పల్లీ.. రుచుల తల్లి!


Sun,September 9, 2018 12:57 AM

Peanut
చల్లని సాయంత్రాల్లో.. చినుకులు పడే సమయాన.. కరకరలాడుతూ.. పంటికింద నలిగిపోతాయి పల్లీలు.. వాటిని పోపుల్లో వేసినా.. పచ్చడిగా చేసినా ఆ టేస్టే వేరు.. కూరల్లోనూ చేర్చి.. స్వీట్స్‌గా మార్చి పల్లీలు మెనూలోకి చేర్చేస్తున్నారు.. ఈ వారం నేషనల్ పీనట్ డే అదేనండీ.. జాతీయ పల్లీల దినోత్సవం సెప్టెంబర్ 13న జరుపుతున్నారు.. ఈ సందర్భంగా పల్లీల వంటకాలు మీ కోసం ప్రత్యేకం..
- సౌమ్య పలుస

brittle-recipe-peanut

పల్లీ పట్టి

కావాల్సినవి :
పల్లీలు : 2 కప్పులు
బెల్లం : 150 గ్రా.
నెయ్యి : 1 1 /2 టేబుల్ స్పూన్.
తయారీ :
పల్లీలను ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించాలి. ఆ తర్వాత పొట్టు తీసి కాసేపు పక్కన పెట్టాలి. బెల్లం తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి బెల్లం వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు కలుపాలి. అప్పుడు చిక్కటి పాకం వచ్చేస్తుంది. దీంట్లో పల్లీలను వేసి కలుపాలి. రెండు నిమిషాల తర్వాత ఒక ప్లేట్‌కి కొద్దిగా నెయ్యి రాసి మిశ్రమాన్ని పోయాలి. వేడిగా ఉన్నప్పుడే వీటిని ముక్కలుగా చేసుకోవాలి. రుచికరమైన పల్లీ పట్టీలు తయార్!
PeanutPakoda

పల్లీ పకోడి

కావాల్సినవి :
పల్లీలు : ఒక కప్పు, శనగపిండి : 4 టీస్పూన్స్, బియ్యంపిండి : ఒక టీస్పూన్, సోడా ఉప్పు : చిటికెడు, అల్లం, వెల్లుల్లి ముద్ద : అర టీస్పూన్, గరం మసాలా పొడి : అర టీస్పూన్, కారం : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు, నూనె : తగినంత.
తయారీ :
పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోయాలి. పది నిమిషాలు అలా ఉంచి నీళ్లు పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు ఆ పల్లీల్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి, చిటికెడు సోడా ఉప్పు, శనగపిండి, బియ్యంపిండి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. అందులో ఒక్కో పల్లీని ముద్దలా చేసి విడివిడిగా వేసి ఎర్రగా అయ్యేవరకు కాల్చుకోవాలి. క్రిస్పీ పల్లీ పకోడి రెడీ!
peanutricerecipe

పల్లీ అన్నం

కావాల్సినవి :
బాస్మతీ రైస్ : 1 1/2 కప్పులు
పల్లీలు : పావు కప్పు
శనగపప్పు : 1 1/2 టేబుల్‌స్పూన్స్
మినుపపప్పు : ఒక టేబుల్‌స్పూన్
వెల్లుల్లి రెబ్బలు : 2,
కరివేపాకు : 2 రెమ్మలు
ఎండుమిర్చి : 3,
ఆవాలు : పావు టీస్పూన్
ఇంగువ : చిటికెడు
జీలకర్ర : అర టీస్పూన్
నువ్వులు : ఒక టేబుల్‌స్పూన్
నూనె : 2 టేబుల్‌స్పూన్స్
ఉప్పు : తగినంత.
తయారీ :
బియ్యం కడిగి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత అన్నం పొడిగా వండాలి. ఆ తర్వాత ఆ అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి చల్లార్చాలి. ఈలోపు కడాయిలో శనగపప్పు, మినుపపప్పు వేరువేరుగా వేయించుకోవాలి. అదే కడాయిలో వెల్లుల్లి, పల్లీలు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక.. కరివేపాకు, రెండు ఎండుమిర్చిలు వేసి కలుపాలి. అన్నీ వేగాక కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు నువ్వులు, జీలకర్రను కూడా ఒక క్షణం వేయించి చల్లారనివ్వాలి. వీటన్నిటినీ కలిపి మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి తర్వాత ఉప్పు కలుపాలి. దీంట్లో పొడి చేసిన మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేయాలి. పై నుంచి మరికాస్త పొడి వేసి కలిపితే సరి.

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles