బిల్వమంగలుడు


Sun,September 2, 2018 01:05 AM

Bilvamangaludu
జీవితం అంటే మేలిమి బంగారం కాదు. నల్లని బొగ్గూ కాదు. కానీ ఎంత సానపెడితే అంతటి వెలుగునిస్తుంది. ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు మనిషిని ఊపిరి ఆడనీయకుండా చేసినా, అది సత్యశోధనకు మైలురాల్లుగా పనిచేసే సందర్భాలేనని గుర్తుంచుకోవాలి. మనిషికున్న పట్టుదల, మొండితనం, కసి, ప్రేమ మనిషిని ఎంత దూరమైనా వెళ్ళేందుకు ప్రేరేపిస్తాయి. ప్రాపంచిక విషయాల మీద ఆకర్షణ పెంచుకోవడం వల్ల ఆకర్షణే నిజమని నమ్మి దాని వెనకాల పరుగెత్తడం వల్ల అసలైన జీవిత సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అయితే లోకంలో మనుషులు కొందరు పుట్టుకతోనే గొప్పదనాన్ని ఆపాదించుకుంటారు. మరికొందరు గొప్ప వాళ్ళుగా గుర్తింపును పొందుతారు. ఇంకొందరు సత్యశోధన క్రమంలో గొప్పస్థానాన్ని అలంకరిస్తారు. అది అనిర్వచనీయం, అత్యద్భుతం. అటువంటి మహోన్నత స్థాయికి తన జీవితాన్ని తననే ఆసరాగా చేసుకొని తీసుకెళ్ళిన గొప్పవ్యక్తి బిల్వమంగలుడు. సామాజికంగా, చారిత్రకంగా ఇతనేమీ గొప్ప కార్యాలేవీ చేయలేదు. కానీ జీవితమంటే సత్యశోధనకు ఆలంబనైతేనే అర్థం ఉంటుందని తెలియపరిచిన మానవీయుడు బిల్వమంగలుడు. భారతజాతి ఆత్మకోణంలో పేర్కొన్న అసామాన్యుడు ఇతను.
-ఇట్టేడు అర్కనందనా దేవి

బిల్వమంగలుడు అతి సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. తల్లిదండ్రులిద్దరూ అతనికి యుక్తవయసుకు రాగానే మరణించారు. దాంతో బిల్వమంగలుడు అడ్డుచెప్పేవారు లేక, బాధ్యతలు నేర్పేవారు లేక ఎలాగోలా జీవితం కొనసాగించసాగాడు. ఒకనాడతను సంతను చూద్దామని పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఒక యువతిని చూసి ఆకర్షితుడు అవుతాడు. ఆ ఊరికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఉధృతి కలిగిన నదిని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. బిల్వమంగలుడు ప్రతీరోజూ చిన్న నావలో పక్క ఊరికెళ్ళి ఆ అమ్మాయిని చూసి వచ్చేవాడు. అతనికది అలవాటు కాదు, వ్యసనంలా మారింది. అలా కొంతకాలం తర్వాత ఒకరోజు అతని తల్లిదండ్రుల పుణ్యతిథి కారణంగానూ, అతను కొడుకులా నిర్వర్తించాల్సిన బాధ్యతల కారణంగానూ సాయంత్రం దాటిపోయింది. కానీ ఎలాగైనా పక్క ఊరికి వెళ్ళాలన్నదే అతని ధ్యాస. అతనిలోని ఆకర్షణ కారణంగా తల్లిదండ్రుల తిథి కార్యక్రమాన్నీ అన్యమనస్కంగానే చేసేశాడు. చీకటి పడింది. ఎడతెరపిలేని గాలివాన, దాంతో నది ఉధృతి మరింత పెరిగింది. నావలేదు, నావ నడిపేవాడూ లేడు. కానీ బిల్లమంగలుడు ఎలాగైనా వెళ్ళాలనే పట్టుదలను విడిచి పెట్టలేదు.

నదిలో ఏదో కొట్టుకువస్తే చెట్టు దుంగను కొని దాన్ని ఆసరాగా చేసుకొని ఎలాగోలా పక్క ఊరికి చేరతాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళతాడు. ఎంత తలుపులు కొట్టినా ఎవరూ తెరవలేదు. ఇంటి పైభాగం నుంచి ఏదో వేలాడుతుంటే ఆ అమ్మాయే నాకై తాడును వదిలిందని ఎక్కడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా దభేలున కింద పడతాడు. ఆ శబ్దానికి అందరూ నిద్రలోంచి లేచి బయటికి చూస్తారు. ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చి ఎవరు నీవని, నీవు చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తే, బిల్వమంగలుడు తనపై గల ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆమె అంటుంది. నీకు ఏర్పడిన ఆకర్షణ నిన్నెంతగా దిగజార్చిందో ఆలోచిస్తున్నావా?

నదీ ఉధృతిలో, కారు చీకటిలో నీటిలో కొట్టుకొచ్చిన శవాన్ని దుంగనుకొని భ్రమపడ్డావు. భవనం పైభాగంలోని రంధ్రంలో కొండచిలువ తల ఇరుక్కుపోగా దాని మిగతా భాగం కిందకి వేళాడితే దానిని తాడనుకున్నావు. నీలో కలిగిన ఆకర్షణను ప్రేమనుకొని దానిపై పిచ్చిగా పరుగుపెడుతున్నావు. ప్రేమంటే ముందు మనిషిగా తనను తానూ, తల్లిదండ్రులనూ, జీవితాన్ని, సత్య శోధననూ ప్రేమించగలగాలి. విశ్వజనీనమైన ప్రేమను మనిషిగా నీలో కలిగుండేలా చూసుకోవాలని అంటుంది. అంతే, బిల్వమంగలుడు అక్కడి నుంచి సరాసరి అడవికి వెళ్ళి సత్యశోధన మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా జీవిత పరమార్థం తెలిసొచ్చింది. కొంతకాలానికి మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాడు. వస్తూనే అందమైన స్త్రీని చూసి ఆకర్షితుడయ్యాడు. వెంటనే ఆమె వెంటే వెళ్ళి ఆమె దగ్గరనుంచి రెండు సూదులను తీసుకొని తన రెండు కళ్ళనూ పొడిచేసుకున్నాడు.

ఆకర్షణ బుద్ధి వక్రతకు దారి చూపిస్తుందనీ, ఇక నా అంతర్నేత్రాలతో ప్రపంచాన్ని చూస్తాననీ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. జీవిత సాధన సత్యశోధనాత్మకంగా సాగాలనే విషయాన్ని బాధ్యతాయుతంగా చేపట్టమని చెప్పిన అమ్మాయినే గురువుగా భావించిన బిల్వమంగలుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి శ్రమించి సాధించలేని ఉన్నతమైన గొప్పస్థాయిని చేరుకోగలిగాడంటే అతిశయోక్తి కాదు. చారిత్రాత్మక త్యాగాలు చేసిన వారో, గొప్ప గొప్ప వంశాల్లో జన్మించిన వారో సామాజిక కోణంలో ఆదర్శనీయ విలువలు పొందినవారో గొప్పవాళ్ళంటే పొరపాటు. సామాన్యమైన తన జీవితం ద్వారా గొప్పదైన సందేశమిచ్చిన బిల్వమంగలుని జీవితం కథ కాదు. సత్యభాసితం, చారిత్రకాధారం.

బిల్వమంగలుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి శ్రమించి సాధించలేని ఉన్నతమైన గొప్పస్థాయిని చేరుకోగలిగాడంటే అతిశయోక్తి కాదు. చారిత్రాత్మక త్యాగాలు చేసిన వారో, గొప్ప గొప్ప వంశాల్లో జన్మించిన వారో సామాజిక కోణంలో ఆదర్శనీయ విలువలు పొందినవారో గొప్పవాళ్ళంటే పొరపాటు.

355
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles