పల్లెపల్లెనా.. పండుగొచ్చెనా..


Sun,April 21, 2019 05:16 AM

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముని మాటలను నిజం చేస్తూ తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామస్తులంతా ఒక్క తాటిపై నిలబడి అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ఇంటర్‌నెట్ వినియోగం, నీటిపారుదల, పంటల ఉత్పత్తులు ఇలా ఒక్కటని కాదు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. సమష్టి కృషితో గ్రామాలను తీర్చిదిద్దుకుంటున్నారు. దీంతో ఎన్నో గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. పంటచేలు, పరిశుభ్రమైన పరిసరాలు, ఆదర్శవంతమైన పాలనతో పల్లెలు నవ్వుతున్నాయి. పల్లెపల్లెనా.. పండుగొచ్చెనా... అని తెలంగాణ పాడుతున్నది.


ఆదర్శం శ్రీనివాస్‌నగర్

లోయర్ మానేర్ డ్యాంలో ముంపునకు గురైన గ్రామాల నుంచి వచ్చిన కుటుంబాలతో ఏర్పడింది మానకొండూర్ మండలంలోని శ్రీనివాస్‌నగర్. అనతికాలంలోనే ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచింది. 1981లో కొండాపూర్, సంగెం, ఆరెపల్లి, చెర్లపూర్, పోతుగంటి, యాస్వాడ, పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు మానకొండూర్ మండల పరిధిలో శ్రీవేంకటేశ్వరస్వామి గుట్ట సమీపంలో స్థిరపడ్డారు. అప్పడు వీరి కాలనీ మానకొండూర్ గ్రామ పంచాయతీ శివారు గ్రామంగా శ్రీనివాస్‌నగర్‌గా కొనసాగింది.1981 నుంచి 1995 వరకు మానకొండూర్ ఆ గ్రామ పంచాయితీ పరిధిలోనే ఉన్నది.1995లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1995 నుంచి దాదాపు నేటి వరకు నాలుగుసార్లు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా రెండు కుటుంబాల వారే పాలించారు. గ్రామంలో దాదాపు 1300 జనాభా ఉండగా 970 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకున్న గ్రామంగా నిలిచింది. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, నగదు రహిత లావాదేవీల్లో వందశాతం పురోగతి సాధించింది. దీనికి గుర్తింపుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు లభించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛ స్త్రీ శక్తి పురస్కార్ అవారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్న ఘనత ఈ పంచాయతీది. జిల్లాలో కూడా మౌలిక సదుపాయాల వినియోగంలో వందశాతం పురోగతి సాధించిన రికార్డు సొంతం చేసుకున్నది. గ్రామాభివృద్ధిలో గ్రామస్తులంతా కలిసి కట్టుగా ఉండి పనిచేయడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.

సకల వసతుల మాదాపూర్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం 2016-2017 వ సంవత్సరానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకొని ఆదర్శంగా నిలిచింది. 2013 సంవత్సరంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన మాడుగుల రవీందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేశారు. మారుమూల గ్రామాన్ని రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది మాదాపూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. గ్రామంలో 283 ఇండ్లు, 295 ఇంకుడు గుంతలు నిర్మించారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించారు. వంద శాతం మహిళా సంఘాల రుణాలను రికవరీ చేశారు. నీటి సమస్యను అధిగమించడానికి 12 బోర్లు వేశారు. 50 లక్షల నిధులతో వాడవాడనా సీసీ రోడ్లు నిర్మించారు. హరితహారంలో భాగంగా రెండు లక్షల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. రైతులకు 12 కళ్లాలు, 12 ఫాంపౌండ్‌లు, 15 పశువుల పాకలు నిర్మించడంతో పాటు 80 నాడెపు కంపోస్టు కిట్‌లను ఏర్పాటు చేశారు. ఆధునిక హంగులతో స్మశాన వాటికను నిర్మించారు. గ్రామంలోని 8 మంది నిరుపేద దళితులకు మూడెకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు. పాడి రైతులకు ఈజీఎస్‌లో పశుగ్రాస విత్తనాలను అందజేశారు. గ్రామంలోని వివిధ భవనాల నిర్మాణాలకుగాను 25 గుంటల భూమిని గ్రామంలో కొనుగోలు చేసి గ్రామ అవసరాలకు వినియోగిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దారు.

మద్యనిషేదంలో హిమ్మత్‌నగర్

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని హిమ్మత్‌గనర్ గ్రామంలో మొత్తం జనాభా 2100 ఉండగా 350 ఇండ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోప్రతీ ఇంటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మాణం జరిగేలా చర్యలు తీసకున్నారు అధికారులు. గ్రామంలో వందశాతం నిర్మాణాలు చేపట్టినందుకు హిమ్మత్‌నగర్ జిల్లాలోనే ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. వీటితో పాటు గ్రామంలో ప్రతీ ఇంటికీ ఉపాధిహామీ పథకం కింద నాడెపు కంపోస్ట్ నిర్మాణాలను కూడా చేశారు.సుమారు రూ.4 కోట్లతో గ్రామంలోని ప్రతీ వీధిలో సీసీ రోడ్లు, సమీప పల్లెలను కలుపుతూ బీటీ రోడ్లను నిర్మించారు. గ్రామ శివారులో అధునాతనంగా స్మశానవాటిక నిర్మాణం కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా మొక్కలు నాటిన గ్రామంగా హిమ్మత్‌నగర్ ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మద్యపానం, ఇతర నిషేధిత పదార్థాలు వాడకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానా విధించేలా తీర్మాణం చేయడం ఆ గ్రామం సాధించిన విజయంగా పేర్కొనవచ్చు. ప్రతీ ఇంటికీ తడి, పొడి చెత్తను వేసే బుట్టలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వంద శాతం ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన గ్రామంగా హిమ్మత్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 201లో ఆదర్శగ్రామంగా నిలిచింది.

బంగారు నాగాపురం బండల నాగాపూర్

ఒకప్పుడు చుట్టూ బండరాళ్లతో మామూలు గ్రామంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగాపూర్ ఇపుడు బంగారు నాగాపురం. ప్రగతిపథంలో దూసుకెళ్తున్న గ్రామం. నాలుగున్నరేండ్లలో రూ.36 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి సాధించిన ఆదర్శ గ్రామపంచాయతీ. ఆదిలాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండల నాగాపూర్ చక్కని బీటీ రోడ్డు కలిగి ఉండటం అందర్నీ ఆకట్టుకుంటుంది. గ్రామానికి వెళ్లేముందు మత్తడి వైపు నుంచి వచ్చే ఎడమకాలువ నీళ్లతో పంటలు పండి.. పచ్చని అందాలతో కళకళలాడుతున్నాయి. ఈ గ్రామం గుండా డబుల్ రోడ్డుకు అటు ఇటూ హరిత మొక్కల సొగసు , రాత్రి, ఉషోదయాన సోలార్‌లైట్ల కాంతులు పల్లె శోభను ఇనుమడింపజేసినట్లు కనిపిస్తాయి. వంద డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలతో, జాతీయస్థాయి పురస్కారం పొందిన యూపీఎస్‌తో, ఇతర అభివృద్ధి పనులతో ప్రగతిపథంలో బండల నాగాపూర్ దూసుకెళుతున్నది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి వైపు సాగుతున్నది. గ్రామంలో నిరంతర అవగాహనతో మరో 200 మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 50 మంది దళితులకు 150 ఎకరాలు, వివిధ గ్రాంటులతో రూ.32 లక్షలతో సీసీ రోడ్లు , డ్రెయిన్లు నిర్మించి ఆదర్శ గ్రామంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నది. 14వ ఫైనాన్స్ నిధులతో పరిశుభ్రత చర్యలు, మౌలిక వసతులను పక్కా వినియోగించుకున్న గ్రామం ఇది. ప్రతి కుటుంబంలో అర్హులైన వారికి సర్కారు పథకాల ద్వారా మేలు జరుగుతుండటం ఈ గ్రామ విశేషం.

అభివృద్ధికి మాతృక అంకాపూర్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం పంటల సాగులో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నది. వ్యవసాయానికి తోడు, విత్తనాభివృద్ధి, పిల్లల ఉన్నత చదువుల సమ్మేళనంతో అంకాపూర్ గ్రామం అభివృద్ధిబాటలో పయనిస్తున్నది. పట్టణాలను తలపించే విధంగా అంకాపూర్ ప్రజలు సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆధునిక భవనాలతో ఇదో మోడ్రన్ విలేజ్‌గా కనిపిస్తుంది. పంటల సాగులో విప్లవం సృషిస్తుండటం రాష్టంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా దేశ, విదేశాల్లోంచి అంకాపూర్ సందర్శనకు రైతులు వస్తున్నారు. పచ్చని పంట పొలాలతో గ్రామ పోలిమేరలు కనువిందు చేస్తుండడంతో పాటు, రైతులు, విద్యావంతులు, వ్యాపారులు, యువకులు, కార్మీకులతో సకల జనుల సమ్మేళనంగా అంకాపూర్ కనిపిస్తుంది. పచ్చదనానికి, పరిశుభ్రతకు ఈ ఊరు చిరునామా. అంకాపూర్‌లోని ఏ రోడ్డుకు వెళ్లినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లే దర్శనమిస్తాయి. పర్యావరణానికి ప్రాధన్యమిస్తూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో ఇతర గ్రామాలకు అంకాపూర్ ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని గ్రామాభివృద్ధి కమిటీ, గురడిరెడ్డి రైతు సంఘం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరూ కలిసి గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, రోడ్ల పరిశుభ్రతలను పర్యవేక్షిసున్నారు. గ్రామంలోని వీడీసీ కల్యాణ మండపాన్ని, కూరగాయల మార్కెట్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. గురడిరెడ్డి రైతు సంఘం సభ్యులు గ్రామకూడలిలో ఏసీ కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పదుల సంఖ్యలో సీడ్‌ప్లాంట్లు, రెండు బ్యాంకులు, ఆరోగ్య ఉపకేంద్రం, టెలిఫోన్ ఎక్సేంజ్, వృద్ధాశ్రమాలు, ట్రస్ట్‌ల సేవలు, ఏటీఏం వంటి అన్ని రకాల సౌకర్యాలతో అంకాపూర్ గ్రామం పట్టణాన్ని తలపిస్తున్నది. ఆర్మూర్‌కు వచ్చిన వాళ్లంతా అంకాపూర్ దేశీ చికెన్ తప్పక తినాలి అనేంత విశేష ప్రాచుర్యం పొందింది ఈ గ్రామం.
Rural-houses1

ఆకలి తీర్చుతున్న దుద్దనపల్లి

ఇంటిపన్నులు వంద శాతం వసూలు చేసి గ్రామ అభివృద్ధిలో దూసుకెళుతున్నది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామం. ఇక్కడ ప్రతీ వార్డు మెంబర్.. వాళ్ల వార్డులో ప్రతిరోజూ పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకునే సంప్రదాయం కొనసాగుతున్నది. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించిన గ్రామంగా నిలిచింది. హరితహారాన్ని వందశాతం వినియోగించి ప్రతీ ఇంటికి మొక్కలు నాటిన గ్రామంగా రికార్డు సాధించింది దుద్దనపల్లి. నిరుద్యోగ యువతకు స్వచ్ఛందంగా ఉపాధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నది. పేదవారి ఆకలి తీర్చేందుకు.. అభాగ్యులను ఆదుకునేందుకు గుప్పుడు బియ్యం పథకం రూపొందించారు. పేదరికాన్ని అరికట్టడం కోసం చేయూత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు తమ ఇంట్లో వస్తువులు, దుస్తులు, చీరలవంటి వాటిని అవసరం ఉన్నవారికి అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు, గ్రామ పంచాయితీలో రికార్డుల నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాల్లో ఆదర్శంగా నిలిచి 2018లో నానాజి దేశ్‌ముఖ్‌రాష్ట్రీయ గౌరవ్ పురస్కారం(జాతీయ అవార్డు)కు ఎంపికైంది. 2018 ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్‌లోని నర్మద నది పక్కన జరిగిన పంచాయితీరాజ్ దినోత్సవంలో అప్పటి సర్పంచ్ సోమారపు రాజయ్య, గ్రామ కార్యదర్శి మహేందర్‌రావు ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

హరిత గ్రామం.. సింగాపూర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొదటి మూడు విడుతల్లో అధికల సంఖ్యలో మొక్కల పెంపకం చేపట్టి జిల్లాలోనే ఉత్తమ అవార్డును కూడా అందుకున్నది. గ్రామ శివారులోని రాకాసిగుండ్ల వద్ద 27ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి సుమారు 50 రకాల పైగా మొక్కలు నాటారు. వాటికి ఉపాధిహామీ కూలీలతో నిత్యం కలుపు తీయిస్తూ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ శివారులో మొత్తం 46,899 మొక్కలు నాటగా, గుట్టల పరిసర ప్రాంతాల్లో 14వేలు, గుడికుంట దగ్గర 7,130, రాకాసిగుండ్లలో 6480, ఓసెస్ట్‌లో 1084, కిట్స్ కళాశాల ఆవరణలో 3400, రైస్‌మిల్లుల ఆవరణల్లో 2450, చెరువు కట్ట, పొలం గట్ల వెంబడి 2200, గ్రామంలో ఇండ్ల పక్కల, రోడ్ల వెంబడి 1022 వరకు మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.లక్షతో బోరువేసి మోటారు బిగించారు. గ్రామ కార్యదర్శి జున్నూతుల రేవంత్‌రెడ్డి హరితహారం విజయవంతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా హరిత మిత్ర అవార్డు అందుకున్నారు.

ఆదర్శానికి మారు పేరు సిద్ధ్దాపూర్


రాష్ట్రంలోనే మొట్ట మొదటగా గ్రామపంచాయతీలో ఇంటర్నెట్ సేవలను పొందిన గ్రామం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సిద్దాపూర్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ చుట్టు పక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బహిరంగ మల విసర్జన నిర్మూలన కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రతీ ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తూ గ్రామంలో ఐదు వేల మొక్కలు నాటారు. గ్రామంలో నిరక్షరాస్యులు ఉండకుండా వంద శాతం అక్షరాస్యతను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 95% అక్షరాస్యత సాధించిన గ్రామంగా రికార్డు సాధించింది. ప్రతియేట ఉత్తమ గ్రామపంచాయతీగా సిద్ధాపూర్ ఎంపిక అవుతుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం కార్యక్రమాన్ని సిద్ధాపూర్ గ్రామస్తులు విజయవంతంగా లక్ష్యాన్ని పూర్తిచేశారు. అధికారిక లెక్కల ప్రకారం వంద శాతం మరుగుదొడ్లు పూర్తయిన గ్రామాల జాబితాలో ఈ గ్రామం చేరింది. గత 45 సంవత్సరాలుగా వంద శాతం పన్నుల వసూళ్లు సాధిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది సిద్ధాపూర్ గ్రామం.

సుగుణాల ఉసిరికపల్లి

ఉసిరిలో ఎన్ని సుగుణాలు ఉంటాయో ఆ పేరుతో రూపుదిద్దుకున్న ఉసిరికపల్లికి కూడా అంతే స్వలక్షణాలు గోచరిస్తాయి. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రోడ్లు, 100శాతం మరుగుదొడ్లు, 100శాతం ఇమ్యునైజేషన్, సీసీ కెమెరాలు, మంచి నీటి ట్యాంకులు, ఇంకుడు గుంతలు, పచ్చదనం.. ఇలా అన్నింటిలోనూ ఆ గ్రామం ముందంజలో ఉన్నది. అటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజా అవగాహనతో సద్వినియోగం చేసుకోవడం గ్రామం ప్రత్యేకత. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న రాయిపల్లి గ్రామ పంచాయతీ నుంచి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది ఉసిరికపల్లి. ఉసిరికపల్లిలో మాత్రం 137 కుటుంబాలకు గాను 137 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. అభివృద్ధిలో మరో భాగం ఇంకుడు గుంతలు. గ్రామంలో ఏ ఒక్క నీటి చుక్క కూడా వృథా కాకుండా ప్రతి బిందువును ఒడిసి పట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో బాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 10 నీటి ట్యాంకుల వద్ద ఇంకుడు గుంతలను నిర్మించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని డేఘ కన్ను నిఘాలో ఉంచారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా 800 మొక్కలను నాటి గ్రామాన్ని హరితవనంలా మారుస్తున్నారు. పారిశుధ్యంలో ఆ గ్రామస్తులు తమ సమైక్యతను చాటుతున్నారు. గ్రామ శివారులో ఒక ప్రత్యేక డంప్ యార్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు గ్రామంలో పోగుచేసిన చెత్తను ఆ డంపింగ్‌యార్డులో మాత్రమే వేస్తున్నారు. ప్రతి వీధిలో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లోనూ ఆ గ్రామం అంతా విధ్యుత్ కాంతుల్లో కనువిందు చేస్తున్నది. ముఖ్యంగా గ్రామంలో పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు తోడుగా ప్రజలు చెల్లించే పనులను ఆయా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

అభివృద్ధిలో ఆదర్శం మన్మథ్

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మథ్ గ్రామం అభివృద్ధితో పాటు ఆదర్శంలో ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి స్థానం సాధించింది. అభివృద్ధితో పాటు గ్రామంలో 100కు వందశాతం ఇంటి పన్నులు కట్టి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. గ్రామంలో ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకొని నూటికి నూరు శాతం వాడకంలోకి తీసుకొచ్చి అభియాన్ పురస్కారం అందుకున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకం కింద ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత స్థానికులే తీసుకున్నారు. గ్రామంలో గల 620 కుటుంబాలు ఒకేమాటపై ఉండి గ్రామాభివృద్ధి కోసం 14 కమిటీలను ఏర్పాటు చేసుకొని స్వచ్ఛ గ్రామం కోసం కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వందశాతం లబ్ధిదారులకు ఎంపికచేసి వాటిని అమలుపర్చారు. గ్రామంలో నేర నియంత్రణకు గ్రామస్తులందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో రైతులందరికీ పంటలకు సాగు నీటిని అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సౌకర్యం పొందుతున్నారు. గ్రామాభివృద్ధి కొరకు 14 కమిటీలను ఏర్పాటు చేసుకొని కమిటీల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కోసం పనులు చేపడుతున్నారు.

స్వశక్తిగా వేల్పూర్


నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. పంచాయతీ అభియాన్‌లో భాగంగా వేల్పూర్ పంచాయతీకి స్వశక్తి కరణ్ అవార్డును అందజేశారు. పంచాయతీకి సంబంధించిన ఆదాయ, వ్యవయలతో పాటు పంచాయతీ కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచినందుకు అవార్డును అందజేశారు. దీంతో పాటు పంచాయతీ ఆదాయ వనరులు సమకూర్చుకోవడంతో జాతీయ స్థాయిలో ముందు ఉండటంతో అధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గతంలో పంచాయతీ ఆదాయం తక్కువ ఉండేది. ఆదాయాన్ని పెంచడానికి కార్యదర్శి, సర్పంచ్, వార్డు సభ్యులు పక్కా ప్రణాళికలో ముందుకు సాగడంతో ఆదాయం గణనీయంగా పెరిగింది. నాలుగు సంవత్సరాల నుంచి గ్రామంలో ప్రజలందరూ వంద శాతం పన్నులు చెల్లిస్తున్నారు. పన్నులతో పంచాయతీకి సంబంధించిన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించారు. 17వాణిజ్య సముదాయాల ద్వారా ఏడాదికి రూ.3,60లక్షలు ఆదాయం సమకూరుతుంది. గత ఏడాది పంచాయతీ పరిధిలో కళ్యాణ మండపం నిర్మించారు.

ఉత్తమ గ్రామం కారేగాం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకపోతున్నది నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కారేగాం గ్రామం. గ్రామంలో ఇప్పటికే వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ చైతన్యవంతులుగా తీర్చిదిద్దారు. గ్రామ పర్యావరణంతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో తాగునీరు, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలను రూపొందించి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దారు. సౌకర్యవంతమైన స్మశానవాటికలు నిర్మించిన గ్రామంగా ముథోల్ మండలంలోనే ఈ గ్రామం మొదటిదిగా నిలిచింది. గ్రామంలో ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టి భూగర్బజలాలను పెంచి గ్రామస్తులు మరుగుదొడ్లును వందశాతం పూర్తి ఆదర్శంగా తీర్చిదిద్దారు. అలాగే గ్రామంలో ఎక్కడ చెత్తను వేయకుండా చెత్త బుట్టలను ఏర్పాటు చేసి రోజు చెత్త సేకరించడంతో గ్రామం సుందరంగా మారింది. మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరిగి అభివృద్ధిలో దూసుకెళుతున్నది.
Rural-houses2

721
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles