ప్రాయశ్చిత్తం


Sun,May 13, 2018 12:50 AM

సమయం ఉదయం ఏడు కావస్తున్నది. చలికాలం, అందులోనూ వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా గడచిన నెల రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్‌లో కూడా ఉదయం తొమ్మిది దాటితే కానీ బయట తిరగలేని పరిస్థితి. కానీ బతుకుతెరువు కోసం ఏదో ఒక పనిచేసే జనం మాత్రం తమ రోజువారీ పనుల కోసం రోడ్డెక్కారు. కూకట్‌పల్లి జెఎన్‌టీయు ప్రాంతం. జనం పలుచగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్‌బస్సులు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దీంతో రోడ్డంతా బస్సులతోనే నిండిపోయింది. ఆర్‌టీసీ బస్సులు, ఇతర వాహనాలు వెళ్ల డానికి కూడా వీలు లేకుండా ట్రావెల్‌బస్సులు రోడ్డంతా ఆక్రమించాయి. ద్విచక్ర వాహనదారులు కూడా ఒక్క అడుగు ముందుకు సాగడానికి రెండు మూడు నిమిషాలు పడుతున్నది. నెల్లూరు నుంచి వచ్చిన బస్సు జేఎన్‌టీయు ఎదురుగా ఆగింది. దిగాల్సిన వాళ్లు తమ బ్రీఫ్‌కేసులు, బరువైన సంచులు పట్టుకుని దిగుతున్నారు. కానీ ఒక నడివయస్సు వ్యక్తి మాత్రం చేతి సంచితో దిగాడు. తెల్లని షర్టు, తెల్ల పంచె, భుజం మీద టవల్, చేతిలో సంచి తప్ప ఆయన దగ్గర మరేం లేవు. ఆయన దిగి ఎదురుగా ఉన్న టీ స్టాల్ వైపు నడిచాడు. మూసాపేట నుంచి కూకట్‌పల్లి మీదుగా పటాన్‌చెరువుకు వెళ్దామని బయలు దేరిన నాకు ఈ ట్రాఫిక్ ఒక పద్మవ్యూహంలా కనిపించింది. ఒక స్నేహితుణ్ని కలుద్దామని తెల్లారుజామునే వెళ్లి తిరిగి వద్దామనుకున్న నేను అర్ధగంట గడిచినా ఇంకా కూకట్‌పల్లి దాటక పోయేప్పటికీ ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. జేఎన్‌టీయు దగ్గర్లోనే పది నిమిషాలుగా నా బైక్ కనీసం పది అడుగులు ముందుకు సాగలేదు. అప్పుడే అక్కడ ఆగిన నెల్లూరు బస్సును చూడగానే నాతో కలసి పనిచేసిన మిత్రుడు సురేష్ గుర్తుకు వచ్చాడు. నేను చాలాసార్లు అమీర్‌పేట వరకు వచ్చి అతణ్ని నెల్లూరు బస్సు ఎక్కించిన విషయం గుర్తొచ్చి నవ్వుకున్నా.

నా వెనుక బైకతను హారన్ కొట్టగానే ఈ లోకంలోకి వచ్చిన నేను బైక్‌ను మరో రెండడుగులు ముందుకు కదిలించా. అప్పు డే బస్సు దిగుతున్న ఆ పెద్దాయన నా కంట పడ్డాడు. ఏదో పనిమీద ఇక్కడికి వచ్చినట్లున్నాడు అనుకుంటుండగానే ట్రాఫిక్ ఈసారి కొంచెం ఎక్కువగానే కదిలింది. ఆలోచనల నుంచి తేరుకొని ముందుకు సాగాను. సరిగ్గా ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓ ఆదివారం పూట హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కవి సమ్మేళనం ఉంటే వెళ్లి వస్తున్న. ఆదివారం కావడంతో రోడ్లమీద పెద్దగా జనం లేరు. నేను హిమాయత్‌నగర్ దాటి సెక్రటే రియట్ ముందు నుంచి హుస్సేన్‌సాగర్ మీదుగా వెళ్తున్నా. సాయంత్రం ఐదు కావస్తున్నది. వాతావరణం చల్లగా ఉండడంతో పాటు పరిసరాలు గమ నిస్తూ బైక్‌ను స్లోగా నడుపుతున్న. సెక్రటేరియట్ దాటి ఎన్టీఆర్ గార్డెన్ ఎంటర్ అవడంతోనే కనిపించిన అక్కడి దృశ్యం నన్ను ముందుకు సాగనివ్వలేదు. వారం క్రితం కూకట్‌పల్లిలో కనిపించిన వృద్ధుడు. అదే పంచె, అదే చేతి సంచి....ఈయన ఇక్కడెందుకున్నడబ్బా? నా మస్తిష్కం ప్రశ్నల దాడి మొదలు పెట్టింది. ఆశ్చర్యంతో కూడిన అనుమానం నా బైక్‌ను ముందుకు సాగనివ్వలేదు. బైక్ పక్కనే పెట్టి అతణ్నే గమనిస్తూ దగ్గరికి వెళ్లా....ఆయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఎటో చూస్తున్నాడు. నేను వెళ్లి ఆయన పక్కనే కూర్చున్న.ఎక్కడ స్థలం లేనట్లు నా పక్కనే కూర్చో వాలా? అన్నట్లు నన్ను తేరిపారా చూసి కొంచెం సర్దుకుని కూర్చున్నాడు. ఇద్దరి మధ్య రెండు నిమిషాలు మౌనం. మా మౌనాన్ని డిస్ట్రర్బ్ చేస్తూ ఓ యువకుడు రోడ్డు మీద వెళ్తూ అదే పనిగా హారన్ కొడుతున్నాడు.నాకు అర్థం కాలేదు కానీ ఆ పెద్దాయన ఏదో గొణుగుతున్నాడు. ఇలా అయితే మా మధ్య మౌనమే మిగులుతుందని నేను పలకరించడానికి సిద్ధమయ్యా....ఇంతలో...టైమెంతవుతుంది బాబు ఆయనే నిశ్శబ్దాన్ని ఛేదించాడు.
Story

చేతికున్న వాచీ వంక చూసి ఐదున్నర అని చెప్పా. మళ్లీ మౌనం.... ఈసారి నేనే తెరదించా..అవును మీ పేరేమిటీ? ఆయన ఒక్కసారి చెప్పాలా వద్దా? అన్నట్లు నన్ను పైకి కిందికి చూశాడు. తరువాత తన చూపును తిప్పుకుంటూ ఈశ్వరయ్య ముక్తసరిగా చెప్పాడు.
ఎక్కడుంటారు? నా ప్రశ్న.ఇక్కడే సమాధానం.ఇక్కడే అంటే.....ఈ పుట్‌పాత్ మీదనే, అప్పుడప్పుడు ట్యాంక్‌బాండ్‌మీదనో, ఇందిరాపార్కులోనో. నిరుత్సాహంగా సమాధాన మిచ్చాడు.అవునా? ఎందుకలా? మీకు ఎవరు లేరా? ఉత్కంఠగా అడిగా.పెదవి దాటని చిరునవ్వొకటి నవ్వి నిట్టుర్చాడు. ఏమన్నా చెబుతాడనుకున్నా కానీ చెప్పలేదు.నిజంగా మీకెవ్వరూ లేరా? మళ్లీ అడిగా.ఎందుకు బాబు తెలుసుకుని నీవు చేసేదేముంది. చెప్పి నేను పొందేదేముంది ఇష్టం లేనట్లుగా అన్నాడు.అదేం లేదు. నా వల్ల ఏదన్నా సాయం చేసే అవకాశం ఉంటే చేస్తాగా అని ఏం సాయం చేస్తావు బాబు. చెదిరిన నా కలలను తీసుకొస్తావా? చిరిగిన నా జీవితాన్ని అతికిస్తావా? ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన నా గుండెను తడిచేస్తావా? వర్షిస్తున్న కళ్ల నుంచే ఆయన దుంఖం పొంగుకొచ్చి ప్రశ్నించిన తీరుకు ఆశ్చర్యంతోపాటు గుండె బరువెక్కిన ఫీలింగ్ కలిగింది. రెండు నిమిషాలు ఏం మాట్లాడలేక పోయా. ఆయన భుజానికున్న టవల్ తీసుకుని కళ్లు తుడుచుకున్నాడు. తిరిగి అతనే ఏదో ఆవేశంలో అన్నాను బాబు. నిన్ను అనాలని కాదు అన్నాడు.ఫర్వాలేద్సార్. మీరు పెద్దవాళ్లు ఏదో బాధలో అన్నారులే. అయినా ఎవరికన్నా చెప్పుకుంటేనేగా మన మనస్సు తేలిక పడు తుందంటారు. మీలో మీరే బాధపడితే ఎలా సార్? ఏదో గొప్ప ఉపదేశమిచ్చినట్లు చెప్పా.ఏం చెప్పమంటావు బాబు. అందరినీ దూరం చేసుకుని ఒంటరినయ్యానని చెప్పనా? అందరూ ఉన్నా ఎవరు లేని అనాథునయ్యానని చెప్పనా? ఏం చెప్పను మళ్లీ అదే ప్రశ్నతో కూడిన సమాధానం.మీరు ఏదో బాధలో ఉన్నట్లున్నారు. మనసు తేలిక చేసుకుని చెప్పండి. నా వల్ల అయ్యే సాయం చేస్తా. ముందు మనం ఒక టీ తాగుదాం అని అటు ఇటు చూశా. దగ్గర్లోనే టీ అమ్ముతున్న వ్యక్తి కనిపించాడు.హలో, ఓ టీ బాబూ ఇటు రా పిలిచా. అతను వచ్చి రావడంతోనే ఎన్ని సార్? అడిగాడు. రెండివ్వు నేను.

పది రూపాయాలు చిల్లర ఉందా సార్? అడిగాడతను టీ ఇవ్వకుండానే.ఉన్నాయిలే ఇవ్వు జేబులో నుంచి పది రూపాయలు తీసిస్తూ చెప్పా. అతను టీ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇద్దరం టీ తాగాం.ఇప్పుడు చెప్పండి. మీ మనసు తేలికవుతుంది. అన్నీ మరిచిపోయి హాయిగా ఉండొచ్చు అన్న.నాకు చెప్పడం ఇష్టం లేకున్నా..నువు ఇంతగా అడుగుతున్నావు కనుక చెప్తున్న. మాది నెల్లూరు జిల్లా మూత్కూరు. పెద్దగా ఉన్న కుటుంబమేం కాదు. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే. వాళ్లు ఇచ్చిన పాత ఇల్లు తప్ప ఏం లేదు. చిన్నతనంలోనే అమ్మానాన్న చనిపోవడంతో పదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. దూరపు బంధువులు ఉన్నా నన్నెపుడూ చేరదీయలేదు. నేనూ వాళ్లను చేయి జాపి అడగలేదు. అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. కడుపు నింపుకోవడం కోసం ఏ పనిదొరికితే అది చేసా. ఎవరు ఎంతిచ్చినా తీసుకున్న. పదిహేనేళ్లకే నా రెక్కలు ముక్కలు చేసుకుని నా బతుకు నేను బతికా..... నాకు ఇరవై ఏండ్లు వచ్చేసరికి ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్న. సమద్రంలో చేపలు పట్టడానికి కాంట్రాక్టర్లు ఉండేవాళ్లు. రోజువారి కూలీకింద వాళ్లు మమ్మల్ని తీసుకుపోయేవాళ్లు. సముద్రం మీదకు పోయి ఒక్కోసారి వారం పది రోజులు అటే ఉండేటోళ్లం. అప్పుడే నేను ప్రేమగా మామా అని పిలిచే అప్పయ్య పరిచయమయ్యాడు. తొందర్లోనే ఇద్దరం మంచి దోస్తులమయ్యాం. ఆయన నాకంటే ఇరవై ఏండ్లు పెద్ద. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లను కూడా పదవ తరగతి వరకు చదివించి కుటుంబం గడవడమే కష్టమై చదువు మానిపించాడట. వాళ్లిద్దరూ బట్టలు కుట్టడం నేర్చుకుని ఇప్పుడు ఇంట్లోనే ఆడొళ్ల బట్టలు కుడుతూ వెన్నీళ్లకు చన్నీళ్లలా కుటుంబానికి సాయం చేస్తున్నరు. ఇట్లా ఉండగా ఒకసారి చేపల వేటకు వెళ్లినపుడు నాకు జ్వరం వచ్చింది. పాపం అప్పుడు అప్పయ్య మామే నన్ను చూసుకున్నడు. అప్పుడే నా పెళ్లి విషయం వచ్చింది.ఈశ్వరయ్యా! ఇక్కడంటే నేనున్నగానీ రేపు ఇంటికి పోయినంక జ్వరం తగ్గకపోతే ఎవరు చూసుకుంటర్ర అన్నడు.
ఎవరు చూసుకుంటరు మామా. నాకు నేనే చేసుకోవాలే. నాకెవ్వరున్నరు చెప్పు అన్న.

పెళ్లి చేస్కోరా? పెళ్లాం అన్నీ చేసి పెడుతది. నీకు జ్వరం వస్తే మందు లిస్తది. కడుపు నిండా ముద్దపెడ్తది. ముద్దు పెడ్తది వెటకారంగా అన్నడు.పో..మామా. నువ్వు భలే జోక్ లేస్తవు. నాకేమున్నదని పిల్లనిస్తరు చెప్పు. అన్న.నీకేందిరా బంగారం లాంటి మనిషివి. నీకు తగ్గట్టు ఎక్కడో ఎవరో పుట్టే ఉంటరురానీకు అడ్రస్ తెలిస్తే చెప్పు మామా, ఎక్కడ పుట్టిందో లేపుకొస్తా అరే ప్రతి మనిషికి ఎక్కడో ఒక దగ్గర రాసి పెట్టుంటదిరా. నేను చెప్పేది విను. పిల్లను చూసి పెళ్లి చేస్కో.మళ్లీ అదే మాటంటవు మామా. నాకెవ్వరిస్తరు చెప్పు మళ్లీ అడిగిన.
అదేందిరా అట్లంటవు. నీకేం తక్కువ. ఇల్లు పాతదైనా సొంతంది. ఇంట్ల అన్ని తెచ్చి పెట్టినవ్. ఇంకేం కావాలే.ఇల్లు, ఇంట్లో అన్ని ఉంటే పిల్లనిస్తరా మామ! అరె ఎందుకియ్యర్ర. నువ్వు ఒకడుగేసి చూడుసరే మామా ఎవరో ఎందుకు నీ బిడ్డనిస్తవా చెప్పు అనుకోకుండా నానోట్లోకొచ్చిన మాటను బయటకనేసిన.అప్పయ్య మామ అప్పటి వరకు నా పక్కన కూర్చున్నోడల్లా లేచి దూరంగా పోయిండు. అరే నేను ఆ మాట అనాల్సింది కాదు అనిపించింది. తప్పు చేసిన అని బాధనిపించింది. ఒంట్లో ఓపిక లేకున్నా లేచి మామ దగ్గరకు పోయి అది కాదు మామా నేను ఏదో తమాషాకు అన్న అంతేకానీ నిన్ను బాధ పెట్టాలని కాదు మామ బాధగా అన్న.అదేం లేదురా... రోజూ నిన్ను చూస్తున్నా ఈ ఆలోచన నాకెందుకు రాలేదా? అని ఆలోచిస్తున్నా రా? అన్నడు.మొదట నాకేం అర్థం కాలేదు. కానీ తరువాత అర్థమయ్యింది. ఆయన అనుకున్నట్లే నెలరోజుల్లో మా పెళ్లయింది. అప్ప య్య మామ పెద్ద బిడ్డ శివపార్వతిని నాకిచ్చి పెళ్లి చేసిండు. ఉన్నంతలో మంచిగ పెళ్లి జేసిండు.అట్లా ఐదేండ్లు గడచినయ్. నాకు మొదట పాప, తరువాత కొడుకు పుట్టిన్లు. కాలం ఆనందంగా సాగిపోతుంది. పాపకు పావనికుమారి అని, కొడుక్కు రాజేష్ అని పేరు పెట్టుకున్నం. పాప ఇంటర్ చదివినంక ఉన్న ఇల్లు అమ్మి పెండ్లి చేసి ఒకయ్య చేతిలా పెట్టిన. ఇల్లు అమ్మినంక అక్కడ ఉండబుద్ధి కాక కావలి వచ్చినం. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని దొరికిన కాడల్లా పనిచేసుకుంటా కుటుంబాన్ని పోషించిన. కొడుకు డిగ్రీ చదివిండు. అప్పుడే నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. పని చేసే దగ్గర పరిచయమైన వాళ్లంతా నాటుసారా తాగేటోళ్లు. మెల్లమెల్లగా నాకూ అలవాటయ్యింది. అదే నా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. అందర్నీ దూరం జేసింది అంటూ ముఖానికి చేతులు పెట్టుకుని తల మోకళ్ల మీద వంచుకుని ఏడ్వడం మొదలు పెట్టాడు.

ఒక్కసారిగా నా గుండె బరువెక్కినట్లయింది. చూస్తే తాగేవాడిలా లేడు. కానీ ఆనందంగా గడచిన జీవితంలో ఏం జరిగి ఉంటుంది? అన్న ప్రశ్నలు నన్ను వేధించసాగాయి. కొంత సమయానికి ఆయనే తేరుకుని సారా తాగుడు అలవాటయినంక నేను తాగి ఎక్కడ పడిపోయేవాణ్నో తెలిసేది కాదు. చాలాసార్లు మా రాజేష్, పార్వతి నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకుపోయారు. ఇగ తర్వాతర్వాత నన్ను పట్టించు కునుడు మానేశారు. ఎక్కడ ఉన్నానో, ఎక్కడ తిన్నానో కూడా తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వస్తే డబ్బుల కోసం నా భార్యను, కొడుకును తిట్టడం కొట్టడం చేసేవాణ్ని.రెండేళ్లు గడిచాయి. రాజేష్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. కూకట్‌పల్లిలో ఒక ట్రావెల్స్ ఏజెన్సీలో పనిచేస్తుండు. రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి కొంత డబ్బిచ్చి వెళ్లేవాడు. ఇదిలా ఉంటే నా భార్యకు ఆరోగ్యం చెడిపోయింది. రాజేష్ ఇచ్చే డబ్బు లు ఎక్కడా సరిపోలేదు. కొంతకాలం దాకా ఆ మందు ఈ మందు వాడి చివరకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించిన. కొడుకు హైదరాబాద్‌లో, భార్య ఆసుపత్రిలో అప్పుడు తెలిసింది నేనేంత తప్పు? తాగుడు మానేసి నా భార్యను బతికించుకోవడానికి దొరికిన కాడల్లా పనిచేశా. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆమె మందులు వాడుతూనే పోయింది. ఆయన చెప్తున్నంత సేపు కండ్లు వర్షిస్తూనే ఉన్నాయి. చెప్పడం ఆపేసి ఒక్కసారి ఊపిరి తీసుకుని కండ్లు తుడుచుకున్నాడు.ఆమె చనిపోయిన తర్వాత ఈయన కొడుకు దగ్గరకు వచ్చి ఉంటడు. ఆ కొడుకు ఈయనను చేరదీయ లేదనుకుంటా అని మనసులోనే డిసైడ్ అయ్యా. అయినా ఆయన నోటితోనే వినాలన్న ఆత్రుతతో అడిగా..ఆ తర్వాత ఏం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చేశారా?
లేదు బాబు. నా కొడుకు రమ్మన్నాడు. నా కూతురు రమ్మంది. ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత మన బిడ్డయిన పరాయి బిడ్డేకదా! అందుకే ఆమె దగ్గరకు వెళ్లలేదు. నిజం చెప్పాలంటే నా భార్య జ్ఞాపకాలు నన్ను అక్కడి నుంచి కదలనివ్వలేదు. ఇంట్లో వస్తువులలో నేను వండుకోవడానికి సరిపడా ఉంచుకుని కొంత కూతురుకు, కొంత కొడుక్కు ఇచ్చా. మూడు నెలలు గడిచింది. అక్కడక్కడ పనిచేసినా ఇంటి కిరాయి కట్టడానికే సరిపోలేదు. మిగిలిన గిన్నెలు అన్నీ అమ్మేసి నెల్లూరుకు పోయిన. అక్కడ దొరికిన పనల్లా చేసిన. పనిచేసేవాళ్లతోనే ఓ రూం తీసుకుని హోటళ్ల తినుకుంట ఉన్న. నా కొడుకును ఒక్క పైసా అడగలేదు. అడగాలనిపించలేదు. నేను వాళ్లకు చేసిన అన్యాయానికి తగిన శాస్తి జరిగిందని అనుకుంటా. అందుకే వాళ్లకు భారం కావద్దనే నా పని నేను చేసుకుంటా బతికిన. జీర గొంతుతో చెప్తున్నడు.

మరి హైదరాబాద్ ఎందుకు వచ్చినవ్. వారం కింద నిన్ను కూకట్‌పల్లిలో చూసిన. నీ కొడుకు అక్కడే ఉంటడన్నవు కదా! అక్కడే ఉండక మళ్లీ ఇక్కడికెందుకు వచ్చినవ్? అనేక అనుమానాలు ఒకే ప్రశ్నతో అడిగా.వాళ్లకు భారం కావద్దనుకున్నా కానీ, వాళ్లను కావద్దనుకోలేదు కదా! అందుకే నా కొడుకును చూడబుైద్దె కష్టపడి వెయ్యి రూపాయలు సంపాదించుకుని ఇక్కడికి వచ్చిన. రావడానికే 600 దాకా ఖర్చయినయి. కూకట్‌పల్లిలో దిగి వాడు పనిచేసే ట్రావెల్‌అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్లిన. కానీ వాణ్ని కలవలేదు. ఆ రోజంతా అక్కడే ఉన్న. వాడు ఎప్పుడో పొద్దున పది, పదకొండు గంటలకు ఆఫీసుకు వస్తండు. రాత్రి పదకొండు గంటలకు రూముకు పోతండు. మధ్యాహ్నం హోటల్ల తింటండు. పక్కనే ఉన్న వాళ్లను వాడు లేనపుడు అడిగిన రాజేష్ జీతమెంత అని. పన్నెండువేలు ఇస్తున్నరన్నరు. అందులో రూముకే మూడు నాలుగు వేలు, తిండికి మరో మూడు నాలుగు వేలు, ఇంకా ఖర్చులకు పోను వానికి మిగిలేదేం లేదు. అలాంటపుడు నేను వాని దగ్గర ఉంటే నా భారం పెరుగుతుంది. అందుకే వెళ్లలేదు అసలు విషయం చెప్పాడు.
అవునా! మరి ఎక్కడ తింటున్నవు? అడిగిన.ఇక్కడే రామకృష్ణ మఠం ఉంది కదా! అందులో రోజూ రూపాయిస్తే భోజనం పెడుతున్నరు. ఇగ పార్కు పక్కన నీళ్లు పోతుంటయ్ అక్కడ్నే స్నానం చేస్తున్న. చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయినయ్. అందుకే ఎక్కడన్నా పనిచేద్దామని తిరిగిన కానీ ఎవరూ పని ఇవ్వడం లేదు. నిన్న ఇందిరాపార్కు వెనుకున్న బ్రాందీ షాపు దగ్గర పనిచేస్తే వంద రూపాయలు వచ్చినయ్. ఇంతకు ముందే కూకట్‌పల్లి వెళ్లి రాజేష్‌ను చూసి వచ్చిన. ఇవాళ ఒంట్లో కొంచెం నలతగా ఉంటే బ్రాండీ షాపు దగ్గరకు వెళ్లబుద్ధికాక ఇక్కడ కూర్చున్న. గుండెభారంతో చెప్తున్న ఆయనను చూస్తే చాలా బాధేసింది.

వంద రూపాయలతో ఏం బతుకుతవ్. నీ కొడుకు దగ్గరకు పోవచ్చు కదా? వద్దుబాబు వద్దు. వాడికి భారం కావొద్దు. అంతేకాదు, నేను చేసిన పాపానికి ఇలా ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వండి. ఆయనలో పశ్చాత్తపం కనపడింది.సరే నేను ఏదన్నా వృద్దాశ్రమంలో చేర్పిస్తా. వస్తావా? అడిగా.లేదు బాబు. నా ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్లు ఎక్కడ దొరికితే అక్కడ పనిచేస్తా. నేను ఎవరికీ భారం కాకూడదు. కూర్చొని తినకూడదు. ఇగ ఆ బ్రాండీ షాపు వాళ్లే రేపటి నుంచి రాత్రి కూడా పక్కనే రూంలో పడుకోమన్నరు. నాకింకేం కావాలే.అదికాదు ఈశ్వరయ్య గారు అందరూ ఉండి ఇలా...చెప్పాగా బాబూ నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అంతే.....నాకు చేతకాదు అనుకున్న రోజు నా కొడుకు దగ్గరకో, మీరన్నట్లు వృద్దాశ్రమంకో తప్పకుండా పోతా.... ఆయన చాలా దృఢంగా చెప్పాడు.ఇంకా నేనేం చెప్పిన వినే పరిస్థితిలో ఆయన లేడని అర్థమైంది. సరే ఏదో నాకు తోచిన సాయం చేద్దామని జేబులో నుంచి వందనోటు తీసి ఇవ్వబోయా.. బాబు నేను బీదవాన్నే కానీ అడుక్కు తినను. నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు పనిచేసే తింటా ముక్కుసూటిగా చెప్పాడు.
నా మనస్సు చివుక్కుమంది. నేను డబ్బులివ్వబోయి తప్పుచేసానా అనిపించింది. అది కాదండీ మీకు దేనికన్నా ఉపయోగపడుతాయ్.. అని చెపుతుండగానే లేచాడు.వద్దు బాబు... నన్ను అడుక్కునేవాణ్ని చేయకు అంటూ చెప్పులు తొడుక్కుని చేతిసంచి పట్టుకుని పుట్‌పాత్ దిగాడు. ఒక్కసారి వెనక్కు తిరిగి....బాబూ నా మనసు భారం దిగుతుందని నీకు నా విషయమంతా చెప్పా. మనసు కుదుటపడింది. ఇప్పుడు నాకు నేను పని చేసుకుని బతకగలనన్న నమ్మకం కుదరింది. ఇప్పుడు ఇంకా దృఢంగా ఉన్నా. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు... టైం తొమ్మిదవుతున్నది. నీ కోసం మీ ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తుంటరు. వాళ్లను మాత్రం దూరం చేసుకోవద్దు. వాళ్ల కంటే మనకు ఎవరూ ఎక్కువ కాదు. తొందరగా వెళ్లు.. అని చెప్పి తను ముందుకు సాగాడు.
ఏం మాట్లాడాలో తెలియక ఆయన వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయా....ఆయన కనుమరుగయ్యాక గానీ నేనీ లోకంలోకి రాలేదు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి నా బైక్ స్టార్ట్ చేశా.....

-మధుకర్ వైద్యుల, సెల్:9182777409

1052
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles