బైక్ మెకానిక్ అజిత్ తెలుసా!


Sun,November 4, 2018 03:24 AM

Ajith-Kumar
అజిత్ కుమార్ సినిమా హీరోగానే ఎక్కువమందికి పరిచయం. కానీ ఆయనలో మరోమనిషి కూడా ఉన్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఆయన సామాజిక సేవ చేస్తూ తనలోని మరో కోణాన్ని చాలాసార్లు చూపించాడు. కార్ రేసర్‌గా కూడా దూసుకెళ్తు పలుమార్లు సత్తా చాటాడు. ఇంకా చాలా విషయాలున్నాయి
అజిత్ గురించి..

- పసుపులేటి వెంకటేశ్వరరావు

సినిమాల్లోకి రాకముందు అజిత్ బట్టల వ్యాపారం చేసేవాడు. అంతకు ముందు కొన్నిరోజులు మెకానిక్‌గా కూడా పనిచేశాడు. ఇండియాలో ఎక్కడ రేసింగ్ పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవాడు. చిన్నప్పటి నుంచే ఆయనకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. 2003లో ఫార్ములా ఏషియా బీఎండబ్య్లూచాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ఇండియా తరుపున 2010లో ఫార్ములా 2 చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన అర్మాన్ ఇబ్రహీం, పార్థీవ సురేశ్వరన్‌ల తర్వాత అజిత్ మూడోవాడిగా నిలిచాడు. అదికూడా 1.5 సెకన్లు ఆలస్యం కావడంతో ఫార్ములా 2 చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అజిత్‌కు బైక్‌లు, కార్లు అంటే ఎంతో ఇష్టం. అందుకే తనకు నచ్చిన స్టోర్స్ కార్లు, బైక్‌లతో ఇంటివద్ద ఓ పెద్ద షోరూంనే ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్‌లోకి ఏ కొత్త బైక్ గానీ, కార్‌గానీ వచ్చిందంటే దాన్ని కొనాల్సిందే. రేసింగ్‌లో మంచి పట్టున్న జోనాథన్ పాల్మర్ అజిత్‌కు ప్రతి రేసులోనూ సలహాలూ, సూచనలు ఇచ్చేవాడు. పీర్స్ హన్నిసెట్ అజిత్ రేసర్‌గా రాణించేందుకు తగిన శిక్షణ ఇవ్వడమేకాకుండా ఎలాంటి కారు కొనాలి, ప్రయాణం చేసేటప్పుడు ఆచరించాల్సిన విషయాలను, రేసింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చెప్పేవాడు. విమానం నడిపేందుకు లైసెన్స్ కూడా పొందాడు.
Ajith-Kumar1
సామాజిక సేవాకార్యక్రమాలలో అజిత్ ముందువరుసలో ఉంటాడు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అందరికంటే ముందుగా బాధితులకు సాయం చేసి నేనున్నానని నిరూపించుకున్నాడు. నిరుపేద విద్యార్థులను చదివించి తనలోని ఉదారతను చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అభివృద్ధిలో వెనుకబడిన పల్లెటూర్లను దత్తత తీసుకొని మౌళిక వసతులను కల్పించాడు. సినిమాల్లో మంచివాడిగా పాత్రలు పోషించడమే కాదు.. నిజజీవితంలో కూడా ప్రజలకు, పేదలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు తమిళ, తెలుగు ప్రజల అభిమాన హీరో అజిత్ కుమార్.
అజిత్‌కు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగులప్పుడు కాస్త సమయం దొరికితే చాలు.. కెమెరా భుజాన వేసుకొని ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తుతాడు. ప్రయాణాల్లో లగేజీ మరిచిపోయినా.. కెమెరా మాత్రం మరిచిపోడు. ఎక్కడికెళ్లినా కెమెరా తీసుకెళ్లి అనుభవాన్ని కెమెరాలో బంధిస్తాడు.

తోటి నటుల హవాభావాలను సైతం కెమెరాలో బంధిస్తూ, ఆ ఫొటోలను వారికి పంపించి ఆశ్చర్యపరుస్తాడు. అజిత్ మంచి వంటకాడు కూడా. వంట చేయడంలో అజిత్‌ది అందెవేసిన చేయి. ఇంట్లో, షూటింగ్‌లో స్వయంగా తన చేతి వంట రుచి చూపిస్తుంటాడు. అజిత్ చేసిన బిర్యానీ తింటే ఎవరైనా ఆయన బిర్యానీకి దాసోహం కావాల్సిందే. వెరైటీ వంటకాలు దొరికే రెస్టారెంట్లను వెతుకుతూ కొత్త రుచులను ఆస్వాదిస్తుంటాడు. ఆయా వంటల గురించి చెఫ్‌లను అడిగి తెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ వంటలు చేసి ఇంట్లోవాళ్లకు రుచి చూపిస్తుంటాడు. అభిమానులంటే అజిత్‌కు చాలా ఇష్టం. హంగూఆర్భాటాలకు దూరంగా ఉంటూ.. ఫ్యాన్స్ ఎప్పుడు వచ్చినా వారిని గౌరవంగా పలుకరిస్తాడు. తను సొంతంగా తీసిన సినిమాలకు ప్రచార ఆర్భాటాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు. భారీ ఆడియో ఫంక్షన్లకు దూరంగా ఉంటాడు. నిత్యం స్టాంప్‌లు, నాణేలు, హెల్మెట్లు, పుస్తకాలు, పెయింటింగ్స్, కార్లు, బైక్‌లు సేకరిస్తుంటాడు. వాటిన్నింటితో ఇంట్లో ఓ గ్యాలరీ ఏర్పాటు చేశాడు. లాస్ట్.. బట్ నాట్ లీస్ట్.. ఎక్కడికి వెళ్లినా సామాన్యుడిలా క్యూలైన్లో నిల్చునే వెళ్తాడు. పెద్ద హీరో అని, సెలబ్రిటీ అని ఎవరైనా ప్రత్యేక మర్యాదలు చేస్తే సున్నితంగా తిరస్కరిస్తాడు.

అజిత్ చేసిన బిర్యానీ తింటే ఎవరైనా ఆయన బిర్యానీకి దాసోహం కావాల్సిందే. వెరైటీ వంటకాలు దొరికే రెస్టారెంట్లను వెతుకుతూ కొత్త రుచులను ఆస్వాదిస్తుంటాడు. ఆయా వంటల గురించి చెఫ్‌లను అడిగి తెలుసుకుంటాడు.

503
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles