బెత్తెడు జాగ ఓ అనుబంధాల అల్లిక


Sun,May 15, 2016 01:11 AM

జీవితాన్ని సునిశితంగా పరిశీలించిన వాళ్ళే మంచి కథలు రాయగలుగుతారు. కాల్పనికతను ఆశ్రయించినప్పటికీ యదార్థ జీవితాల్ని ప్రతిబింబించే కథలే నాలుగు కాలాల పాటు నిలబడి రాబోవు తరాలకు మార్గదర్శనం చేస్తాయి. అట్లాంటి కథలు విరివిగా రాసి వాసికెక్కుతున్న రచయితల్లో కథా, నాటక రచయిత అయిన రావుల పుల్లాచారి ఒకరు. బెత్తడు జాగ పేరుతో వీరు తన కథలను కథల సంపుటిగా తీసుకొచ్చారు. ఇవన్నీ గతంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే.

story రచయిత ఆధునిక యుగంలో కుంచించుకుపోతున్న మానవ సంబంధాలనే కాదు, నోరులేని మూగ జీవాల్ని కూడా కథా వస్తులుగా తీసుకొని అద్భుతంగా ఆవిష్కరించడం విశేషం. సృష్టిలో మనిషితో పాటు మూగజీవులకు కూడా బతికే స్వేచ్ఛ ఉంది. భూతదయతో వాటి సాధకబాధకాలను కూడా గుర్తించాలని రచయిత ఎంతో ఆర్తితో వాటి ఆధారంగా కథలు రచించి ఆలోచింపజేయడం అభినందనీయం.

దా బిస్సి కథలో మనకి ఈ విషయం రూఢీ అవుతుంది. కథలో వితంతువైన సుభద్రమ్మ, పిల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటుంది. వంతులో భాగంగా తల్లిని కొడుకులు తమ ఇండ్లకు రమ్మని పిలిస్తే రానంటుంది. ఇంట్లో పిల్లి పిల్లలు పెట్టింది. వాటిని విడిచి రాలేను అని చెబుతుంది. కొడుకులు, కోడళ్ళ యాంత్రికమైన పోషణ - వాళ్ళకు అయిష్టంగా, తనకి ఇబ్బందిగా తయారైందని గుర్తించిన ఆ తల్లి నిరంతరం తన చుట్టూ తిరుగుతూ తన మీద ఆధారపడి జీవిస్తున్న పిల్లుల పట్ల ప్రేమను పెంచుకుంటుంది. కొడుకుల నుంచి ప్రేమరాహిత్యం, దాని నుంచే పిల్లులపై అభిమానం పెరగడాన్ని రచయిత చెప్పకనే చెబుతాడు. ఇట్లా అనేక కథల్లో మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని చెప్పడానికి రచయిత మూగజీవులను కథా సంవిధానంలో ప్రధాన పాత్రలుగా ఎంచుకోవడం కనిపిస్తుంది.

అలాగే, మరో కథ బెత్తెడు జాగలో శ్రమజీవి నారాయణ అంత్యక్రియలకు స్మశాన వాటికలో చోటు దొరకకపోవడం, దాంతో నారాయణ భార్య తన ఇంటిముందే భర్తను దహనం చేస్తాననడంతో కథ ముగుస్తుంది. అయితే, సమాజంలో పేరుకుపోయిన కులవ్యవస్థ అంతరాలు, దాని తాలూకు వివక్షలను రచయిత ఎంతో మానవీయంగా ఆవిష్కరించారు. చనిపోయాక కూడా మనిషి మన దేశంలో ఎలా వివక్షకు గురవుతాడో ఇందులో చూస్తాం. ఇలా ఒకటని కాదు, అన్ని కథలు, మానవీయ కోణంలో వైవిధ్య భరితంగా ఉంటాయి.

అమ్మంగి వేణుగోపాల్ ముందుమాట రాస్తూ, కఠిన వాస్తవికత మీద కాల్పనిక ప్రపంచాన్ని నిర్మించడంలో రచయిత పుల్లాచారి బాధ్యతాయుతమైన కృషి చేస్తున్నారు అంటూ, ఈ పనిని నిర్వహిస్తూనే పుల్లాచారి జంతువును కూడా మానవ ప్రపంచంలోకి తీసుకు వచ్చాడని, ఇది ప్రత్యేకమైన పని అని అభినందించారు. అలాగే, మరో ముందుమాట రాసిన డి.యస్.యన్.మూర్తి ఈ కథలు చదువుతుంటే మనకి కల్పిత గాథలుగా అనిపించవు. మన ముందు జరుగుతున్న సంఘటనల్లాగా ఉంటాయి అన్నారు. నిజం. ఇలా మనకు బాగా తెలిసిన సంఘటనలతోనే రచయిత మనలో పరివర్తన కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, మనలో నిదానంగా పెరుగుతున్న యాంత్రికత్వాన్ని నిశ్శబ్దంగా ఈ కథలు బద్దలు కొడతాయనే అనిపిస్తోంది. మరి చదివి చూడండి.

బెత్తెడు జాగ రచన: రావుల పుల్లాచారి, పేజీలు: 150, వెల: రూ. 120/- ప్రతులకు: ఆర్.శరత్‌బాబు దశరథరామ నిలయం, ఇం. నెం. 9-34, ఇందిరా మార్గం, హుజురాబాద్, హైదరాబాద్-505 468, కరీంనగర్ జిల్లా, మొబైల్: 9949208476
అశోక్

1083
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles