పార్టీ గర్ల్


Sun,April 21, 2019 02:54 AM

మొదటగా మొగాళ్ళ పత్రికలోని ఆ ప్రకటనని చూసిన క్లారెన్స్ ఆమెపట్ల ఆకర్షితుడు అయ్యాడు.లైఫ్ సైజ్ పార్టీ దాల్. గాలి ఊదితే 42-22-40 పరిమాణానికి ఉబ్బుతుంది. వినైల్ చర్మం. మూడు రకాల జుట్టు. ఎర్ర జుట్టు గోధుమ రంగు జుట్టు. బంగారు రంగు జుట్టు. ప్రతీ మగాడికీ ఓ పార్టీ గర్ల్ ఉండి తీరాలి. వెంటనే నాలుగు వందల డాలర్లు పంపండి.ఇండియానా రాష్ట్రంలోని ఓ చిన్న ఊరి చిరునామా ఆ ప్రకటనలో ఇచ్చారు. ఆ ప్రకటనని ఒకటికి రెండుసార్లు చదివిన కొద్దీ క్లారెన్స్‌తో ఎక్సైటిమెంట్ అధికమైంది. తనకి అవసరమైంది ఇదే అని అతనికి అర్థమైంది. తను తప్పకుండా ఆమెని సంపాదించి తీరాలి అని తీర్మానించుకున్నాడు.అతను దాని ధర గురించి ఆలోచించాడు. అది అతనికి అందుబాటులో లేని ధర. వేక్యూం క్షీనర్ మీద ఇంకా మూడు వాయిదాలు చెల్లించాలి. పెట్రోల్ బంక్ బిల్ ఎటూ తప్పదు. అంతలోనే అతనికి రసహీనమైన తన భార్య గుర్తొచ్చింది. తను ఆమెని ఎక్కడ ముట్టుకుంటాడో అని సదా జాగ్రత్తగా గమనిస్తూ తనకి దూరంగా ఉండే భార్యతో రతిలో పాల్గొని ఎంత కాలమైందో కూడా అతనికి గుర్తు లేదు. తనది పెరిగే వయసు కాని తరిగేది కాదు.

త్వరలోనే అల్సర్, గుండె జబ్బు లాంటివి వచ్చే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాక ఇక చేసేదేం ఉండదు. అతని మనసు సదా ఎలా సెక్స్ సుఖాన్ని పొందాలా అని ఆలోచిస్తూంటుంది.అతనికి పరిచయం ఉన్న ఆడవాళ్ళల్లో ఎవరూ అతనితో ఆ రకం పరిచయానికి ఆసక్తి చూపించలేదు. తను ఎంత రొమాంటిక్‌గా ప్రవర్తించగలడో వాళ్ళెవరూ కనీసం ఊహించలేరు కూడా.అతని దృష్టి ఆ ప్రకటనలోని గాలి ఊది పెంచబడ్డ ఆ పార్టీ గర్ల్ ఆకృతినే చూస్తూండిపోయింది. అద్భుతమైన వంపులు. ఎంత ఖర్చయితేనేం? అవన్నీ తనవి అవుతాయి.ఇంటికి వెళ్ళాక తను క్రిస్ట్మస్ బహుమతుల కోసం డబ్బు ఆదా చేస్తున్న సీసాని తీసుకొని తన భార్య చూడకుండా అందులోని నాణాలని, నోట్లని లెక్క పెట్టాడు. ఇరవై డాలర్ల చొప్పున నలుగురు మిత్రుల నించి చేబదులు తీసుకుంటే నాలుగు వందల డాలర్లని తేలిగ్గా సమకూర్చుకోగలడని అర్థమయ్యాక ఆనందంగా నిట్టూర్చాడు. దాన్ని కొనే తన ప్రతీ అడుగునీ జాగ్రత్తగా పథకం వేసాడు. తన భార్య మార్తాకి తెలీకుండా దాన్ని కొనాలి.
PartyGirl

మొదటి సమస్య తను డబ్బు పంపి ఇంటి ఎడ్రసకి దాన్ని డెలివరీ చేయమనలేడు. ఆ పెట్టె వస్తే మార్తా దాన్ని విప్పి చూస్తుంది. అది తనకి పోటీ అని ఇట్టే తెలుసుకుని చింపేస్తుంది. ఆలోచించి పోస్ట్ ఆఫీస్‌లో ఓ బాక్స్ ని అద్దెకి తీసుకున్నాడు. మర్నాడు పార్టీ దాల్ కోసం ఆ ప్రకటనలోని చిరునామాకి డబ్బు పంపాడు.అది రావడానికి మూడు వారాలు పట్టింది. అది వచ్చే దాకా క్లారెన్స్ పోస్ట్ ఆఫీస్‌కి ఫోన్ చేసి వచ్చిందా అని విచారిస్తూనే ఉన్నాడు. .మూడు వారాల తర్వాత పోస్టల్ క్లర్క్ అతని సంతకం తీసుకుని ఓ పొడుగాటి కార్డ్ బోర్డ్ పెట్టెని ఇచ్చాడు. క్లారెన్స్ దాంతో కొద్ది దూరంలోని క్రిసెంట్ హిల్లోని తన ఇంటికి బయలుదేరాడు. దాంతో ఇంట్లోకి వెళ్తే మార్తా గద్ద కళ్ళు దాన్ని చూస్తాయి. తన కన్నా ముందే ఆమె ఎక్సయిటింగ్ గా అదేమిటని అడిగి, కత్తెర తెచ్చి విప్పతీసి చూస్తుంది. పైగా తను రావడం ఆలస్యమవడంతో వంట పూర్తి చేసి ఎదురు చూస్తూంటుంది. క్లారెన్స్ ఆ సమస్యకి పరిష్కారాన్ని ముందే ఆలోచించి పెట్టుకున్నాడు.చీకటి పడుతూండగా అతను ఇంటికి ఎడమవైపు కాంపౌండ్ వాల్, ఇంటి గోడకి మధ్య గల చిన్న సందులోకి పిల్లిలా నడిచాడు. దాన్ని అక్కడ ఉన్న చెత్త డబ్బాలో ఉంచాడు. మర్నాడు ఉదయమే వాళ్ళు వచ్చి చెత్తని తీసుకునేది. అప్పటి దాకా అది అక్కడే భద్రంగా ఉంటుంది.

అతను తాళంచెవితో ఇంటి తలుపు తాళం తీసి లివింగ్ రూంలోకి వెళ్ళాడు. మార్తా చిరాకు మొహంతో వెంటనే దండకం మొదలు పెట్టింది.క్లారెన్స్! ఎక్కడికి వెళ్ళారు? ఇరవై నిమిషాలు ఆలస్యం చేసారు. ముందు ఫోన్ చేసి ఆలస్యం అవుతుందని చెప్పక్కర్లేదా? మీకు చల్లటి భోజనాన్నే వడ్డిస్తాను.ఆఫీస్‌లో పనెక్కువై ఆలస్యమైంది. క్లారెన్స్ గొణిగాడు. నేను ఆఫీస్‌కి ఫోన్ చేస్తే ఎవరూ రిసీవర్ తీయలేదే? ఆ సరికి ఆఫీస్ తాళం వేసి నేను ఇంటి దారిలో ఉన్నాను.భోజనం చల్లగా, రుచి లేకుండా ఉన్నా ఆ రాత్రి అది అతన్ని బాధించలేదు. పార్టీ గర్ల్ వచ్చింది, అది త్వరలో తన ఇంట్లోకి వస్తుందనే ఆలోచనే అతనికి ఆనందంగా ఉంది. భోజనం తర్వాత ఎప్పటిలా రెండు గంటల పాటు టి.వి ముందు భార్య పక్కన కూర్చుని గోళ్ళు కొరుకుతూ గడిపాడు. గాసిప్ లేదా పోట్లాట. ఈ రెండూ తప్ప మార్తా మరి దేనికీ నోరు తెరవదు. ఆ రెండు గంటల సేపు మాత్రం మార్తా మౌనంగా ఉంటుంది.రాత్రి పదికి లేచి మార్తా తన కట్టుడు పళ్ళని నీళ్ళ గ్లాస్‌లో ఉంచి తన పడక గదిలోకి వెళ్ళింది. చాలా మంది అమెరికన్ భార్యాభర్తల్లా వాళ్ళిద్దరూ చెరో పడక గదిలో పడుకుంటారు. గుడ్‌నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. తర్వాత అసహనంగా అరగంట సేపు వేచి ఉన్నాడు. తర్వాత వెళ్ళి ఆమె తలుపుకి చెవి ఆనించి విన్నాడు. చిన్నగా గురక వినిపించడంతో నిశ్శబ్దంగా ఇంటి తలుపుని తెరిచి వెళ్ళి ఆ పెట్టెని లోపలకి తెచ్చాడు. .

ఒకో మెట్టు మీద కాలు పెట్టినప్పుడల్లా అది కరకర శబ్దం చేస్తోంది. ఆ ఇల్లు అతనికి తల్లి నించి వారసత్వంగా వచ్చింది. మార్తా అటక మీదకి ఎప్పుడూ రాదు. ప్రతీ వసంత కాలంలో మాత్రం వెళ్ళి శుభ్రం చేస్తుంది. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. అటక తలుపు మూసి లైట్స్ వెలిగించాడు. ఆ పెట్టెని తెరచి అందులోంచి పార్టీ గర్ల్ రబ్బర్ బొమ్మని తీసాడు. ఆమె పొడుగ్గా, ఐదడుగుల ఆరంగుళాల ఎత్తులో ఉంది. కాని చప్టాగా ఉంది. అటకలోని పనికి రాని వస్తువుల మధ్య వెదికితే సైకిల్‌కి గాలి కొట్టే ఓ పాత పంపు కనిపించింది. దాన్ని ఉపయోగించి బ్రోచర్‌లో చెప్పినట్లుగానే ఆమె తల వెనక ఉన్న ఎయిర్ వాల్ఫ్ లోంచి గాలి కొట్టాడు. గాలి నిండే కొద్దీ ఆమె శరీరం ఉబ్బుతూంటే ఆరాధనగా దాని వంక చూడసాగాడు. చివరికి ఆమె మనిషి ఆకారంలో తయారై ఇంక గాలి లోపలకి వెళ్ళలేదు..ఆమె బట్టతల మీద బంగారు రంగు జుట్టు గల విగ్‌ని, ఆ పెట్టెతో పాటు వచ్చిన దుస్తులని తొడిగాడు. ఆమెని నిలబెడితే తన కాళ్ళమీద తనే నించుంది. ముట్టుకుంటే అచ్చం మనిషి చర్మంలా ఉంది. ఆమె ఎర్రటి పెదాల మీద సన్నటి చిరునవ్వు ఉంది. తమకంగా ఆమెని కౌగలించుకుని చెప్పాడు.బేబీ! నువ్వు నా దానివి.ఆమెని ఓ పక్క ఉన్న కేంప్ కాట్ మీది ఆర్మీ బ్లాంకెట్ మీద పడుకోబెట్టాడు. తన దుస్తులు విప్పి ఆమె పక్కకి చేరాడు. తెల్లవారే దాకా క్లారెన్స్ ఆమె పక్కనే గడిపాడు. అతనికి స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. ఆమెకి జేన్ అనే పేరు పెట్టాడు.

క్లారెన్స్ అమెజాన్ లాంటి కాసీ కోడ్స్ అనే ఓ పెద్ద కంపెనీలో హెడ్ క్లర్క్ పని చేస్తున్నాడు. ఆ కంపెనీ బికినీల నించి పెళ్ళి బట్టల దాకా అన్ని తరహా బట్టలని అమ్ముతుంది. వారి దగ్గర కొన్న బికినీలని ధరించిన అమ్మాయిలు త్వరలో ఓ యువకుడికి ఆకర్షణీయంగా మారి కొద్ది కాలానికి మళ్ళీ వారి నించి పెళ్ళి దుస్తులు కొనడం తరచు జరుగుతూంటుంది. రోజూ అతను అందమైన దుస్తులని పెట్టెల్లో ఉంచి పేక్ చేసి కస్టమర్లకి పంపుతూంటాడు.నా జేనికి ఒకటే డ్రస్ ఉంది అని అతనికి అనిపించసాగింది. జీవితంలో అంత దాకా ఎన్నడూ ఎలాంటి నేరం చేయని క్లారెన్స్ మొదటిసారి క్లాసీ కోడ్స్ కంపెనీ నించి ఓ బికినీని దొంగిలించాడు. మొదటి రాత్రి ఆమెతో తను ప్లేబాయ్‌లా ప్రవర్తించాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి అనుకుని కేటలాగ్ వెదికి, చక్కటి పెళ్ళి దుస్తులని దొంగిలించాడు. దాన్ని తన పోస్ట్ బాక్స్ రాసిన చిరునామా పెట్టెలో ఉంచి దొంగ బిల్లుతో కొరియర్ కంపెనీ మెసెంజర్‌కి మిగిలిన పెట్టెలతో ఇచ్చాడు. మార్తా చూడకుండా దాన్ని తన ఇంట్లోకి తీసుకెళ్ళడం ఇప్పుడు తేలికైంది.ఆ రాత్రి పార్టీ జేన్‌కి ఆ దుస్తులని తొడిగి చూసి, తను అంతదాకా అంత అందమైన జీవించి ఉన్న వధువుని చూడలేదు అనుకున్నాడు. అతను ఆమె పక్కన నిలబడి పెళ్ళిలో చెప్పే ప్రమాణాలని చేస్తే ఆమె కూడా వాటిని మళ్ళీ చెప్పింది. ఆమెలోని డిజిటల్ వాయిస్ రికార్డర్ విన్నది ఆడకంఠంతో తిరిగి చెప్తుంది. జేన్ ఇప్పుడు శాశ్వతంగా తనదే అనుకున్నాడు. ఆమె ఎప్పటికీ ఇంకో మగాడి వంక చూడదు. ఇంకో మగాడు కూడా ఆమెని చూడడు. ఆ రాత్రి కూడా ఆమెతోనే కేంప్ కాట్ మీద గడిపాడు.

నా భార్యకి కొత్త బూట్లు కావాలి అనుకోగానే వాటిని పోస్ట్ బాక్స్‌కి పంపించేస్తాడు. ఇంకా గ్రమ్స్, స్వెటర్, స్కార్ఫ్, డ్రస్లు... ఒకటేమిటి? అలా ఇంటికి పోస్టాఫీస్ నించి తెచ్చిన వాటిని అటకలోని వార్రోబ్‌లో పాత దుస్తుల చాటున హేంగర్స్‌కి వేలాడదీసాడు.ఉదయం జేన్‌లోంచి గాలి తీసేసి మళ్ళీ రాత్రి ఊదడం అతనికి బాధాకరంగా ఉన్నా మార్తా కళ్ళబడచ్చన్న భయంతో ఆ పని చేస్తున్నాడు. గాలితో ఉబ్బిన జేనని దాచడం కష్టం. ఓ రోజు మార్తా చెప్పింది. మా అమ్మ ఫోన్ చేసింది. ఒంట్లో బాలేదుట. అదేం సీరియస్ కాదని ఆశిద్దాం. క్లారెన్స్ వెంటనే చెప్పాడు. బాగా దగ్గంట. నాన్న పోయాక ఆవిడ ఒంటరిగా ఉంటోంది. నేను వెళ్ళి కొన్ని రోజులు ఉండి వద్దామని అనుకుంటున్నాను. అలాగే. శనివారం ఉదయం మార్తా వెళ్ళే ముందు హెచ్చరించింది. క్లారెన్స్. జాగ్రత్తగా ప్రవర్తించండి. ఆమెని బస్ ఎక్కించి ఇంటికి వస్తూంటే క్లారెన్స్ ఆనందానికి పగ్గాలు లేవు. శనాదివారాలు ఆ ఇంట్లో తను, జేస్ మాత్రమే. ఇంటికి వెళ్ళి జేన్‌ని కిందకి తెచ్చి, గాలి ఊది తన ఇంట్లోని ప్రతీ గదిని చూపించాడు.ఇది వంట గది జేన్. మార్తా వంట సరిగ్గా చేయలేదు... ఇది మార్తా పడక గది. ఆమెకి రతి కూడా చేతకాదు. ఇది నా... మన పడక గది. ఆ రెండు రోజులూ అతనికి రెండు క్షణాల్లా గడిచాయి. సోమవారం ఉదయం మార్తా తిరిగి వచ్చేసింది. అతని కామ జీవితం మళ్ళీ అర్ధరాత్రుళ్ళు అటక మీదకి బదిలీ ఐంది.

వారం తర్వాత మార్తా ప్రవర్తనలోని మార్పు క్లారెన్స్‌ని భయ పెట్టసాగింది. ఆమె అనేక అలమరలని, వార్డ్రోబ్‌లని తెరచి లోపల చూడసాగింది. ఏమిటి? అని అతను అడిగితే ఏం లేదు అని ముభావంగా జవాబు చెప్పింది. తను గదిలోకి వస్తూంటే తన అడుగుల చప్పుడు విని బయటకి వచ్చేస్తుంది. .దేని కోసం వెదుకుతున్నావు? బుధవారం చురుగ్గా చూస్తూ అడిగాడు.ఏం లేదు క్లారెన్స్. ఆమె కొద్దిగా ఇబ్బందిగా జవాబు చెప్పి మళ్ళీ ఇంకో ప్రశ్న వినదలచుకోనట్లుగా తన పడక గదిలోకి వెళ్ళిపోయింది.పెళ్ళయ్యాక మార్తా అలా వింతగా ప్రవర్తించడం క్లారెన్స్ ఎన్నడూ చూడలేదు. ఆమె మనసులో ఏదో ఉంది. జేన్ కోసం వెదుకుతోందని అతనికి అనిపించింది. ఆమెకి అసలు తన మీద ఎందుకు అనుమానం వచ్చినట్లు?
రాత్రిళ్ళు మరి కాస్త జాగ్రత్తగా ఉండాలనుకొని ఓ గంట ఆలస్యంగా అటక మీదకి వెళ్ళి, ఓ గంట ముందుగానే కిందకి దిగసాగాడు.రెండు రోజుల తర్వాత వర్షం పడుతూంటే క్లారెన్స్ ఆఫీస్ నించి సమయానికే ఇంటికి వచ్చాడు. అప్పటికే మూడు రోజులుగా పోస్టాఫీస్‌కి వెళ్ళి ఆలస్యంగా వస్తున్నాడు. అతని కాళ్ళకి రబ్బర్ బూట్లు ఉండటంతో అడుగుల చప్పుడు కాలేదు. వంట గదిలోని మార్తా ఎవరితోనో ఫోన్లో మాట్లాడేది విని ఆగిపోయాడు.షైనీ నేను చెప్పేది నువ్వు ఎప్పటికీ నమ్మలేవు. ఆమె కంఠంలో ఉత్కంఠ ధ్వనించడంతో ఏమిటి ఎప్పటికీ నమ్మనిది? అనుకుని ఆగి ఆసక్తిగా విన్నాడు.షెర్లీ, మార్తెలు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు..అది లైఫ్ సైజ్, రబ్బర్ లాంటి దాంతో దాన్ని చేస్తారు. శరీరంలో బయటకి ఉండే ప్రతీ అవయవం సరిగ్గా మనిషికి ఉన్నట్లుగానే ఉంటాయి. సైకిల్ పంపుతో గాలి కొట్టాలి. ఇలాంటివి కూడా చేస్తారా అని నివ్వెర పోయాను షేర్ క్లారెన్స్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. అసలు మార్తా ఎలా కనుక్కుంది? అనే ఆలోచన కలిగింది. ఇంక తనకి జెన్ పొందు ఉండదని అనిపించడంతో ముందు దుఃఖం కలిగి క్రమంగా అది ఆగ్రహంగా మారింది.తన గురించి మార్తా అందరికీ చెప్తుంది.

అది ఆమె స్వభావం. ఇప్పుడు షెర్లీకి చెప్తున్నట్లుగానే తమ తోడ బుట్టిన వాళ్ళకి, తన కొలీగ్స్‌కీ చెప్తుంది. అలాంటి పనులు చేసేది సైకోలే. తనని సైకోగా భావించి షిప్పింగ్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగం పోకపోయినా, తనని చూసి నవ్వుకునే కొలీగ్స్ మధ్య రోజుకి ఎనిమిది గంటలు ఎలా పని చేయగలడు? తను దొంగిలించిన బట్టలు, బూట్లు, హేండ్ బేగ్స్ మొదలైనవి బయట పడతాయి. తనని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. తను ఒక్క రోజు కూడా జేన్‌ని విడిచి జైల్లో గడపలేడు. అన్నిటికన్నా బాధాకరమైంది అదే. తన నించి జేన్ని తీసుకెళ్ళిపోతారు. అలా జరక్కుండా తనేదైనా చేయాలి. ఏం చేయాలి?మృదువుగా, చప్పుడు కాకుండా నడుస్తూ అతను వంట గదిలోకి దారి తీసాడు. మార్తా వీపు అతని వైపుంది. ... అవును. పోస్ట్ ద్వారా. మా ఇంటి నిండా దాన్ని దాచడానికి చాలా అలమర్లు ఉన్నాయి మార్తా చెప్తోంది.మార్తా. పిలిచాడు. వెనక్కి తిరిగి అతన్ని చూడగానే ఆమె మొహంలోని చిరునవ్వు మాయమై, భయం స్పష్టంగా కనిపించింది. మీరా? వణికే కంఠంతో అడిగి రిసీవర్ పెట్టేసింది. నేను భోజనం వేడి చేస్తాను.వెళ్ళబోయిన మార్తా మెడని అతని చేతులు పట్టుకున్నాయి. దూరంగా ఉన్న వేళ్ళు బిగుసుకుంటూ క్రమంగా ఒక దాని మీదకి మరోటి ఎక్కాయి. ఆమె కళ్ళు, నాలిక బయటికొచ్చాయి. మార్తా గయ్యాళితనంతో ఇన్నేళ్ళు విసిగిపోయిన క్లారెన్స్‌కి తను ఆమెకన్నా బలవంతుడ్ని అని తెలిసింది. అతను నెమ్మదిగా జీవం కోల్పోయిన ఆమె దేహాన్ని లినోలియం నేల మీదకి జార్చాడు..ఇప్పుడు ఇంట్లో రెండు శరీరాలని దాచాలి. మార్తా మరణించింది కాబట్టి ఇప్పుడు జేన్‌ని తన పడక గదిలోకి తెచ్చుకుని మార్తా శవాన్ని అటక మీద దాయాలని నిశ్చయించుకున్నాడు..అతని కళ్ళు అకస్మాత్తుగా ఫోన్ పక్కన కిచెన్ టేబిల్ మీద ఉన్న పేపర్ క్లిప్పింగ్ మీద పడింది. ఆ ప్రకటన చదివి తృళ్ళిపడ్డాడు.అందమైన పురుషుడి బొమ్మ తేలిగ్గా గాలితో నింపవచ్చు. ఆరడుగుల ఎత్తు. వినైల్ చర్మం ఆడవాళ్ళ సుఖానికి సరికొత్త ఆటవస్తువు దాచడం తేలిక. ప్రతీ మహిళకి ఇది అవసరం. వెంటనే నాలుగు వందల డాలర్లు పంపండి.
(జోసెఫ్ హోమింగ్స్ కథకి స్వేచ్ఛానువాదం)


-మల్లాది వెంకట కృష్ణమూర్తి

333
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles