పాల్వంచ సమేత భద్రాచల సంస్థానం


Sun,June 10, 2018 09:36 AM

(పద్మనాయకులు - సంస్థానాలు: పదో భాగం)

సీతారామ లక్ష్మణులు అరణ్యవాస కాలంలో నివసించిన పంచవటీ క్షేత్రం ఈ సంస్థానంలోనే ఉంది. త్రేతాయుగం నుండి నేటికీ పవిత్రభూమిగా కొలుస్తున్న ప్రాంతమిది. పంచవటి, దమ్మక్క, గోపన్న లాంటి భక్తశిఖామణులు వెలసిన భద్రాచల క్షేత్రం ఈ గడ్డ మీదిదే. భద్రాచల స్వామి సంరక్షకులుగా, సంస్థాన పాలకులుగా 27 తరాల పాటు సేవ చేసిన విఖ్యాత అశ్వారావు బిరుదు ప్రదానులు పాలించిన సంస్థానమే.. పాల్వంచ సమేత భద్రాచల సంస్థానం.

పాల్వంచ - భద్రాచల సంస్థానం నిజాం రాష్ట్రంలో స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాచీన సంస్థానం. 800 చదరపు మైళ్ల విస్తీర్ణం, 315 గ్రామాల్లో 40 వేల జనాభా (1927 లెక్కల ప్రకారం) ఈ సంస్థానం సొంతం. పాల్వంచ పూర్వ నామం శంకరగిరి. సంస్థాన విషయంలో పాల్వంచ, భద్రాచలం వేర్వేరు కాదు. సంస్థాన పూర్వీకులకు రాజధానిగా ఉన్న భద్రాచలం.. గోల్కొండ నవాబుల కాలంలో కొంతకాలం విడిపోయింది. తర్వాత తిరిగి పాల్వంచ సమేతమైంది. నిజాం కాలంలోనూ ఇలాగే జరిగింది. గోదావరి మండలంలోని భద్రాచలం, రేకపల్లిని 1860లో అప్పటి నిజాం బ్రిటీషు ప్రభుత్వానికి ఇవ్వడంతో అవి సెంట్రల్ ప్రొవిన్సెస్ (Central provinces)లో చేరాయి. ఆ తర్వాత 1874లో భద్రాచలంతో పాటు రేకపల్లి చెన్నపురిలోని తాలూకాలుగా మారాయి. ఇంతకీ పాల్వంచ నుంచి భద్రాచలం ఇలా రెండుసార్లు ఎందుకు విడిపోయింది? తిరిగి ఎలా కలిసింది? - ఈ సంస్థానం మూలాల గురించిన సమాచారం మరింత ఆసక్తికరం. ప్రఖ్యాత పద్మనాయక వెలమల్లో విఖ్యాత విప్పర్ల గోత్రానికి చెందిన అశ్వారావు వారు ఈ సంస్థాన పాలకులు. అశ్వారావు అనేది వీరికి కాకతీయులు ఇచ్చిన బిరుదు. అశ్వారావులు అంటే అశ్వదళాధిపతులు. కాకతీయ సామ్రాజ్య కాలం నుండి భద్రాచలం రాజధానిగా వీరు పాలన సాగించారు. కాకతీయ సామ్రాజ్యానంతరం వీరి పూర్వీకుల్లో ఒకడైన అన్నప్ప అశ్వారావుకు ఢిల్లీ సుల్తాను ఈ ప్రాంతాన్ని తిరిగి ఇచ్చినట్లు చరిత్ర చెబుతున్నది.

అన్నప్ప అశ్వారావు క్రీ.శ. 1324లో శంకరగిరి, హసనాబాద్ పరగణాలతో కూడిన ప్రాంతమైన పాల్వంచ భద్రాచలం జమీందారీకి పాలకుడుగా ఉన్నట్లు బ్రిటీష్ రికార్డులు, గోదావరి గెజిట్‌ల వల్ల తెలుస్తున్నది. పాల్వంచ జమీందారులే భద్రాచలం జమీందారులు అని కూడా ఈ గెజిట్ చెబుతున్నది. అన్నప్ప అశ్వారావు ఈ సంస్థానానికి మూలపురుషుడు. ఇతడు నూజివీడు సంస్థాన మూలపురుషుడైన బసవదండనాథుని వంశానికి చెందినవాడు. అన్నప్ప అశ్వారావు కాలం నుండి పద్దెనిమిది తరాల వారు ఈ భూభాగాన్ని స్వతంత్రంగా పాలించినట్లు సంస్థాన చరిత్ర చెబుతున్నది. ఈ సంస్థాన పాలకుల్లో 16వ శతాబ్దానికి చెందిన సర్వప్ప అశ్వారావు విఖ్యాతుడని సింహాచల ఆస్థాన మంటప శాసనం చెబుతున్నది. ఈ సర్వప్ప నూజివీటి సంస్థాన నిర్మాత విజయ అప్పారావుకు సమకాలికుడు. క్రీ.శ. 1650 ప్రాంతంలో గోల్కొండ నవాబులు ఢిల్లీ సుల్తాను ఆధిపత్యాన్ని ధిక్కరించి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. రాజకీయ విప్లవాలు అనేక రూపాలుగా కొనసాగిన ఈ సందర్భంలో పాల్వంచ సంస్థానాధీశులు ఢిల్లీ సుల్తాన్ పక్షం వహించారు. ఇందుకుగాను సుల్తాను అశ్వారావు వారికి రైవత్ వ అవలి మహనా అనే బిరుదునిచ్చారు.
Badradritemple

ఢిల్లీ సుల్తానుల తరపున పాల్వంచ సంస్థానాధీశులు యుద్ధంలో ఉన్న సమయం చూసి క్రీ.శ. 1668లో గోల్కొండ నవాబు తానీషా భద్రాచలాన్ని వశపరుచుకున్నాడు. ఈ సమయంలో అక్కన్న మాదన్నలు తానీషా కొలువులో ప్రధానమంత్రులుగా ఉన్నారు. తానీషా భద్రాచలాన్ని వశపరుచుకున్న ఏడాది తర్వాత అక్కన్న మాదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న భద్రాచల పరగణాకు తహశీల్దారుగా వచ్చాడు. ఆ తర్వాత రామభక్తి పరాయణుడైన గోపన్న శ్రీరామదాసుగా మారిన చరిత్ర, భద్రాచల క్షేత్ర ప్రాశస్త్యం మనకు తెలిసినవే. హైదరాబాద్ షాలిబండలోని మహంకాళీ ఆలయాన్ని నిర్మించింది ఈ అక్కన్న మాదన్నలే. క్రీ.శ. 1687లో గోల్కొండను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వశపర్చుకున్నాడు. దీంతో భద్రాచల సంస్థానం తిరిగి అశ్వారావుల వశమయ్యింది. ఔరంగజేబు భద్రాచలాన్ని తిరిగి అశ్వారావులకు అప్పజెబుతూ బాద్‌షాహి మున్సబ్‌దార్ అనే బిరుదునిచ్చి సత్కరించాడు. క్రీ.శ. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత 1724లో మొఘల్ సర్దారుల్లో ఒకడైన అసఫ్ జాహీ నిజాముల్ ముల్క్ దక్కను సుబేదారుగా వచ్చి నిజాం రాజ్యం స్థాపించాడు. క్రీ.శ. 1769లో జాఫర్ ఉద్దౌలా అనే మొఘల్ సేనాని పాల్వంచ సంస్థానంపై దాడి చేశాడు. ఆనాటి పాలకుడు నరసింహ అశ్వారావును సంహరించి సంస్థానాన్ని కొల్లగొట్టాడు. కొంతకాలం తర్వాత తురుష్క సేనాని ఇబ్రహీం ఖాన్ (హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్ హయాంలోని ఎలగందల ఖిలేదార్ మీర్జా ఇబ్రహీం దంసా కావొచ్చు) జమీందారులను దోచుకొంటూ ధ్వంసకాండ తలపెట్టాడు. ఇతనిని దంసా అని తెలుగు కవులు పేర్కొన్నారు. ఈ దంసా దమనకాండతో సంస్థానం మరింత శక్తిని కోల్పోయింది.
నరసింహ అశ్వారావు కుమారుడు రామచంద్ర అశ్వారావు. తండ్రి మరణం తర్వాత భద్రాచల క్షేత్రం స్వామి వారికి రక్షణ బాధ్యత రామచంద్ర అశ్వారావుకు సమస్యగా మారింది. ఈ స్థితిలో రామచంద్ర అశ్వారావు ఆలయంలో స్వామి కనబడకుండా అడ్డుగోడ కట్టి ఉత్సవమూర్తులతో బస్తరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు భద్రాచల క్షేత్ర చరిత్ర చెబుతున్నది. కొంతకాలం తర్వాత తిరిగి రామచంద్ర అశ్వారావు సంస్థానాన్ని దక్కించుకొని, నిజాం రాజ్యానికి సామంత రాజుగా పాలించాడు. ఒక సంవత్సరం పాటు పాలించిన అనంతరం క్రీ.శ. 1788లో రామచంద్ర అశ్వారావు మరణించాడు. ఈయనకు సంతానం లేకపోవడంతో పాలనా అధికారం కోసం సంస్థానంలో చాలాకాలం అంతఃకలహాలు చెలరేగాయి. ఈ సంస్థానాధీశుల్లో ఇరవై ఒకటో తరానికి చెందిన వెంకటరామ నరసింహ అశ్వారావు 1798లో నిజాం నుండి రాజా బహద్దూర్, సవై మున్సబ్‌దారు అనే బిరుదులను, జెండా, నగారా, నౌబత్‌లను, రెండు వేల అశ్విక సేన, మూడు వేల సైన్యాన్ని కలిగి ఉండే అధికారాన్ని పొందారు.

ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్న పాల్వంచ భద్రాచల సంస్థానం వారసత్వం మహ్మదీయుల దాడుల వల్ల, చేతులు మారుతూ అప్పుల పాలైంది. దీంతో సంస్థానం హక్కుల కోసం దామెర వారు, సెట్టిపల్లి వారు తగాదాలకు దిగారు. పోటీలు పడ్డారు. క్రీ.శ. 1800 నుంచి 1858 మధ్య జరిగిన అనేక కలహాల వల్ల సంస్థానం క్షీణదశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో సీతారామచంద్ర సవై అశ్వారావు బహద్దూర్, సర్ సాలార్ జంగ్ బహద్దూర్ సహాయంతో ఈ తగాదాల నుంచి బైట పడి జమీని చేజిక్కించుకుని, కొంతకాలం పాలించాడు. ఈ సమయంలోనే గతంలోని అప్పులు తీర్చే క్రమంలో గోదావరి మండలంలోని రేకపల్లి, భద్రాచలం ప్రాంతాలను నిజాం ప్రభుత్వం బ్రిటీషు వారికి ధారాదత్తం చేసింది. సీతారామచంద్ర అశ్వారావు పెండ్లి కాకముందే మరణించాడు. దీంతో ఇతని తల్లి రాణీ లక్ష్మీ నరసయ్యమ్మ కొంతకాలం పాలన సాగించింది. ఈమె కుమార్తె నూజివీడు సంస్థానానికి చెందిన నాలుగో వేంకటాద్రి అప్పారావును పెండ్లాడింది. వీరి కుమారుడు రాజా పార్థసారథి అప్పారావు. రాణీ లక్ష్మీ నరసయ్యమ్మ క్రీ.శ. 1857లో మరణించిన తర్వాత మనవడు రాజా పార్థసారథి అప్పారావు పాల్వంచ భద్రాచలం సంస్థానానికి వారసుడయ్యాడు. రాజా పార్థసారథి అప్పారావు ప్రతిభావంతుడైన జమీందారుగా పేరుగాంచాడు. ఉర్దూ సంస్కృతాంధ్ర పార్సీ భాషల్లో పండితుడు. ఈయన అసమాన వాక్ చాతుర్యాన్ని నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ మెచ్చుకునేవారట. నిజాం పట్టాభిషిక్తుడైన సమయంలో పార్థసారథి అప్పారావుకు విలువైన దుస్తులు, రత్నహారాలు బహుకరించారట.
Badradritemple1

ఈయన తన వ్యవహార దక్షతతోనే పూర్వం బాకీ కింద తీసుకున్న భూభాగాలను బ్రిటీషు వారి నుంచి తిరిగి పొందారట. రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, సొంత పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించుకునే అధికారాలు కూడా ఇచ్చారట. స్వతంత్ర రాష్ర్టాలకు తప్ప మిగిలిన ఏ సంస్థానానికి కూడా లేని ఇలాంటి అధికారాలు పార్థసారథి అప్పారావు పొంది అసమాన ప్రతిభాశాలిగా పేరు సంపాదించాడు. రాజా పార్థసారథి అప్పారావు మైలవరం యువరాణి సీతమాంబను పెండ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు. వీరిలో పెద్ద కుమారుడు నారయ్యప్పారావు. ఈయన పిఠాపురం రాజకుమారి అన్నపూర్ణా దేవిని పెండ్లాడాడు. వీరికి ముగ్గురు కుమారులు. పెద్దవాడు విజయ అప్పారావు.
పార్థసారథి అప్పారావు తర్వాత 1932 నుంచి ఆయన పెద్ద కొడుకు నారయ్యప్పారావు, తర్వాత ఆయన కొడుకు విజయ అప్పారావు సంస్థానాన్ని పాలించారు. జమీందారీ రద్దు చట్టం మేరకు, పోలీసు చర్య తరువాత ఒడంబడికల ప్రకారం ఈ సంస్థానం ప్రభుత్వ వశమైంది. విజయ అప్పారావు తర్వాతి తరం వారు ఏమయ్యారనేది చారిత్రకంగా అందుబాటులో లేదు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావు పేట అనే ఒక మండలం ఉంది. ఆశ్వారావు పేటకు ఆ పేరు ఎందుకు వచ్చిందని ప్రముఖ చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ పరిశీలించారు. క్రీ.శ. 1324లో పాల్వంచను పాలించిన అప్పన్న అశ్వారావు పేరు మీదనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు ఆ వంశానికి చెందిన వారసులు చెబుతున్నారు. ఎనిమిదో తరానికి చెందిన మహీపాల్‌ను శ్రీనివాస్ కలిసి మాట్లాడారు. ఈ సంస్థానానికి మొదటి రాజధాని పాల్వంచ అయి ఉంటుందనేది ఒక అంచనా. కానీ అశ్వారావు పేట మధ్యలో ఉన్న ఇప్పటి సాధారణ గ్రామం పోలవరపు పాడు మొదటి రాజధాని అయి ఉంటుందనేది మరో వాదన. పొలవాస ప్రాంతానికి సమానమైన పేరుగా పోలవరపు పాడు లేదా పాల్వంచ ఏర్పడడానికి ప్రధాన కారణమైన ఊరు ఇదేనని చెబుతున్నారు. దానికి ఆధారంగా ఈ ప్రాంతంలో బంగారు ఆభరణాలు, నాణేలు లభ్యమయ్యాయి.


నగేష్ బీరెడ్డి, సెల్ : 80966 77177

1171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles