ప్రచారోద్యమాలు


Sun,August 13, 2017 05:07 AM

social-mediaసమస్య ఒక్కటే ఉంటుంది. దానికి పరిష్కార మార్గాలు సవాలక్ష ఉంటాయి. ఒక్కోసారి పెను సమస్యలు ఉత్పన్నమైనా ఒక్క చిరునవ్వుతో చిత్తయిపోతాయి. ఉఫ్ఫ్‌మని ఊదేస్తే ఉత్తేజం రెట్టింపవుతుంది. మనసులో గట్టిగా అనుకుంటే అనుకున్నది నెరవేరుతుంది. అంటే.. ఆలోచించే విధానమే.. స్పందించే ధోరణే సకల సమస్యలకూ పరిష్కారమన్నట్టు. అది స్వీయ సమస్య కావచ్చు. సంసారానికి సంబంధించిందీ..
సమాజానికి సంబంధించిందీ కావచ్చు. ఆశ చిగురిస్తూ ఉండాలి. ఆశయం మొగ్గ తొడుగుతూ ఉండాలి. ఆలోచన నిత్య నూతనంగా ఉండాలి.

అలా ఉంటే.. మన ఆలోచన గొప్ప నినాదమై నిద్రపోతున్నవాళ్లను తట్టి లేపుతుంది. అంశం పట్ల అవగాహన కల్పిస్తుంది. మార్పు కోరేవాళ్లను చైతన్యపరుస్తుంది. అదే క్యాంపెయిన్ (ప్రచారోద్యమం) వైపు నడిపిస్తుంది. తెలంగాణ మార్పులో ఒక అడుగు ముందే ఉంటుంది. మొన్నటి రైస్‌బకెట్ నుంచి నేటి సిస్టర్స్ ఫర్ ఛేంజ్ వరకు మార్పు దిశగా నిన్నూ.. నన్నూ ఏకం చేస్తూనే ఉంది. సమాజ ప్రగతి కోసం ఉద్యమంలా కదిలి వస్తున్న క్యాంపెయిన్ ట్రెండ్స్‌పై ముఖచిత్ర కథనం.


హైదరాబాద్‌లోని ఒక ప్రశాంతమైన పార్క్ అది. ఓ ఉదయం పూట పార్క్‌లో కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్నాడు అనంత్. పార్క్‌లో తిరుగుతున్న ఓ బక్కచిక్కిన పెద్దమనిషి కనిపించాడతనికి.
అటూ ఇటూ తిరిగి అలిసిపోయిన పెద్దాయన అనంత్ పక్కనే వచ్చి కూర్చున్నాడు.
ఏం తాతా.. ఇలా అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా అంటాడు అనంత్.
ఈ వయసులో నాకెవడిస్తాడు పని. ఒకవేళ ఇచ్చినా నా వల్ల అవుతుందా అంటాడు పెద్దమనిషి.
ఇంతకీ ఏం చేస్తావ్ ఈ డబ్బుల్తో అని అనంత్ ప్రశ్నిస్తే.. ఇంటికాడ మా ఆడి మనిషికిస్తా. దానికి కండ్లు సరిగా కనిపించవు. ఆపరేషన్ చేయిద్దామంటే డాక్టర్ డబ్బులు కావాలన్నడు. నా దగ్గర లేవు. అందుకే ఈ పనిచేస్తున్నా బదులిస్తాడు.

ఓహో.. నీకే చేతగాదంటే నీకో పెళ్లామా ఇంకా అని ఎద్దేవాగా మాట్లాడతాడు అనంత్.
ఎప్పుడో పెండ్లప్పుడు మాటిచ్చిన. ఉన్నంత కాలం కంటికి రెప్పలా చూసుకుంటానని. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కదా అంటూ తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుంటూ అనంత్‌కు చెప్పాడు.

అనంత్‌కు ఓ నిమిషం పాటు ఏం మాట్లాడాలో అర్థంకాక.. సైలెంట్ అయిపోయాడు. ఆపరేషన్‌కు ఎన్ని డబ్బులు కావాలన్నారు డాక్టర్లు అడిగితే ఇరవై వేలు కావాలన్నారు అని చెప్పాడు పెద్దమనిషి.
ఇలా ఎన్ని రోజులు అడుక్కుంటే ఇరవై వేలు అవుతయ్.. నేను చెప్పినట్టు చేస్తవా? నీ సమస్య పరిష్కారం అవుతుంది అనంత్ అనగానే సరే సారూ అంటాడు.

అనంత్ తన ఫ్రెండ్ మూర్తికి ఫోన్ చేసి ఏదో విషయం చెప్పి.. రాక కోసం ఎదురుచూస్తుంటాడు.
ఒక చేతిలో ఒక మనీ బాక్స్.. ఇంకో చేతిలో ప్లకార్డు పట్టుకొని వచ్చాడు మూర్తి.
ఈ ప్లకార్డ్ పట్టుకుని కూర్చోమని చెప్పి.. పక్కన మనీ బాక్స్‌ను పెట్టారు.
అటువైపుగా ఒకమ్మాయి.. అబ్బాయి వస్తున్నారు. ప్లకార్డును చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. తర్వాత ఓ నలుగురు వచ్చారు. వాళ్లూ లైట్ తీస్కుని వెళ్లారు. అనంత్, మూర్తిలకు టెన్షన్ పట్టుకుంది.

అల్లంత దూరం నుంచి ఒక వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన చేతిని పట్టుకుని ఓ నాలుగు-ఐదేండ్ల అమ్మాయి నడుస్తున్నది. పెద్దాయన్ను దాటేసి వాళ్ల నాన్నకు ఏదో చెప్పి మల్లా వెనక్కి వచ్చింది. పెద్దమనిషి చేతిలో ఉన్న ప్లకార్డు చూసి.. వాళ్ల నాన్న దగ్గర ఫోన్ అడిగి ఓ సెల్ఫీ తీసుకున్నది. నాన్నను వంద రూపాయలు అడిగి మనీ బాక్స్‌లో వేసింది. అనంత్, మూర్తి ముఖాలు కాంతితో వెలిగిపోయాయి.

అలా ఒకరి తర్వాత ఒకరు ఇరగబడి ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. వంద, యాభై, పది ఇలా మనీబాక్స్‌లో వేశారు. ఆపరేషన్‌కు సరిపడే ఇరవైవేల రూపాయలు పోగయ్యాయి.
ఇంతకూ ఆ ప్లకార్డ్‌లో ఏముంది? సెల్ఫీ తీసుకునేంత సెలబ్రిటీ కాదుగా ఆయన. మరి అలాంటప్పుడు ఇంతలా ఎగబడి సెల్ఫీలు తీసుకునేంత విషయమేముంది?
Its A Beautiful Day. Make It More Beautiful By A Selfie. It Might Save A Life అని ప్లకార్డ్‌పై రాసి ఉంది. అనంత్ కొచ్చిన వినూత్న ఆలోచన.. ఓ జీవితాన్ని నిలబెట్టింది. మానవీయ కోణంలో సమస్యను పదిమందికి తెలిసేలా చేసింది. చైతన్యమనే మార్పును అప్పటికప్పుడు చేసి చూపించింది.
వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ఈ సెల్ఫీ ఎక్స్‌పరిమెంట్ చేశాడు అనంత్. ఇలాంటి ఆలోచనలే ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. సమాజంలో మార్పును తీసుకొస్తున్నాయి. చైతన్య నినాదాలై క్యాంపెయిన్‌లుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఛాలెంజ్‌లై జడత్వానికి కూడా చలనం తెప్పిస్తున్నాయి.

మంజులత దయానిధి.. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంటారు.
వృత్తిరీత్యా జర్నలిస్ట్. అంతకుమించి మంచి సోషల్ యాక్టివిస్ట్. సమాజాన్ని నిశితంగా పరిశీలించడం.. పేదల జీవితాలను అధ్యయనం చేయడం ఆమె దినచర్యలో భాగం.
ఆకలికి తట్టుకోలేక కుళ్లిపోయిన బ్రెడ్ ముక్కలు.. ఆహార పొట్లాలు తింటున్నవాళ్లు ఎక్కడో ఒకచోట తారస పడుతుంటారు. అందరిలా ఆమె వాళ్లను లైట్ తీసుకోలేదు. దగ్గరగా వెళ్లి పరిశీలించింది. పాపం.. వాళ్లకు అన్నం వండటానికి బియ్యం కూడా లేవు.

ఎవరినీ అడుగరు. భిక్షాటన కూడా చేయలేరు.
ఏం చేయాలబ్బా అని అనేకసార్లు ఆలోచించింది మంజులత. అది ఐస్ బకెట్ ఛాలెంజ్ నడుస్తున్న సమయం. ఎవ్వరినోటా విన్నా ఐస్ బకెట్ గురించే వినిపిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా ఉద్యమంలా దూసుకెళ్తున్న తీరు మంజులతను ఆలోచింపజేసింది. కానీ అనవసరంగా నీరు వృథా చేస్తున్నారు. నీటిని ఆదా చేసి.. పేదలకు బియ్యం పంచండి అంటూ క్యాంపెయిన్ చేపట్టింది.
Its local, desi and a practical solution to issues in the vicinity. Instead of wasting water on ice bucket challenge, save water and feed the hungry,
అంటూ.. గుడిసెలు.. మురికివాడల్లో నివాసముండే హైదరాబాద్ బస్తీవాసులను పలుకరించి బకెట్ రైస్‌ను డొనేట్ చేసి ఫొటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అలా మిగతా వాళ్లు కూడా తమకు తోచినంత రైస్ డొనేట్ చేసి ఫొటో పోస్ట్ చేయాల్సిందిగా ఛాలెంజ్ విసిరింది.
ఇది స్టార్ట్ అయిన మూడు రోజుల్లోనే.. కర్నాటక, చెన్నై, కోల్‌కతా లాంటి మెట్రోసిటీల్లో రైస్‌బకెట్ ఛాలెంజ్ కొత్త ఒరవడి సృష్టించింది. స్వచ్ఛంద సేవా సంస్థలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు, కళాశాలలు కదిలివచ్చి ఈ ఛాలెంజ్‌లో భాగమయ్యాయి.

ఫిలిప్పీన్స్, టర్కీ వంటి దేశాల్లో ఈ ఛాలెంజ్ వేలమందికి అన్నం పెట్టింది.
ఒక మంచి ఆలోచనతో.. సమాజశ్రేయస్సు కోసం మంజులత ప్రారంభించిన ఈ సోషల్ క్యాంపెయిన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.
సమాజం అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. కానీ సరిగ్గా కళ్లు పెట్టి చూస్తే వరదల్లా కారే కన్నీళ్లు కనిపిస్తాయి. ఆకలితో అలమటిస్తున్న పేదల ఆర్తనాదాలు వినిపిస్తాయి. దిక్కూమొక్కూలేక దీనంగా పడివున్న అనాథల శోకాలు వినిపిస్తాయి. మనం ఏదో చేస్తామని కాదుగానీ.. కనీసం వాళ్ల కన్నీళ్లన్నా తుడవడానికి ప్రయత్నిస్తే బావుంటుందనే ఆలోచనతో రైస్‌బకెట్ స్టార్ట్ చేశాం. సమాజంమీద జాలి అవసరం లేదు. ఎంతో కొంత బాధ్యత ఉంటే చాలు. విలాసవంతమైన జీవితానికి వేలు, లక్షలు ఖర్చు చేస్తాం. పాపం.. కాలే కడుపులో కాసిన్ని అన్నం మెతుకులు పడేందుకు గుప్పెడు బియ్యం దానం చేయలేమా? అంటున్నది మంజులత దయానిధి.

క్యాంపెయిన్ ఎందుకు?:

క్యాంపెయిన్ అంటే క్యాంప్‌లకు సంబంధించింది కాదు. కానీ దీంట్లో అంతర్గతంగా చైతన్యమనే క్యాంప్ ఉంటుంది. పెయిన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతీ క్యాంపెయిన్ ఓ పెయిన్/బాధ నుంచే పుడుతుంది. ఒక అవసరంగా ప్రారంభమైన ఈ క్రియ బాధ్యతగా మారి పదేసి పది మందిని చేర్చుకుంటూ వందలు వేలుగా మారిపోతుంది. ఆఖరికి ఇది అందరి బాధ్యత అని చాటిచెప్తూ మీరూ చేయండని ఛాలెంజ్ విసురుతుంది. తెలంగాణకు ఉద్యమాలు కొత్త కాదు. మార్పు కూడా కొత్త కాదు. ఒక అంశాన్ని లేవనెత్తాలన్నా.. మంచిని ప్రమోట్ చేయాలన్నా మన వాళ్లు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు. అందరికంటే ముందు వరుసలో నిలబడి మార్పు మంత్రం జపిస్తారు. ఇప్పుడు తాజాగా ప్రగతి కోసం పరితపిస్తున్నారు. దాంట్లో భాగంగానే పురుడు పోసుకున్న క్యాంపెయిన్‌లు సిస్టర్ ఫర్ చేంజ్, రివైవ్ హ్యాండ్‌లూమ్, సెల్ఫీ విత్ ప్లాంట్, సే నో డ్రగ్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ లోకల్‌ఫ్లేవర్‌తో వచ్చి గ్లోబల్ స్టేటస్ సాధిస్తున్నాయి.

హ్యాష్ ట్యాగ్ అంటే?:

చెప్పాలనుకున్న విషయాన్ని.. ఇవ్వాలనుకున్న సందేశాన్ని సులభంగా, వేగంగా విస్తరించేందుకు సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్‌లో హ్యాష్‌ట్యాగ్‌ను వాడుతారు. దీనిని # సింబల్‌తో సూచిస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా నడుస్తున్న క్యాంపెయిన్‌లు, ఛాలెంజ్‌లు హ్యాష్‌ట్యాగ్ ద్వారానే ఫేమస్ అవుతున్నాయి. సమాజం చేత.. సమాజం కోసం పురుడు పోసుకుంటున్న క్యాంపెయిన్ ధోరణికి హ్యాష్‌ట్యాగ్ ఆక్సీజన్ అందిస్తుందని చెప్పొచ్చు. దీని సహకారంతోనే ఒకరి నుంచి ప్రారంభమైన ఆలోచనలు వంద చేతులై కలిసి మార్పు తీసుకొస్తున్నాయి. వాస్తవానికి ఈ ధోరణి విదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రజలకు మేలు చేసేవి ఉంటే.. కొన్ని వ్యాపార సంస్థలకు మేలు చేసేవి ఉంటున్నాయి. ఏది ఎలా ఉన్నా.. ఆ క్యాంపెయిన్‌లో మంచి అంశం ఉంటే అవి ఆదరించబడుతున్నాయి. విజయవంతం అవుతున్నాయి. మంచి పదిమందికి చేరాలంటే.. తలా ఒక చేయి వేయాలి. ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది. ఆ మద్దతే థీమ్‌ను షేర్‌చేస్తూ హ్యాష్‌ట్యాగ్ చేయడం వల్ల సాధ్యమవుతున్నది.

# సెల్ఫీ విత్ డాటర్:

సూరత్‌కు చెందిన 45మంది మహిళలు ఆగస్టు 15న జమ్ముకాశ్మీర్‌లోని లడక్‌కాంట్లూగా శిఖరంపై జాతీయజెండా ఎగురవేయనున్నారు. ఎందుకు? దేశంలో బాలికా విద్య ఆవశ్యకతను చాటి చెప్పేందుకు బేటీ పడావో.. బేటీ బచావో అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదమే స్ఫూర్తిగా మే 3న ఈ మహిళా చైతన్యయాత్ర ప్రారంభమైంది. దీనికంతటికీ కారణం హర్యానాలోని బీబీపూర్ అనే గ్రామ సర్పంచ్. లింగ వివక్షను తరిమి కొట్టేందుకు, బాలికావిద్యను ప్రోత్సహించేందుకు ఆయన సెల్ఫీ విత్ డాటర్ అనే క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఆడబిడ్డలతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఈ హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్ నచ్చిన మోడీ బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమానికి అనుసంధానిస్తూ ప్రచారం ప్రారంభించారు.

#అడాప్ట్ ఎ విలేజ్:

శ్రీమంతుడు సినిమాతో మొదలైన కొత్త క్యాంపెయిన్ ఇది. మహేశ్‌బాబు రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోగా, ప్రకాశ్‌రాజ్ కొండారెడ్డిపల్లిని, మంత్రి హరీశ్‌రావు తన నిజయోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌ను దత్తత తీసుకున్నారు. ఇలా ఒక్కరితో మొదలైన క్యాంపెయిన్ పదుల సంఖ్యను దాటింది.

#ఇంకుడు గుంతలు:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో క్యాంపెయిన్ ఇంకుడు గుంతలు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ప్రజల నుంచి మద్దతు వచ్చింది. సామాన్య జనాల నుంచి సినిమా సెలబ్రిటీల దాకా ఇంటి ముందు ఇంకుడు గుంతలు తీసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

# స్వచ్ఛ తెలంగాణ:

ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అన్ని రాష్ర్టాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛమేవ జయతే అంటూ చేయి కలిపింది. ఒక ఊపు ఊపిన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ లాగే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ క్యాంపెయిన్‌లు ప్రజల ఆదరణను పొందాయి. అందరి మద్దతూ కూడగట్టుకుని విజయవంతమయ్యాయి. ప్రైవేటు, ప్రభుత్వ, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, సినీ తారలు, రాజకీయ నేతలు అందరూ కలిసొచ్చి స్వచ్ఛ తెలంగాణకు జై కొట్టారు. చీపుర్లు పట్టి.. చెత్త తొలగిస్తూ సరికొత్త సందేశాన్నిచ్చి సామాన్యులనూ ఈ క్యాంపెయిన్లో పాల్గొనేలా చేశారు.

# సెల్ఫీ విత్ ఎ ప్లాంట్:

తెలంగాణకు హరితహారంలో భాగం ఇది. మొక్క నాటాలి. దాంతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. హరితహారం ఫస్ట్‌ఫేజ్‌లోనే స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఇప్పటికీ ఉద్యమంలా సాగుతున్నది. ప్రజల మద్దతుతో హరిత జోరును కొనసాగిస్తున్నది. చైనాలోని గోబీ ఎడారిలో, బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ తీరంలో గతంలో ప్రజలు స్వచ్ఛందంగా చెట్లు నాటిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అనేక కోట్ల మొక్కలు నాటాలనే బలమైన సంకల్పంతో క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది. మొక్కను నాటండి.. సెల్ఫీ దిగండి అనే నినాదంతో వచ్చిన ఈ కార్యక్రమంలో సినీ తారలు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలతో పాటు కామన్‌మ్యాన్ కూడా కదిలాడు. సెల్ఫీ విత్ ప్లాంట్ క్యాంపెయిన్‌కు సంబంధించి కొన్ని లక్షల ఫొటోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ అయ్యాయి.

# రివైవ్ హ్యాండ్‌లూమ్:

చేనేతను బతికించాలనే ఆలోచనతో సినీతార సమంత చేపట్టిన కార్యక్రమం ఇది. తన తల్లి గతంలో ధరించిన చేనేత చీరను తాను ఇప్పుడు కట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేనే కాదు మీరూ ఇలా చేయండి. అమ్మల చేనేత చీరలను ధరించి రివైవ్ హ్యాండ్‌లూమ్, ఓపెన్ 2017 హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అని పిలుపునిచ్చింది. సమంత ఇలా పోస్ట్ చేసిందో లేదో వందలకొద్దీ పోస్ట్‌లు వచ్చాయి. వీళ్లను ఎంట్రీలుగా తీసుకున్నారు. ఫైనల్‌గా ఐదుగురిని ఎంపికచేసి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్కిల్ ఆర్టిజన్స్ నిర్వహించే ఓపెన్ ఫ్యాషన్ షోకు ఆహ్వానించారు. నేతన్నను ఆదుకోవాలనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ ప్రారంభించిన చేనేతకు చేయూత క్యాంపెయిన్‌లో రివైవ్ హ్యాండ్‌లూమ్ కూడా భాగమైంది. ఈ క్యాంపెయిన్‌లో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలూ దోతీలు కట్టుకుని ఫొటోలు పంపడం విశేషం.

# సే నో టు డ్రగ్స్:

డ్రగ్స్ మాఫియాను అంతమొందించేందుకు హైదరాబాద్‌లో చేపట్టిన కార్యక్రమమిది. సినీ పరిశ్రమలో డ్రగ్స్ అంశం హాట్‌టాపిక్‌గా మారడటంతో సినీతారలు ఈ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి హైదరాబాద్‌లో ప్రవేశించకుండా చేయడానికి ఇదే సరైన సమయమని.. ఈ చీడపురుగును మొగ్గదశలోనే తుంచేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగానే కళామందిర్ ఫౌండేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవేర్‌నెస్ వాక్, ర్యాలీలు నిర్వహించారు. ఫేస్‌బుక్‌లో సినీతారలు ఫ్రొఫైల్ పిక్చర్స్ కూడా Say No To Drugs అంటూ మార్చుకున్నారు. అంతేకాదు.. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన ఫొటోలు కూడా అప్‌డేట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు, అవగాహనా కల్పిస్తున్నారు.

# సిస్టర్స్4చేంజ్:

ఇది తెలంగాణలో మొదలైన క్యాంపెయిన్. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టారు. అక్కాచెల్లెండ్లు.. రాఖీ పండుగనాడు తమ అన్నాతమ్ముండ్లకు రాఖీ కట్టి ఓ హెల్మెట్‌ను ఇవ్వాలనేది థీమ్. తన అన్న కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ మేకల వంశీకృష్ణ తీసిన రక్షా బంధన్ లఘుచిత్రం స్ఫూర్తిగా ఈ క్యాంపెయిన్ మొదలైంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపడం వల్ల ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పుతున్నారు. అందుకే అక్కాచెల్లెండ్లు సోదరులకు రాఖీతోపాటు హెల్మెట్ కూడా ఇవ్వండని సందేశమిచ్చారు కవిత. అనూహ్య స్పందనతో ఈ కార్యక్రమం విజయవంతమై రాఖీ పండుగనాడు అనేక ఇళ్లలో రాఖీలతో పాటు హెల్మెట్లే కనిపించాయి. సానియా మీర్జా, గుత్తాజ్వాల, పీవీ సింధు లాంటి ప్రముఖ క్రీడాకారిణిలతో పాటు సినిమాతారలు కూడా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. యూపీ, అమేథీలో అయితే అక్కాచెల్లెండ్లు సోదరులకు రాఖీ కడితే.. వాళ్లకు కానుకగా మరుగుదొడ్లు కట్టివ్వాలనే కార్యక్రమం ఉద్యమంలా వ్యాపించింది.

# సేవ్ పవర్:

కరెంట్ ఆదా చేయాలనే ఆలోచనతో వచ్చిని మరొక క్యాంపెయిన్ సేవ్ పవర్. సోషల్ మీడియా నెటిజన్లు తమకు తెలిసిన చిట్కాలతో ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కొన్ని టీవీ ఛానళ్లు ఏకంగా యాడ్‌లను చిత్రీకరించాయి. ఇదే నినాదాన్ని కొన్ని సంస్థలు వ్యాపారం కోసం వాడుకున్నాయి.

twitter# కొత్త ఆలోచన
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ఖాన్ స్టార్‌ప్లస్ టీవీ చానల్ చేసి నయీ సోచ్ క్యాంపెయిన్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఆడపిల్లల మద్దతు కోసం యాడ్ ఇంటర్‌నెట్‌లో ప్రభంజనం సృష్టించింది. ఈ వీడియోకు మద్దతుగా బాలీవుడ్ తారలంతా ట్వీట్ చేశారు. అభిమానులు, సామాన్య జనం కూడా జేజేలు పలికారు. ఆడపిల్లల్ని వద్దనుకుంటున్న తల్లిదండ్రుల కళ్లు తెరిపించేలా ఉంటుందా యాడ్.

# రైస్ బకెట్ ఛాలెంజ్:
ప్రపంచమంతా ఐస్‌బకెట్ ఛాలెంజ్‌లో మునిగిన సమయంలో ఐస్ బకెట్ కాదు.. రైస్ బకెట్ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఫేస్‌బుక్‌ను వేదికగా ఎంచుకుని నెటిజన్లను కూడా పాల్గొనేలా చేశారు. ఈ రైస్‌బకెట్ ఛాలెంజ్‌తో పేద ప్రజలకు సాయం చేసే అవకాశం దక్కుతుందని భావించారు. మంజులత అనే హైదరాబాదీ ఈ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ హబ్సిగూడలో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. నిరుపేదలకు, అన్నార్తులకు బియ్యం ఇవ్వడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియాలో దీన్ని చూసి దర్శకుడు రాజమౌళి కూడా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.

#దో రోటి:
ప్రతి రోజూ మీరు తినే అన్నంతో పాటు రెండు చపాతీలు (రొట్టెలు) దానం చేయాలని ప్రచారం మొదలుపెట్టాడు సామాజిక కార్యకర్త అజహర్ మక్సూసీ. ఆకలితో అలమటిస్తున్న అనాథలకు, గుప్పెడు మెతుకులు కరువై అన్నం కోసం ఎదురుచూస్తున్న అన్నార్తుల కోసం ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. దో రోటి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లుగా చంచల్‌గూడ, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ైప్లె ఓవర్‌ల వద్ద ఉన్న పేదలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆకలి విలువ తెలిసిన అజహర్‌కు అవతలి వ్యక్తి ఆకలిగా ఉండటం ఇష్టం లేదు. ఇతను చేస్తున్న ఈ క్యాంపెయిన్ రాజకీయాలకు అతీతంగా లీడర్లు సెలబ్రిటీలు కూడా పాల్గొని తమ వంతుగా అన్నదాతలవుతున్నారు.

# ఆర్మీకి సలామ్ కరో:
ఎండనక, వాననక రాత్రింబవళ్లు దేశం కోసం, దేశ రక్షణ కోసం గస్తీ కాస్తారు మన సైనికులు. ప్రాణాలు అరచేతితో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తారు వాళ్ల కుటుంబసభ్యులు. దేశం మీద ఉన్న భక్తితో దేశసేవ చేయడానికి అడుగు ముందుకేసిన ఆర్మీ అన్నలు ఇప్పటి వరకు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఇప్పటికీ పోరాడుతున్నారు. సోల్జర్స్ నిజమైన హీరోలు. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విషెస్ ఫర్ ఆర్మీ ఫోర్స్, ఆర్మీకి కరో సలామ్ పేరుతో ఓ క్యాంపెయిన్ నడిచింది. హైదరాబాద్ కూకట్‌పల్లి ఫోరమ్ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో నటి హంసా నందిని, క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్‌ని ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల సంస్థ ఎల్‌జీ చేపట్టింది.

# బేక్ టు సపోర్ట్:
బుద్ధిమాంద్యం గల చిన్నారులు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంకో ప్రపంచంలో బతికేస్తుంటారు. బెంగళూరుకు చెందిన దంపతులు వీళ్ల కోసం కేక్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. గీత, రతీష్‌లకు ఒక బాబు అతడి పేరు ఓం. డౌన్ సిండ్రోమ్‌తో పుట్టాడు. ఈ విషయంలో వాళ్లు తిరుగని ఆసుపత్రి లేదు. కలువని డాక్టర్ లేడు. పిల్లాడిని సాధారణ మనిషిలా మార్చుకోవడానికి వాళ్లు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఈ వ్యాధితో బాధ పడుతున్న మిగతా పిల్లల పరిస్థితేంటి? వారికి సపోర్ట్‌గా నిలువాలి. ఇలాంటి అవమానాలు జరుగకూడదని క్యాంపెయిన్ చేపట్టారు ఆ దంపతులు. బేక్ టు సపోర్ట్ పేరుతో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ క్యాంపెయిన్‌లో రకరకాల కేకులు తయారు చేసి అలాంటి చిన్నారులకు కానుకగా ఇవ్వాలన్నమాట.
అజహర్ షేక్, 9963422160

859
Tags

More News

VIRAL NEWS

Featured Articles