పాత పగ


Sun,November 25, 2018 02:22 AM

Crime
స్లేష్ అంటే కేపిటల్ ఆల్ఫా, కేపిటల్ బి, కేపిటల్ ఇప్సిలోన్. ఆల్ఫా అంటే 1. స్లేష్ ఆల్ఫా అంటే 1,000. బి అంటే 600. ఎప్సిలోన్ అంటే 50. వాటిని కూడితే వచ్చేది 1650. అది తారీకు కావచ్చు. లేదా స్విస్ బేంక్ నంబర్ కావచ్చు. దాన్ని గుర్తుంచుకోడానికి వీలుగా ఆ నంబర్ ప్లేట్‌ని ఎంపిక చేసుకుని ఉంటాడు.

నెంబర్ 43870ని మరో రోజు జైల్లో ఉంచేలా సహాయం చేయమని నిన్ను కోరమన్నాడు. అతను లైబ్రెరీలోని నాతో చెప్పాడు.
జీవిత ఖైదు అనుభవించే నేను లాయర్ని కాబట్టి ఖైదీలు చట్టపరమైన సలహాలని నన్ను కోరుతుంటారు.
వాడికి జైల్లో ఉంటే కొద్దిగా పిచ్చెక్కిందా? సరే. అతన్ని పంపు. మాట్లాడుతాను.
నేను జైలు లైబ్రరీలో లైబ్రేరియన్‌గా పని చేస్తున్నాను.
అతను వచ్చాక పరిశీనలగా చూశాను. పిచ్చివాడిలా కాక మామూలుగా కనిపించాడు.
నిన్ను విడుదల చేయాల్సిన రోజుకన్నా ఇంకో రోజు ఎక్కువగా జైల్లో ఉంచడం జైలు నియమాలు అంగీకరించవని నీకు తెలీదా? అడిగాను.
ఇది మీకు వింతగా అనిపించవచ్చని నాకు తెలుసు. కానీ, నా కారణాలు నాకున్నాయి. అతను నవ్వి చెప్పాడు.
ఓ కారణం చెప్పు.

బయట గాల్లోని పొల్యూషన్ నించి కనీసం ఓ రోజైనా రక్షించుకోవడానికి... ఈ కారణం మీకు సబబుగా ఉండదని నాకు తెలుసు.
సబబైన కారణం చెప్పే దాకా నేను నీకేం సహాయం చేయలేను నిష్కర్షగా చెప్పాను.
అతను చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
సరే. ఇష్టం లేకపోయినా ఆ రహస్యాన్ని చెప్పిస్తున్నారు. నేను జైల్లో కార్ల లైసెన్స్ ప్లేట్‌లని తయారుచేసే విభాగంలో పని చేస్తున్నాను. తయారీలో కాక, వారికి సమాచారం ఇచ్చే విభాగంలో. కొందరు పర్సనలైజ్డ్ నేమ్ ప్లేట్స్‌ని కోరుతుంటారు.
అది నాకు తెలుసు. మరో ఇరవై డాలర్లు అదనంగా చెల్లిస్తే నెంబర్ బదులు జాన్, జాన్ క్యు లాంటి పేరు గల నెంబర్ ప్లేట్‌ని తీసుకోవచ్చు. ఎనిమిది అక్షరాలకి మించకూడదు, అసభ్యంగా ఉండకూడదు, గతంలో అలాంటిది ఎవరికీ ఇవ్వబడి ఉండకూడదు అన్నవి నియమాలు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ శాఖకి ఇటీవల ఈ ఆదాయం బాగా పెరిగింది.

అతను తను చెప్పేది కొనసాగించాడు.
కంప్యూటర్ మానిటర్ ముందు కూర్చొని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ నించి వచ్చిన, వాళ్ళు మంజూరు చేసిన లైసెన్స్ ప్ల్లేట్స్ ప్రింటవుట్‌ని తీసి తయారీ విభాగానికి పంపడం నా పని. ఇవాళ సన్‌బమ్, ది జార్, రెపో టు, మి జేనీ లాంటి కొన్ని పేర్లు నాకు గుర్తున్నాయి. వాటిలో నాకు తెలిసిన ఓ వ్యక్తి పేరు, అతను కోరిన అక్షరాల ప్లేట్ కంప్యూటర్‌లో ఫ్లేష్‌లా చదివాను. నేనా ఎనిమిది అక్షరాల పేరుని గుర్తుంచుకునే లోగా వేరే పేజీ తెరుచుకుంది. నేను వెనుక పేజీకి వెళ్ళి అతను కోరిన పేరుని తెలుసుకునే లోగా ఓ గార్డ్ వచ్చి రేపు విడుదలకి కావాల్సిన పేపర్ వర్క్‌ని పూర్తి చేయడానికి, వైద్య పరీక్షకి నన్ను తీసుకెళ్ళాడు. దాంతో ఆ ప్రింటవుట్ పనిని వేరొకరు చేశారు. అవి ఉత్పత్తి విభాగానికి వెళ్ళిపోయాయి. నేను ఇంకో రెండు గంటల్లో విడుదలవుతాను. ఇక అతని కారు నెంబర్ ప్లేట్‌ని గుర్తించే అవకాశం లేదు. ఇక ఇవాళ నాకు కంప్యూటర్ అందుబాటులో ఉండదు.
అతని కంఠధ్వనిని బట్టి అతనికా వ్యక్తి మిత్రుడు కాదని, శత్రువై ఉంటాడని నాకు బలంగా అనిపించింది.
నేనా సమాచారం తెలుసుకొని కాని వెళ్ళదలుచుకోలేదు. అది నాకు చాలా ముఖ్యం.

నేను అతనికి సహాయం చేయకూడదని మనసులో నిర్ణయించుకున్నాను. జరుగబోయే ఓ నేరంలో నేను భాగస్తుడిని కాకూడదు. అతను పట్టుబడ్డాక జరిగే విచారణలో నా పాత్ర బయటకి రావచ్చు.
అతను నా వంక ఆశగా చూశాడు.
చట్ట ప్రకారం నువ్వు ఇంకో రోజు జైల్లో ఉండలేవు. భౌతిక కారణంగా మాత్రం ఉండొచ్చు సూచించాను.
అంటే ఎవరినైనా చావబాదాలా? నేను అంతకాలం ఉండాలనుకోవడం లేదు. ఒక్క రోజు మాత్రం చాలు.
నీకు జ్వరం వచ్చినట్లుగా నటించడం వచ్చా? నీ ఆరోగ్యం పూర్తిగా బావుందన్న సర్టిఫికెట్‌తోనే నిన్ను విడుదల చేయాల్సి ఉంటుంది సలహా ఇచ్చాను.
నేను హాస్పిటల్లో మిగిలిన వాళ్ళకి దూరంగా ఉండి ప్రయోజనం ఏమిటి?
నువ్వు హాస్పిటల్లో ఉండి డాక్టర్ చెప్పినట్లు చేయి. ఈ లోగా నేనా ప్రింటవుట్‌ని సంపాదిస్తాను. ఆ విభాగంలోని ఒకరిద్దరు నాకు ఋణపడి ఉన్నారు
మీరా సహాయం నిజంగా చేస్తావా? అడిగాడు.
చేస్తాను. వెళ్ళి జ్వరం నటించు. చెప్పాను.
* * *

మర్నాడు మళ్ళీ మేం జైల్ లైబ్రెరీలో కలిశాం.
ప్రింటౌట్ దొరికిందా? ఆత్రంగా అడిగాడు.
నా దగ్గరున్న ఫోల్డర్‌ని చూపించాను.
ఐతే చూస్తాను. ఇవ్వు కోరాడు.
ముందు అసలు విషయం చెప్పాకే.
ఏమిటా అసలు విషయం?
నీకూ, ఆ వ్యక్తికి గల సంబంధం.
ఓ క్షణం అతను నా మీదకి దూకి ఆ ఫోల్డర్ లాక్కుంటాడని నాకు అనిపించింది. కాని గార్డ్ నీడని చూసి ఆగాడు.

అతను మేథ్స్‌లో మేధావి. మేం బ్యాంక్‌లో సెక్యూరిటీస్ విభాగంలో పని చేస్తుండగా మాకు పరిచయం. నేను గుమాస్తాగా, అతను ఆఫీసర్‌గా పని చేసేవాడు. నాకు షేర్లు, బాండ్లు అందుబాటులో ఉండేవి. మేమిద్దరం కలిసి బేరర్ బాండ్లని తీసుకొని స్విడ్జర్లాండ్‌లోని జూరిక్‌కి వెళ్ళాం. హోటల్లో దిగి సరాసరి ఓ బ్యాంక్‌కి వెళ్ళాం. తన దగ్గర డబ్బు లేకపోవడంతో నన్ను ట్యాక్సీకి చెల్లించమని చెప్పి అతను బ్యాంక్ లోకి వెళ్ళాడు. నేను అతన్ని అనుసరించే సరికే అతను బ్యాంక్ ప్రెసిడెంట్ గదిలోకి వెళ్ళాడు. అతని సెక్రెటరీ నన్ను బయట వేచి ఉండమని కోరింది. చాలాసేపు వేచి ఉన్నాను. గంట తర్వాత కూడా అతను బయటకి రాకపోవడంతో విచారిస్తే, అతనా బాండ్లని నగదుగా మార్చుకొని ఓ ఎకౌంట్ తెరచి అందులో డిపాజిట్ చేసి ఇంకో తలుపులోంచి వెళ్ళిపోయాడని తెలిసింది. అతనికి జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి హోటల్‌కి దారి మర్చిపోతాడని భావించి తిరిగి వస్తాడని బయట వేచి ఉన్నాను. అతను హోటల్‌కి వెళ్ళనేలేదు. నేను అతని కోసం వెదుకుతుంటే, ఎఫ్‌బీఐ ఏజెంట్లు మా ఇద్దరి కోసం వెదుకుతున్నారు. నన్ను పట్టుకొని అమెరికాకి తీసుకువచ్చారు. విచారణ ముగిశాక ఇక్కడికి వచ్చి శిక్షని అనుభవించాను. స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్స్ వల్ల అతని మీద ఇక చర్య తీసుకోలేరు. అంతదాకా వేచి ఉన్నాక అతను అమెరికాకి తిరిగి వచ్చి కారు కొంటున్నాడు.

నేను ఆ ఖైదీ చెప్పింది నమ్మాను. అతని బాధనీ, కోపాన్నీ నేను కొంత అనుభవించాను. అతనికి సహాయం చేయాలని అనిపించింది. అతన్ని మోసం చేసిన తోడు దొంగ పేరు చెప్పాక అతనికా ఫోల్డర్‌ని ఇచ్చాను. అతను పట్టుబడ్డాక జరిగే విచారణలో నా పాత్ర బయటకి రావచ్చు. జీవిత ఖైదు అనుభవించే నాకు, అతను హత్య చేసినా కొత్తగా పడే శిక్ష ఇంకోటి లేదు. ఈ రాష్ర్టంలో మరణశిక్ష లేదు. అతను నేమ్ ప్లేట్ మీద కోరిన పేరు ఎదురుగా SLASHAXE అని కనిపించింది.
ఇదేం పేరు? అతను ఆశ్చర్యంగా అడిగాడు.
దాన్ని నేను చదివాను. నాకూ అర్థం కాలేదు.
ఇది నాకు గ్రీక్, లాటిన్‌లా ఉంది. కాని ఈ నెంబర్ ప్లేట్‌ని బట్టి వాడి చిరునామాని కనుక్కోగలను. అతని కళ్ళల్లో నాకు కోపం కనిపించింది.
ఆ ఎనిమిది అక్షరాలు నన్ను వెంటాడాయి. స్లేష్ అంటే నరకడం. ఏక్స్ అంటే గొడ్డలి. గొడ్డలితో నరకడం. నేను లైబ్రెరీలోని గ్రీక్ న్యూమరల్స్‌కి చెందిన పుస్తకం తీసుకొని కొద్ది సేపు దాన్ని చదువుతూ కాగితం మీద పెన్సిల్‌తో ఏదో రాయడం అతను ఆసక్తిగా గమనించాడు.
కనుక్కున్నావా? నేను గర్వంగా నవ్వడం చూసి ఆశగా అడిగాడు.
కనుక్కున్నాను.

ఎలా?
నువ్వే క్లూ ఇచ్చావు. అది నీకు గ్రీక్ అండ్ లేటిన్ అన్నావు. ఆ ఎనిమిది అక్షరాలు గ్రీక్ అంకెలు. డిఐఎక్స్ అంటే రోమన్ అంకెల్లో 509 అని నాకు తెలుసు. అందుకని రోమన్ అంకెల్లో ఈ ఇంగ్లిష్ అక్షరాల సంఖ్య ఎంతో చూశాను. స్లేష్ అంటే కాపిటల్ ఆల్ఫా, కాపిటల్ బి, కాపిటల్ ఇప్సిలోన్. ఆల్ఫా అంటే 1. స్లేష్ ఆల్ఫా అంటే 1,000. బి అంటే 600. ఎప్సిలోన్ అంటే 50. వాటిని కూడితే వచ్చేది 1650. అది తారీఖు కావచ్చు. లేదా స్విస్ బ్యాంక్ నెంబర్ కావచ్చు. దాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా ఆ నంబర్ ప్లేట్‌ని ఎంపిక చేసుకొని ఉంటాడు. నువ్వా ఎకౌంట్‌ని క్లోజ్ చేసి ఆ డబ్బుని చట్టబద్ధంగా అమెరికాకి తెచ్చుకోవచ్చు సూచించాను.
అతను నాకు తన కృతజ్ఞతలని తెలియచేసి బయటకి నడిచాడు.
వారం తర్వాత జూరిక్ నించి నాకో టెలిగ్రాం వచ్చింది.
థాంక్స్. నన్ను ధనవంతుడిని చేశావు.
(ఎడ్వర్డ్ వెలెన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

547
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles