పునర్జన్మ ప్రసాదించాడు!


Sun,July 8, 2018 02:06 AM

బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లాలన్నది నా లక్ష్యం. అక్కడి కాలిఫోర్నియాలో మా చుట్టాలు ఉంటారు. చుట్టాలు అంటే మా అమ్మ.. వాళ్ల అమ్మ సొంత అక్కాచెల్లెళ్లు. వాళ్లు అక్కడే సెటిల్ అయ్యారు. నేను ఎంఎస్ చేసి తర్వాత అక్కడే ఏదైనా జాబ్ చూసుకోవాలన్నది నా ఆలోచన. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇక ఎవరూ ఉండరు అని అనుకునేదాన్ని. అలా 2007లో అమెరికా వెళ్లాను. ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరాను. పెద్దన్నయ్య చాలా ఏండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. తర్వాత అక్కడే ఉండే తెలుగు అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. తర్వాత చిన్నన్న వెళ్లాడు. వాళ్లు ముగ్గురూ కలిసి ఒకే ఆఫీస్‌లో జాబ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు మా పెద్దన్నే ఆఫీస్ యూనిట్ ఇన్‌చార్జి. నేను, చిన్న చెల్లె చదువుకునేవాళ్లం. ఆ అన్నయ్య వాళ్లు నన్ను సొంత చెల్లి కంటే మంచిగా చూసుకునేవాళ్లు. మేం చెయ్యడానికంటూ ఏ పనీ ఉండకపోయేది. వదినే అన్నీ చేసిపెట్టేది. చెల్లెను, నన్ను కాలేజీ దగ్గర వదిలేసి వాళ్లు ఆఫీస్‌కు వెళ్లేవాళ్లు. ఇదే మా ప్రపంచం. అక్కడ ఫలానావాళ్లే స్నేహితులంటూ ఏమీ ఉండదు. అందరూ స్నేహితులే. నాకేమో తెలుగువాళ్లతోనే మాట్లాడాలి అని అనిపించేది. ఎందుకో ఏమో వేరేవాళ్లను అంత ఈజీగా నా అనే కోణంలో చూడలేకపోయేదాణ్ని.
Love-story

అప్పుడు జూన్-జూలై నెల. అమెరికాలో అప్పుడు వేసవి సెలవులు ఉంటాయి. ప్రతీ సంవత్సరం ఈ సీజన్‌లో ఇండియాకు వస్తుంటారు అన్నయ్యవాళ్లు. ఆ సంవత్సరం నేను ఉన్నాను.. నాకు ఇబ్బంది అవుతుందేమో అని వెళ్లొద్దు అనుకున్నారు. కానీ కచ్చితంగా వెళ్లాల్సిన పెండ్లి ఒకటి ఉండటంతో ఇండియాకు వెళ్లడానికే వాళ్లు మొగ్గు చూపారు. మరి నా పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఎదురైనప్పుడు అన్నయ్య అన్నీ సెట్ చేసే వెళ్తారనే ధీమా ఒకటి ఉండేది. వదిన వాళ్ల కజిన్ ఒకతను మేం ఉంటున్న ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. ఆయనది అక్కడే ఉద్యోగం. ఇంకా పెండ్లి కాలేదు. అన్నా, వదిన ప్లాన్ ఏంటంటే నాకు తోడుగా అతడిని ఉంచుదామని. నాకు వేరేవాళ్లతో ఉండాలంటే పరమ చిరాకు. అంతకన్నా ఎక్కువ మొహమాటం. ఏం చేయాలి? అన్నయ్యవాళ్లు నన్ను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయరు అనుకున్నాను. ఇండియాకు ఫోన్ చేసి అమ్మవాళ్లతో ఇదే విషయం చెప్పాను. మాకన్నా అన్నయ్యకే ఎక్కువ తెలుసు కదరా. వాడు నిన్ను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయడు అన్నారు. నేను సరే అన్నాను. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్. అన్నయ్యవాళ్లు మళ్లీ అమెరికాకు రావడానికి ఎంత లేదన్నా ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు నేను ప్రశాంత్ ఇద్దరమూ కలిసి ఉండాల్సిందే అని తెలియగానే నాకు ఏదోలా అనిపించింది. కానీ అమెరికాలో అవన్నీ కామన్. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా కలిసే ఉంటారు. సర్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేస్తాం అని సముదాయించుకొని ఓకే చెప్పేశాను. అన్నయ్యవాళ్లు ఇండియా వెళ్లారు.

మొదటిరోజు. నేను లేచేసరికే ప్రశాంత్ లేచి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. స్నానం చేశాడు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. నేను రెడీ అయితే నన్ను కాలేజీ దగ్గర దించేసి ఆఫీస్‌కు వెళ్లాలని అతని ఆలోచన. యాభై కిలోమీటర్ల దూరం వెళ్లాలి కదా అందుకే అన్నీ చకచకా చేసేసుకున్నాడు. అక్కడ యాభై కిలోమీటర్ల ప్రయాణం పెద్ద దూరమేమీ కాదు. ఒక్కొక్కరు అయితే రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా మా కాలేజీకి వస్తుంటారు. సరే అది పక్కన పెడితే.. అతని పరిస్థితి అర్థం చేసుకొని నేను త్వరగా రెడీ అయ్యాను.
కార్లో వెనకాల కూర్చోవడానికి వెళ్తుంటే.. ఏ దివ్యా. ముందు కూర్చో పర్లేదు అన్నాడు. కొద్దిసేపు తటపటాయించిన నేను థ్యాంక్స్ అంటూ వచ్చి ముందు సీట్లో కూర్చున్నాను. హా.. ఏం సంగతి? ఏం చేస్తున్నావ్? నన్ను ఎప్పుడైనా చూశావా? పరిచయం చేసుకున్నాడు. హా.. నేను చూల్లేదు. మీరు వదినవాళ్ల కజిన్ కదా? అని ఏదో ఒకటి మాట్లాడాను. దిగేటప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చాడు. ఇదెక్కడిది? అని అడిగితే పొద్దున నేనే చేశాను అన్నాడు. అక్కా వాళ్లు నిన్ను కేవలం కాలేజీ దగ్గర వదిలిపెట్టమని మాత్రమే చెప్పలేదు. నీ బాధ్యత మొత్తం నాదే అని చెప్పారు. వారి మాటను గౌరవించాల్సిన బాధ్యత నాది. నీకు ఏం అవసరమున్నా? ఏం చెప్పాలనుకున్నా నాతో నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇండియా లెక్క కాదు. మనకు ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత త్వరగా డెవలప్ కావచ్చు అని చాలాసేపు లెక్చర్ ఇచ్చాడు. సాయంత్రం ఇక్కడే ఉండు.. అంటూ చెప్పి తన నంబర్ ఇచ్చాడు. సాయంత్రం కాలేజీ అయిపోగానే నేను ప్రశాంత్‌కు ఫోన్ చేసి ఒక ఫుడ్‌కోర్ట్‌లో వెయిట్ చేస్తున్నానని చెప్పాను. ట్వంటీ మినట్స్‌లో వస్తాను అని చెప్పాడతను. రోజూ ఇలాంటి సన్నివేశాలతో మా కథ నడుస్తుండేది. వారం తిరగ్గానే మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. హే దివ్యా.. నీకు ఏదైనా లవ్‌స్టోరీ ఉందా? అన్నాడు. లేదంటూ తలూపాను. ఎహే చెప్పు. మనకు అలాంటి తొక్కలో సెంటిమెంట్లు ఏమీ ఉండవు అన్నాడు. అబ్బో ఏదో ఇరికించే ప్రయత్నమే చేస్తున్నాడు అనుకొని.. ముందు నువ్వు చెప్పు అన్నాను. నేను ఇప్పుడు జెస్సీతో లవ్‌లో ఉన్నాను. రేపు పార్టీ కూడా ఉన్నది. వెళ్లాలి. మాది థ్రీ ఇయర్స్ లవ్‌స్టోరీ. ఇక్కడ ఇంత లాంగ్ టర్మ్ ఏ లవ్ స్టోరీ నడవదు. కానీ మాది నడుస్తున్నది. ఆమె తెలుగు కాదు. అసలు ఇండియనే కాదు. కానీ నాతో లవ్‌లో పడింది అని చెప్పాడు. నాకు వింతగా అనిపించింది. సొంత రాష్ట్రం కాదు.. సొంత దేశం కాదు.. ఆమెది అమెరికా.. ఇతడేమో ఇండియా. ఎలా కుదురుతుంది. మన కల్చర్ వేరు.. వాళ్ల కల్చర్ వేరు కదా? అనుకున్నాను. కానీ గ్రేట్ కదా అనుకున్నాను.

మరుసటి రోజు తన లవర్‌తో పార్టీ ఉందని వెళ్లాడు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. బోర్ కొట్టింది. నేను ఇండియాలో ఊళ్లో ఉన్నప్పుడే ఒక్కదాన్ని అసలు ఉండకపోయేదాణ్ని. అలాంటిది దేశంగాని దేశంలో ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే ఉండటమా అనే ఆలోచన వచ్చేసరికి భయమేసింది కూడా. నాలుగుసార్లు ఫోన్ చేశాను. లిఫ్ట్ చెయ్యలేదు. లవర్‌తో హ్యాపీగా గడుపుతుండొచ్చు. ఫోన్‌చేసి డిస్టర్బ్ చేయడం దేనికి? అనుకున్నాను. ఎంతకూ నిద్రపట్టడం లేదు. మెలకువ ఉంటేనేమో లేనిపోని ఆలోచనలేవో వస్తున్నాయి. షెల్ప్‌లో చూస్తే స్లీపింగ్ టాబ్లెట్లు ఉన్నాయి. త్వరగా నిద్ర పట్టాలని నిద్రమాత్రలు వేసుకున్నాను. నాకేది గుర్తులేదిక. ప్రశాంత్ నాకు ఎన్నోసార్లు ఫోన్ చేశాడట. ఏంటీ కంగారుగా ఉన్నావ్? అని అతని లవర్ అడిగితే మా ఫ్యామిలీ ఫ్రెండ్ దివ్య ఇంట్లో ఒక్కతే ఉంది. ఆమె ఊరికి కొత్త అని చెప్పాడట. అతడు పదే పదే నాకు ఫోన్ చేయడం.. ఆమె అతన్నే గమనించడం. తనకంటే నాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం.. ఆమె అలగడం.. ప్రశాంత్ కోప్పడటం ఇవన్నీ జరిగాయట. పాపం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నా కోసం తన ప్రేమను కూడా వదలుకున్నాడు ప్రశాంత్. అదే రాత్రి ఇంటికొచ్చి చూస్తే నేను బెడ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అన్నయ్యవాళ్లకు సమాచారం ఇస్తే ఆందోళన చెందుతారని ఎవరికీ చెప్పకుండా మేనేజ్ చేశాడు. సరైన సమయానికి హాస్పిటల్‌కు తీసుకెళ్లడం వల్ల నేను బతికిపోయాను. మూడ్రోజులకు కోలుకున్నాను. అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నాడు. కోలుకున్నాక నాపై చాలా కోప్పడ్డాడు. చిన్న పిల్లల మనస్తత్వం ఉంటే ఎట్లా అని మందలించాడు. తర్వాత తన బ్రేకప్ గురించి చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. అలా మా మధ్యలో ప్రేమ చిగురించింది. నేను అతన్నే పెండ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అతనూ ఓకే అన్నాడు. అన్నయ్యవాళ్లు అనుకున్నదాని కంటే ఓ పది రోజులు ఆలస్యంగా అమెరికా వచ్చారు. నాలో ఉన్న యాక్టివ్‌నెస్‌ను చూసి షాక్ అయ్యారు. ప్రశాంత్ ఎలా చూసుకున్నాడు? అని అడిగారు. అన్నీ ఓకే అని చెప్పేశాను. ప్రశాంత్ మళ్లీ తను గతంలో ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయాడు. నేను ఇప్పటివరకు ఎవరికీ నా ప్రేమ గురించి చెప్పలేదు. అతడైనా చెప్తాడేమో అనుకుంటే అతడిదీ సేమ్ సిచ్యువేషన్. కానీ వదిన మా ప్రేమను పసిగట్టింది. ఆమెకు తెలిసిపోయింది. నన్ను నిలదీస్తే అలాంటిది ఏమీ లేదన్నాను. ప్రశాంత్‌ను అడిగిందో లేదో తెలియదు. ఇప్పుడు నాకేమో ఇక్కడే ఎన్నారై సంబంధమేదైనా ఉందేమో అని చూస్తున్నారు మా వాళ్లు. నేను ప్రశాంత్‌ను ప్రేమించాను కాబట్టి అతడినే చేసుకుంటా. త్వరగా మా ప్రేమ ఫలిస్తుందనే నమ్మకమైతే ఉన్నది. ప్రశూ.. నువ్వు నాకు పునర్జన్మను ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ఈ జన్మ వేరేవాళ్లకు నేను దాసోహం చేయలేను. ఎప్పటికైనా నేను నీతోనే ఉంటాను. నువ్వు కూడా అర్థం చేసుకొని మన ప్రేమను విజయవంతం అయ్యేలా చూడగలవని కోరుతున్నాను. లవ్ యూ ప్రశూ.. నీ దివ్య!

చిన్న పిల్లల మనస్తత్వం ఉంటే ఎట్లా అని మందలించాడు. తర్వాత తన బ్రేకప్ గురించి చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. అలా మా మధ్యలో ప్రేమ చిగురించింది. నేను అతన్నే పెండ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అతనూ ఓకే అన్నాడు. అన్నయ్యవాళ్లు అనుకున్నదాని కంటే ఓ పది రోజులు ఆలస్యంగా అమెరికా వచ్చారు. నాలో ఉన్న యాక్టివ్‌నెస్‌ను చూసి షాక్ అయ్యారు. ప్రశాంత్ ఎలా చూసుకున్నాడు? అని అడిగారు. అన్నీ ఒకే అని చెప్పేశాను. ప్రశాంత్ మళ్లీ తను గతంలో ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయాడు. నేను ఇప్పటివరకు ఎవరికీ నా ప్రేమ గురించి చెప్పలేదు. అతడైనా చెప్తాడేమో అనుకుంటే అతడిదీ సేమ్ సిచ్యువేషన్. కానీ వదిన మా ప్రేమను పసిగట్టింది.

1059
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles