బెచారా పుజారా!


Sun,April 16, 2017 01:33 AM

పుజారా.. పూజకు పనికిరాని పువ్వు అన్నారెవరో ఆ మధ్య సోషల్ మీడియాలో. ఐపిఎల్ వేలం పాటలో చతేశ్వర్ పుజారాను ఏ ఒక్క జట్టు కూడ పట్టించుకోని నేపథ్యంలో వచ్చిన కామెంట్ అది. ప్రాస అదీ బాగానే కుదిరింది గానీ ఎంత పొరపాటు? ఐపిఎల్ ఆడినవాడే మొనగాడా? టెస్ట్ క్రికెటర్లంటే మనకుండే లోకువను ఈ వ్యాఖ్య ప్రతిబింబిస్తున్నది. టి20 క్రికెట్‌లో ఎడాపెడా బ్యాట్ ఊపుతూ ఆడే వాళ్ళే మనకు హీరోలు. ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఓపికగా సింగిల్స్ తీస్తూ సెంచరీలు కొట్టే టెస్ట్
బ్యాట్స్‌మెన్ ఓ పెద్ద బోర్. కొడితే సిక్స్ కొట్టాలి, ఆడితే రఫ్ఫాడాలి..

Venkatesh ఇదే లేటెస్ట్ ట్రెండ్. ఎవరో గుర్తుకొస్తున్నారు కదా.. అవును రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే టైపు. సచిన్ టెండుల్కర్‌కు బ్రహ్మరథం పట్టాం, భగవంతుడని కొనియాడాం. కానీ ఈ ద్రావిడ్‌లు, పుజారాలు చిల్లర దేవుళ్ళు. పాప్ మ్యూజిక్ రాజ్యమేలుతున్న రోజుల్లో ఇంకా శాస్త్రీయ సంగీతాన్ని నమ్ముకున్న శంకరాభరణం శంకర శాస్ర్తులు. సెల్‌ఫోన్ బదులు ల్యాండ్‌లైను వాడేవారు.. ఎయిర్‌బస్ రోజుల్లో ఎర్ర బస్సులో తిరిగే జనాలు. అందుకే సచిన్, కోహ్లీలకుండే ఫ్యాన్ ఫాలోయింగ్‌లో పది శాతం కూడా వీరికి ఉండదు.


ఈమధ్య టీమిండియా నాలుగు వేరు వేరు జట్లతో వరసగా 13 టెస్టులాడింది. స్వదేశంలోనే జరిగిన ఆ నాలుగు సీరీసుల్లో మన జట్టు ఘన విజయం సాధించి టెస్టుల్లో నంబర్ వన్ స్థానం పదిలం చేసుకుంది. అందరూ విరాట్ కోహ్లీని వేనోళ్ళ పొగిడారు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా అతని ఆటను తెగ మెచ్చుకున్నారు. అయితే ఆ నాలుగు సీరీసుల్లో కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసింది పుజారానే. పుజారా 13 టెస్టుల్లో 1316 పరుగులు చేశాడు. వాటిలో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ పన్నెండు టెస్టుల్లో 1252 పరుగులు చేశాడు. అతను కూడా 4 సెంచరీలు చేశాడు కానీ రెండే రెండు అర్థ శతకాలు సాధించాడు. ఈ నాలుగు సీరీసుల్లోనూ పుజారా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ ఆడటం మనకు తెలుసు. ముఖ్యంగా బెంగళూరు టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఓడించడంలో ముఖ్యపాత్ర వహించాడు. కానీ ఈ సీజనులో ఇండియా సాధించిన విజయాల క్రెడిట్ అంతా కోహ్లీ ఖాతాలోకే వెళ్ళింది. గతంలో సచిన్ నీడలో ద్రావిడ్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనేవాడు. మీడియా మొత్తం కోహ్లీని సచిన్‌తో పోలుస్తూ పుంఖాను పుంఖాలుగా రాస్తూనే ఉంది గానీ పుజారా రూపంలో మనకు మరో ద్రావిడ్ లాంటి మిస్టర్ డిపెండబుల్ దొరికాడని ఎవరైనా ప్రస్తావించారా?
cheteshwar-pujara

పుజారా కూడా ద్రావిడ్ లాగానే నంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ద్రావిడ్ లాగానే అవసరమైతే ఓపెనర్‌గా కూడా బరిలోకి దిగగలడు. ఇప్పటికే నాలుగు టెస్టుల్లో ఓపెనింగ్ చేసి ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. పుజారాకు పటిష్ఠమైన టెక్నిక్ ఉంది, సుధీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే ఓర్పు కూడా ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మూడు ట్రిపుల్ సెంచరీలు అతని పేరిట ఉన్నాయి. ద్రావిడ్ లాగానే అతనిపై కూడా టెస్టులకు మాత్రమే పనికొచ్చే బ్యాట్స్‌మన్ అన్న ముద్ర పడింది. ద్రావిడ్ వందల సంఖ్యలో వన్‌డే లు ఆడి పదివేలకు పైగా పరుగులు చేశాడు. కానీ పుజారాకు మాత్రం ఐదే ఐదు వన్ డేల్లో ఛాన్సు ఇచ్చారు. అవి కూడా జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల పైన. ఇక ఐపిఎల్ అతనిపై చాలాకాలంగా శీతకన్ను వేస్తూనే ఉంది.
అయితే టెస్ట్ జట్టులో కూడా పుజారా స్థానం పదిలంగా ఉన్నదా అంటే అది కూడా లేదు. అతని పైన తాపీ మాస్టర్ అన్న ముద్ర ఉండనే ఉంది. దూకుడుగా ఆడే రోహిత్ శర్మ కోసం పుజారాను జట్టునుంచి తప్పించిన సందర్భాలు క్రితం ఏడాది చూశాం. 21 టెస్టులాడినా ఇప్పటికీ రోహిత్ బ్యాటింగ్ సగటు 37 మాత్రమే. ఇంకా అతను తన టాలెంట్‌కు ఎప్పుడు న్యాయం చేస్తాడో తెలియదు. అయినా రోహిత్‌కు అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఆచి తూచి ఆడే పుజారా బ్యాటింగ్ స్టయిల్ ఓల్డ్ ఫ్యాషన్ గా అనిపించొచ్చు. కానీ టెస్ట్ క్రికెట్ అలానే ఆడాలి. అందరూ స్ట్రోక్ ప్లేయర్లే ఉన్న భారత జట్టులో వెర్రివాళ్ళ మధ్య వేదాంతిలాగ పుజారా అవసరముందని బహుశా ఇప్పటికైనా కోహ్లీ గుర్తించి ఉంటాడు. అతని సేవలు అమూల్యమని ఈ మధ్య విరాట్ కితాబిచ్చాడు కూడా.

cheteshwar-pujara1వన్‌డేలు, టి20, ఐపిఎల్ - ఇవేమీ ఆడకుండా కేవలం టెస్ట్ క్రికెట్‌నే నమ్ముకున్న ఏకైక ఆటగాడు పుజారా. సినిమా, టీవీ జోలికెళ్ళకుండా నాటకరంగాన్నే నమ్ముకున్న సత్తెకాలపు సత్తెయ్య లాంటివాడతను. నిన్నగాక మొన్న క్రికెట్ మొదలుపెట్టిన టీనేజ్ కుర్రాళ్ళకు కూడా రెండు మూడు కోట్ల ఐపిఎల్ కాంట్రాక్టులు దక్కుతున్నాయి గానీ పుజారాకు ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతున్నది. మొన్నటిదాకా అతను క్రికెట్ బోర్డు వారి సెంట్రల్ కాంట్రాక్టులో బి గ్రేడ్ ఆటగాడిగానే ఉన్నాడు. అంటే ఏడాదికి 50 లక్షల రూపాయల కాంట్రాక్టు మొత్తం, ఆడిన ప్రతి టెస్టుకు 7 లక్షలు మాత్రమే అతనికి వచ్చేవి. ఇప్పుడు పుజారాకు ఎట్టకేలకు ఎ గ్రేడుకు ప్రమోషన్ వచ్చింది. రెండుకోట్ల రూపాయల కాంట్రాక్టు, ఒక్కో టెస్టుకు 15 లక్షల పారితోషికం దక్కుతుంది. కానీ అది కూడా ఏ మూలకు అంటున్నాడు రవి శాస్త్రి. పుజారా లాంటి ఆటగాళ్ళు మోడలింగ్ కూడా చేయరు, వారు చేయరని కాదు. ఆఫర్లు రావంతే. వంద మీటర్ల రేసు పరిగెత్తే యుసైన్ బోల్ట్‌కు ఉండే గ్లామర్ మారథాన్ రన్నర్లకుండదు కదా. కనీసం 10 కోట్ల రూపాయల కాంట్రాక్టుతో ఈ అరుదైన టెస్ట్ స్పెషలిస్టును బి.సి.సి.ఐ. గౌరవించాలి. పవిత్రమైన టెస్ట్ క్రికెట్‌నే నమ్ముకున్న పుజారా పూజకు మాత్రమే పనికొచ్చే పువ్వు.

3880
Tags

More News

VIRAL NEWS