భగీరథుడు


Sun,March 17, 2019 01:13 AM

Bhagiradha
జీవితమే ఒక ప్రయత్నం. మనిషి తన ప్రయత్నం చేస్తూ పోతే తప్పక ఏదో ఒక రోజు ఆ ప్రయత్నం ఫలిస్తుంది. కానీ మనం చేసే ప్రయత్నం మన వారి కోసమో, సమాజం కోసమో, ప్రపంచం కోసమో అయితే ప్రయత్న ఫలితం మరింత నిగ్గు తేలుతుంది. ప్రయత్నం గట్టిదైతే ప్రపంచమే కదిలివస్తుంది. అయితే మనం చూసే ప్రయత్నంలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వస్తే ప్రయత్నం అంతగా ముందుకు సాగుతుందని అర్థం చేసుకోవాలి. కుంగిపోకుండా, నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించడమే మనిషి కర్తవ్యం కావాలి. స్వార్థం లేని ప్రయత్నం తనకై కాక తను పడే తపన మనిషిలో ఉంటే సంకల్పం బలంగా, వరంగా మారి ప్రపంచ మనుగడ రూపును పూర్తిగా మార్చేస్తుంది. తన జీవిత గమ్యాన్నే ప్రయత్నంగా మలుచుకొని తన పూర్వీకులను ఉద్ధరించే ప్రయత్నంలో భగీరథుడు తన పేరునే ప్రయత్న సాధనకు రూపంగా మార్చుకొని, లోకాలన్నింటినీ పావనం చేశాడు. భగీరథ ప్రయత్నం అన్నది విన్నా చాలు ప్రతీ ఒక్కరిలో సంకల్పం ఒక్కసారిగా జాగృతమవుతుంది.

ఇక్షాకు వంశాన్ని తరింపజేసిన దిలీపుని పుత్రుడే భగీరథుడు. ధార్మికత, తేజో సంపన్నత, వివేచన కల్గిన చారిత్రక పురుషుడు భగీరథుడు, పూర్వీకులను స్వర్గతుల్యులను చేయాలనే సంకల్పమే జీవితంగా బతికిన భగీరథుడు రాజ్యపాలనను గాడి తప్పకుండా ఏర్పాట్లు చేసి, యంత్రాంగానికి అప్పజెప్పి తపస్సుకై వెళ్లిపోయాడు. గంగను దివి నుంచి భువికి తేవడానికి గోకర్ణ క్షేత్రంలో మండు వేసవిలో చేతులు పైకెత్తి నిల్చొని నెలకు ఒకసారి ఆహారం తీసుకొంటూ తపస్సు చేశాడు. భగీరథుని ప్రయత్నం ధర్మ నిర్ణయం. ఎందుకంటే తన పూర్వీకుల ఉద్ధరణే కాక, భూ సంరక్షణ కోసం ధర్మంలో భాగంగా గంగను భువికి తేచ్చాడు. అందుకనే తపస్సుకు మెచ్చి బ్రహ్మ దిగి వచ్చాడు. నీ ప్రయత్నం సమంజసమైంది గానీ, గంగను ఒక్కసారిగా భూమి మీదకు వదిలితే భూమి తట్టుకోలేదు. శివుని వల్లనే ఏదైనా మార్గం స్ఫురిస్తుందని భగీరథుడితో అంటాడు బ్రహ్మ.

భగీరథుడు కేవలం కాలి బొటన వేలును భూమ్మీద ఆనించి చేసిన తపస్సుకు శివుడు కదిలివచ్చాడు. గంగను తలపై ధరించి, తిరిగి వదిలే లోపే గంగ శివున్ని తనతో పాటు పాతాళానికి తీసుకెళ్లాలనుకుంది. గంగ అంతరంగాన్ని గమనించిన శివుడు తన జటాజూటాన్ని హిమాలయాలంత విశాలం చేసి గంగను బంధించి వేశాడు. అలా చాలా కాలం గంగ శివుని తలపైనే ఉండిపోయింది. భగీరథుడు తన ప్రయత్నం మానక శివున్ని ఎలాగైనా గంగను భువికి పంపించాలని కోరాడు. భగీరథుని విన్నపం లోక కల్యాణం కోసమనే తలంపుతో శివుడు ధారణ వదిలిన గంగ ఏడుపాయలై, ఏడవ పాయ భగీరథుని వెంట నడుస్తూ వచ్చింది.

భగీరథుని వెంట గంగ తరలిన దృశ్యం అద్భుతాలకే అద్భుతం. భగీరథుడు ఎటు నడిస్తే గంగ అటు కదిలింది. లోకంలోని పాపపంకిలం అంతా గంగ స్పర్శతో తుడిచిపెట్టుకుపోయింది. భూమి తరించిపోయింది. అలా గంగా ప్రవాహం సాగుతుండగా భగీరథుడు దారిలో జుహ్నరుషి ఆశ్రమం రావడంతో ఒక్కసారిగా ఆగిపోయాడు.

గంగ మాత్రం తన ప్రవాహాన్ని ఆపుకోలేకపోయింది. దాంతో మహర్షి ఆశ్రమం మునిగిపోయింది. కోపంతో జుహ్నరుషి గంగానదిని అమాంతం తాగేశాడు. భగీరథుని ప్రయత్నంలో మళ్లీ అవాంతరం. అయినా భగీరథుడు బెంగపడలేదు. మంచిపని కోసం తాను గంగను భువిపైకి తీసుకొచ్చాననీ, గంగను తమ కూతురిగా భావించి వదిలివేయమని అర్థిస్తాడు. జుహ్నువు చిరునవ్వుతో గంగను చెవి నుంచి వదిలిపెట్టాడు. గంగ జాహ్నవి అయ్యింది.
భగీరథుడు గంగను సముద్రంలోకి, అటునుంచి పాతాళానికీ తీసుకెళ్లి, తన తాత ముత్తాతల భస్మరాసులను గంగా ప్రవాహంతో తడిపేశాడు. అంతే వారికి ముక్తి లభించింది. గంగ అటు స్వర్గంలోనూ, భూమ్మీద, ఇటు పాతాళంలోనూ ప్రవహిస్తూ లోకాన్ని పావనం చేసింది. భగీరథుని ప్రయత్న ఫలమై వచ్చింది గనుక భాగీరథిగా పేరుగాంచింది.

చిన్నతనంలో భగీరథుని శరీరంలో బలం లేకుండా, తను కాసేపు కూడా నడవలేని పరిస్థితి ఉండేదట. ఒక రోజు ఆశ్రమ ప్రాంతంలో నడవడంలో ఇబ్బంది పడుతున్న భగీరథున్ని చూసి అష్టావక్రుడు తనని హేళన చేస్తున్నాడని అనుకొని, నన్ను పరిహసిస్తే భస్మం అవ్వాలని, కానట్లయితే మంచి రూపం పొందగలడని అన్నాడట. అలా భగీరథుడు స్ఫురద్రూపుడై, సత్సంకల్పుడై, విజయుడై చరిత్రను అద్భుతానికి ఆపాదించాడు. మంచి చేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోతే అసాధ్యాలను సుసాధ్యం చేయగలమనే ప్రేరణ భగీరథుని ప్రయత్నం. పుట్టిన ప్రతీ ఒక్కరూ తమ తమ జీవితాలకు అర్థం ఉండేలా చేసుకోవాలనే ఆదర్శం భగీరథుని జీవితం.

చిన్నతనంలో భగీరథుని శరీరంలో బలం లేకుండా, తను కాసేపు కూడా నడవలేని పరిస్థితి ఉండేదట. ఒక రోజు ఆశ్రమ ప్రాంతంలో నడవడంలో ఇబ్బంది పడుతున్న భగీరథున్ని చూసి అష్టావక్రుడు తనని హేళన చేస్తున్నాడని అనుకొని, నన్ను పరిహసిస్తే భస్మం అవ్వాలని, కానట్లయితే మంచి రూపం పొందగలడని అన్నాడట.

- ప్రమద్వర

304
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles