేపిచ్చుకోవాలంటే యిదో లంచం.సరె.. ఆ కతేందో పడొత్తగని.. పా.. పా.. అట్లనే ఆల్ల కూలి సంగతి గిట్ల మాట్లాడి వత్త.

లచ్చీ.. వోరి లచ్చీగా... పన్నావుర పోరడ .శీకటి పడుడే ఆల్సం వీనికి. యేందుండ్రీ... యిప్పుడె అట్ల అడ్డ మొరిగిన జాం రాత్రయితాంటె పన్నావుర అంటరేంది.. కంపజీర్కపోయి నేను సత్తాంటె.. మల్ల పొద్దుగాల లేవాల్నాయె.నడుంగ లేసి పెద్దసుక్క పొడువంగ ఓపాలి గొడ్లకింత వరిగడ్డేయి.. అప్పటోరకు నేను యేసిపోతానింత సొప్ప తింటయిగని..యింటికి పోతవావత్తవా కొట్టంలనే పంటవురో... అమ్మగారింటికి పోయి వచ్చిందా పొల్ల..అదొత్తె యింత సేపుందునా చెల్కల...మల్లిగాడు గిట్ల యింత కల్లుబొట్టుంటె తాగినం.. పానం సొక్కినట్టయ్యి.. అట్ల వొరిగితానె... అట్లనే కన్నంటుకున్నది.బువ్వరో...అమ్మ పెట్టిచ్చిన మాపడిజాం బువ్వ... పని చేసుకుంట అట్లనే.. పొద్దగుంజాముల తిన్న.. యింత కలుబొటు తాగితారికె తినబుద్ది కాతలేదు.పొద్దుగాల గోరుకొయ్యలు పొడువంగ కట్టాలె బండ్లను. రాములు మల్లయ్య మన చిన్నోడు యెల్లిగాన్ని గిట్ల నువ్వే లేపుక రావాలె.. యింటాన వార లచ్చీ.యింటానింటాన.. పొద్దుగాల శీకట్లెనే గట్టి.. జాము పొద్దెక్కితార్కె యిడుద్దాని బండ్లు. యెండకు వగిరిత్తయి యెడ్లు. కాకపోతె పొద్దుగుంజాల కషె సల్లబడ్డంక మల్లో రొండు మల్కలు తోలుదామి.
లచ్చి.. అట్లనే కానియ్యిరా.నేను గోరుకొయ్యలు పొడువంగనే లేశొత్త.

అహ్హడి.. చ్చొ.. చ్చొ. దా.. దా.. రాముడు దా. యెద్దు గటెటో పోతదేమిరో..పయ్యెద్దు అట్ల నిలబడి సూత్తదేంరో.. పెండ్లికొచ్చినట్టు.. కాని మెడమీదేసుకోక.. దా.. రోజు రోజు కు తెలివెక్కువయితాంది.కుడితి తాపిండ్రా...అన్ని తాపినం.మల్లీ.. బండి తోల్కోని పా.. ముందల. సక్కగ శెర్ల.. ఆ పెద్దగుండు కాడి కోపు కాడ ఆపు. తట్టలు పారలు యేసుకున్నార్రా.. తడుకలు గట్టిగున్నయా లేవురో.. అసలె బుర్దమట్టి. గడుగొయ్యలు బరాబర్ వుండాలె.మొన్ననే యెర్కలోల్ల రాములు దగ్గర అల్లిత్తిమి.. పెండతోని రొండొరుసలు పూత్తిమి..తడకలకేమయిందుండి.
అయితె పోనియ్.చిన్న బండి కట్టి న్రార. పోనీయ్ ఒకదానెనుక వొకటి రానియిరి యిగ.

పున్నమి యెన్నల తెల్లగ మంచిగనే వున్నదిగ... తెల్లారితారికే ఆరు ట్రిప్పులు గొట్టాలె.ఆరి ముత్తయ్య.. నువ్వా గడ్డపార పట్కోనిటురా..లచ్చీ.. నువ్వాడ తొవ్వు..యెల్లిగా ఆ తట్ట పట్కోని అవుతలి కోపులకు పో.. రాములు నువ్వుగూడ పో. మేమిక్కడ తొవ్వుతం గని.. మీరక్కడ తొవ్వున్రి.మాది పెద్ద బండి మీది చిన్నది.యెవ్వల్ది ముందుగాల నిండుద్దో సూద్దామి.. యేమంటవురా మల్లీ..యిగ. ముందుగాల బండి నింపినోనికి యియ్యాల మాపడి జాం పోద్దాల్ల కల్లు ఫుల్లు..అద్దగంట సేపట్ల నిండాలె పట్టురా... యెయ్.. యెయ్..అల్లీ రాణీ వోచ్చేనే వో జనులారా.. ఆలకించా రండయో..యాదవుండవయ్యీ..మరియాదలేదు నీకూ.నాదు చెంతటా... నాదు చెంతటా.. ఏయ్ నాదూ చెంతటా నిలిచి పలికేదవ్ న్యాయమౌర నీకూ..గడికాడి బాగోతం పాట ..లీల గ యిన బడుతాంది. వొరేక్కో... దాసరి బిచ్చం గానోల్లు.. బాగోతమాడుతానున్నట్టు గదరో ..లచ్చిఆల్ల ఆట యిప్పుడొడుత్తదా.... తెల్లారాలే.. మనం మట్టి బండ్లిడిశినంక గూడా నడుస్తనే వుంటది ఆల్ల బాగోతం..యిగ మనల జూసి... రేపటిసంది మన పట్టె పట్టె కదులు తట్టున్నరారి..మట్టి తోల్దానికి. లచ్చీ... మనకు మిగుల నిత్తార్ర రేగడి మట్టి.యేందుండ్రి మీదోటి.. నిరుడు వరుదల్లేక దొరకలేదుగని.. యీ యేడు వరుదలకు శెరువుల మస్తుగ చేరిందండి రేగడి. మూడూర్లకు సరిపోనుంది మట్టి.అయితెమాయె పా... అందరు తోల్కోవాలె. తోలుకుంటనే శెరువుల కోపులు తేల్తయి. నీల్లు మరిన్ని పడుతయి. మన బావుల్లకు నీల్లూరుతయి. రేపటి నించి మట్టి బండ్ల తిర్నాలే యిగ.. శెల్కలల్లకు శెర్వులకు.యెయ్రా నా మల్లి..యెయ్రా రేగడి మన్ను.యెయ్రా మన కరువుదీర యెయ్రా మన చెరువు మట్టి //యెయ్రా//నల్లా రేగాడి మట్టి..సల్వజేసేటి మట్టి
యెరువు లేని భూములకు ఆదెరువుర యీ మట్టి
వరుదతొ మన వూరు జేరి
బురదతో మన శెరువునింపి
తన బలముతో మన పంటలకు శక్తి నింపు శెర్వుమట్టి // యెయ్రా//
నల్లా బంగారము నిండగ పండునులే బంగారము
రోగాలను అరికట్టి మన పంటల కాపాడే మట్టి //యెయ్రా//


రమేష్ హజారి ,సెల్: 9390919090

1047
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles