ప్రపంచంలోనే ఖరీదైన మామిడి!


Sun,March 17, 2019 01:43 AM

Japan-Mango
మామిడి పండ్లు ఎలా కాస్తాయి..? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏంటి పిచ్చి ప్రశ్న.. చెట్లకు కాస్తాయని తెలీదా! అంటారు. అయితే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మామిడి పండ్లు మాత్రం చెట్లకు కాయవు. కుండీల్లోని మొక్కలకు కాస్తాయి. అంతేకాదండోయ్.. ఇవి మనం పండించే మామిడి పండ్లకంటే 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. ఇన్ని వైవిధ్యాలున్నా ఈ మామిడి పండ్ల విశేషాలు మీ కోసం..

మనకి తెలిసి ఒక మామిడి మొక్క చెట్టుగా ఎదిగి కాయలు కాయాలంటే ఐదారు యేండ్లు పడుతుంది. దానికి మానవ శ్రమ ఎంతో అవసరం కూడా. అయితే.. టెక్నాలజీని అందిపుచ్చుకొని.. అద్భుతాలు చెయ్యడంలో ముందుండే జపాన్.. ఎన్నో యేండ్ల శ్రమ ఫలితాలను కొద్ది కాలంలోనే అనుభవిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ మియజాకీ మామిడి పండు. వీటిని స్థానికంగా రెడ్ మ్యాంగో, ఎగ్ ఆఫ్ సన్ అని పలు రకాల పేర్లతో పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన పండుగా మియజాకీ రికార్డులు బద్దలు కొట్టింది. ఇంత గొప్పగా చెప్పినా ఇదేదో.. పెద్ద పెద్ద చెట్లకు కాస్తుందని అనుకోకండి. ఎందుకంటే వీటిని చిన్న కుండీల్లో మాత్రమే పండిస్తున్నారు.

పెంపకంలో చాలా జాగ్రత్తలు!

ముఖ్యంగా ఈ మియజాకీ మామిడి పండ్లను పండించే పద్ధతి చాలా డిఫరెంట్. చిన్న కుండీల్లో మొక్కలుగా నాటుతారు. తర్వాత వాటికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు అన్నీ సేంద్రీయ పద్ధతిలోనే వాటికి పిచికారీ చేస్తారు. చీడ పీడలను రాకుండా జాగ్రత్తలు వహిస్తారు. మొక్కలు పెరిగి భూమిని తాకకుండా.. వాటి చుట్టూ వెదురు కర్రలను కడుతారు. తర్వాత ఈ మొక్కలు చెట్టుగా ఎదగకుండా కొమ్మలను కట్ చేస్తుంటారు. కొద్దికాలానికి అంటే పూత వచ్చే దశలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొమ్మలు పైకి వచ్చేలా తాళ్లతో పైకి కడుతారు. తర్వాత కొత్త కొమ్మలకు వచ్చే పూత రాలిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ మొక్కలకు ఎప్పుడూ సరిపడా నీరు, గాలి, వెలుతురు అందేలా చర్యలు తీసుకుంటారు. పూత కాయగా మారే దశలో ఒక్కో కొమ్మకు ఒకట్రెండు కాయలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఒక కొమ్మకు దాదాపు ఐదు నుంచి పది వరకూ పిందెలు వస్తాయి. వాటిల్లో మేలైన పిందెను కొమ్మకు ఉంచి.. మిగతా వాటిని తెంచేస్తారు. దీని వల్ల పెరిగే ఒక్క కాయ అయినా.. ఆరోగ్యంగా పెరుగుతుంది. పూతలేని కొమ్మలను కూడా తెంపేస్తారు. ఆ తర్వాత కొమ్మకు ఉన్న కాయలు బరువు మొక్కపై పడకుండా వాటిని కూడా పైకి తాడుతో కట్టేస్తారు.

చెట్టుమీదనే పక్వం..

మనకు అందుబాటులో ఉండే మామిడి కాయలను.. పండ్లుగా మార్చడానికి మనోళ్లు చాలా విష ప్రయోగాలు చేస్తుంటారు. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ మియజాకీ మామిడి పండ్లను మొక్క మీదనే పక్వానికి వచ్చే వరకూ ఉంచుతారు. అది పూర్తిగా తొడెం ఊడిపోయే వరకూ మొక్కకే ఉంటుంది. మధ్యలో దానిని తెంచడానికి వీలు లేదు. ఇందుకు వీలుగా వాటికి నెట్‌లు కడుతుంటారు. కాయలు పెరిగేటప్పుడు మచ్చలు, గీతలు పడకుండా సున్నితంగా ఉండే కవర్లు కూడా చుడతారు. కాయ పండుగా మారి.. రాలిపోయినప్పుడే దానిని మార్కెటింగ్ చేస్తారు. ఇవి చూసేందుకు సాధారణ మొక్కల్లాగానే ఉంటాయి. పండ్లు మాత్రం భళా అనిపిస్తాయి.
Japan-Mango1

15 రెట్లు తియ్యదనం..!

మన దగ్గర దొరికే మామిడి పండ్లకు.. జపాన్‌లో అరుదుగా పండించే పండ్లకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ మియజాకీ పండు 700 గ్రాముల వరకూ బరువు పెరుగుతుంది. అంతేనా.. రుచి కూడా 15 రెట్లు ఎక్కువే. అందుకే ఒక్కొక్క మామిడి పండు ధర దాదాపు 5వేల రూపాయల పైమాటే. వీటికి ఐరోపా దేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. వీటిని ఖరీదైన బహుమతులుగా కూడా అందిస్తుంటారు. ఇన్ని విశేషాలు చూసిన తరువాత మీకూ ఈ పండ్లను రుచి చూడాలని ఉందా? అయితే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. త్వరలో వీటిని భారత మార్కెట్లో విక్రయించే యోచనలో ఉన్నారు. అప్పుడు మాత్రం కాస్ట్ గురించి ఆలోచించకుండా కొని టేస్ట్ చేయండి.

మనకూ.. వారికీ ఇదే తేడా!

మన దగ్గర మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. డబ్బులకు ఆశపడి విష ప్రయోగాలు చేస్తుంటారు. మామిడి రైతుల దగ్గర పచ్చికాయలను, పక్వానికి రాని వాటిని కొనుగోలు చేసి.. మందులతో వాటిని పండిస్తారు. ఒక్క మామిడి పండే కాదు.. మన దేశ మార్కెట్‌లో దొరికే చాలా వరకు పండ్లను రసాయనాలతోనే పక్వానికి రాకముందు పండిస్తున్నారు. అందుకే మనం తినే పండ్లు రుచికరంగా ఉండవు. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు ధ్రువీకరించాయి కూడా. ఈ తరహా విధానానికి జపనీయులు చాలా విరుద్ధం. అందుకే చెట్టుమీదనే కాయను పండించి.. అధిక లాభాలు ఆర్జించడంతో పాటు.. ఆరోగ్యాన్ని అందరికీ పంచుతున్నారు.

- డప్పు రవి
సెల్: 9951243487

673
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles