బొబ్బిలి యుద్ధం


Sun,May 13, 2018 12:57 AM

(పద్మనాయకులు - సంస్థానాలు : ఆరో భాగం)

నగేష్ బీరెడ్డి, సెల్ : 8096677177

ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటీష్, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు వారు తమలో తామే కాక, స్థానిక పాలకులతోనూ అనేక యుద్ధాలు చేశారు. వీటి కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం తరచూ మారుతూ ఉండేది. ఇలా జరిగిన అనేక యుద్ధాలలో, తెలుగు నాడు చరిత్రలో బొబ్బిలి యుద్ధం ఒక ప్రముఖ ఘట్టంగా మిగిలిపోయింది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.

జల్లిపల్లి మహాసంగ్రామం (క్రీ.శ. 1361) రగిల్చిన వంశపు పగలు పొగలు కక్కుతూ నాలుగు వందల ఏండ్ల వరకూ అగ్నిజ్వాలలను రగిల్చాయి. రావు వారు బొబ్బిలి సంస్థానాన్ని స్థాపించినా.. పూసపాటి వారు విజయనగరాన్ని ఏలుతున్నా.. పూర్వపు వైషమ్యాలను మాత్రం వీడలేదు. బొబ్బిలి వారిని ఎదుర్కొనడం విజయనగర రాజుల తరం కాలేదు. బలం, బలగం ఉన్నా అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. కానీ, ఎప్పటికైనా తమ పక్కలో బల్లెంలా ఉన్న బొబ్బిలి వారిని వెళ్లగొట్టి ఆ సంస్థానాన్ని ఆక్రమించుకోవాలన్నది విజయనగర రాజుల ఆశ. అది ఆడియాశగానే మిగిలిపోసాగింది. ఈ నేపథ్యంలో వారెప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉండేవారు. 18వ శతాబ్దంలో బొబ్బిలి సంస్థానాన్ని రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగర సంస్థానాన్ని పూసపాటి పెద విజయరామరాజు పాలిస్తూ ఉండేవారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. ఈ మేరకు ఆ ఇరువురి మధ్య అనేక ఘర్షణలు, యుద్ధాలు జరిగాయి. వీటిల్లో ఎక్కువగా బొబ్బిలి సంస్థానమే విజయం సాధిస్తూ ఉండేది.
ఫ్రెంచి వారు గతంలో హైదరాబాద్ నిజాం నుంచి ఉత్తర సర్కారులను పొంది ఉన్నారు. ఫ్రెంచి సేనాని బుస్సీ ఆధీనంలో ఈ సర్కారులు ఉండేవి. స్థానిక ప్రభువులు ఫ్రెంచి వారికి శిస్తు కడుతూ పాలన సాగిస్తుండేవారు. 1756 చివరలో హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్.. బుస్సీని ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ వార్త తెలిసిన తరువాత విజయనగర రాజులు తప్ప, ఉత్తర కోస్తా జమీందారులందరూ ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానేశారు. అటు తర్వాత బుస్సీ.. నిజాంతో రాజీ కుదుర్చుకుని, తిరిగి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు. 1757లో బుస్సీ నిజాం సంస్థానం నుండి బయల్దేరి మచిలీపట్నం మీదుగా రాజమండ్రి చేరుకుని, కోటపల్లి వద్ద మకాం వేశాడు. పాలెగాళ్లు, జమీందారులు, సంస్థానాధీశులు వచ్చి తనను కలువాలని అందరికీ కబురు పంపాడు బుస్సీ. దొర ఆజ్ఞ మేరకు విజయరామరాజుతో సహా అందరూ వచ్చి కలిశారు, ఒక్క బొబ్బిలి పాలకుడు రంగారావు తప్ప.

సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్న విజయరామరాజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. బొబ్బిలి రంగారావుకు వ్యతిరేకంగా బుస్సీకి, అతని దివాను హైదర్‌జంగ్ (నిజాం నవాబు తరపున దివానుగా మహ్మదీయ సేనాని హైదర్ జంగ్ బుస్సీ దొరకు సహాయంగా ఉండేవాడు)కు లేనిపోనివి చెప్పాడు. మీరంటే వారికి లెక్కలేదనీ, అందువల్లే మిమ్మల్ని వచ్చి కలువలేదనీ, మీకు ఇవ్వాల్సిన శిస్తు కూడా సరిగా చెల్లించడం లేదనీ వారికి నూరిపోశాడు. బొబ్బిలి వారు తనను అనేక రకాలుగా ఇబ్బందులు కలుగజేస్తున్నారని, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టి బొబ్బిలిని తనకు స్వాధీనం చేస్తే శిస్తు సక్రమంగా చెల్లిస్తానని కూడా విజయరామరాజు బుస్సీని వేడుకున్నాడు. తాను కట్టాల్సిన కప్పం కూడా వెంటనే కట్టేశాడు. అంతేకాక, హైదర్‌జంగ్‌కు లంచం ఇచ్చి, బుస్సీకి బొబ్బిలిపై మనసు విరిచేందుకు సహకరించమని కోరాడు. ధనాశాపరుడైన హైదర్‌జంగ్ అందుకు అంగీకరించడమే కాక.. విజయరామరాజుకు వత్తాసు పలికి బొబ్బిలి వారిపై బుస్సీకి ఆగ్రహం తెప్పించాడు. వెంటనే బొబ్బిలి వదిలిపెట్టి పోవాలని బుస్సీ బొబ్బిలి రంగారావుకు హుకుం జారీ చేశాడు. రంగారావు దాన్ని అవమానంగా భావించాడు.హైదర్‌జంగ్‌కు, విజయరామరాజుకు మధ్య జరిగిన లంచం ఒప్పందం తన వేగుల ద్వారా బొబ్బిలి రంగారావుకు తెలిసింది. హైదర్‌జంగ్‌కు, బుస్సీ దొరకు అసలు విషయం చెప్పేందుకు తన రాయభారి మంతెన బుచ్చనతో రంగారావు రాయభారం నడిపాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలం అయింది. మరో ప్రయత్నంగా బొబ్బిలి రంగారావు తమకు ఆత్మీయుడయిన బందరు ఫ్రెంచి దొర గోరుం గారితో సిఫారసు ఉత్తరం బుస్సీ దొరకు పంపించాడు. కానీ, హైదర్‌జంగ్ మాయోపాయాలు, విజయరామరాజు దురుద్దేశం ముందు బొబ్బిలి దొరల రాజనీతి, రాయబారం నిరుపయోగం అయ్యాయి. ఆ సాయంత్రం విజయరామరాజు హైదర్‌జంగ్‌ను కలిసి చూశారా? నేను చెప్పిందే నిజమైంది. ఆ రంగారావు మిమ్మల్ని కలవడానికి రాకుండా, బందరు కమాండరు ద్వారా బుస్సీకి ఉత్తరం పంపించాడు, అతడికి మీరంటే లెక్కే లేదు అని అతడ్ని రెచ్చగొట్టాడు.
Uddam

అంతకు ముందో, ఇదే సమయంలోనో జరిగిన రెండు సంఘటనలు కూడా బొబ్బిలి రంగారావుపై బుస్సీకి మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. అందులో ఒకటి.. బుస్సీ దొర తన కొందరు సిపాయిలను ఒక దూరప్రదేశానికి పంపించాల్సి వచ్చింది. వాళ్లు బొబ్బిలి రాజ్యం గుండా వెళ్లాల్సి రాగా, అందుకు తగ్గ అనుమతులు కూడా తీసుకున్నారు. విజయరామరాజు కుటిల రాజకీయ చాతుర్యం కావచ్చు, రంగారావు ప్రణాళిక కావొచ్చు.. ఆ సిపాయిలపై దాడి జరిగింది. ఆ దాడిలో 30 మంది సిపాయిలు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. బొబ్బిలి సంస్థానంపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని బుస్సీకి తెలియజేయడానికి విజయరామరాజు ఈ సందర్భాన్ని కూడా బాగా ఉపయోగించుకున్నాడు. ఇక రెండోది.. ఇబ్రహీం ఖాన్ శ్రీకాకుళంలో ఫ్రెంచి వారి తరపున ఫౌజుదారుగా ఉన్నాడు. బుస్సీకి నిజాంతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అతడు బుస్సీపై తిరుగుబాటు చేశాడు. రాజమండ్రి కోటలో సైనికులను రెచ్చగొట్టి, తిరుగుబాటు చేయించాడు. ఫ్రెంచి వారు వసూలు చేసిన శిస్తులు వెనక్కి ఇచ్చేయాలని అతడు డిమాండ్ చేశాడు. బుస్సీ రాజమండ్రి చేరుకోగానే అతడు భయపడి పారిపోయి, బొబ్బిలి రాజుల వద్ద శరణు కోరాడు. తనను ఎదిరించిన వాడికి ఆశ్రయం ఇవ్వడం.. బుస్సీకి బొబ్బిలిపై ఉన్న కోపాన్ని, వారిపట్ల అతడి శత్రు భావనను మరింతగా పెంచాయి. ఈ సంఘటనలే బుస్సీని బొబ్బిలిపై యుద్ధం దిశగా నడిపించాయి.
బుస్సీ ఆజ్ఞ మేరకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన ఫ్రెంచి తురుష్క సేనలు పెద్దాపురం మీదుగా కసింకోట చేరుకున్నాయి.మంతెన బుచ్చన్న తన తొలి రాయబారం విఫలం అయినప్పుడే యుద్ధం అనివార్యమని బొబ్బిలికి వర్తమానం పంపాడు. బొబ్బిలి వారు యుద్ధానికి సిద్ధం అవుతూనే రాయబార ప్రయతాన్ని మాత్రం మానలేదు. బొబ్బిలి సంస్థానపు సర్దారులలో ఇనుగంటి పెద్దలక్ష్మీ నరసయ్య, చెలికాని వెంకయ్య, దామెర ధర్మానాయుడు, రావు చిన్నయ్య, తాండ్ర పాపయ్యలు ముఖ్యులు. ఇందులో ఇనుగంటి లక్ష్మీనరసయ్య, దామెర ధర్మానాయుడు రంగారావుకు మేనమామలు. చెలికాని వెంకయ్య, తాండ్ర పాపారాయుడు బావమరుదులు. మంతెన బుచ్చన వర్తమానం అందిన వెంటనే పోరు తప్పదని భావించిన ఈ పద్మనాయక వీరులందరూ తమ పరివారంతో బొబ్బిలి కోటకు చేరుకున్నారు. యువవీరుడు, రంగారావు సోదరుడు వెంగళరావు వీరవాహినికి స్వాగతం పలికాడు. రంగారావు సోదరులు తమ యోధులను విభజించారు. నాయకులను నిర్ణయించారు. ఆయుధాగారం తెరిపించారు. మార్టారులు, ఫిరంగులు బురుజులకు ఎక్కించారు. తాండ్ర పాపయ్య రాజం కోట రక్షణకు బయలుదేరాడు.

బుస్సీ కసింకోట మకాంలో ఉన్నప్పుడు బొబ్బిలి రంగారావు తన సర్దార్ చెలికాని వెంకయ్యతో మరో రాయబార ప్రయత్నం చేశాడు. హైదర్‌జంగ్, వెంకయ్యతో మీ దొర కోట వదిలి పెట్టి వెళ్లాడా లేదా? అని గద్దించాడు. మాకు కోటను విడిచి వెళ్లే అవసరం లేదని, వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పి వచ్చాడు వెంకయ్య. మర్నాడు..జనవరి 24, 1757 తెల్లవారేటప్పటికీ బుస్సీ సేనలు కసింకోట మకాం నుంచి బొబ్బిలి పొలిమేరకు చేరుకుని డేరాలు వేశాయి. బొబ్బిలి కోటలో మూడు వేళలా మోగే నగారా (నౌబత్) తెల్లవారి నుంచే మోగడం మొదలైంది. అది ఫ్రెంచి సేనలకు చెవుల్లో జోరీగలా తోచింది. హైదర్ జంగ్ ఉద్రేకంతో ఊగిపోయాడు. ఇంతటి వాహినితో కోట ముట్టడికి తాము సిద్ధంగా ఉన్నా కించిత్ భయపడక నగారా మోగిస్తారా? ఏమి ఈ పద్మనాయక ప్రభువుల స్థయిర్యం? ఏమిటి ఈ బొబ్బిలి వారి గర్వం? అని ఒళ్లుడికిపోయింది జంగ్‌కు. హైదర్, బుస్సీ దొర డేరాలో దర్బారు ఏర్పాటు చేశారు. విజయరామరాజు కూడా అందులో పాల్గొన్నాడు. దీని పర్యవసానంగా ఫ్రెంచి సేనానాయకుడు లడూఖాన్‌ను బొబ్బిలి కోటలోనికి రాయబారం కోసం పంపారు. అందులో ప్రధాన షరతుగా వెంటనే నగారాను ఆపాలి. తర్వాత బొబ్బిలి వారు కోట ఖాళీ చేసి వెళ్లిపోవాలి. రంగారావు లడూఖాన్‌ను స్వయంగా, సగర్వంగా ఆహ్వానించాడు. కానీ, రాయభార విషయాలను మాత్రం అంగీకరించలేదు. నౌబత్ (దుందుభి, భేరిలాంటి చర్మ వాయిద్యం) మాకు మొగలు చక్రవర్తులు బహుకరించినది. దానిని మోగించడం మేం ఆపం. రెండోది.. కోట ఖాళీ చేయడం అనే మాట తాము వినడానికే సహింపడం లేదని.. తీవ్రమైన ప్రకృతి విపత్తుల సమయంలో కూడా తాము కోటను విడిచి ఏనాడు వెళ్లలేదని, చావైనా చత్తుముగానీ కోట వీడుట కల్ల అని వెలమ వీరులందరూ నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పారు. దాంతో యుద్ధం అనివార్యమైంది.దామెర ధర్మానాయుడు, చెలికాని వెంకయ్య, ఇనుగంటి ధర్మానాయుడు, కాకర్లపూడి వెంకటరామరాజులు తమ తమ బలగాలతో బురుజులను ఆక్రమించారు. ఇనుగంటి పెదలక్ష్మీనరసయ్య సర్వసైన్యాధిపత్య బాధ్యతలు తీసుకున్నారు. వెంగళరాయుడు ప్రధానద్వార రక్షణ బాధ్యతను చేపట్టాడు.యుద్ధ తంత్రాలు సిద్ధమయ్యాయి.
Uddam1

ఉభయ సేనలూ యుద్ధ ప్రకటనలు చేసుకున్నాయి. పోరు ప్రారంభమైంది. ఫ్రెంచి తురుష్క సేనలది విజయకాంక్ష, వెలమ వీరులది అభిమాన రక్షణకాంక్ష. తురుష్క సేనావాహిని కోటగోడలను ఎక్కే ప్రయత్నం చేయసాగింది. బొబ్బిలియోధులు కోట దరిదాపునకు వారిని రానీయకుండా హతం చేయసాగారు. బొబ్బిలి బెబ్బులులు కోట బురుజుల నుంచి శిలాయంత్రాలు, వడిసె రాళ్లు, కొయ్య సాధనాలు, తాటి తుపాకులు, ఫిరంగులు ఉపయోగించసాగారు. ఫ్రెంచి సేనలు అపార మందుగుండు సామగ్రిని, ఆధునిక ఆయుధాలను వాడసాగారు.
ఫిరంగుల తాకిడికి పెద్ద దేవిడి ఫెళఫెళలాడింది. ఫిరంగి గుండ్లకు ఆహుతి అవ్వడం ఇష్టం లేక వెలమవీరులు ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందేందుకు సైతం సిద్ధపడ్డారు. బొబ్బిలి నాయకులందరూ అత్యవసర సమావేశం నిర్వహించి అంతఃపుర స్త్రీల మానరక్షణ ముఖ్యమని భావించారు. ఈ మేరకు బొబ్బిలి రంగారావు తన పచ్చల పిడి పేష్కబ్బు(కత్తి)ని తన బావమరిది చెలికాని వెంకయ్యకు ఇచ్చి తన రాణి మల్లమదేవికి పంపాడు. అది చూసిన మల్లమ వెంటనే తన కర్తవ్యాన్ని తెలుసుకుంది. తన పుత్రుడైన వేంకట రంగారావును తీసుకుని ముద్దాడింది. దాయియైన వేంకట లక్ష్మిని పిలిచి హితోక్తులు చెప్పింది. కొడుకు బతికితే తన వంశం నిలుస్తుందని భావించింది. ఎలాగైనా తన కొడుకును సామర్లకోటలోని తన సోదరి జగ్గమాంబ దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పింది. అలాగే తన అన్న తాండ్ర పాపారాయుడికి ఇక్కడ పరిస్థితి విషమించింది, వెంటనే రావాలనే సందేశాన్ని వేగుల కూడా ద్వారా పంపించింది. వెంకటలక్ష్మి బయలుదేరింది. అనంతరం అంతఃపురంలోని వీరపత్నులందరూ ఆత్మాహుతి చేసుకున్నారు. అది చూసి అంతఃపుర పరిచారికల నాయకురాలు రామామణి అంతఃపురం తలుపులు మూసి నిప్పంటించింది. అంతఃపుర నారీలోకమంతా ఆ అగ్నికి ఆహుతైంది. అది చూసిన బొబ్బిలి వీరుల హృదయ జ్వాలలు భరింపరానివయ్యాయి. ఫిరంగి దాడికి దేవిడి ఊగిసలాడింది. వెలమవీరులు కోటను వీడి రణరంగానికి కదిలారు. ఇరు పక్షాల మధ్య పోరు హోరెత్తింది. ఈ పోరులో వెంగళరావు వీర స్వర్గం పొందాడు. ఈ వార్త విన్న ప్రభువు రంగారావు కూడా కోటను వదిలి కదన రంగానికి కదిలాడు. శత్రవులును చీల్చి చెండాడాడు. తలలు బంతుల్లా ఎగిరి పడ్డాయి. తనువుపై ఆశ వదిలి తెగబడిన బొబ్బిలి యోధుల ముందు తురుష్క సేనలు నిలువలేకపోయాయి. ప్రతిపక్షం పరుగులు పెట్టింది. రణరంగం రక్తసిక్తమైంది.

వెలమవీరుల ధ్యేయం ఒక్కటే. సేనావాహినిని చీల్చుకుని వెళ్లి హైదర్ జంగ్, విజయరామరాజులను అంతమొందించడమే. ఈ విషయం ఊహించిన హైదర్ జంగ్ వెంటనే యుద్ధ వ్యూహాన్ని మార్చాడు. తురుష్క సేనలు వెనక్కి తగ్గాయి. బొబ్బిలి సేనలు ముందుకు కదిలాయి. ఫ్రెంచి సేనలు వెనుక నుంచి మందుగుండ్లతో తెగబడ్డాయి. ఈ కుటిల వ్యూహం పసిగట్టలేక వెలమ వీరులు ఆ దొంగదెబ్బకు అసువులు బాసారు. ఆ పద్మనాయక వీరుల అస్తమయం చూడలేక సూర్యుడు సైతం అస్తమించాడు.యుద్ధంలో చిట్టచివరి బొబ్బిలి వీరుడు కూడా నేలకొరిగిన తర్వాత మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించగలిగింది. లోపలికి వెళ్లిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతులయ్యారు. లోపల జరిగిన సామూహిక మరణాల గురించి తెలిసిన బుస్సీ, కోటలోకి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదట. (మరో కథనం ప్రకారం బుస్సీ కూడా లోపలికి వెళ్లాడు) బొబ్బిలి వీరుల శూరత్వాలకు, అభిమాన పరాక్రమాలకు, అక్కడ జరిగిన ఘోరానికి బుస్సీ బాధపడి హైదర్‌జంగ్‌ను పిలిచి మందలించాడట. ఆ రాత్రి విజయరామరాజు తన డేరాలో సంబరాలు చేసుకున్నాడు. ఇక బొబ్బిలి తనదేనంటూ ఉత్సవాలు చేసుకున్నాడు. ఆనందడోలికల్లో తేలియాడాడు. మల్లమ తన అన్న తాండ్ర పాపారాయునికి సమాచారం అందజేయడానికి పంపిన వేగును తురుష్క సేనలు మార్గ మధ్యలోనే అంతం చేశాయి. దీంతో గజబలుడు, సింహవిక్రముడు అని పేరున్న తాండ్ర పాపయ్యకు బొబ్బిలి పోరాటం వార్త ఏ మధ్యాహ్నానికో తెలిసింది. కోపోద్రిక్తుడైన తాండ్ర పులి దేవులపల్లి పెద్దన్న, బుద్ధిరాజు వెంకయ్యను వెంటబెట్టుకుని వెంటనే రాజం కోట నుంచి గుర్రాలపై బొబ్బిలికి దౌడు తీశాడు. చీకటిపడే సరికి బొబ్బిలికి చేరుకున్నారు ఆ వీరులు. అక్కడ జరిగిన ఘోరాన్ని చూసిన వారి హృదయాలు ద్రవించాయి.

రాజ్యం, రాజు, అంతఃపురకాంతలు, చివరకు నా అన్న వారెవరూ మిగలని ఆ గడ్డను చూసి విలపించారు. తన అక్కని, చెల్లిని, బావలను విగత జీవులుగా చూసిన పాపయ్య చలించి పోయాడు. కంట నీరు పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. వెంటనే తేరుకున్నాడు. విజయరామరాజును అంతం చేయడమే తన లక్ష్యమని శపథం చేశాడు. పాపారాయుని వీరావేశానికి అవధులు లేవు. పగ.. పగ.. పగ.. పగ తీర్చుకోవడమే ఇక ఆ వీరుని లక్ష్యం. తన వేగులను పంపి విజయరామరాజు డేరా ఆనుపానులు తెలుసుకున్నారు.
తెలతెలవారుతుండగా.. విజయరామరాజు సుఖనిద్రలో ఉన్నాడు. జాగ్రత్తగా లోపలికి వెళ్లారు పాపయ్య, మిగిలిన ఇద్దరు వీరులు. ఒక్కసారిగా విజయరామరాజుపై పడ్డాడు పాపయ్య. తాండ్ర పులిని చూసిన విజయరామరాజు కేకలు వేశాడు. ఆ అరుపులు విని లోపలికి వస్తున్న అంగరక్షదళ నాయకుడిని పాపయ్య వెంటవచ్చిన వీరులు మట్టుబెట్టారు. పాపయ్య విజయరామరాజును బాకుతో పొడిచి, పొడిచి చంపాడు.డేరాలో పులి దూరి రాజును భక్షించిందనే వార్త అంతటా అలుముకుంది. సేనలు బారులు తీరాయి. ఫిరంగులు సిద్ధమయ్యాయి. శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక పాపయ్య సహా ఆ వెలమ వీరులు ఆత్మాహుతి చేసుకున్నారు. అలా తాండ్ర పాపయ్య బొబ్బిలి పులిగా చరిత్రలో నిలిచిపోయాడు.
Uddam2

వచ్చేవారం : బొబ్బిలి రంగారావు కుమారుడు వెంకటరంగారావు ఏమయ్యాడు?

2093
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles