పరీక్షిత్తు


Sun,November 25, 2018 01:46 AM

Parikshit
పుట్టుకే ఒక పరీక్ష. పుట్టినప్పటి నుంచీ చివరిదాకా బతుకు సాగించడం మరో పరీక్ష. జీవితానికి అంతమూ ఒక పరీక్ష. ఇన్నింటిని దాటి మనిషి నేర్చుకునేదేంటి? ప్రపంచానికి సమాధానపరిచే విధానమేంటి? జీవిత పరమార్థమా? మానవత్వ దృష్టికోణమా? లోకం సహజ స్వరూపమా? అంటే ఆలోచనల పరిధులు దాటుతాయి. మనసులు బరువెక్కుతాయి. విభిన్నపార్వాలకు రూపం ఏర్పడి వినూత్న సిద్ధాంతాలు చరిత్రను తిరుగరాస్తాయి. అన్యాయం ఎంత ప్రబలినా, ధర్మాన్ని కాలరాయాలనే దుష్కలతి ఎంత విస్తరించినా చరిత్ర సహనం కోల్పోతుంది. తన పేజీల్లో అటువంటి దుస్థితికి నల్లని సిరాను పూసి చరిత్రలో స్థానం లేకుండా చేస్తుంది. ధర్మానికి రంగులద్ది, న్యాయానికి కొత్త రూపమిచ్చి చరిత్రక కొత్తనైన సొబగును అద్దుతుంది. యుగాంతంలో జన్మించిన చారిత్రక పురుషుడు, అంతరించి పోతుందనుకునే పాండవ వంశోద్ధారకుడు, కలి వ్యవస్థను కలియుగంలో నిగ్రహించినవాడు అయిన పరీక్షుత్తు చరిత్రకే నూతనత్వం ఆపాదించాడు. పరీక్షిత్తు జీవితం ఆదర్శాలకే నెలవు.

పద్మవ్యూహంలో అసువులు బాసిన అభిమన్యుని పుత్రుడు, తల్లి ఉత్తర గర్భంలో అవస్థలు అనుభవించిన వాడు పరీక్షిత్తు. పాండవ వంశానికి మిగిలిన ఏకైక వారసుడుగా, కృష్ణుని ప్రాభవంతో లోకాలన్నింటినీ కాచేవాడు దేవదేవుడని తల్లి గర్భంలోనే పరీక్షించిన సార్థకనాయధేయుడిగా చరిత్రకు పరిచయమయ్యాడు పరీక్షిత్తు. కురుక్షేత్త యుద్ధం అశ్వత్థామ ఉపపాండవులను చంపి ప్రాణభీతితో పారిపోతాడు. అతన్ని వెదికి పట్టి తెచ్చిన అర్జునునిపైకి బ్రహ్మస్ర్తాన్ని ప్రయోగిస్తే, దానిని అర్జునుడు కృష్ణుని ఆదేశం మేరకు ఉపసంహరించినా, దాని అగ్నిజ్వాల సూక్ష్మరూపంలో అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ప్రవేశిస్తుంది. అమ్మకడుపులోనే ఆ జ్వాలల తాకిడికి అల్లాడిపోయాడు పరీక్షిత్తు. ఉత్తర తన అవస్థను శాంతపరచి తన బిడ్డను రక్షించమని కృష్ణున్ని వేడుకుంటుంది. కృష్ణుని దయవల్ల పరీక్షిత్తు చల్లగా బయటపడ్డాడు.

రాజులకు రాజై ఇక్షాకునిలా ప్రజలను రక్షిస్తాడని, రామచంద్రునిలా ధర్మపాలన చేస్తాడని, శిబిచక్రవర్తిలా ఆపదల్లో రక్షకుడవుతాడని, దుష్యంత పుత్రుడు భరతునిలా చాలా కీర్తిని పొందుతాడని పుట్టినప్పుడే మహనీయుల ప్రశంసలు అందుకున్న గొప్ప మనిషి పరీక్షిత్తు. అంతరించే వంశానికి ఆశాకిరణమై వచ్చి అఖండమైన భూమిని అద్భుతంగా అరవై యేండ్లు రాజ్యపాలన చేశాడు. తన మేనమామ ఉత్తరుని కూతురు ఇరావలని పెళ్ళాడాడు. జనమేజయాది నలుగురు పిల్లలు పరీక్షిత్తు ఆలోచనలను పుణికి పుచ్చుకున్నారు. ప్రజలు మెచ్చే పాలన, స్వేచ్ఛ ధర్మం ఆలవాలమైన ఆదర్శ భావన పరీక్షిత్తు ప్రపంచానికి తన కర్తవ్యంగా అందించాడు.

పరీక్షిత్తు ద్వాపర యుగాంతం, కలియుగ ఆరంభంలో మూడు అశ్వమేధ యాగాలు చేసి జైత్రయాత్రకు బయలుదేరాడు. తన దిగ్విజయ యాత్రలో భాగంగా సరస్వతీ నదీ తీరం చేరేసరికి వృషభ రూపంలో ఉన్న ధర్మం ఒంటిపాదంతో కళావిహీనమై కన్నీటిధారతో భూదేవి ఎదురుపడుతారు. తపం, శౌచం, సత్యం, దయ అనే నాలుగు పాదాలతో నడిచే ధర్మం త్రేతాయుగంలో ఒక పాదాన్ని, ద్వాపరంలో రెండోపాదాన్ని, ఇక కలియుగం వచ్చేసరికి మూడో పాదాన్నీ కోల్పోయి ఒంటి పాదంతో నడువాల్సిన గతిపట్టిందా! అందరినీ మోసేతల్లి అన్నీ భరించే భూమాత కంటతడిపెట్టే రోజు వచ్చిందా! అంటూ అందుకు కారణమైన కలిపురుషున్ని సంహరించేందుకు సిద్ధపడితే, పరీక్షిత్తు ఆక్రోషానికి వణికిపోయిన కలి కాళ్ళబేరానికి వచ్చి రక్షించమని వేడుకుంటే, నిన్ను రక్షించే లోకంలో మంచివారిని బతకనిస్తావా? అయినా శరణుకోరావు గనుక అసత్యం, కామం, హింస, కలహం, మదం అనే ఐదు ప్రదేశాల్లోనే నీవుండాలని హెచ్చరించి వదిలేస్తాడు. ధర్మ తపం, శౌచం, సత్యం, దయ అనే నాలుగు పాదాలూ లోకంలో విరాజిల్లేలా పరిపాలించాడు పరీక్షిత్తు.

ధర్మపరిరక్షణే ధ్యేయంగా పాటుపడిన పరీక్షిత్తు ఒకనాడు వేటకు వెళ్ళి దాహంతో నీటికోసం వెదుకుతూ శమక మహర్షి ఆశ్రమానికి వెళతాడు. ధ్యానంలో ఉన్న శమకునికి నమస్కరించి, కాస్త నీళ్ళివ్వమని ఎంతగానో అడుగుతాడు. ఉలుకూపలుకూ లేని శమకుని చర్యకు కోపగించుకున్న పరీక్షిత్తు చచ్చిపడి ఉన్న పామును శమకుని మీదకు విసిరేసి, విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోపిష్టి అయిన శమకపుత్రుడు శృంగి తన తండ్రికి జరిగిన అవమానానికి కారకుడైన పరీక్షిత్తు సర్పం కాటుతో ఏడు రోజుల్లోనే మరణించేలా శపిస్తాడు. విషయం తెలుసుకున్న శమకుడు ధర్మం నాలుగుపాదాల నిల్పిన పరీక్షత్తుకు శాపమా! భరతవంశాన్నీ ఉద్ధరించిన రారాజుకు శాపమా! మంచి మనసున్న, ఉన్నత భావాలున్న వ్యక్తికి శాపమా! అని బాధపడి శాపం గురించి వెంటనే పరీక్షిత్తుకు తెలియపరుచమని శిష్యులను హస్తినాపురికి పంపిస్తాడు.

పరీక్షిత్తు తన శాపం గురించి తెలుసుకొని చాలా బాధపడుతాడు. శాపభయంతో కాదు, తాను చేసిన అపరాధాన్ని తలుచుకొని అహంకారం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసిందనే పశ్చాత్తాపంతో చింతిస్తాడు.మనుషులన్నాక తప్పులు చేయక మానులు చేస్తాయా! కానీ చేసిన తప్పు తెలుసుకొని ఎవరు పశ్చాత్తాపం పొందుతారో వారు ఉత్తమగతినే పొందుతారనడానికి తార్కాణం పరీక్షిత్తు. తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా అది తప్పే ఇక తప్పని తెలిశాక దాని ఫలితాన్నీ తప్పక అనుభవించి తీరాలనీ, తన తప్పు తాను తెలుసుకున్నవాడికన్న మహనీయుడు ఇంకొకడుండడనీ తలచిన పరీక్షిత్తు ప్రాయోపదేశంతో దేహత్యాగం చేయాలనుకుంటాడు.

పరీక్షిత్తు ప్రాయోపదేశానికి ఎందరెందరో మహనీయులు వస్తారు. అక్కడికి శుకమహర్షి కూడా వస్తాడు. తనకున్న ఏడు రోజుల పరిధిలో శుకుని ద్వారా భాగవత శ్రవణం చేసి సంతోషంగా విధి నిర్ణయించినట్లుగానే తన పాత్రను ముగించి వెళ్ళిపోతాడు. మంచిని మాత్రమే కోరుకొని, ధర్మం రక్షించబడాలని తపనపడి జీవితమంతా ఉన్నతంగా మలుచుకున్న పరీక్షిత్తులాంటివారు ఈ భూప్రపంచంపై ఉండబట్టే కాలగమనం సక్రమంగా కొనసాగుతున్నది.

పరీక్షిత్తు తన శాపం గురించి తెలుసుకొని చాలా బాధపడుతాడు. శాపభయంతో కాదు, తాను చేసిన అపరాధాన్ని తలుచుకొని అహంకారం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసిందనే పశ్చాత్తాపంతో చింతిస్తాడు.

- ప్రమద్వర

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles