బావకు ప్రేమతో..


Sun,December 3, 2017 02:45 AM

నాకలల ప్రేమికుడు బావ. బావంటే నాకు చిన్నప్పట్నుంచీ ఇష్టం. కానీ ఎవరితోనూ చెప్పలేదు. ఆఖరికి బావతో కూడా నువ్వంటే నాకిష్టం అని ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే చిన్నప్పట్నుంచీ సాన్నిహిత్యం ఉండేది. ఎంతున్నా తనని సూటిగా చూస్తూ మాట్లాడే సాహసం మాత్రం చేయలేను. బావంటే నాకు ఎంత ఇష్టమో అంతే భయం కూడా. భయం అంటే అదేదో ఆయన స్వభావం వల్ల ఏర్పడింది కాదు. బావ చాలా మంచోడు. తన స్వభావంతో అలా ఎవరినీ బాధించడు. భయపెట్టడు. అయితే అతనిపట్ల నాకున్న భయం మాత్రం వేరే. ఆ భయం బావ మీదున్న గౌరవంతో ఏర్పడింది. నేను అతనికిచ్చే స్థానాన్ని బట్టి ఏర్పడింది. సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న పరిస్థితులు.. నేను పెరిగిన వాతావరణం బావకు నన్ను దూరంగానే ఉంచాయి. బావకూ నేనంటే చాలా ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఇష్టమైన వారికి కల్పించే స్థానం.. చూసే విధానం ఎంత గొప్పగా ఉంటుందో బావ నాకు కల్పించిన ప్రాధాన్యాన్ని బట్టి చెప్పొచ్చు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం. అందులోనూ నా సొంతం మా బావ. ఎక్కడికి వెళ్తాడులే అనుకున్నా. మెల్లగా చెప్పొచ్చులే అనుకున్నా. కానీ నా ఆ మౌనమే బావకు.. నన్ను దూరం చేసింది. బావే ప్రపంచంగా బతికిన నేను.. ఆ రోజు నీతోనే నేనుంటా అని ఒక్కమాట చెప్పి ఉంటే.. నువ్వు లేక నేను లేను బావా అని గట్టిగా అని ఉంటే.. నువ్వంటే నా ప్రాణం అని ఒక్కమాట చెప్పి ఉంటే ఇలా జ్ఞాపకంగా రాయాల్సి వచ్చేది కాదు.
అందుకే బావ గురించి.. నా తొలిప్రేమ గురించి రాస్తుంటే కన్నీటి మసకలో అక్షరాలు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇవి అక్షరాలా లేక కన్నీటి ధారలా అనిపిస్తుంది. గుండె తడియారని నా ప్రేమను చెప్పుకుంటున్నందుకు ఆనందించాలో.. బాధపడాలో కూడా తెలియడం లేదు. ధైర్యం చేయాల్సిన చోట చేయకపోతే.. ఏది ఇష్టమో అది స్పష్టంగా.. సరైన సమయానికి చెప్పకపోతే ఇలానే ఉంటుంది కదా అనిపిస్తుంది.
love

అంత విషయమున్న.. ఇష్టమున్న వ్యక్తి బావ. చాలా బాగుంటాడు. నవ్వితే పున్నమి చంద్రుడే అన్నట్లుంటాడు. తను మాట్లాడితే నిలువెత్తు ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. బావ చూపు చల్లని దీవెన. ఆ రామచంద్రుడిలో ఉండే సుగుణాలన్నీ బావలో కనిపిస్తాయి. ఆయన్ను చూస్తే అమ్మాయిలిట్టే పడిపోతారు. అంత బావుంటాడు బావ. తనంటే అంత ప్రేమ కాబట్టి తను చేసే ప్రతీ పనిని.. అతని ప్రతీ హావభావాల్ని గమనించేదాన్ని. ప్రేమించేదాన్ని. నాకు అప్పుడున్న వయసుకు.. అప్పటి పరిస్థితులకే బావ తప్ప వేరే ప్రపంచమే కనిపించలేదు. ఆయనే ప్రపంచంగా బతుకుతున్నా.
నేనే బెట్టు చేశానో.. నాన్న మీద ఉండే విపరీతమైన భయం వల్లనో మొత్తానికి బావకు దూరమయ్యాను. అందునా నాన్న మాట. నాన్న ఏ మాటైనా చెప్తే అందరూ ఆజ్ఞలా పాటించాల్సిందే. చిన్నచిన్న కారణాల వల్ల బావతో పెళ్లికి నాన్న అంగీకరించలేదు. దానికి నేనంటే ఇష్టం కదా. నాన్నకు భయపడి ఇప్పుడు చెప్పడం లేదేమో. కానీ రేపైనా.. ఎల్లుండైనా.. ఎప్పటికైనా చెప్తుంది అని బావ నా అంగీకారం కోసం చాలాకాలం నిరీక్షించాడు. నాన్నా.. నాకు బావతోనే పెళ్లి చేయండి. నేను వేరే అతణ్ని చేసుకోను. ఆయనంటే నాకు ప్రాణం అని చెప్తే నాన్న నన్ను ఎక్కడ తప్పుగా అర్థంచేసుకుంటారో.. ఎక్కడ బాధపడతారోనని నేను సైలెంట్‌గా ఉన్నాను.

నీ మౌనం నిన్ను మోసం చేస్తోంది. ఆలోచించు. ధైర్యం చేయి అని లోపల మనసు ఎంత చెప్పినా నాన్నకుగానీ.. కుటుంబసభ్యులకు గానీ నా మనసులోని మాట చెప్పలేకపోయాను. నా నుంచి సరైన సమాధానం రాక.. ఇంతకాలం ఎదురుచూశాను. స్పందన లేదు. ఏం చేస్తాం. బలవంతంగా అయితే ఒప్పించలేం. చూస్తే నలుగురూ నానా రకాలుగా అనుకుంటారు. ముందు అమ్మాయి జీవితం. ఏమైనా ఆమె భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తుంది అని నన్ను ఏమీ అనక బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి నాక్కూడా వేరే అబ్బాయితో పెళ్లి జరిగింది. మా వారు ప్రభుత్వ ఉద్యోగి. అన్నట్టు బావ కూడా ప్రభుత్వ ఉద్యోగే. పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టారు. పెద్దవుతున్నారు. కాలం.. కాపురం రెండూ గడిచిపోతున్నాయి. తప్పో.. ఒప్పో నాకు తెలియదు కానీ.. నా మనసు మాత్రం బావ దగ్గరే ఆగిపోయింది.

ఎంత ప్రయత్నించినా నా మనసులోంచి బావ వెళ్లడం లేదు. బావను నేనెంత ప్రేమించానో అప్పుడర్థమైంది. రోజురోజుకీ అసహనం పెరిగిపోతున్నది.ఎందుకిలా? నా మనసుకు నచ్చిన బావతో ఒక్కసారి మాట్లాడాలి అనిపించింది. కానీ బావేమనుకుంటాడో? ఒకవేళ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే? అనిపించింది. ఆ ఊహే భరించలేకపోయా. అప్పుడెప్పుడో మా పెళ్లికి ముందు ఏర్పడిన కుటుంబ మనస్పర్దల కారణంగా మేం వాళ్ల ఫంక్షన్లకు వెళ్లలేదు. కాబట్టి ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. బంధువుల ఫంక్షన్లలో మాత్రం రెండుమూడు సార్లు బావను చూశాను. దూరం నుంచి చూశాను అంతే. కలవలేదు. దగ్గరికి వెళ్లి మాట్లాడాలనిపించినా పక్కన వాళ్లావిడ ఉండటం వల్ల ఆ ప్రయత్నం చేయలేదు. నిజంగా తలుచుకుంటేనే బాధనిపిస్తుంది. ఒక్కటా రెండా.. పన్నెండేళ్లు అవుతుంది బావతో మాట్లాడక. ఆయన ఎంత బాగా మాట్లాడేవాడో. ఎంత ఆప్యాయంగా పలకరించేవాడో. అబ్బ.. ఎలాగైనా ఒక్కసారి బావతో మాట్లాడితే బావుండు అనిపిస్తుంది. కనీసం ఫోన్లో అయినా మాట్లాడితే నా ప్రాణం కుదుట పడునేమో అనిపించింది. కానీ ఫోన్ నంబర్స్ కూడా లేవు. ఎలాగోలా ఫోన్ నంబర్ సంపాదించాను. కానీ ఎలా? ఇంట్లో నుంచి చేస్తే బిల్ వచ్చేటప్పుడు తెలుస్తుంది. నా ఫోన్లో నుంచి చేసినా మావారు చూస్తారు. ఫోన్ నంబర్ దొరికిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. పొద్దున్నే రెడీ అయి పబ్లిక్‌ఫోన్ దగ్గరకు వెళ్లాను. నంబర్ కలిపాను. ఫోన్ రింగ్ అవుతోంది.
హలో ఎవరు? అన్నాడు బావ. ఎన్నాళ్లయింది ఆ గొంతు విని? మళ్లీ మళ్లీ వినాలనిపించింది. అంత మాధుర్యం ఉందా స్వరంలో. మగాళ్ల గొంతులో మాధుర్యం ఏంటి అనిపించినా బావ వాయిస్ ప్రత్యేకతే అది. హలో ఎవరూ? అని గట్టిగా అన్నాడు. దెబ్బకు ఉలిక్కిపడి ఈ లోకానికి వచ్చా. నేను బావా అన్నాను. ఓహ్.. నువ్వా? బావున్నావా? అన్నాడు. బానే ఉన్నాను బావా అని చెప్పా.
మీరెలా ఉన్నారు? అన్నాను. ఫైన్. బావున్నాం. థ్యాంక్యూ ఫర్ కాలింగ్ అన్నాడు.
love1

పిల్లల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడెక్కడ ఉంటున్నారు? మీవారెలా ఉన్నారు? అంటూ చాలా మామూలుగా మాట్లాడుతున్నాడు. ఏదో చాలారోజుల క్రితం విడిపోయిన పరిచయస్తుల్లా. నాకేమో అలా మామూలుగా మాట్లాడాలనిపించడం లేదు. నాకు మాటలు గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్నాయి. అదే సమయంలో కళ్ల నుంచి నీళ్లు ఆగకుండా ప్రయాణం సాగిస్తున్నాయి.
ఏం చేస్తాం.. ఇన్ని రోజులు దాచుకోలేదా ప్రేమని గుండెల్లో. ఇంకా అలానే దాచుకుందామనిపించింది. ఓకే బై అని చెప్పి ఠక్కున ఫోన్ పెట్టేశా. ఏ రోజూ బావతో కలిసి సినిమాలు.. షికార్లు తిరగలేదు. మనసు విప్పి మాట్లాడలేదు. ఏ ఊహనీ.. ఊసునీ పంచుకోలేదు. తను నాకన్నా వయసులో చాలా పెద్ద. అందుకే గంభీరంగా.. హుందాగా ఉండేవారు. బహుశా అదీ ఒక కారణమేమో నేను తనకు దగ్గర కాలేకపోవడానికి. అయినా సరే పెళ్లయితే మాత్రం మరచిపోతారా ప్రేమించినవాళ్లను. అలా అయితే అది ప్రేమెందుకు అవుతుంది? నాకు మాత్రం కళ్లు మూసినా తెరిచినా బావే కదులుతున్నాడు. ఎన్ని పనులున్నా.. ఎంతమందిలో ఉన్నా మది నిండా తన గురించిన ఆలోచనలే. ఇది తప్పు కావచ్చు. కానీ నా మనసు అది దాటలేకపోతున్నది. బహుశా.. నా చివరిక్షణం వరకూ మానసికంగా బావతోనే బతుకుతానేమో? బావేమైనా జ్ఞాపకమా మర్చిపోవడానికి? రక్తసంబంధం. మాది మానసిక అనుబంధం. బావ నా శాశ్వతం. ఐ లవ్ యూ బావా!
నిన్ను చూసిన క్షణం ఆకాశం మల్లెల నావగా మారి.. ఆనందం పువ్వుల వానగా కురుస్తుంది!
ప్రేమతో.. నీ మరదలు.

2169
Tags

More News

VIRAL NEWS