బల్లి పాతర


Sun,August 13, 2017 03:35 AM

storyయాదవ్వ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆర్.ఎమ్.పి. దవాఖానా నుండి బయటకు వచ్చింది. ఎగదన్నుకొస్తున్న దుఃఖాన్ని పెదవుల మధ్య బిగపట్టుకొని ఇంటివైపు వేగంగా నడుస్తోంది. మెయిన్ రొడ్డు అవతలి వైపు గల సందులోంచి భర్త నాగరాజు తూలుకుంటూ వస్తున్నాడు. అతణ్ణి చూడగానే బోరున ఏడుస్తూ నోటికి కొంగు అడ్డు పెట్టుకున్నది యాదవ్వ. ఆమె రోడ్డు దాటక మునుపే, అతడు మూల తిరిగి వైన్స్ షాప్ మెట్లెక్కి గ్రిల్‌లో నుండి డబ్బులు ఇస్తూ ఉన్నాడు.

ఇరవై నాలుగ్గంటలు తాగే ముం...కొడ్కు నేను సచ్చినంక నా పొరగాండ్లను రేవుకు తెత్తడన్న నమ్కం లేదు బయటకే అంది. వైన్స్‌షాప్ ఎదుట అడ్డదిడ్డంగా మోటర్ సైకిళ్ళు నిలిపి ఉన్నాయి. కొందరు, పక్కనే మూసి ఉన్న షట్టర్ ముందు కూర్చొని తాగుతూ ఉన్నారు. వచ్చే పోయే వాహనాల హారన్లు మోగుతూ ఉన్నాయి. యాదవ్వ తల వంచుకొని రోడ్డు దాటుతోంది. నడక తడబడుతోంది. ఒళ్ళంతా వణుకుతోంది. చెమటతో జాకెట్టు తడిసి పోయింది. మడమల మీదుగా చెమటలు చెప్పుల్లోకి జారిపోతూ ఉన్నాయి. జనాన్ని దాటుకొని ఆటో వేగంగా వచ్చి క్లస్.. అంటూ ఆగిపోయింది.

ఓ.. అక్కా.. గొర్రె దాటినట్టు దాటుడేనా.. అటీటు సూసుడు లేదా అన్నాడు డ్రైవర్ తల బయటకు పెట్టి. యాదవ్వ అదేమీ గమనించకుండానే ఎదురు సందులోకి ప్రవేశించింది. ఇరువైపులా రేకులతో ప్లాస్టిక్ కవర్స్‌తో వున్న చిన్నచిన్న ఇండ్ల మధ్యలోంచి వెళ్ళి ఇంటిముందు వాకిట్లో ఆయాస పడుతూ కూర్చున్నది. నేలవైపు చూస్తోంది. ముఖం బెంగతో నిండిపోయింది. దగ్గుతూ తెమడ ఉమ్మేసి మట్టి కప్పేసింది.

ఎదురింట్లోంచి రంగవ్వ వస్తూనే ఎటు పోయినవ్ బిడా? ఏమో రందితోటి బీరిపోయి కూసున్నవ్ అంది. యాదవ్వ మోకాళ్ళ నడుమ ముఖం దాచుకొని బోరున ఏడ్వడం ఆరంభించింది. ఇంట్లోంచి ఇద్దరు ఆడపిల్లలు రివ్వున బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు.ఏంది బిడ్డా..ఏమైందే వావ్వ! యేదవ్వా.. అంటూ కింద కూర్చొని ఎడమ చేయి వీపుమీద వేసి కుడి చేత్తో ముఖం పైకి ఎత్తుతూ హరే.. పోరికేమన్న దయ్యం పట్టెనా ఏమీ...! షెప్పది షెయ్యదీ.. సోకం బెట్టుకోనేడ్తదీ.. హరే.. పొలగాండ్లు బెంగటీల్తరవ్వా.. హరే.. ఇదెక్కడేషముల్లా.. పాడయ్యీ.. రంగవ్వ ముఖం కూడా దుఃఖ పూరితమైయ్యింది.

ఇద్దరు పిల్లల కళ్ళు నీళ్ళు నిండి ఉన్నాయి. యాదవ్వ ముందు కూర్చొని ప్రశ్నిస్తూ ఉన్నారు. పక్కిళ్ళ నుండి మహిళలు గుంపుగా చేరిపోయారు. ఒకావిడ ఉప్పొస తీర ఏడ్వనియ్యి రంగవ్వా..జెరాగూ అంది.
ఆరే.. అప్పటి దాన్క ఏందోనని బెగడుతోటి నన్ను సావుమంటవా ఏందీ..
కొద్ది క్షణాలు గడిచిపోయాయి. యాదవ్వ గోడకు ఒరిగి ఆయాస పడుతోంది.
జెర్రన్ని లీల్లు అందుకో బిడ్డా.. కుత్కెండుకు పోతాన్నట్టున్నదీ.. అంది రంగవ్వ.
యాదవ్వ నీళ్ళు తాగింది. పక్కకు తిరిగి ముక్కు చీదింది. గొంతు సవరించుకొని ఇయ్యల్ల పనికాడ పగటీలి దగ్గంగనే దోషెడంత నెత్తురు పడ్డది. ఇప్పుడు సయ్యదన్న తాడికిపోతె అంత బొక్కబొక్కైనవూ... ఏమి ఆలతు లేకుంటైనవూ.. ఊకె దగ్గవడ్తివీ.. ఊకె జెరం అనవడ్తివీ.. తెమడ రావట్టే. మల్ల షాతిల నొత్తందనవడ్తివీ.. సర్కారు దావుకానకు పొమ్మంటె పోతలెవ్వైతివీ.. ఇదంత ఎటో టీబీ రోగమోలున్నదీ.. అగో గడ్డమీది రాములు కోడలు రోగం ముదిర్నంక పోయింది. మందులేం పనిజెయ్యలేదూ.. నవ్షీ నవ్షీ పిడాత సచ్చిపొయ్యిందీ.. రేపో ఎల్లుండో దినాలున్నయీ అన్నడూ.. అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకొని కుమిలి కుమిలి ఏడుస్తోంది.

ఆని సయ్యదుగాని దౌడలు దగ్గరవడా.. డాటర్ దైర్నం జెప్తడు గనీ.. పికరు జెప్తాడూ.. టీబి రోగమొచ్చి నోల్లందరు.. సామదొడ్లెవడి సత్తాండ్రంటనా.. ఓ మా బామ్మార్ది పెండ్లాం నెల్లాల్లు దోసిల్ల కొద్ది నెత్తురు గక్కింది. ఓ బొక్కల మీద తోలు దుప్పటి కప్పినట్టుండే.. రొండ్నెల్లు సర్కారు దావుకాండ్ల మందులాడుకున్నదీ.. ఇప్పుడు గుర్రానికి గుర్రమైయ్యిందీ. నువ్వేం బుగులు పట్టకు బిడ్డా.. రేపు దావుకాండ్లకు తోల్కపోత. శర్దతోని మందులేస్కుంటే మాలెస్క ఎప్పటోలైతవూ.. అంది రంగవ్వ.
షిన్నవ్వా..నాకేం పానం మీద తీపిలేదు. సచ్చిందే నయ్యం. యాల్ల పొద్దుగాల్ల గీ.. ఆడి పోరగాండ్లు తర్లైతరని రంది.. దినం బాగలేదు. ఈడు తాగుబోతు ముం...కొడ్కూ.. పిల్లల తెర్లు జేత్తడు అంది యాదవ్వ.

ఈ మాట మాత్రం నువ్వొద్దె బిడ్డా.. ఇదివర్దాక పొలగాండ్లను ఈపుల సర్షి జిలుకర డబ్బలున్న మూడువందలు అందుకొని పొయ్యిండు.
హయ్యో.. నుదురు కొట్టుకుంటూ ఈనవ్వ కడ్పు కాల.. నా పొలగాండ్లుచ్చ తాగ్తడూ.. ఆని ఆరం దినాలు షేస్కుంటడూ.. షిన్నపోరి ఆరం పద్దినాల సంది షికెను షికెను అని తండ్లా..డ్తందీ.. అద్దపావంత తెచ్చి కడుపునిండ తినవెట్టుకుంటననుకొని బమ్షిన.. ఇంట్ల నూకిత్తు సుతం లేదూ.. దమ్మొత్తంటె సుతం సుదురాయించుకుంట తట్టకు షెంబెడు లీల్లు తాక్కుంట.. కడుపుల పేగులు కుత్కెలకొత్తంటె సుతం నిచ్చెన్లు ఎక్కి దిగుకుంట కూలి షేత్తన్న.. ఈ దేవునికెట్ల నాయమైతదో మూలిగింది యాదవ్వ.
యేదవ్వా.. పైషలు పైలంగ దాసుకోవాలె బిడ్డా ఆని గునమెర్కేనాయే.. కోడిపిల్లను కుక్కెత్క పోయినట్టేనాయే..
ఈ పిల్లలు ఇంట్లనే ఉన్నరు పెద్దవ్వా.. గొంతు పెంచి అరుస్తూ లేచి వంగి పిల్లల వీపుల మీద కొట్టింది. ఈల్లు ఉన్న సందం లేదూ, లేని సందం లేదూ.. ఏం లేదు.. గాడ్దిపండ్లు తోముతన్నారూ తన్నింది.

రంగవ్వ అడ్డు తగులుతూ యేదవ్వా! పొలగాండ్లను ఏంజేయమన్నవ్ బిడ్డా.. ఆడే ఒల్షన్ని దెబ్బలు కొట్టిపాయే.. మల్ల నువ్ కొట్టవడ్తివీ.. ఆడివిల్లల మీద షెయ్యెయ్యొద్దు బిడ్డా.. గోస తాక్తదీ..
ఇప్పుడు ఒట్టి షాపలలోలె ఎండాలె పోరలూ.. ఒక్క పైషసుతం లేదూ.. బదలు కూడ పుట్టయీ.. అది అదాట్న ఆయింత జత్తె పైషలు మున్గుతయనుకుంట్రూ.
ఈ అండ్యాల్లం పాడుగానూ నువ్వెందుకు సత్తవే బిడ్డా.. నా తాడ పైషలు మాగున్నయితీ.. నూకలూ షికెను నేను తెత్తతీ... గొంతు తగ్గించి జెర నువ్ తలే గిలాస ఏరే పెట్టుకో బిడ్డా.. ఎంగులం మంగులం పొల్లగాల్లకు అంటనియ్యకూ.. పక్క సుతం ఏరే ఏస్కో బిడ్డా.. బంగారమోలె పొల్లగాల్లున్నరూ.. అంటూ రంగవ్వ మార్కెట్టుకు వెళ్ళిపోయింది.

తెల్లవారి రోజు..
ఏరియా ఆసుపత్రి నుండి రంగవ్వా యాదవ్వ ఇంటికి వస్తూ ఉన్నారు.
యేదవ్వా.. టీబీ రోగమొచ్చెనని బుగులు పట్టేడ్ది లేదూ.. రంది పెట్టుకునేడ్ది లేదు బిడ్డా.. సూదులు మందులు ఫిరీగ దొరుకుతయీ. రొండ్నెల్లు కైకిలు బందుపెట్టూ మూడు పూటలు ఆర్షి నాలుగు బుక్కలు కడుపునిండ తిను బిడ్డా.. జప్పన కమ్మైతదీ.. ఇన్నొద్దులోలె కడ్పు మాడ్సుకోని తిండి నల్లిడ్షినవనుకో.. షేతికి రాకుంటైతవూ.. నీ పిల్లలు ఏడిండ్ల పిల్లికూనలైతరూ.. ఇయ్యేడల్ల నాకు షెప్పిషెప్పి యాట్టకొచ్చింది బిడ్డా.. ఆ ముం... కొడ్కేమన్న దూము జేత్తె ఆడకట్టు ఆడోల్లమందరం కల్సి షీపురు కట్టందుకుంటమ్.
ఇష్టం జేస్కొని తింట షిన్నవ్వా.. నా పొల్లగాండ్లను ఒగయ్యల షేతుల్ల పెట్టేదాన్క నేను బత్కాలే.. ముక్కు చీదింది.
రాత్రి పదిగంటలు దాటింది. పిల్లలూ యాదవ్వ పడుకున్నారు. రేకుల మీద వర్షం పడుతున్న చప్పుడు అవుతున్నది.

యాదవ్వ ఇంటికప్పు వైపు చూస్తూ ఉన్నది. కన్నీళ్ళు ధారలుగా చెవుల మీదికి కారుతున్నాయి.
అమ్మా.. బాపు నిన్నటి కాంచి ఇంటి మొకానొత్తలేడు. బడికేల్లి ఒత్తాంటే కల్లు దుకునం ముంగట కూకోని కున్కుపాట్లు పడ్తండు. బుక్కెడంత బువ్వ తిందువు రమ్మని పిల్చిన.. నా మీదికే కొట్టకొట్టొచ్చిండూ.. అంది పూజ. ఏం జేత్తాం బిడ్డ! ఇయ్యేడల్ల ఎగిచ్చి ఎగిచ్చి నా పానం మీదికి తెచ్చుకున్న.. మన రాతలు గిట్లున్నయి బిడ్డా.. నువ్ పెద్దదానివీ.. మంచిగ సద్వుకోని బుద్దిమంతురాలువైతే.. షెల్లె సుతం మంచిగైతదీ.. రేప్పొద్దుగాల ఏ కట్టం ఎట్లొచ్చినా సద్వు మాత్రం ఆపొద్దు బిడ్డా..
అమ్మా.. మా క్లాసులల్ల అక్కా నేనే ఫస్టొత్తం. నేను బాగ సదువుకోని పెద్ద కలెక్టరమ్మనై ఈ కల్లుదుకాన్లు, ఈ వైన్సు దుకాండ్లు పురాంగ లేకుంట జేత్త అంది నీరజ.
పూజ నవ్వింది సాలుతీ.. ఓ కోతలూ ఇప్పుడు కలెక్టర్లు లేరా.. ఆల్లు బందుజేపిత్తండ్లానే.. పిస్సా..
ఓ పిస్సదానా.. ఇయ్యల్ల ఒగ అంకుల్‌గాడూ.. తాగి బజార్ల సోయిసొక్కు లేకుంట పడిపోయిండు. షేతులున్న సంచిలకేల్లి బియ్యం కిందపోయినయీ. పందులు బుక్కుతన్నయీ.. ఇంటికాడ ఆని పొలగాండ్లు ఆకల్తోటి ఎదురు సూత్తాండ్లేమోనని మత్తు బాదనిపిచ్చిందే నాకూ.. ఏ కొల్వు జేత్తె ఈ దుకాండ్లు బందు జేపియ్యెచ్చో.. ఆ కొల్వే దొర్కవడ్తా.. ఆ సదువే సద్వుతా..
పిల్లలు వాదించుకుంటూ ఉన్నారు.

యాదవ్వా.. ఓ.. యాదవ్వా..
అమ్మా.. ఈరయ్య తాత పిలుత్తాండే.. అంది నీరజ.
యాదవ్వ తలుపు తెరిచింది.
యాదవ్వా.. నడిజాము రాత్రికావట్టే.. ముసురువెట్టవట్టే.. ఇంటి మనిషి ఇంటికి రాకపోతే సోయుండదానే.. ఆ బాడుకావు వైన్స్ ముంగట తాగి పన్నడు. ఈదర రావట్టే. దోమలు కుట్టవట్టే.. ఊ నిన్ననే రాత్రి లేసి మోరీల లీల్లు తాగిండంటా.. కుత్కెండిపోయి ఆయింత పానమిడ్తే.. బదునామ్ ఎవనికీ.. అన్నాడు వీరయ్య.
బద్నాం నాకా.. నేను బజార్ల తాగిపడి సావుమన్నవా.. నా అయ్యను నన్ను బొంకిచ్చి బొర్లిచ్చి ఇసోంటి తాగుబోతు ముం... కొడ్కును అంటగట్నెవ్, నా బత్కు నాశ్నం జేస్నెవ్.. నువ్వే తీసుకొచ్చి ఇంట్ల పండవెట్టూ.. నా పానమే మంచిగ లేదు. ఆడి మనుషులం.. ఈ అద్దుమ రాత్రి ఎట్లరాము.. ఆటోల ఏస్కరానీకి నయాపైషలేదూ.. నూకలకు పోస్కతాగనీకి ఉంచుకున్న పైషలు ఎత్కపొయ్యిండూ.. ఆవేశంతో అంది.

ఈ పోరి తల్లి ఆపతి మీదొత్తె కొల్లపొరంసద్వవట్టెనేమ్రో.. నేను ఆటోకు పైషలిత్తరాయే.. జెర నీ దయనూ, నీ అన్న కొడ్కేనాయే.. సూస్కుంటుంటవాని కులం నా నోట్లూంస్తందీ.
నా రాత కాలిపోనూ.. తెల్లన్‌దన్క నిర్దపోయేటట్టు సుతం లేదూ.. ఈ తాగుడు మంట్లె పోనూ.. గొంతులో ఏడ్పు ధ్వనించింది.
వెళ్లేసరికి నాగరాజు కళ్లు మూసుకొని పెదవులు తడుముకుంటున్నాడు. వీరయ్య నీళ్ల పాకెట్ కొరికి అతడి నోటికి అందించాడు. కళ్లు మూసుకొనే తాగేశాడు. డ్రైవర్ సహాయంతో ఆటోలో కాళ్లు పెట్టుకొనే చోట పడుకోబెట్టి ఇంటికి తీసుకొచ్చారు.
అర్ధరాత్రి దాటింది. పెట్రోలింగ్ వ్యాన్ హారన్, దూరాన కుక్కలు మొరుగుతున్న శబ్దం వినపడుతున్నది. గాలితో పాటుగా వర్షం ఉధృతి పెరిగింది. ఇంటిపైన కప్పిన ప్లాస్టిక్ కాగితాలు పటాపటా కొట్టుకుంటున్నాయి. యాదవ్వా పిల్లలు నిద్రపోతూ ఉన్నారు.
ఓ యాది ముండా.. ఆకలైతాందే.. నాగరాజు గట్టిగా అరిచాడు.

యాదవ్వ మౌనంగా లేచి పళ్లెంలో అన్నం వేసి ముందు పెట్టింది. అతడు అన్నాన్ని పరీక్షగా చూస్తూ పండ్లు పటపట కొరికి నీ తల్లీ.. యాదీ.. నేలను గుద్దుతూ అన్నాడు.
నీ దండం బెడ్త! బాంచెను కాల్మొక్త.. పొలగాండ్లు నిర్దలున్నరూ.. బుగులు పట్ట జిక్కిరీ.. అంది యాదవ్వ.
రంగవ్వ పిలిస్తే తలుపు తెరిచింది. నీ తల్లీ.. ఇండ్ల షికనేదే.. ముండా.. నీయవ్వ కడ్పు కాలగదరా.. ఉన్న పైషలెత్క పోయి కుత్కెల దాన్క తాగ్తివీ.. షికెన్ కోసం యాడ బోవాల్రా..
నాగన్నా.. నీకెమన్న నాయమైతాదిరా.. గంజిల నీతోటి బత్తాలు మోసేటోల్లు నీ లెక్కనే షేత్తాన్నారా.. షేస్కున్న కాడికి తాగవడ్తివీ.. సాలకపోతే ఇంట్లకెల్లి ఎత్క పోవడ్తివీ.. ఆ పోరి గోస సూత్తంటె కడ్పుల పేగులు ఆవ్షి పోతున్నయిరా.. దానికి టీబీ రోగమొచ్చిందట. దోసిల్ల కొద్దీ నెత్తురు గక్కుతందీ.. ఇగనన్న తొవ్వకు రారా.. నా అన్న కడుపుల షెడ బుడ్తివి గదరా.. ఆ పోరి వీని అడ్డమైన సట్టముల మన్నువడని తిడ్తంటె రోషం రావట్టె గద్రా.. అని హితవు చెప్పింది రంగవ్వ.

షిన్నవ్వా.. ఈ లం...కొడ్కు నా.. గండాన పుట్టిండు. షిలుకకు షెప్పినట్టు కన్నతల్లోలె షెప్పిన.. తోడబుట్టిన తోడోలె బతిమిలాడిన.. నా కండ్లలీల్లతో ఈని కాల్లు కడిగిన.. పొల్లగాండ్ల మొఖం జూడుమని ఆల్లను కాల్లమీదేసిన.. ముండాకొడ్కా.. నాకు అవ్వోడు లేడ్రా.. అయ్యోడు లేడ్రా.. నువ్వున్నొక్క దిక్కు ఏమన్నైతే సంసారం ఆగమైతద్రా.. అని బొచ్చంత కొట్టుకున్న.. నా కడ్పు మాడ్సుకొని వీని కడుపిస్సారిత్తినీ.. ఇప్పుడు నా పానం మీదికి తెచ్చుకుంటినీ.. తల్సుకుంటే బొచ్చెల అగుల్లు బుగుైల్లె గడ్డపారతోని పెల్లగిచ్చినట్టయ్యి నా పానం ఎల్లిపోవట్టే.. ఏడుస్తూ తల నిట్టాడుకు కొట్టుకుంటూ ఉంటే..
ఓ.. పోరి ముండా సత్తావే.. అంటూ రంగవ్వ ఆపింది.
ఈ లం...కొడ్కు ఇంగ తొవ్వకు రాడు షిన్నవ్వా.. ఇంగ వీన్ని పిడాత సంప్త.. చీపురుతో నాగరాజును దబదబా కొట్టింది. అతడి కాళ్లమీద పడి కుమిలి కుమిలి ఏడుస్తున్నది యాదవ్వ.
రంగవ్వ కన్నీళ్లు తుడుచుకుంటూ.. ఒద్దు బిడ్డా.. ఇంగలే.. కట్టుకున్నొన్ని కొట్టి పాపంల పడ్తవా.. అవ్వ..! కడ్పు మస్లితే గిట్లనే ఉంటది బిడ్డా.. ఏమి ఏడ్పే బిడ్డా.. కండ్లు అవుట్ల లీల్లొత్తున్నయి గనీ.. షర్లైతె ఎప్పుడో ఎండిపోవు బిడ్డా..
నాగరాజు తలవంచుకొని కూర్చున్నాడు.
ఇద్దరు మంచి మాటలు చాలా చెప్పారు.

షిన్నవ్వా.. ఈ కొలుపు ఎప్పడికీ ఉన్నదేనాయే.. నా తోటి సరిదంట కట్టపడ్తానవ్.. పొద్దంత కైకిలి షేషి అలిష్ట మీదున్నవ్.. పండుకోపో అంది యాదవ్వ. రంగవ్వ వెళ్లిపోయింది.
యాదవ్వ నాగరాజుకు అన్నం తినిపించింది. మంచి మాటలు చెపుతూ నీళ్లు తాగించి, మూతి కడిగింది. అతడి భుజంపై గల తువ్వాలుతో మూతీ, చాతీ తుడిచింది.
యాదవ్వా.. నీ కొంగుతోటి తూడ్తవు గదా ఎప్పడికీ.. అన్నాడు నాగరాజు.
నా ఎంగులం మంగులం నీకు తలుగొద్దు..టీబీ రోగమాయె.. నాకు ఏమన్నైనా.. నువ్వు సల్లంగుంటె పొల్లగాండ్లను రేవుకు తెత్తవ్.. నేను సచ్చినంకనన్న నువ్ తొవ్వొకొత్తవేమో..
నాగరాజు యాదవ్వను బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఆమె పిట్టపిల్లలా ఒదిగిపోయింది. బోరున ఏడ్వడం మొదలుపెట్టాడు. ఇద్దరూ దుఃఖవాహినిలో తడుస్తూ ఉన్నారు.
పిల్లలిద్దరూ ఏడుస్తూ తండ్రి కాళ్లపై ముఖం పెట్టారు. బాపూ.. నువ్ తాగుడు పురాంగ మానాలే.. అమ్మ పానం మంచిగ లేదు.. బలం తిండి, బలం మందులు ఉంటెనే అమ్మ పానం మంచిగైతదీ.. ఇంగ కైకిలికి పోదు అమ్మ.. తనకేమన్నైతే మేము ఎంబడే ఏమన్నేస్కోని పిడాత పానమిడ్తం.. మా అందరి బత్కులు నీ షెతుల్నే ఉన్నయి బాపూ.. అంది పూజ.
నాగరాజు పిల్లల్ని దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. వాళ్ల తలలపై చేతులు వేసి మీ మీద ఇమానం జేత్తాన బిడ్డా.. నా జన్మల కల్లు సార బరండి ఏమి తాగ బిడ్డలాలా..తాగుతె మిమ్ముల సంప్కతిన్నట్టు బిడ్డా.. అన్నాడు.

ఇసొంటి ఇమానాలు మత్తు సాల్లు షేష్నవ్.. దేని మీద పాటి లేదు నీకు.. పెద్ద పోరి తోటోల్లు పెద్దమనుసులైపోయిండ్రట.. పొల్లకు బలం తిండి లేక కాలే.. దాని ముందట మాట లిలవెట్టుకో.. తెల్లారంగనే ఆ ముం...కొడ్కు దుక్నం తియ్యంగనే ఉర్కి తాగేవు.. అంది యాదవ్వ.
యాదవ్వా.. తాగుబోతునే కావొచ్చు గానీ.. నేను సుతం ఒగ అవ్వయ్యకు పుట్టినోన్నే.. నాకు సుతం నెనరున్నదే.. ఈ అడ్డమైన తాగుడు బందు జేద్దామని మత్తు సాల్రు అనుకున్న. కనీ.. నా తోటైత లేదు. తాగుడు జెర్రంత ఆల్షమైతే కాల్రెక్కలు మెడలు ఒన్కుతుంటయి.. పిచ్చిపిచ్చైతదీ.. అగుల్లు.. బుగుల్లూ.. గాలి గావరా.. ఉరివెట్టుకుంటే బాగుండనిపిత్తదే.. తాగుడు మాన్పించే దావుకాండ్లున్నయట గనీ పవేటంట.. వెయిల పైష కర్సైద్దటా.. పాడై గవురుమెంటు దావుకాండ్లుండు గద పోదునే.. అన్నాడు నాగరాజు.
నీ యవ్వ! టీబీ రోగానికి సూడకుంటె మాయె గనీ.. ఈ తాగుడు మానిపిత్తె మంచిగుండును అంది యాదవ్వ.
పిల్లలు నాగరాజు పక్కనే నిద్రపోయారు.

ఉదయం ఎనిమిది గంటలవుతున్నది. పిల్లలు ఇంటి పని చేస్తున్నారు. యాదవ్వ నిద్రపోతున్నది.
అవ్వలూ.. నేను పనికి పోతన్న బిడ్డా.. అమ్మను పనికి పోవద్దని చెప్పుండ్రవ్వా.. మీకు అప్పడికి పండ్లు తెత్త బిడ్డా.. అంటూ వెళ్లిపోయిండు నాగరాజు.
వేపచెట్టు కొమ్మల్లోంచి ఎర్రని సూర్యుడు జారిపోతూ ఉన్నాడు. ఆకాశం చీకటి దుప్పటి దులుపుకుంటున్నది కప్పుకొనేందుకు. ఎదురుగా వున్న వైన్స్ షాప్‌లో లైట్లు వెలిగాయి. మద్యం ప్రియుల రద్దీ ధ్వని ముందు అలసి గూళ్లకు చేరిన పక్షుల రొద తేలిపోతున్నది.
పిల్లలు వైన్‌షాప్ వద్దకు వచ్చారు. నాగరాజు షాప్ పక్కన గల గద్దెపై కూర్చొని కళ్లు మూస్తూ, తెరుస్తూ తూలుతూ ఉన్నాడు. పిల్లలు యాదవ్వకు విషయం చెప్పారు.
మీ బాపు తాగుడు మాన్తడని నేనేమీ ఆశ పెట్టుకోలేదు బిడ్డా.. ఆయ్న పెయ్యి ఆయ్న ఆగ్గెల లేదు.. తాగుడు అల్వాట్ల పడితే కూకేటి పాము సుట్టుకున్నట్టు.. అది ఈల్లను మింగంది ఇడ్వదీ.. మనం ఇస్సం పుచ్చుకోని సచ్చేదినం ఒచ్చింది బిడ్డా.. అంది యాదవ్వ.
పిల్లలు తలా ఒక మూలకు కూర్చున్నారు. కాలం నిశ్శబ్దంగా సాగుతున్నది.
అమ్మా.. మా దోస్తులు కొందరు పొద్దునా సాయంత్రం సమోసలు, డబుల్ రొట్టెలు, బిస్కెట్లు అమ్ముతరు.. కొందరూ పూలు అల్లుతరూ.. అమ్ముతరూ.. ఇంకొందరు అల్లమెల్లి పాయమ్ముతరూ.. అల్లమ్మొరబ్బ అమ్ముతరూ.. మల్ల మా తోటి బల్లెకొత్తరూ.. అంది పూజ.
దొంగతనం జేత్తె తప్పు బిడ్డా.. కట్టపడి బత్తె ఏం తప్పులేదు బిడ్డా.. అంది యాదవ్వ.
నీ పానం మంచిగయ్యే దాన్క నేనూ చెల్లే మా దోస్తులతోని పోతం.. మరి పొట్టకెట్లెల్లుతదీ..
అర్ధరాత్రి దాటింది. పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. యాదవ్వ కూర్చొని ఉంది. బయట అడుగుల చప్పుడు అవుతూ ఉంటే తలుపు తీసి చూస్తున్నది. వాన తుంపర మొదలైయ్యింది.
అమ్మా.. బాపు పిల్షినట్టు కలవడ్డదీ.. అంది నీరజ.
నేను ఆయ్న కోసమే సూత్తన్న బిడ్డా..
వైన్స్ కాడున్నడేమో.. తోలుకొద్దామా అమ్మా..
పా.. బిడ్డా..

ఇద్దరూ బయటకు వెళ్లారు. వర్షం వస్తూనే ఉంది. ఆ ప్రాంతమంతా వెతికారు. నాగరాజు కనిపించలేదు. ఇంటికి వచ్చారు.
నీరజవ్వా.. జప్పన లేవాలె బిడ్డా.. మబ్బుల.. బ్యారానికి పోతనంటిరి గదవ్వా.. పండుకో బిడ్డా..
యాదవ్వ పక్కమీద అటూఇటూ కదులుతూనే ఉంది రాత్రంతా.. కోయిల కూత వినబడుతున్నది.
నిపురు వంటి మేఘాలు కొట్టుకుపోతూ ఉంటే తూర్పు మబ్బు నిప్పు కణికల్లాగ మెరిసిపోతున్నది. కవాతు చేస్తున్న సైనికుల్లా పక్షులు అరుస్తూ ఆకాశమంతా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటి రెక్కలు విసనకర్రలైనట్టుగా.. ఆ వీచే గాలికి ఉదయాగ్ని మరింత రాజుకుంటున్నట్టుగా ఉంది.
పిల్లలు బ్యారం కోసం బయటకు వచ్చారు.
అక్కా.. బాపు వైన్స్‌కాడ పండుకున్నడో చూద్దామా.. అంది నీరజ.
వస్తూనే వేపచెట్టు కొమ్మల్లోకి యాదృచ్ఛికంగా చూసింది నీరజ. చెయ్యెత్తి అక్కా.. అంగో బాపూ.. అంది.
నాగరాజు మెడకు బిగుసుకుపోయిన తాడుతో కొమ్మకి వేలాడుతూ ఉన్నాడు. కనుగుడ్లు తేలేసి. నాలుక బయటకు జారిపోయి ఉంది.
పర్కపెల్లి యాదగిరి, సెల్: 9299909516

1033
Tags

More News

VIRAL NEWS