బిజ్జులవారు ఏలిన అలంపురం


Sun,October 7, 2018 01:41 AM

(తెలంగాణ సంస్థానాలు : పద్నాలుగో భాగం)
Alampuram
ఈ మండపాన్ని శ్రీశైలం రిజర్వాయరు ముంపు గ్రామమైన ప్రాగటూరులోని శ్రీ వరదరాజ స్వామి ప్రాంగణం నుంచి తరలించారు. ఈ శిలాస్థంభాలను పురావస్తు, ప్రదర్శన శాఖ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని మ్యూజియంలో పునఃనిర్మించింది. బిజ్జులదేవ కాలం నుంచి విశిష్ట పాలన సాగించిన బిజ్జుల వారు చివరకు అలంపురంలో స్థిరపడ్డారు. అనంతరం పల్లెపాడుకే పరిమితమైన బిజ్జుల వంశీయుల పాలన జనరంజకంగానే సాగింది. రాణి చెన్నమ్మ తర్వాత ఆమె దత్తపుత్రుడు బిజ్జుల వెంకటధర్మారెడ్డి, తర్వాత ఆయన కొడుకు బిజ్జుల వెంకట నరసింహారెడ్డి పల్లెపాడును పాలించారు.

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

బిజ్జుల వెంకట నరసింహారెడ్డి (క్రీ.శ.1850-1913) నాయనమ్మ రాణి చెన్నమ్మ, తండ్రిలాగే చక్కటి పాలన సాగించాడు. ఇతను క్రీ.శ. 1875లో లక్ష రూపాయలు ఖర్చు చేసి చెరువులు, కాలువలు తవ్వించాడు. 150 ఎకరాలకు సాగునీటిని అందించారు. ఈయన ఇండిగో-బ్లూ రంగును తయారు చేసి ముంబై నుంచి నౌకల ద్వారా యూరప్ దేశాలకు ఎగుమతి చేసేవారు. శ్రేష్టమైన ఇండిగో నీలి రంగు తయారుచేయడంలో పల్లెపాడు అప్పట్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఆంజనేయ స్వామి దేవాలయానికి కుడివైపున రాతి గోడకు ఉన్న శాసనం వేయించింది ఈయనే. ఈయన వారసులు ఇప్పటికీ పల్లెపాడు ప్రాంతంలో ఉన్నారు. భారతదేశంలో జాగిర్దారీ వ్యవస్థ రద్దయ్యే నాటికి ఈయన కొడుకు బిజ్జుల చంద్రశేఖర్ రెడ్డి పాలనలో ఉన్నాడు. ఈయన బిజ్జుల వెంకటనరసింహారెడ్డి మొదటి భార్య సీతమ్మ కొడుకు. రెండో భార్య రామలక్ష్మీదేవి కొడుకు బిజ్జుల రామేశ్వరరెడ్డి.

చంద్రశేఖర్ రెడ్డికి ముగ్గురు కొడుకులు పద్మనాభ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి. తెలంగాణలో నిజాం విముక్తి పోరాటంలో భాగ్యనగర్ రేడియో నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదు. ఈ పోరాటంలో భాగంగా కర్నూలులో పాగా పుల్లారెడ్డి సర్వాధికారిగా తెలంగాణ ప్రాంతీయ సమితి కార్యాలయం ఏర్పాటైంది. ఈ కార్యాలయంలో గడియారం రామకృష్ణ శర్మ భాగ్యనగర్ రేడియోను నడిపారు. ఈ రేడియోను నడుపడానికి కావాల్సిన ట్రాన్సిస్టర్‌ను వనపర్తి రాజా రామేశ్వరరావు ముంబై నుంచి తెప్పించారు. దీన్ని బిజ్జుల చంద్రశేఖర్ రెడ్డి తన ఇంట్లో రహస్యంగా దాచారు. తన కొడుకులైన గోవర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలను పంపి రేడియో నిర్వహణ సమర్థవంతంగా సాగేలా సహాయం అందించారు.

బిజ్జుల రామేశ్వర్ రెడ్డి బిజ్జుల వారసత్వ హక్కులు కలిగిన చిట్టచివరి జాగిర్దారు. ఈయన అన్న పద్మనాభరెడ్డితో కలిసి మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పద్మనాభ రెడ్డి వైద్య శాస్త్రంలో డిగ్రీ చదివి భారత సైన్యంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేశారు.
రామేశ్వర్ రెడ్డి జాగిర్దారుగా తన సోదరులతో కలిసి పల్లెపాడు భారత గణతంత్ర దేశంగా మారే వరకు పాలించారు. చాళుక్యుల, చోళుల కాలం నాటి రాగిపత్రాలు, పలకల గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు.
రామేశ్వర్ రెడ్డికి ఇద్దరు చెల్లెళ్లు రుక్మిణీ దేవి, సీతాదేవి. రుక్మిణీ దేవి మేనమామను వివాహమాడారు. సీతాదేవి (ప్రమీలా పింగిలి) జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.
రామేశ్వర్ రెడ్డికి నలుగురు కొడుకులు అభిమన్య, అశోక్, కేశవ్, అనిరుధ్. వీరిలో చిన్నవాడైన అనిరుధ్ కుమార్ బిజ్జుల తండ్రి నుంచి బిజ్జుల లెగసీని వారసత్వంగా పొందారు. హైదరాబాద్ హబ్సీగూడలో నివసిస్తున్న అనిరుధ్ బిజ్‌కామ్ సిస్టమ్స్ అనే సాఫ్టవేర్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. తమ వంశ చరిత్రను తెలియజేసేందుకు అనిరుధ్ www.bizzula.com అనే వెబ్‌సైట్‌ను రూపొందించి నిర్వహిస్తున్నారు.

గద్వాల సంస్థానానికి దగ్గరలోని పరశురామ దేవస్థానం గత వేయి సంవత్సరాలుగా బిజ్జుల వారి ఆధ్వర్యంలో పూజలందుకుంటున్నది. బిజ్జులదేవుడి కాలం నుంచి అక్కడి బోయలు ఈ గుడిని చూసుకుంటున్నారు. వీరి కుల పెద్దనే పరశురాముడి గుడికి పూజారిగా ఉంటూ వస్తున్నారు. ఈ గుడికి, పల్లెపాడు చెన్నకేశవ స్వామి గుడికి ప్రతీ సంవత్సరం బిజ్జుల వారే నిధులు సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రదేశం కాళీ దేవత ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందింది. గద్వాల, అలంపూరు ప్రాంత ప్రజలు ప్రతీ ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తుంటారు. 1980కి ముందు పల్లెపాడు తిరునాళ్లు అంటే జనం తండోపతండాలుగా వచ్చేవారు. బిజ్జుల వంశీయుల ఇలవేల్పు అయిన చెన్నకేశ్వరస్వామి పేరు మీదుగా ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఇక్కడ బ్రహ్మాండంగా తిరునాళ్లు జరిగేవి. గ్రామంలో ఆకర్షణీయమైన పెద్ద రథం ఉండేది. దీన్ని చంద్రశేఖర్ రెడ్డి చేయించారు. రథోత్సవాల సందర్భంగా పల్లెపాటు జనంతో కిటకిటలాడేది. ఊరికి ఉత్తరాన బిజ్జుల వారి మాన్యాలలో అంగళ్లు, పిల్లల వినోదాలకు సర్కస్‌లు, ఎద్దుల బేరాలు, కలప వ్యాపారం జోరుగా సాగేది. చుట్టు పక్కల ప్రజలేకాక కర్నూలు నుంచి కూడా జనం వచ్చేవారు. ఇదంతా ఒకనాటి వైభవం. 1980 తర్వాత పల్లెపాడు (పాత) గ్రామం శ్రీశైలం ప్రాజెక్ట్ కింద ముంపునకు గురైంది. దీంతో స్థానికులు పాత ఊరిని వదిలి దానికి రెండు కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కొత్త గ్రామాన్ని నిర్మించుకున్నారు.

బిజ్జులదేవకు 27వ తరం మాది..

రాజా అనిరుధ్ బిజ్జులతో ములాఖత్
Alampuram1

మూడు మహా సామ్రాజ్యాల ఏర్పాటుకు పరోక్షంగా కారకుడైన బిజ్జుల దేవకు మీది ఎన్నో తరం?

మాది 27వ తరం. మా తండ్రి రామేశ్వర్ రెడ్డి, వారి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి మధ్య జరిగిన వివాదాలు కోర్టు ద్వారా పరిష్కారమైన తర్వాత వారసత్వం మాకు దక్కింది.

మిగతా సంస్థానాధీశులకు భిన్నంగా మీ వంశ చరిత్రనంతా మీరే సేకరించి వెబ్‌సైట్‌గా రూపొందించాలని మీకెందుకు అనిపించింది?

మా నాన్నగారు 1995లో మరణించారు. ఆయన బతికి ఉన్నప్పుడు మా చరిత్రను కథలు కథలుగా చెబుతుండేవారు. ఆయన పోయాక ఆ చరిత్రను పదిలపర్చుకోవాలనిపించింది. నాన్న చెప్పిన ప్రకారం, వారసత్వంగా మాకు వచ్చిన చారిత్రక ఆధారాలు, అనేక పత్రాల ఆధారంగా ఐదేండ్ల పాటు శ్రమించి చరిత్రను తెలుసుకుని ఈ తరానికి, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 2000లో వెబ్‌సైట్‌ను తెలుగు, ఇంగ్లీషులో రూపొందించాను.
Alampuram2

పల్లెపాడుతో మీకున్న అనుబంధం ఎలాంటిది?

పాత ఊరు శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోయింది. కొత్త ఊరిలో మాకు ఇల్లు, స్థలం ఉన్నాయి. పల్లెపాడుతో మాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని అనుబంధమే. అక్కడి ఆలయాలను ఇప్పటికీ మేమే పరిరక్షిస్తూ వస్తున్నాం. సంప్రదాయబద్ధంగా పూజలు, ఇతర కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. బిజ్జుల వారు ఇప్పటికీ కొందరు అక్కడ ఉన్నారు. గ్రామస్తులతో మా అనుబంధం విడదీయరానిది.

పల్లెపాడును, ప్రాగటూరును పర్యాటక కేంద్రంగా చేసే ప్రయత్నం ఏమైనా చేశారా?

చేశాం. 1980లో మా వంశ చరిత్ర, అందుకు తగిన ఆధారాలు, తాళపత్రాలు, నాణేలు, సీల్స్ పొందుపరుస్తూ ఒక ఫైల్ తయారుచేసి అప్పటి ప్రభుత్వానికి ఇచ్చాం. కానీ అదెందుకో కార్యరూపం దాల్చలేదు. ప్రాగటూరులోని మండపం ఒకటి పబ్లిక్ గార్డెన్స్ మ్యూజియంలో ఉంది. ముంపు సమయంలో తరలించారు. ఆలయ ముఖ తోరణం ఒకటి ఆబిడ్స్ మహబూబియా హైస్కూల్ పక్కనున్న సెంటినరీ హెరిటేజ్ మ్యూజియంలో ఉంది.

మీకు అపురూపంగా మిగిలినవి ఏమిటి?

ఘనమైన చరిత్ర. అంతకుమించి అపురూపమైన ఆధారాలు, పత్రాలు, సీల్స్. రాణి చెన్నమ్మ వాడిన కత్తి. ఇదిగో అక్కడి ఇంటి ముఖద్వారాన్ని తెచ్చి ఇక్కడ ఇప్పుడు మా ఇంట్లో పొందుపరుచుకున్నాం.

584
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles