బతుకునిచ్చిన బతుకమ్మ చీరలు


Sun,October 7, 2018 02:07 AM

Bathukamma-sarees
తెలంగాణ విశిష్ఠతను చాటిచెప్పే తీరొక్కపూల జాతర బతుకమ్మ. నీలాకాశాన్ని సిబ్బిగా మలచి సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతినే దేవతగా పూజించే రంగురంగుల పూలపండుగ. బతుకమ్మ అనగానే ఆడపడుచుల మనసు పులకరిస్తుంది. తొమ్మిదిరోజులపాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆనందగా ఆడిపాడుతారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ ఉద్యమకాలానా ఉసిళ్ల పుట్టలై కదిలిన ఆడ పడుచుల గుండెల్లో దీపమై వెలిగింది. బతుకమ్మ విశిష్టతను, ఉద్యమంలో ఆడపడుచుల ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగకు చీరలు పెట్టి ఆడబిడ్డలను గౌరవించుకుంటున్నది. ఆ చీరల కు బతుకమ్మ చీరలు గానే పేరు పెట్టడంతో పాటు 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ చీర పెట్టనుంది. తెలంగాణ ఇంటి పండగ బతుకమ్మకు ప్రతి పేద అడబిడ్డ సంతోషంగా పండగ చేసుకోవడంతోపాటు దశాబ్దాలుగా సరిపడా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది.
- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

Bathukamma-sarees1
Bathukamma-sarees2
తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగను జరుపుకుంటారు. ఇది రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండుగ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన పుట్టింటికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్నది. కానీ బతుకమ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఒక ఆలోచన -రెండు సంబురాలు

సరిగ్గా ఏడాది క్రితం జూన్ నెలలో నేతన్నలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేతన్న కష్టాలు, వారికి కావాల్సిన సహకారంపై చర్చించారు. ఈ సంద ర్భంగా ప్రతి నేతన్నకు కనీసం 15 వేల నెల ఉపాధి దొరికేలా చేయాలన్న సంకల్పంతో ప్రభు త్వం పలు కార్యక్రమాలకు రూలకల్పన చేస్తుందని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల బాధ్యతను మంత్రి కెటీఆర్‌కు అప్పగించా రు. ఇప్పటికే రంజాన్, క్రిస్మస్ పండగలకు నూతన వస్ర్తాలు పంపిణీ చేస్తున్న ప్రభు త్వం ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా నేతన్నల ఇళ్ల ల్లో సంక్షోభాన్ని సంబురంగా మార్చింది. మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారి ద్వారానే కొనుగోలు చేస్తున్నది. దీని ద్వారా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. పనికి హామీ లభిస్తున్నది. బతుకుకు భరోసా ఏర్పడుతున్నది. చీరల పంపిణీతో మహిళల పండుగ సంబురం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు.

గతేడాది సూరత్ నుండి..

గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కా రు ప్రణాళికాబద్ధంగా పనిచేసింది. ముందు గా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి అడబిడ్డకు చీరల పంపిణి చేయాలని నిర్ణయించుకున్న ది. ఈ మేరకు సూమారు కోటీ నాలుగు లక్ష ల చీరలను సిద్ధం చేసింది. ఇందుకోసం సు మారు రూ. 222 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ చీరల తయారీకీ సూమారు 7 కోట్ల మీటర్ల వస్ర్తాలను ప్రభుత్వం తయారు చేయించింది. ఈ మొత్తం చీరల్లో సగానికిపైగా రాష్ట్రం నుంచే సేకరించింది. రాష్ట్రంలోని మరమగ్గాల్లో అత్యధిక శాతం ఉన్న సిరిసిల్లలోనే 52 లక్షల చీరలు ఉత్పత్తి అయ్యాయి. రెండు నెలలపాటు అన్ని మర మగ్గాలు పూర్తి ఉత్పాదక సామర్ద్యంతో పనిచేసి సగం చీరలు సిద్ధం చేశాయి. మిగిలిన సగాన్ని సూరత్ నుంచి కొనుగోలు చేశారు. రూ. 222 కోట్లలో దాదాపు రూ. 122 కోట్ల విలువైన 52 లక్షల పాలియెస్టర్ చీరల పంపి ణీ అర్డర్లను సిరిసిల్లలోని నేత కార్మికులకు అప్పగించారు. మరో రూ. 100 కోట్ల తయారీ ఆర్డరును సూరత్‌లోని కంపెనీల నుంచి కొనుగోలు చేశారు.

ఈసారి తెలంగాణలోనే..

అప్పట్లో సమయాభావం వల్ల సూరత్ వైపు మొగ్గు చూపిన ప్రభుత్వం ఈసారి ముంద స్తు ప్రణాళికతో రాష్ట్రంలోనే మొత్తం ఉత్పత్తి చేసింది. రూ. 230 కోట్లతో 1.20 కోట్ల చీరలను ఉత్పత్తి చేశారు. ముందుగా నేత కార్మికులకు మొత్తం 1.20 కోట్ల చీరల తయారీకి పని ఉత్తర్వు (వర్క్ ఆర్డర్) ఇవ్వాలని ఆదేశించారు. చీరల ఉత్పత్తిని మార్చి నెల నుంచి ప్రారంభించి సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనుకున్నట్లుగానే సెప్టెంబర్ చివరినాటికి చీరల ఉత్పత్తి పూర్తయ్యింది. దాదాపు ఆరు నెలల కాలంలో ప్రతీ నెల 20 లక్షల చీరల ఉత్పత్తి చొప్పున మొత్తం చీరలను తయారు చేశారు. రంజాన్, క్రిస్మస్ పండగల సందర్భంగా పంపిణీ చేయనున్న చీరలను గతంలో ఇతర రాష్ర్టాల్లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వీటిని సైతం సిరిసిల్ల ఇతర ప్రాంతాల్లోని కార్మికులతో తయారు చేయించారు.

సిరిసిల్లకు చీరల ఆర్డర్

గతేడాదిలో రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందించింది ప్రభు త్వం. అయితే ఈ చీరలపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ దఫా అలాంటి వ్యతిరేకతకు చాన్స్ లేకుండా స్థానికంగా చీరలు తయారు చేయిస్తున్నది సర్కార్. ఈ మేరకు చీరల తయారీ ఆర్డర్ సిరిసిల్లకు దక్కింది. జిల్లాలోని కార్మికక్షేత్రంలో కార్మికులకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది సిరిసిల్ల, సమీపంలోని సుమారు 30 వేల పవర్లూం యూనిట్లకు (సొసైటీలు, వ్యక్తిగత మగ్గాలను కలిపి) రూ. 222.48 కోట్ల విలువైన చీరల తయారీ బాధ్యతను అప్పగించింది. ఈ ఏడాది కూడా రూ. 280 కోట్ల విలువైన 97 లక్షల చీరలను సిరిసిల్లలో తయారుచేశారు. ఇదిలా ఉంటే చీరల కోసం దాదాపు 7 కోట్ల మీటర్ల వస్త్రం తయారు చేశా రు నేతన్నలు. జిల్లాలోని 25 వేల మరమగ్గాలు 5 నెలల పాటు ప్రతిరోజు పనిచేసి టార్గెట్‌ని పూర్తిచేశారు. ఈ దఫా వేడుకల బతుకమ్మ చీరల తయారీ వల్ల 20 వేల మందికి ఉపాధి దొరికింది.

వలస పక్షులు సొంతగూటికి..

గత ఏడాది సమయం లేక సగం మాత్రమే చీరలు నేసిన సిరిసిల్లా నేత కార్మికులు ఈసారి 90 లక్షల చీరల ఆర్డర్ లభించడంతో చేతినిం డా పని దొరికింది. ఉదయం రాత్రి వరకు పని చేసైనా నిర్ణీత సమయానికి చీరలను అందించాలనే ఉద్దేశంతో ఆసాములు, వస్త్ర ఉత్పత్తిదారులు గతంలో ఇక్కడే ఉండి వలస వెళ్లిన కార్మికులను రప్పించుకున్నారు. బతుకుదెరువు కోసం ఒకప్పుడు వలస పోయి న కార్మికులు.. ఇప్పుడు తిరిగి వస్తుండడంతో నేతన్నల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవు తున్నది.

ఉరితాళ్లు-పురివిప్పుకుని..

ఒకప్పుడు సిరిసిల్లా అంటే ఉరిసిల్లాగా పేరుపడింది. సరైన ఉపాధిలేక, పనులు దొరక్క అనేకమంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ వచ్చేనాటికి 432 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. అయితే తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు. కుటుంబాల్లో వెన్నెల కురిపించింది. ఉపాధి లేక వల సపోయిన వారిని సొంత ఇంటికి మళ్లించిం ది. వారికి రోజు చేతినిండా పని కల్పించి ఆత్మహత్యల ఆలోచన పక్కనపెట్టి.. పనిపై నిమగ్నమయ్యేలా ప్రోత్సహించింది. ఒకవైపు బతుకమ్మ చీరలతో పాటు రాజీవ్ విద్యా మిషనుకు కావాల్సిన బట్టను ప్రభుత్వం ఇక్కడినుంచే కొనుగోలు చేస్తోంది. కోటి ఇరవై లక్షల మీటర్ల బట్టను కొని కార్మికులకు ఉపాధి కల్పించింది.

ఆధునిక మగ్గాలు

గతంలో చాలామంది నేత కార్మికులు తమ మగ్గాలను ఆధునీకరించుకోవడం అన్నది వేలాది రూపాయాలతో కూడుకున్న పని. కానీ తెలంగాణ వచ్చాక ప్రభుత్వం భారీ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు అక్కడున్న మరమగ్గాలను ఆధునీకరించటంపై దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వారి మరమగ్గాలను ఉచితంగా ఆధునీకరిస్తున్నారు. ఎక్కడైనా పోగు తెగితే గతం లో చీర మొత్తం పాడయ్యేది. అయితే ఇప్పుడు మగ్గం ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాటు చేయించింది ప్రభుత్వం. ఇప్పటివరకు రూ. కోట్లకుపైగా వెచ్చించి, సుమారు 7-8 వేల మగ్గాలను ఆధునీకరించారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు, ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా ప్రభుత్వమే చూపిస్తున్నది. దీంట్లో భాగంగా జూకీ మిషన్లపై దుస్తులు కుట్టడంపై శిక్షణ ఇస్తున్నారు.

పూర్తిస్థాయిలో నిఘా

సిరిసిల్లా నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఎవరైనా వస్త్ర వ్యాపారులు సూరత్, భివండి, షోలాపూర్, ముంబై వంటి ప్రాంతాల నుంచి చీరల బట్టను దిగుమతి చేస్తారనే అనుమానంతో అధికారులు బతుకమ్మ చీరల ఉత్పత్తిపై నిఘా ఉంచారు. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ నుంచి సిరిసిల్లలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జౌళిశాఖకు చెందిన ఏడు బృందాలతో వార్పిన్ యూనిట్లపై నిఘా ఉంచారు. చీరల ఉత్పత్తి వివరాలను నమోదు చేశారు. 20 మంది సాంకేతిక సిబ్బంది చీరల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఉత్పత్తి అయిన చీరల బట్టను ఎప్పటికప్పుడు సేకరిస్తూ.. గోదాములో నిల్వ చేశారు. రేయింబవళ్లు సాంచాలు ఆగకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగింది, శ్రమ అధికమైనా మెరుగైన వేతనాలు రావడంతో కార్మికులు ఉత్సాహంతో పనిచేశారు.

12 నుంచి పంపిణీ

రాష్ట్రంలో కోటి 20 లక్షలకు పైగా ఉన్న పేద మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయారు చేయించింది ప్రభుత్వం. ఈ చీరలు ఉత్పత్తి కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఆ తరువాత జిల్లా కేంద్రం నుంచి రేషన్ షాపులకు చీరలను పంపుతారు. రేషన్ షాపుల్లో అక్టోబర్ 12 నుంచి మహిళలకు పంపిణీ చేస్తారు. సదరు మహిళ షాపుకు రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లిగానీ, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. రేషన్ షాపుల్లో ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా పొటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.
Bathukamma-sarees3

కేటీఆర్ ముందుచూపు

బతుకమ్మ చీరల తయారీని ఈసారి పూర్తిగా తెలంగాణలోనే చేపట్టాలనే లక్ష్యాన్ని హాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ మంత్రి కె.తారకరామరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి అనుగుణంగా తన నియోజకవర్గం అయిన సిరిసిల్లా నేత కార్మికులను సిద్ధం చేశారు. దానికోసం మూడు నెలల ముందే చీరల తయారీని ప్రారంభించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అడపడుచులకు చీరలు అందించడంతోపాటు నేతన్నలకు ఉపాధి కల్పించాలనే ద్విముఖ వ్యూహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 95 లక్షల చీరల తయారీతో.. సిరిసిల్లలోని 20 వేల మంది మరమగ్గ కార్మికులకు, 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించింది. దీనివల్ల గతంలో నెలకు రూ.7 వేల ఆదాయం సంపాదించిన నేతన్నలు ఇప్పుడు రూ.22 వేల వరకు సంపాదించారు. కార్మికులందరూ సంతోషంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తొమ్మిది గజాల చీరలు కూడా కడుతారని, నిరుడు వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈసారి 8లక్షల చీరలను ప్రత్యేకంగా తొమ్మిది గజాల నిడివి ఉండేలా తయారుచేయించామన్నారు. మొత్తం చీరల తయారీ కోసం రూ.280 కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెల్లకార్డు ఉండి 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ చీరలను అందిస్తాం. మొత్తం 80 రంగుల్లో చీరలను తయారుచేశామని, ఇవి చేనేత చీరలు కావని, జరీ అంచు ఉన్న పాలిస్టర్ చీరలని తెలిపారు. వీటన్నింటినీ కూడా సిరిసిల్లలోని మరమగ్గాలపై తయారుచేయించామని ఆయన చెప్పారు. నాణ్యతలో రాజీపడటం కానీ, ఎలాంటి అసంతృప్తి తలెత్తకుండా ఉండేలా.. తయారీకి ముందుగానే మహిళా సంఘాలు, వివిధ వర్గాల మహిళల అభిప్రాయాలను తీసుకున్నామని ఆయన చెప్పారు.
Bathukamma-sarees4

చేతినిండా పని

మండల లక్ష్మీరాజం, చేనేత కార్మికుడు
ఒకప్పుడు పని దొరకడమే కష్టమైతుండే. ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్‌తో చేతినిండా పని దొరికింది. ప్రభుత్వం ప్రతి ఏడాది ఇక్కడికే ఆర్డర్ ఇస్తే మా బతుకులు బాగుపడుతయి. ప్రభుత్వం చేస్తున్న ఈ సహకారం వల్ల వారానికి రెండు వేలు సంపాదించుకునే కార్మికుడు ఇప్పుడు నాలుగువేలు సంపాదించుకోగలుగుతుండు. ఉపాధి ఇట్లనే ఉంటే చేనేతల బతుకులు బాగుపడుతయి.

ఆమె కృషి అమోఘం

బతుకమ్మ చీరల తయారీలో జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్‌ది కీలక పాత్ర. చీరల నాణ్యత విషయంలో గానీ, రంగుల విషయంలో గానీ ఆమె ఎక్కడ రాజీ పడలేదు. గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోగానే ఆమె ముంబై, సూరత్ వంటి ప్రాంతాలను సందర్శించి అనేక రకాల చీరలను ఆమె సేకరించ గలిగారు. తక్కువ సమయంలోనే కావలసిన సంఖ్యలో చీరలను అందించడంలో ప్రత్యేక కృషి చేశారు. ఈసారి కూడా అంతే జాగ్రత్తతో వ్యవహరించారు. సిరిసిల్లాలో నేస్తున్న చీరలను ఎప్పటి కప్పుడు పరిశీలించడం, నాణ్యత విషయంలో సలహాలు ఇవ్వడం, ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘాను ఏర్పాటు చేయడం ద్వారా సకాలంలో బతుకమ్మ చీరలు నేతకు నోచుకొని తెలంగాణ ఆడపడుచుల చేతికి చేరుకోగలిగాయి.
Bathukamma-sarees5

ప్రభుత్వ ప్రోత్సాహం మరవలేనిది

లగిశెట్టి శ్రీనివాస్, పవర్‌లూం యాజమాని. సిరిసిల్లా.
రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో బతుకమ్మ చీరలు నేస్తున్నాం. గడచిన మూడు నెలలుగా అన్ని లూమ్స్ బతుకమ్మ చీరలనే నేశాయి. అందువల్లే అనుకున్న టార్గెట్‌ను పూర్తి చేయగలిగాం. నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీపడకుండా సూపర్ క్వాలిటీని ఇవ్వగలిగాం. దీనిద్వారా కార్మికుల్లో మరింత నైపుణ్యం పెరిగింది. ప్రభుత్వ అధికారులు నిరంతరం పర్యవేక్షించడం ద్వారా సమయానికి లక్ష్యానికి చేరుకున్నాం. ఇక్కడున్న కార్మికులతో పాటు ఇతర జిల్లాల్లో స్థిరపడ్డ కార్మికులకు కూడా ఉపాధి లభించింది. సుమారు 27 వేల మగ్గాలు నిరంతరం పనిచేయడం ద్వారా 20 వేల మందికి లబ్ధి చేకూరింది. ఒక్కప్పుడు కేవలం 7-8వేలు సంపాదించుకునే వారు ఇప్పుడు 16-25 వేల వరకు సంపాదించుకోగలిగారు. అలాగే ఇతర రాష్ర్టాలకు అవసరమైన వస్త్ర ఉత్పత్తని సిరిసిల్లకు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపితే ఏడాదంతా ఉపాధి లభించినట్లవుతుంది.

నాణ్యతకు పెద్దపీట

ఈ చీరల తయారీలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది. ముఖ్యంగా టెక్స్‌టైల్ డైరెక్టర్ శ్రీ శైలజా రామయ్యర్ అధ్వర్యంలో వందలాది చీరల డిజైన్లను తయారు చేయించారు. ఈ డిజైన్ల నుంచి మహిళా ఉన్నతాధికారులు, ఇతర అధికారిణులు పలు చీరలను ఎంపిక చేశారు. మహిళల అభిరుచి మేరకు ఈ బతుకమ్మ చీరల డిజైన్ ఎంపిక జరిగింది. పండగ నాడు అందరు మహిళలు ఒకే విధంగా కన్పించకుండా సూమారుగా 500లకుపైగా డిజైన్లు, పలురకాల రంగుల్లో ఈ చీరలు తయారు అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వస్ర్తాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధతీసుకున్నారు.

అందరికీ ఉపాధి

సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంచుకున్న బృహత్తర పథకం బతుకమ్మ చీరల పథకం. గతేడాది చీరల తయారీలో సుమారు 25 వేల మంది పాలుపంచుకున్నారు. 56 సొసైటీల పరిధిలో వీరంతా మూడు నెలలపాటు శ్రమించారు. కార్మికులు, ఆసాములు, యజమానులు, ఆటోవాలాలు, ట్రాన్స్‌పోర్టు యజమానులు, హమాలీలు రోజు ఉదయం 6గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పని చేశారు. గతంలో కన్నా రెట్టింపు కూలీ లభించడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. నాడు అరకొరగా వేతనాలు పొందినా, నేడు ఒక్కొక్కరు కనీసం 20 వేల నుంచి 30 వేల దాకా సంపాదించారు. 1500 మంది ఆసాములు, యజమానులు, 900 మంది సొసైటీ సభ్యులూ లబ్ధి పొందారు. క్షేత్రస్థాయిలో శ్రమించే కార్మికులకు రెట్టింపు స్థాయిలో కూలి చెల్లించారు.
Bathukamma-sarees6

80 రంగుల్లో చీరలు..

సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశారు. గతే డాది బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తిచేసినా.. గడువులోగా పూర్తి స్థాయిలో చీరల వస్త్రం అందలేదు. 45 లక్షల చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయగా, మరో 55 లక్షల చీరలను సూరత్ నుంచి టెండర్ ద్వారా కొనుగోలు చేశారు. గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ.. మొత్తం ఆర్డరును సిరిసిల్ల నేతన్నలకు అందించారు. దీంతో జరీ అంచుతో కూడిన నాణ్యమైన చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేశారు. 20 వేల పవర్లూమ్స్,14 వేల మగ్గాలపై ఉత్పత్తి సాగింది. మొత్తం 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసి సమయానికి అందించగలిగారు.

పోటోలు: గడసంతల శ్రీనివాస్
ఆర్. సంతోష్‌కుమార్, సిరిసిల్ల

1226
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles