పరాయి


Sun,July 16, 2017 01:46 AM

టిక్కెట్టు తీసుకొని లగేజీని సర్ది అద్దపు పక్క సీట్లో చేరగిలబడ్డాడు. ఆ బస్సులో భారత సమాజం ప్రతిబింబిస్తుంది. టిక్కెటెంత? అడిగి, సరిపోతాయా? అని ఒకాయన జేబులో గాంధీ తాతను వెతుకుతున్నాడు. ఇంకో ఆయన పెద్ద నోటును కండక్టరు చేతిలో పెట్టి చిల్లర లేదని దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏసీ పెంచవయ అని ఒకతను అంటే బదులుగా ఆ కోటు తీసి కూర్చో, ఏసీ అదే పెరుగుతది. చలికాలంలో ఏసీ అట అని గుణిగాడు. ఇంకో పెద్ద మనిషి ఇప్పుడే నా దగ్గర ఈ నోటు చెల్లినప్పుడు నీ దగ్గరెందుకు చెల్లదు? చిరిగిన నోటుతో ఇంకో మనిషి కండక్టరుతో వాదిస్తున్నాడు. వీళ్లందర్లోకీ అతణ్ని ఆకర్షించిందో జంట. సీట్ల అడ్డుగోడల్ని చెరిపి, ఒకరితో ఒకరు కబుర్లతో అల్లేసుకున్నారు. మొహాల్లో నునులేత సిగ్గు, పెదాల్లో ముసిముసి నవ్వులు, దేహాల్లో ఉల్లాసం, కళ్లలో పరవశమే వాళ్లు జంట అని తెల్పుతుంది. అతనికి పాత రోజులు గుర్తుకొచ్చాయన్నట్లు ఆ పక్క జంటలోని వెలుగు ఈయనలో ప్రకాశించింది. ఎవరో డ్రైవర్‌సాబ్ ఇక పోనీవయ్యా అనగానే, ఇతనికి ఇంటికి ఫోన్ చేయాలని గుర్తొచ్చింది. దుబాయి సిమ్మేమో ఇక్కడ పనిచేయకపోవడంతో పక్క సీటాయనను అడిగా ఫోన్ చేశాడు. బాపూ.. నేను సీనూ ఆ.. బిడ్డా ఎక్కడిదాకా వచ్చినవ్ పైలంగ రా.. ఆ గొంతులో ప్రశ్నలేదు అది ఆత్మీయత. ఒక్క కాల్‌తో ఒక కుటుంబం మనసులు మొత్తం కుదుటపడ్డయ్. బస్సుతోపాటూ అతని ఆలోచనలూ స్టార్టయ్యాయి. ఏవేవో ఆలోచనలతో బిగుసుకుపోతున్నాడు. నిద్ర పోదామని అనుకుంటున్నాడు. అది తప్ప మిగతావన్నీ వచ్చిపోతున్నాయి. కళ్లు తనని తాను పరిశీలించుకుంటున్నాయి. లోకాన్ని చూడాలంటే కళ్లు తెరవాలి. తనని తాను చూసుకోవాలంటే కళ్లు మూసుకోవాలని అతనికి తెలుసు.

తన కుటుంబం, పెళ్లి ఈ దుబాయి జీవితం ఇలా కనురెప్పలకంటే వేగంగా అతని ఆలోచనలు మారిపోతున్నాయి. ఆ ప్రవాహాల్లో కొట్టుకుపోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. జ్ఞాపకాల్లో ఎడతెగని దూరాలు ప్రయాణిస్తున్నాడు. వేరే దేశం నుంచి రావడానికి తనకి నాలుగు గంటలు పడితే, ఇంటికి చేరడానికి ఆరు గంటలు పడుతుందని తెలిసి నవ్వుకున్నాడు. జెల్దిన ఇంటికి పోవాలని అతనికున్నంత స్పీడు ఆ బస్సుకు లేదు. మూడు సంవత్సరాల తర్వాత తన ఊరుకి వెళ్తున్నందుకు ఒకింత ఆనందంగా లోపల మాత్రం తనకే తెలియని బాధతో ఉన్నాడు. ఒకే సమయంలో రెండు రకాల భావనలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాడు. బాబూ, నిన్నెక్కడో చూసినట్టుందే? మీది జగిత్యాల?. తల పైకెత్తి చూసి సా...ర్ మీరు సత్యం సార్ కొద్దిగా ఆశ్చర్యంతో అన్నాడు. నువ్వేం మారలేదురా రవీ! మీసాలూ, గడ్డమొచ్చినా పదవ తరగతి రవిలా ఉన్నావు. అందుకే గుర్తుపట్టా, కాకపోతే ఇప్పుడు నీ కళ్లకు వయసొచ్చినట్టుంది అన్నాడు నవ్వుతూ.
KATHA

లేద్సార్.. చూడలేదు
లేదు రా! అప్పుడేమో బ్లాక్ బోర్డ్‌లాంటి జుట్టుండేది నాకు. ఇప్పుడేమో చాక్‌పీస్ రంగులాంటి జుట్టయింది. అందుకే పోల్చలేదేమో? నవ్వారిద్దరూ. ఆ నవ్వుని బస్సుతో పాటు అలాగే కొనసాగించారు. కొన్ని సంవత్సరాల తర్వాత కలిస్తే వేసుకునే ప్రశ్నలన్నీ వేసుకున్నారు. బస్సు వేగం పెరిగింది. సూర్యుడు తన పరదా తీసి మెల్లమెల్లగా తొంగి చూస్తున్నాడు. చలికి శరీరాలు వెచ్చదనం కోరుకుంటుండటంతో సూర్యుణ్ణి అడ్డుకుంటున్న కర్టెనును తొలగించి సాంత్వన పొందగలిగారిద్దరూ. కొడుకుని అమెరికాకు సాగనంపటానికి వచ్చా. నువ్వెక్కడ్నుంచి వస్తున్నావ్ రా? దుబాయి నుంచి సార్! దుబాయి నుంచా? మరి ఎలా ఉందిరా దుబాయి ఎండాకాలపు మధ్యాహ్నపు టెండలా ఉంది. లోపలున్న మాటే బయటకొచ్చింది రవికి. రవి గొంతులోని బాధను గమనించి సత్యం సారు ఏమైంది రా? రవీ ఏదైనా పంచుకోవడానికి మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న రవి, కొద్దిసేపటి నిశబ్దం తర్వాత చెప్పసాగాడు. నేను మన జిల్లా దాటే ఎప్పుడూ వెళ్లలేదు. అలాంటిది దుబాయి వెళ్లాను. భయంతోనే ఎయిర్‌పోర్టులో దిగిన. తెల్లగున్నలాంటి ఒకాయినె మా దగ్గరికొచ్చి అతని దగ్గరి ఫొటోల ఉన్న మమ్ముల్ని మేమేనని గుర్తువట్టి బయటికి రమ్మన్నాడు. పోయ్‌నం. అక్కడి సూర్యుడు మనదేశపు సూర్యుని లెక్క లేడు.

బాగ కోపంగ ఉన్నడు. కారు దగ్గర్కి పోయేసరికి అంగిలు తడిసినయ్. మస్తు ఉక్కపోత. కార్ల మాత్రం సల్లగ ఉంది. సెంటు వాసన తోటి ముక్కు పట్టేసినట్లుంది. పోలీసులు ఎంట బడుతున్నట్టు కారు బాగా ఉరుకుతుంది. కారు అద్దంలకెళ్లి సూత్తే బయట అంతా ఇస్క, అంతా దుబ్బా, దుమ్మూ, మన దేశంల మందిలెక్క తొవ్వ సుట్టూరా ఇసుక. కనిపించినంత పెట్టూ చెట్లూ లేవు. జనం లేరు. ఉన్నవంతా ముళ్లపొదలు, తుమ్మ చెట్టువంటియి. చెట్టుకోటి, పుట్టపోటి అన్నట్టుగా ఇళ్లు. ఉన్నవేమో కింది నుంచి సూస్తే కళ్లు తిరిగి పడిపోయేంత పెద్దపెద్ద బిల్డింగులు, రాళ్లూ, రప్పలూ, చెట్లను లెంకిన, మొక్కలైనా చెట్లయినా ఖర్జూరా చెట్లేనని ఎక్కడో సదివిన, నిజమేననిపించింది. శుక్రవారం నాడు ఆకిట్ల అలుకు సల్లి, ముగ్గులు పెట్టినట్టు రోడ్లు ముచ్చటగా ఖాళీగున్నయ్. ఒక పెద్ద ఇంటిముంగట దించిండ్లు. తెల్లగున్న మనిషి మమ్మల్ని దిగమని, ఆ మాటనే చేతులతో సైగ చేసిండు. ఇంట్లోకి తీసుకచ్చిన ఈ తెల్లగున్న మనిషి, ఆ ఇంట్లోని ఐనకు పాస్‌పోర్టిచ్చి ఏదో మాట్లాడుకున్నరు. నాకు హిందీ అత్తది. కానీ ఈళ్లు మాట్లాడేది ఇంకో భాష. తెల్లారి నుంచీ పని షురూ ఐంది.

కారు డ్రైవరని పోయ్‌న. పేరుకే అది. గొడ్డు చాకిరీ చెయ్యాలె. ఫలానా పనంటూ లేదు. వాళ్లు ఏది చెప్తే అదే పని. అంబటాళ్ల సీకట్లనే లేవాలే. అప్పుడు పొద్దుగూడ రాదు. లేచీ లెవ్వంగనే పని మొదలు. లేసుడుతోనే ఇల్లు తుడువాలె. కసు ఎత్తిపోయాలె. సెత్త పారెయ్యాలె, బాత్రూంలు సాఫ్ చెయ్యాలె. అంతంత మందియి మాసిన బట్టలన్ని ఉతికే మెషీన్ల ఎయ్యాలె. మొక్కలకు నీళ్లు పట్టడం, అంతెత్తున్న పేరుకున్న గిన్నెల్ని తోమాలే, సామాన్లు తేవాలే. బట్టలు ఇస్త్రీ సెయాలే, ఇంటినిండ ఉన్న పిల్లల్ని బడికి పడగొట్టచ్చి, సార్‌ని ఆఫీసుకి తీస్కపోవాలె. అక్కడా ఆనికి చాయ్‌లూ, కాఫీలూ, టిఫిన్లు అందియ్యాలె. రేపటికి కావాల్సిన తిండి లిస్టు తయారు చేసుకోవాలె. మళ్ల వంటకు కావాల్సిన గిన్నెలు కడిగి, ఇల్లు సదిరి రాత్రి గూర్ఖ లెక్క నిలవడాలె. రాత్రి పండుకునే సరికి తెల్లారేది. టైమ్‌కి తిండి సరిగ్గ ఉండేది గాదు. ఆ మురగబెట్టిన ముక్కలు, కూసు కూరలు నాకు పడకపోయేటివి. రొట్టెముక్కతోని రోజంతా ఎల్లదీసేటోణ్ణి. పండుకుంటే నిద్ర రాకపోయేది. శరీరం మొత్తం నొప్పివెట్టేది. ఒంటరితనం చంపేసేది. తిన్నవా అని అడిగేటోళ్లు లేకపాయే. ఇల్లు యాదికచ్చేది. ఎందుకో తెల్వది ఒక్కొక్కసారి పెయ్యంతా సల్లని సెమటలు పట్టేవి. గత్తర వట్టినట్లయ్యేది. కట్టేసిన బతుకైంది. ఏ పండుగ లేదు. చెర్వు గట్టుమీద ఎగిరే పక్షి లేదు. చెరువే లేదు. తొక్కు ఎల్లిపాయ కారానికి పాణం కొట్టుకుంటుండే. ఇగ ఎప్పుడన్నా ఏదన్నా బీమారీ వచ్చినా పని జేయాల్సిందే. లెవ్వకపోతే దవాఖానాకు పొమ్మని డబ్బులు ఇసిరేసేటోళ్లు. ఆరోగ్యం బాగలేనప్పుడు దేవునికి ముడుపు ఏసే అమ్మ అక్కడ లేదు. ఏం గాదురా! అని ధైర్యం జెప్పి భుజంపై చెయ్యేసే బాపు లేడు. ఇట్లాంటి విషయాలు కూడా కన్నీళ్లు పెట్టుకొని సపర్యలు జేసే నా భార్యా అక్కడ లేదు. ఎలా ఉన్నావ్ రా అనే స్నేహితుల్లేరు. చూసుకుంటే అక్కడ నేనే లే..ను.. అనేటప్పుడు అతని గొంతు పూడుకుపోయింది. కళ్లు నీళ్ల రంగుకి మారినయి. రవిపై సారు ఆత్మీయంగా చేయి వేసినా, దుఃఖం పెరిగింది గానీ, తగ్గలేదు.

సారూ! అనారోగ్యమంటే పడేయాల్సింది పైసలా? నీకేం కాదు, మంచిగయితవు అనే భరోసానా? వాళ్లకు నేనొక జీతమిచ్చే ఖరాబ్‌గాని బండిని... అంతే! ఏమైందని అడిగేవాడే లేని డబ్బెందుకు?
ఫోను రింగవడంతో ఎత్తి రవీ! నీకే రా అని ఫోను రవికి ఇచ్చాడు.
నాన్నా! వస్తున్నావా?.. ఆ.. నాకు.. ఇ.. న్ని.. చాక్లెట్లు పట్టుకురా. ఇంకా.. పెద్ద బ్యాగ్ నిండా నింప్కరా.. ష్.. ష్.. అమ్మకు చెప్పకు.. వద్దంటది
చిన్నపిల్ల గొంతులా ఉంది
ఔను సార్.. మా పాప. నిజంగా వస్తున్నావా? ప్రామిస్ చేయమంటుంది.. నమ్మట్లేదు అన్నాడు రవి కళ్లలో నీళ్లు నిండిన నవ్వుతో.
పాప కూడా ఉందా రవీ ప్రస్తావన రాకపోవడంతో ఆశ్చర్యంగా అడిగాడు సత్యం సార్.
నేను దుబాయ్ పోయేటప్పుడే నా భార్య గర్భవతి. పోయిన రెండు నెలలకు పాప పుట్టింది. ఫొటోల తప్ప నా బిడ్డనింక చూడనే లేదు. ముద్దాడనే లేదు. బుజ్జిని ఎత్తుకోని తనతో ఆడుకోవాలని మూడు సంవత్సరాల నుంచి నా ప్రాణం ఊగిసలాడుతూనే ఉంది సార్మరి అలాంటోనివి, ఇంత మందిని విడిచిపెట్టి, పాప గర్భంలో ఉండగా, దుబాయ్ వెళ్లకుంటేనే బాగుండేది కదా!ఔన్సార్. ప్రతీ వానికీ ఏదో ఒక టైంల కష్టమొస్తది. అప్పుడు తొవ్వలుండవు. ఒకే తొవ్వ. ఆ అడుగు తప్పు వడ్తే కుటుంబం తొవ్వల పడ్తది. నాది అప్పుడు అట్లాంటి పరిస్థితే అని రవి తన గతాన్ని వర్తమానంలోకి తెచ్చుకున్నడు.

కాలాన్ని వెనక్కి తెచ్చే సాధనమో జ్ఞాపకం అలాంటి జ్ఞాపకాలనూ, మంచి సినిమాలనూ చూసే అవకాశమిచ్చిన కాలేజీకీ, వాటి కారకులకూ కృతజ్ఞతలు. ఇది వీడ్కోలు సభ కాదూ, జ్ఞాపకాల సభ అంటాన్నేను. గతం యొక్క అనుభవం, వర్తమానం పై నీ పరిశీలన, భవిష్యత్తుపై నీ కోరికే కాకుండా ప్రేమా అనే ఓ గట్టి శక్తీ విజయానికి కారణమవుతుందని నా నమ్మకం. కదిలేది కదిలించేదీ మునుముందుకు నడిపించేది ప్రేమా అంటాన్నేను. ప్రతీ ప్రాణి పట్ల ప్రేమగా చూసే మనసును అందరికీ ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ సెలవు మధు ప్రసంగానికి గాలిని బయటకు తోసి హాలంతా చప్పట్లతో నిండిపోయింది. ప్రసంగం అయ్యాక తర్వాత సరాసరి నా దగ్గరికొచ్చింది.రవీ మనం పెళ్లి చేసుకుందాం అన్నది. ఒక నిర్ణయానికొచ్చినట్టు.
ఒక్క నిమిషం నాకేం మాట్లాడాలో తెలియలేదు. మన గురించి చెప్పకముందే నీ కులం నచ్చలేదు మా వాళ్లకి. అర్థం చేసుకొని, విలువనిచ్చే నీలాంటి మంచి వాడు దొరకడని చెప్పా. నచ్చజెప్పా. బతిమిలాడా. వాళ్లు వినే స్థితిలో లేరు. నా పెళ్లి నిశ్చయించారు. బాధతో చెప్పేది వేరే అమ్మాయి ఐతే.

కానీ, ఒకటి గుర్తుంచుకో రవీ! నాకు ఉద్యోగం రావాలి. నువ్వు నీ కుటుంబానికి ఆసరా కావాలి. నా దగ్గర మహా అయితే ఇంకో రెండు నెలలు ఉన్నాయి. అంతే, ఇక నీ ఇష్టం అంది అన్నీ ఆలోచించే. నేనేమో అప్పుడు ఆలోచించండం మొదలుపెట్టిన. పళ్లైతే చేసుకున్నం. ఒకే ఊరు కాబట్టి లొల్లీలతో తక్లీబని ఊళ్లు మారుస్తూ ఉన్నాం. రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో గడిపినం. మా బాపనేటోడు పొలం నా బలం రా. ఈ భూమి నా గుండెకాయ రా అని. అట్లాంటిదాంట్ల ఉన్న రెండు రెండెకరాల పొలంల రైలచ్చింది. దాంతోటి మా బాపుకి గుండెపోటొచ్చింది. రందితోటి మా అమ్మకు బీమారచ్చింది. చేతిలనేమో పైసలు లేవు. బాగ అప్పులు అయినయ్. నేను చేసే డ్రైవరు పైసలు, నా భార్య స్కూల్ టీచర్‌గా చేసే పైసలు తిండికి మందుకే సరిపొయ్యేటివి కావు. అప్పులోల్లు ఇంటికాడ్కి వచ్చుడు మొదలువెట్టిండ్రు. తప్పలేదు, ఇంకో దారి లేదు. డబ్బులు కావాలె. ఇష్టం లేకపోయినా దుబాయ్ వోయిన.బడలిక తీర్చుకోడానికి బస్సాగింది.
పది నిమిషాలు ఆగుతది అన్నడు కండక్టరు.

రారా కూర్చో.. ఏం తిందాం?
వద్దు సార్.. ఆకలైత లేదు
భయపడకురా.. ఖర్చులు నావే.. వడ్డీ అడుగనులే
వద్దు సార్
ఐతే వడ్డీ, అసలు కూడా వద్దులే అన్నాడు నవ్వుతూ..
సరే ఏం చేస్తాం! ఈ రెండు ప్టేట్లూ నేనే తింటాలే. ఫ్రీగా వచ్చినా వద్దంటే ఈ లోకంలో ఎలా బతుకుతవో? పాపం అమాయకుడిని ఎలా నెట్టుకొస్తుందో ఆ పిల్ల? నవ్వారిద్దరూ.
పోనీ చాయ్ ఐనా..?
వద్దు సార్.. నేనొస్తున్నానని పొద్దుగల్లట్నుంచి ఇంట్ల ఏమీ తినకుండా ఎదురు చూస్తున్నరంట. ఉపాసం ఉన్నరట. మా బిడ్డ కూడ తినలేదట. నా కిష్టమని అమ్మ పప్పు కూర, గారెలు జేసిందట
నేను వేరే దేశంలో ఉండి ప్రవాసీనే, పరాయోడినే. నేను లేక మా అమ్మానాన్న పరాయోళ్లే. మధు తన ఊళ్లో ఉండి కూడా తనవాళ్లకూ పరాయిదే. మధు గురించి మా అమ్మ ఒక్కటే అన్నది... నువ్వున్నా. కోడలికన్నా బాగా సూస్కునేటోనివి కాదురా అని. ఆ తృప్తి చాలు సార్.. ఇంతకంటే ఏం కావాలి?
ఆ రవీ.. ఇక్కడ ఇంకెన్ని నెలలుంటవో? పోయేముందు ఫోన్ చెయి కలుద్దాం అన్నాడు. సత్యం సారు తన గమ్యస్థానం ఇంకో ఐదు నిమిషాలనంగ.

లేద్సార్.. ఇగ వోను అన్నాడు రవి గొంతు హెచ్చించి. ఇగ పోను సార్.. ఇక్కడే ఉంటా. ఏదన్నా పని జేస్కుంట. ఇక్కడే బతుకుత. వందకోట్ల మందికి నీడనిచ్చిన దేశం నాకియ్యదా? ఈ ఉదయించిన తెలంగాణల ఏ పనైనా జేత్త. ఆ పరాయి దేశం బోయి అక్కడ నేను ఖుషీగా లేను. ఇక్కడ మా కుటుంబం ఖుషీగా లేదు. సంతోషమంటే మనసున్న చోట మనముండడం సార్. నా తల్లిదండ్రులకు వయసు మీద వడుతోంది. వాళ్లు పడే బాధ నాకు తెలుసు. ఇంక ఇప్పుడు గూడ బాధపెట్టుడెందుకు సార్? కన్నీళ్లను తుడ్సెటోడు కొడుకు కాడు.. కన్నీళ్లు రాకుండ సూసేటోడు కొడుకు. ఇప్పుడైనా నేను కొడుకునైత సార్.

నా భార్య నా కోసమని వాళ్ల కుటుంబాన్ని ఇడ్శిపెట్టి వస్తే, నేను ఆమెని ఇడ్చిపెట్టి పోవడం మంచిగ లేదు సార్. నా బిడ్డకు నేను నీ నాన్నని అని పరిచయం చేసుడుకంటే ఇంకేమన్న ఘోరం ఉంటదా సార్? బిడ్డను గుండెల మీద పెంచాలని ఏ తండ్రికుండదు? కదిలేది.. కదిలించేదీ.. మునుముందుకు నడిపించేది ప్రేమ సార్. ఇవ్వన్నీ వదిలి నేను పోను సార్ విన్నవెంటనే సత్యం సారు రవిని గుండెకు హత్తుకుని.. నాకున్న ఒక్క కొడుకూ వద్దన్నా, డాలర్ల మోజుల పడి మేమున్న సంగతే మరిచాడు. వాని తల్లి అనారోగ్యంతో మంచం మీదున్నా వానికి సెలవు దొరకదట. వాడు కొడుకా? సారు కంఠం పూడుకుపోయింది. తేరుకోని సరే రా.. రవీ.. మరి ఏ పని జేద్దామనుకుంటున్నవ్? అన్నడు.ఎడారిల బతికినోణ్ణి ఇక్కడ ఎట్లనైనా బతుకుత. ముందుగాల పైసలతోటి కొద్దిగ భూమి కొని మళ్ల మా బాపు గుండె వాపసిస్త. బీమారు పోయేటట్టు మా అమ్మను చూసుకుంట.

1034
Tags

More News

VIRAL NEWS