ప్రకృతి ఒడిలో పవిత్ర లోగిలి అక్క మహాదేవి గుహలు


Sun,February 17, 2019 01:13 AM

temple
దట్టమైన అడవి ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా వెలసినవే అక్కమహాదేవి గుహలు. పచ్చని అడవుల గుండా ప్రయాణించి ఈ గుహలను చేరుకోవాలి. ఒకవైపు శ్రీశైలం బ్యాక్‌వాటర్, మరోవైపు గుహలు చూడముచ్చటగా ఉంటాయి. కర్ణాటకకు చెంది న వీర శైవ సాహిత్యంలో విశేష కృషి చేసిన అక్కమహాదేవి ఈ ప్రాంతంలో తపస్సు చేసిందని, అందుకే ఈ గుహలకు ఆమె పేరొచ్చిందని చెబుతారు. చక్కని పర్యాటక ప్రాంతంగానూ, పవిత్ర దైవక్షేత్రంగానూ ఈ గుహలు గుర్తింపు పొందాయి.

ఎక్కడ ఉన్నాయి?

నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌కు సుమారు 18 కి.మీ. దూరంలో ఈ గుహలు ఉన్నాయి.
temple1

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుండి అచ్చంపేట చేరుకుంటే అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఫరహాబాద్, వటువర్ల పల్లి నుంచి కొంత ముందుకు వచ్చిన తర్వాత ఆరు కిలోమీటర్లు నడిస్తే ఈ గుహలను చేరుకోవచ్చు. లేదా శ్రీశైలం వెళ్లి పాతాళ గంగ నుంచి బయలు దేరే ఆంధ్రప్రదేశ్ టూరిజం పడవ ద్వారా వెళ్లవచ్చు. నదిలో సుమారు 16కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గంటలో గుహలను చేరుకోవచ్చు.

ఎవరీ అక్కమహాదేవి?

అక్క మహాదేవి తల్లిదండ్రులు వీరశైవులు. చిన్నప్పుడే అక్క మహాదేవి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశంగా పొందింది. చిన్నతనం నుండే చెన్నమల్లికార్జునుడే తన భర్త అని అందరికీ చెబుతూ ఉండేది. యవ్వన దశకు వచ్చేసరికి వీరశైవ సాహిత్యాన్ని అవపోసన పట్టింది. ఒకరోజు ఆ దేశపు రాజైన కౌశికుడు ఆమెను చూశాడు. ఆమె అందాలరాశి. దీంతో ఆమెను భార్యగా పొందాలని ప్రయత్నించాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అయితే కౌశికుడు ఆమె తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తానని బెదిరించడంతో కొన్ని షరతులతో ఆమె పెళ్లికి ఒప్పుకుంది. దాంతో ఆమె రాజభవనానికి చేరుకుంది. తను శివారాధన చేస్తానని ఆ తరువాతే పెళ్లి అని షరతు పెట్టింది. రాజు సరేననడంతో ఆమె శివారాధనకు కూర్చుంది. అయితే అక్క మహాదేవి ఎన్నిరోజులైనా శివారాధన నుంచి బయటకు రాకపోయేసరికి కౌశికుడు ఓపిక పట్టలేక ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె పడకగదిలో నిద్రిస్తుండగా తమ కుటుంబ ఆరాధ్య గురువైన గురులింగదేవుడు వచ్చాడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) బయటికి వచ్చి గురుదర్శనం చేసుకొంది. వస్ర్తాలు ధరించి రావలసిందిగా గురులింగదేవుడు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ, పరమభక్తురాలివి గదా, నీకు వస్త్రం ఎందుకు? అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి అక్క మహాదేవి వస్ర్తాలు ధరింపక జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. రాజమందిరం నుం డి బయటపడిన మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.

అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను రకరకాల ప్రశ్నలతో పరీక్షించాడు. ఆమెలోని వైరాగ్య తేజస్సును తెలుసుకొని మహా మందిరంలో స్థానం కల్పించారు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. ఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతి చెందింది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోని జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతికాలంలోనే ఆమె శ్రీశైల మల్లిఖార్జునిలో ఐక్యమైపోతుంది.

గొప్ప కవయిత్రి

కన్నడ వీరశైవ సాహిత్యంలో అల్లమ ప్రభువు, బసవన్నలతోపాటు అక్క మహాదేవి అగ్రశ్రేణి కవయిత్రి. అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో అక్కగళపితికే, కొరవంజి వచనార్ధ అన్నవి ఎంతో ప్రాచుర్యం పొందాయి.
temple2

చూడదగ్గ ప్రదేశం

శ్రీశైలానికి సమీపంలో ఉన్న కదలి వనం నందు అక్క మహాదేవి పేరుతో ఒక వాగు అక్కన్న హళ్ల ఆమె పేరుతో ఒక గద్దె అక్కన్న గద్దెలు ఉన్నాయి. అక్క మహాదేవి గుహల ముందు ఆమె శిలా ప్రతిమ ఉంది. శ్రీశైల దేవస్థాన ప్రాకారపు గోడకు ఆమె చిత్రం చెక్కి ఉన్నాయి. మల్లికార్జునుడి గుడి యందు ఆమె లింగార్చన చేయుచున్నట్లు శిలా ప్రతిమ ఉన్నది. ఇవన్ని ఆమె చారిత్రాంశాలకు చెందిన స్మారక చిహ్నాలు. శ్రీశైలంలో అక్క మహాదేవి ట్రస్టు కూడా ఉంది.

- మధుకర్ వైద్యుల,
సెల్ : 91827 77409

796
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles