ఫలాస్వాదన


Sun,September 2, 2018 01:02 AM

Mango-trees
జీవితం చాలా గంభీరమైంది. పరిశీలన, పరిశోధన, పరస్పర అవగాహన మనిషికి చాలా అవసరం. కానీ ప్రతీ విషయంలోనూ విపరీతంగా ఆలోచించి, శోధించి సాధించాలనుకుంటే జీవితతత్వం తారుమారు అవుతుంది. బంధాలనూ, మానవీయ కోణాలనూ, సామాజిక బాధ్యతనూ ఆచితూచి ఆలోచించి బలపరుచుకోవాలే గానీ విశ్లేషణ చేస్తూ కూర్చుంటే అవి మనకు తెలియకుండానే మన జీవితం నుంచి తప్పుకుంటాయి. మనల్ని ఏమీ చేయలేని అచేతనావస్థకు చేరుస్తాయి. కాబట్టి జీవితాన్నే, అదిచ్చే ప్రతీదాన్నీ స్వాభావికంగా అంగీకరిస్తూ బతకాలి. ప్రతీ కోణాన్నీ పరిశీలనాత్మకంగా చూడాలనుకోవడం పొరపాటు. జీవితం అమృతమయమైన, మధుర సభరితమైన మామిడిపళ్ళ లాంటిది. వాటిని ఆస్వాదించాలేగానీ ఆరాతీయకూడదనే విషయాన్నే తెలియజేస్తుందీ కథ. ఆరాలు తీయడం, ఆర్భాటాలకు పోవడం, అతి సామాన్యమైన విషయాన్నీ అంతర్లీనంగా పరిశోధించడం, ప్రతీ దానికి లెక్కలు వేయడం లాంటి వాటితో అసలు రుచిని ఆస్వాదించలేకపోతున్నామనే వాస్తవాన్ని సులువుగా తేల్చేసిందీ కథ.
-ప్రమద్వర

ఒకానొక అందమైన పల్లెటూరు. పచ్చని ప్రకృతికి నెలవావూరు. పండ్లూ పూదోటలు, ధాన్యం కొబ్బరితోటలు ప్రతీ అడుగూ నిండుగా పచ్చదనంతో సస్యశ్యామలమై ఉండేది. అయితే ఆ వూరు మామిడిపండ్ల తోటలకు ప్రసిద్ధి. విరివిగా కాసే ఆ మామిడిపండ్లు రుచి చూడటానికీ వాటి పెంపకాన్ని గురించి తెలుసుకోవడానికి చాలా దూరాల నుంచి ఎందరో వస్తుండేవారు. ఆ పండ్ల తోటల్లో ఆంక్షలు లేవు. స్వేచ్ఛగా అందరూ తిరిగి చూడొచ్చు. పండ్లను కోసినా అడ్డుపడేవారు లేరు. ఒకనాడు ఆ ఊరికి ఒక పర్యావరణ పరిశోధక బృందం వచ్చింది. వారంతా మామిడి తోటల ప్రత్యేకతను తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. వారిలో ప్రతీ ఒక్కరూ మామిడి చెట్లనూ, చెట్ల కొమ్మలనూ, పండ్లలోని రంగులనూ, రకాలనూ, పండ్ల పరిమాణాల్లోని భేదాలనూ, ఆకులనూ, చెట్టుకీ చెట్టుకీ మధ్య విభిన్నతలనూ తరచి తరచి చూస్తూ పరిశోధనాత్మకంగా చర్చించసాగారు. ఒకతను మాత్రం బాగా పండిన మామిడి పండ్లను రెండు మూడు రకాల చెట్ల నుండి సేకరించి తృప్తిగా తిన్నాడు. మధురత్వం అనేది పండ్లలో ఉంటుంది. వాటిని తృప్తిగా తింటేనే ఆస్వాదన లభిస్తుంది. అవెంత మేలు రకమో ఇట్టే తెలిసిపోతుందని వారితో చెబుతాడు. ఈ ఊరి తోటల్లోని మామిడిపండ్లకు పేరు కాని ఆయా చెట్టు రకాలకు కాదు. పైగా పండు రుచి అమోఘమైనప్పుడు దాని పూర్వాపరాల గురించి ఆరా తీయడంలో అర్థం లేదని అంటాడు.

ఆ వ్యక్తి అంటాడు, పండును గురించి ఆరా తీస్తూపోతే పండును ఆస్వాదించడం అసాధ్యమన్నాడు. కాబట్టి చెట్లలోని వైవిధ్యాన్ని గుణించడం, తరచి చూడటం మానేసి అందరూ తృప్తిగా మామిడిపండ్లను ఆరగించండి. ఫలాస్వాదన అనుభవం ఎంత గొప్పగా ఉంటుందో మీకే తెలుస్తుందని వారంతా అలాగే చేసి తృప్తి చెందుతారు.జీవితం కూడా అంతేననీ, బతకాలనుకున్నప్పుడు జీవితం అందించే ప్రతీ మలుపునూ, అంగీకరిస్తూ లెక్కలు వేయకుండా ఆరాలు తీయకుండా ఎటువంటి పరిస్థితులలోనైనా జీవిత దృక్పథాన్ని అర్థం చేసుకొని జీవితమనే పక్వఫలాన్ని ఆస్వాదించేదాకా పూర్తిగా అనుభవించేదాకా అసలైన మాధుర్యం అందబోదనీ మామిడిపండ్లను జీవితానికి ఆపాదిస్తూ అక్కడున్న వారందరికీ వివరిస్తాడా వ్యక్తి.

జీవితమనే ఫలాస్వాదన పొందాలంటే లోకం ఎన్నో మార్గాలను సూచిస్తుంది. వాటన్నింటి ఆదర్శాలు భిన్నంగానే ఉంటాయి. మన ఆలోచనలనూ, మనలోని అత్యుత్సాహాన్ని పరిశోధనాత్మకంగా పరుగెత్తిస్తాయి. కానీ వాటన్నింటి గొడవలోపడి మధుర ఫలాలను తినలేకపోతున్నాము. జీవితాన్ని స్వాభావికంగా, కాలానుగుణంగా అంగీకరిస్తే, అసలైన శాంతినిచ్చే సంతృప్తి నిచ్చే ఆస్వాదన మధురమై అలరారుతుంది. అందుకే అనవసర తర్కవితర్కాలు మాని ఫలాస్వాదన చేయడంలోనే జీవన మాధుర్యం ఒదిగి ఉంది.

జీవితం కూడా అంతేననీ, బతకాలనుకున్నప్పుడు జీవితం అందించే ప్రతీ మలుపునూ, అంగీకరిస్తూ లెక్కలు వేయకుండా ఆరాలు తీయకుండా ఎటువంటి పరిస్థితులలోనైనా జీవిత దృక్పథాన్ని అర్థం చేసుకొని జీవితమనే పక్వఫలాన్ని ఆస్వాదించేదాకా పూర్తిగా అనుభవించేదాకా అసలైన మాధుర్యం అందబోదనీ మామిడిపండ్లను జీవితానికి ఆపాదిస్తూ అక్కడున్న వారందరికీ వివరిస్తాడా వ్యక్తి.

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles