ప్రకృతికి ఎందుకింత ప్రకోపం?


Sun,September 2, 2018 02:02 AM

kerala
హితం కోరే ప్రకృతి ఖతం చేస్తున్నది. ప్రశాంతతను కోరాల్సిందిపోయి ప్రకోపిస్తున్నది. మొన్న మహారాష్ట్ర.. హిమాచల్ ప్రదేశ్.. జమ్మూ కశ్మీర్.. నేడు కేరళ ఇలా ప్రళయ వలయంలో చిక్కుకొని మానవ సమాజం చిన్నాభిన్నమైపోయింది. వరద ఉప్పొంగి ఉప్పెనలా ఇళ్లల్లోకి చొరబడి జనాన్ని జల సమాధి చేసింది. అప్పటిదాకా హాయిగా బతికిన లక్షలాది మంది ప్రకృతి కోపానికి అన్నార్థులు.. శరణార్థులుగా మారిపోయారు. ప్రాణాలు నష్టపోయి.. ఆస్తులూ నష్టపోయి.. గూడు చెదిరి.. గుండె బెదిరి రోడ్డునపడ్డవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతీసారి ప్రజలు నష్టపోతూనే ఉన్నారు. మానవతా మాత్రంగా సహాయార్థాలు.. సహకార చర్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు ప్రకృతి ఎందుకు ప్రకోపిస్తుంది అని కదా ఆలోచించాలి? ఇది ప్రకృతి తప్పిదమా? మానవ తప్పిదమా? విపత్తు రాకముందే పసిగట్టి ప్రళయ వలయపు ముప్పు నుంచి తప్పించుకోలేమా?
-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

kerala1
కుండపోత వర్షాలు, అకాల వరదలు కేరళకు మాత్రమే పరిమితం కాదు. దేశమంతా ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నవే. ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ స్థాయిలో కాకపోయినా మన రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం దేశంలో 12 శాతం భూభాగం వరద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. వరదలు మన దేశంలో తరచూ సంభవించే విపత్తు. వరదల వల్ల గణనీయమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవిస్తున్నాయి. ప్రజల జీవనోపాధికి ఆటంకం ఏర్పడుతున్నది. మౌలిక వసతులు దెబ్బతింటున్నాయి. ప్రజోపయోగ సేవలు అస్తవ్యస్తం అవుతున్నాయి. జనజీవనం అతలాకుతలం అవుతున్నది. భారతదేశంలోని 3290 లక్షల హెక్టార్ల భూభాగంలో కనీసం 400 లక్షల హెక్టార్లు వరద పీడిత ప్రాంతాలే. వరదల్లో కనీసం ఏటా 1600 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో సగటున ఏటా వరదల వల్ల పంటలూ, ఇళ్లూ, ప్రజోపయోగ సదుపాయాలూ మొదలైన వాటికి కలుగుతున్న నష్టం రూ.1805 కోట్లని అంచనా. దేశం సగటున అయిదేళ్లకోసారి భారీ వరదలను ఎదుర్కొంటున్నది. 1977లో సంభవించిన వరదల్లో 11,316 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో కూడా భారీగా ప్రాణనష్టం సంభవించింది.

అరవై ఏండ్లలో 268 వరదలు

గడచిన ఆరు దశాబ్దాల్లో భారతదేశంలో 268 వరద విపత్తులు సంభవించాయని.. ఈ విపత్తుల్లో 69వేలమంది మృత్యువాత పడ్డారని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశంలో 1950 నుంచి 2015వ సంవత్సరం వరకు అతి భారీవర్షాల వల్ల సంభవించిన వరదలు 82.5 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఈ విపత్తులతో 1.2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద విపత్తులపై మన దేశంతోపాటు అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు రాసిన ఓ వ్యాసాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ గతేడాది అక్టోబరు సంచిక ప్రచురించింది. దేశంలో వరదలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ర్టాలను అతలాకుతలం చేశాయని తేలింది. 15 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం కురిస్తే దానివల్ల వరదలు వచ్చే అవకాశముందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రోలాజి విభాగం శాస్త్రవేత్త రాక్సీ మ్యాథ్యూ కోల్ చెప్పారు. భూగోళం వేడిమి, తీవ్ర వాతావరణ ప్రభావం వల్ల కుండపోత వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్త రాజీవన్ చెప్పారు.

మానవ తప్పిదమూ లేకపోలేదు

ఇష్టానుసారంగా చెట్లను, అడవులను తెగ నరికేయడం.. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, చెరువులు, నదుల విధ్వంసం.. పర్యాటకం పేరుతో కట్టే కాంక్రీట్ భవనాలు.. ఇవ్వన్నీ కేరళలో వరదలకు కారణమే. అంతేకాదు, 44 నదులపై 39 డ్యామ్స్ పుట్టుకొచ్చాయి. ఆకాశహార్మ్యాలు వెలిశాయి. ఇలా మనిషి చేసుకుంటూ పోయిన తప్పిదాలే ఇవాళ కేరళ కన్నీటికి కారణమయ్యాయి. కేరళ రాష్ట్రంలోని నదుల పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా భవనాల నిర్మాణం చేపట్టడంతోపాటు అక్రమంగా క్వారీల వల్లనే వరదలు సంభవించాయని మాధవ్ గాడ్గిల్ ఏనాడో చెప్పారు. కేరళ పశ్చిమ కనుమలపై పూర్తి అధ్యయనం చేసిన పర్యావరణవేత్త గాడ్గిల్.. 2011లోనే కేరళ పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి కేరళ సర్కారుకు ఓ నివేదిక అందించారు. మొత్తం 1500 కిలోమీటర్ల మేర గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు వరకు విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే కేరళ సర్కారు ఆయన చేసిన సూచనలను, సిఫారసులను పట్టించుకోక పోవడం వల్లనే ఈ విపత్తు సంభవించిందనేది నిప్పులాంటి నిజం. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో భారీ విపత్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొన్నేళ్ల క్రితమే స్పష్టం చేశారు.

కోట్లల్లో నిరాశ్రయులు

కేరళ వరదల మూలంగా కోటి మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. లక్షలాది మంది వరదల్లో చిక్కుకుని సాయంకోసం ఎదురుచూస్తున్నారు. వీరందరూ కూడా స్నేహితులు, బంధువులు, ప్రభుత్వ శిబిరాలు, స్కూల్స్, కాలేజీలు, గుళ్లు, ప్రార్థనా మందిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం 20వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. వరదలు అన్నీ తగ్గిన తర్వాత ఇది రెండు, మూడింతలు అయినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ అంచనానే 20 వేల కోట్లు ఉంటే.. ఇండ్లు, ఇళ్లలోని వస్తువుల నష్టం అంచనా వేస్తే లక్ష కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా వరదల్లో చిక్కుకున్న కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం భారీగా నష్టపోయింది. ఈ విమానాశ్రయ నష్టం 200 నుంచి 250 కోట్ల రూపాయల దాకా వుండవచ్చని అధికారులు అంచనా వేశారు. పీడబ్ల్యూడీకి చెందిన దాదాపు 10,000 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నట్లు అంచనా. దాదాపు 60 శాతం ఉన్న గ్రామీణ రహదారులు కూడా కొట్టుకుపోయాయి. వీటి మొత్తం మరమ్మతుకు దాదాపు రూ.10,000 కోట్లు అవసరం అవుతాయని భావిస్తున్నారు.

వందేళ్ల తర్వాత మళ్లీ

కేరళను 1924లో ఇదే విధంగా వరదలు ముంచెత్తాయి. 1924 జూలై నెలలో వరుసగా మూడు వారాల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడ్డాయి. 485 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. త్రిసూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుఝ, కుట్టనాడ్ తదితర జిల్లాలన్నీ మునిగిపోయాయి. వేల మంది చని పోయారు. అపార ఆస్తి నష్టం సంభవించింది. 1895లో నిర్మించిన ముల్లపెరియార్ డ్యామ్ దెబ్బతినడమే జలవిలయానికి దారితీసిందని అంటారు. ఆనాటి దుర్ఘటనను గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 99గా పేర్కొంటారు.

గుణపాఠం కావాలి

ఈ విధ్వంసం నుంచి ఒక కేరళ వాసులే కాదు భారతీయులందరూ ఓ గుణపాఠం నేర్చుకోవాలి. స్వార్థంతో ప్రకృతిని కబలిస్తే, ప్రకృతి మనల్ని కబళించే రోజు దగ్గరలోనే ఉందని గ్రహించాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. మరి మనం ఏం చేస్తున్నాం? అవకాశం ఉన్నపుడల్లా చెట్లని నరకడం, నదుల్లో ఇసుకను ఇష్టానుసారంగా తవ్వడం..కొండల్ని తొలిచి ఇల్లు కట్టడం..మరి చివరికి ఏం మిగిలింది..ఆలోచించండి... తర్వాతి వంతు మనది కాకుండా చూసుకుందాం. వరద నివారణ, వరద నిర్వహణపై ముందస్తు సంసిద్ధతపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యవస్థాగతమైన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యాచరణ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే, సామాజికంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. వరద నిర్వహణకు సంబంధించిన వివిధ నిర్మాణాలు, ఉదాహరణకు ఆనకట్టలు, డ్రైనేజి వ్యవస్థ మొదలైన వాటిపై నిరంతర పర్యవేక్షణ అవసరం. రుతుపవనాల సమయంలో ఇది తప్పనిసరి.
kerala2

అత్యధిక జనసాంద్రత

దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ర్టాల్లో కేరళ ఒకటి. కేరళలో ప్రతి చదరపు కిలోమీటరుకు 860 మంది నివసిస్తున్నారు. జాతీయ సగటు కన్నా ఇది రెట్టింపు. దీనివల్ల వరదలు వస్తే ఎక్కువమంది మృత్యువాత పడుతారు.

కేరళలోనే ఎందుకు?

కేరళకు వరదలు రావడం ఇది మొదటిసారి కాదు. అయితే గత ప్రళయాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోకపోవడమే విచారకరం.

భౌగోళిక సమస్యలు

మలబారు తీరంలోని కేరళకు దాదాపు 600 కిలోమీటర్ల మేర అరేబియా సముద్ర తీరప్రాంతం ఉంది. బ్యాక్ వాటర్స్, కాలువలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. చిన్న నదులు అనేకం పడమటి దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. చిన్న వర్షం పడినా నదులు వెంటనే పొంగిపొర్లుతాయి. కేరళ భౌగోళికంగా 10 శాతం సముద్ర మట్టానికి దిగువన ఉంటుంది. రాష్ట్రంలోని చాలా భాగాలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి. పలు పట్టణాలు, నగరాలు పడమటి కనుమల పాదాల చెంత ఉన్నాయి. ఆవాసాలకు అనుకూలం కానీ ఇలాంటి ప్రదేశాల్లో ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల్ని నిర్మించుకున్నారు. దీంతో వరదలు వస్తే తప్పించుకోలేరు.

ముంచిన ఆనకట్టలు, డ్యామ్‌లు

కేరళలో 44 నదులపై 39డ్యామ్‌లు, 80వరకు చిన్నా పెద్దా ఆనకట్టలు నిర్మించారు. చాలా వరకు ఆనకట్టల్లో సామర్థ్యం కన్నా ఎక్కువగా నీటిని నిల్వచేశారు. కొన్ని ఆనకట్టలను చివరి నిమిషంలో తెరిచారు. ఓ వైపు ఆనకట్టల నుంచి వచ్చిన నీరు, మరోవైపు కుంభవృష్టితో రాష్ట్రం జలప్రళయమైంది.

జల నిర్వహణలో లోపం

దక్షిణాదిలో అత్యంత అధ్వాన్న జలనిర్వహణ కలిగిన రాష్ర్టాల్లో కేరళ ఒకటి. మిగులు జలాల్ని పంపిణీ చేయడంలో కీలకంగా ఉండే చిన్న చిన్న కాలువల్ని కూడా సరిగా నిర్వహించడం లేదని ఇటీవల నీతి ఆయోగ్ తేల్చిందంటే అక్కడి జల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోచ్చు.
kerala3

వరదలు ఎందుకొస్తున్నాయి?

మన దేశంలో వరదలు సంభవించడానికి అనేక కారణాలున్నాయి. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 80 శాతం మేరకు రుతుపవనాల సమయంలోనే కురుస్తున్నాయి. అంటే ఏడాది పొడవునా కురిసే మొత్తం వర్షపాతంలో అత్యధిక శాతం జూన్, సెప్టెంబరు మధ్యకాలంలోనే ఉంటున్నది. ఫలితంగా నదుల్లో భారీగా నీటి ప్రవాహం చేరుతున్నది. తుపానులు, హఠాత్తుగా వచ్చే వర్షాలు, అల్పపీడనాలు మొదలైనవి వరద ప్రమాదాన్ని పెంచుతున్నాయి. నదుల సామర్థ్యాన్ని మించి వాటిలో నీరు చేరుతున్నది. విచక్షణా రహితంగా నదుల్లో ఇసుకను తొలగించడంవల్ల వాటి సహజ ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. డ్రైనేజీలకు సరైన సమయంలో మరమ్మతులు చేయకపోవడం వల్ల అవి మూసుకుపోతున్నాయి. ఫలితంగా మురుగు నీటి నిల్వలు ఏర్పడుతున్నాయి. ఇవి కూడా వరద ముప్పు పెరగడానికి కారణమవుతున్నాయి.
kerala4

మనకూ ఉంది ప్రమాదం

కేరళ రాష్ర్టాన్ని కుదిపేసిన వరదలతో అందరి దృష్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ పై పడింది... గతంలో ముంబై, చెన్నై, తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టించిన విపత్తుల నిర్వహణకు సరైన యంత్రాంగం ఇప్పటికీ సిద్ధం కాలేదు. దేశంలో వరద ప్రమాద ప్రాంతాలను గుర్తించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ.... కేరళ తర్వాత స్థానం తెలుగు రాష్ర్టాలదే అని హెచ్చరిస్తున్నది. కేరళ వరదల దృష్ట్యా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన భవిష్యత్తు వరద ప్రమాద ప్రాంతాల పటంలో.. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉండగా, తెలంగాణ మూడవ స్థానంలో నిలచింది. భవిష్యత్తులో మనకూ వరద ముప్పు పొంచి ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తున్నది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లో 13.9 లక్షల హెక్టార్లలో వరద ముప్పు ఉండగా,తెలంగాణ వరద ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది.
kerala5

మనపరిస్థితి ఏమిటి?

ఇరవై నాలుగు గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంటుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ అంచనా వేసింది. మొదటి రెండు స్థానాల్లో ముంబై, చెన్నై నగరాలున్నాయి. అయితే ఆ రెండు నగరాల్లో కురిసే వర్షంలో సగం కురిసినా హైదరాబాద్ వాటికి మించి నష్టాన్ని చవిచూస్తుందన్నది ఎన్డీఎంఏ విశ్లేషణ. హైదరాబాద్ పరిసరాల్లో వందలాది చెరువులు, కుంటలను కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించడం, ఉన్న కొద్దిపాటి చెరువులు, కుంటల శిఖం భూములు ఆక్రమణకు గురికావడమే దీనికి కారణమని నిర్ధారించింది. హైదరాబాద్‌లో 24 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సగం నగరం వరదలోనే ఉంటుంది. రోజున్నర పాటు అంటే 36 గంటల పాటు తెలంగాణ రాజధానిలో 60 సెం.మీ వర్షం కురిస్తే ముప్పావువంతు హైదరాబాద్ నీటిలో విలవిలలాడుతుంది. 48 గంటల కన్నా ఎక్కువ సేపు వర్షం కురిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని ఎన్డీఎంఏ పేర్కొంది.

ముందస్తు చర్యలు

ఇలాంటి విపత్తులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం గడచిన రెండేళ్లుగా చర్యలు మొదలుపెట్టింది. చెరువులు, కుంటల శిఖం భూములకు సరిహద్దులు నిర్ణయించే పనికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎన్డీఎంఏ నిపుణుల కమిటీ నివేదిక వ్యాఖ్యానించింది.

రియల్ హీరోలు అధికారులు, సైనికులు

రాజధాని తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో, జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. ఇక యుద్ధరంగంలో శతృవులను మట్టికరిపించే జవానులు రణక్షేత్రంలోనే కాదు ప్రకృతి విపత్తుల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. జల ప్రళయంలో చిక్కుకున్న కేరళలోనూ సైన్యం మరువలేని సాయం చేస్తున్నది. మొన్నటి ఉత్తరాఖండ్, నిన్నటి చెన్నై వరదలతో పాటు ఇవాళ్టి కన్నీటితో నిండిన కేరళను ఆదుకుంటున్నదీ ఆ జవాన్లే. కేరళ సహాయక చర్యల్లో ఓ నిండు గర్బిణిని రక్షించడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఒక ఇంటిలో చిక్కుకున్న 26 మందిని హెలికాప్టర్ సాయంతో కాపాడారు.

మత్స్యకారులు

చేపల వేటలో నదులూ, సముద్రాలను లెక్కచేయని మత్స్యకారులు కేరళలో రియల్ హీరోలుగా మారారు. వరదల్లో నేవీ కమెండోలు వెళ్లలేని చోటికి వెళుతున్నారు. ప్రతి ఇల్లూ తిరిగి... ప్రతి ఒక్కరినీ వరద నీటి నుంచి రక్షిస్తున్నారు. తిరువనంతపురం, కొల్లాం, మలప్పురం, కన్నూర్, త్రిశూర్, ఎర్నాకుళం తదితర జిల్లాలకు చెందిన మత్స్యకారులు 6 రోజులుగా తమ పడవలను, జీవితాలను వరద బాధితులను ఆదుకునేందుకే అంకితం చేశారు. కేరళలో మూడోవంతు మందిని మత్స్యకారులే తమ నాటు పడవల్లో రక్షించారు.

భారతదేశంలో జల ప్రళయాలు

భారత్ అనేక నదులకు పుట్టినిల్లు. నదులు ఉన్నచోటే నాగరికత వెలసింది. మనిషికి జీవనాధారం అయిన నదులే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. సునామి కాకుండా ఎన్నో వరదలు ఈ దేశంలో సంభవిం చాయి.

చెన్నై (2015): 2015 డిసెంబర్ 1న భారీవర్షాలు కురిసి వరద పోటెత్తింది. ఈ వరదల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షకోట్ల రూపాయల మేర ఆస్తులు ధ్వంసమయ్యాయి. రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి.

ఉత్తరాఖండ్ (2013): ఉత్తరఖండ్‌లో 2013లో వచ్చిన వరదలు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ప్రపంచంలో అత్యంత విషాదకరమైన వరదలుగా ఇవి నిలిచాయి. 580 మంది చనిపోగా 5748 మంది గల్లంతయ్యారు. 1.10లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

అసోం (2012): అసోంకు 2012 సంవత్సరం తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. 124మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది జిల్లాల్లోని 1,744 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కాజిరంగా వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 540 వన్యమృగాలు మృత్యువాత పడ్డాయి.

లడఖ్ విలవిల (2010): 2010 ఆగస్టు 6న సంభవించిన వరదలకు కశ్మీర్‌లోని లఢఖ్ ప్రాంతం అతలాకుతలమైంది. 300 మంది మరణించారు. లేహ్‌తో పాటు 71 పట్టణాలు, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 33 మంది భారత సైనికులు గల్లంతయ్యారు.

బిహార్ (2004, 2008): 2004లో గంగానది ఫరక్కా బరాజ్ వద్ద ప్రమాదస్థాయినిదాటింది. ఈ వరదల్లో 885మంది చనిపోగా, 3,272 పశువులు మృత్యువాతపడ్డాయి. 2008 ఆగస్టులో గంగా ఉపనది కోసి వరదలతో 23 లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

గుజరాత్ జలవిలయం (2005): దేశ చరిత్రలో ఒక చీకటి ఘటనగా ఇది మిగిలింది. ఈ వరదల్లో రూ.8000 కోట్ల నష్టం వాటిల్లింది.123మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2.5లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

ముంబై వరద (2005):2005లో మహారాష్ట్ర వరదల్లో ఏకంగా 1,094మంది మృతిచెందారు. 52 లోకల్ రైళ్లు, 37వేల ఆటోలు, నాలుగువేల టాక్సీలు, 900 ఆర్టీసీ బస్సులు, వెయ్యి ట్రక్కులు ధ్వంసమయ్యాయి. 550కోట్ల మేర ఆర్థికనష్టం వాటిల్లినట్లు అంచనా.

అసోం అతలాకుతలం (1998): 21జిల్లాల్లోని 5300 గ్రామాలు నష్టపోయాయి. 30,900 ఇండ్లు కొట్టుకుపోయాయి. 156 మంది ప్రాణాలు కోల్పోగా, 47లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 9.7లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది.7814 పశువులు చనిపోయాయి.

బిహార్ (1987): దేశ చరిత్రలో అత్యంత దారుణమైన వరద 1987లో బిహార్‌ను ముంచెత్తింది. ఏకంగా 1,399 మంది ప్రజలు, 5302 జంతువులు మరణించాయి. 30జిల్లాల్లోని 24,518 గ్రామాల్లో సుమారు 2.9 కోట్లమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన నది కోసికి వచ్చిన వరదలు ఈ విలయానికి కారణమయ్యాయి.

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles