పడిలేచిన సంగీత కెరటం వరికుప్పల యాదగిరి

Sun,March 19, 2017 02:22 AM

పుట్టుకతోనే కరువు వెంటాడింది. పెరుగుతున్న కొద్దీ పేదరికం తోడైంది. కానీ పాటమాత్రం ప్రాణమైంది. రెండవ తరగతిలో ఉండగా పాడిన పాట బహుమతిని సాధించిపెట్టింది. ఆ ఉత్సాహం ఆయనను గాయకుడు కమ్మని ప్రోత్సహించింది. అది ఆయనతో పాటు పెరిగి పెద్దదైంది. సినిమాల్లో పాడాలనే పట్టుదలతో హైదరాబాద్ చేరిన ఆయనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. కడలిని ఈదుకుంటూనే కొన్ని సినిమాల్లో పాటలు రాసి, పాడాడు. కొంతకాలం తర్వాత మళ్లీ అదే శూన్యం. కాలం గిర్రున తిరిగింది. రేసుగుర్రం రూపంలో అదృష్టం మళ్లీ ఆయన తలుపు తట్టింది. ఇప్పుడు వరుసగా పాటలు రాస్తూ సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు రచయిత, గాయకుడు వరికుప్పల యాదగిరి.

యాదగిరి.. ఒకప్పుడు పశువులు కాస్తూ జీవితాన్ని గడిపినవాడు. చదువుకోసం తల్లిదండ్రుల మీద అలిగి ఉపవాసం ఉన్నవాడు. ఆర్థిక ఇబ్బందులతో సహజీవనం చేసినవాడు యాదగిరి. పుట్టినపుడు మా ప్రాంతంలో కరువొచ్చిందట. దాంతో ఇంట్లో ఉన్న పశువులూ, బంగారం అమ్మేసుకున్నారట, దాంతో ఇంటిని చెడగొట్టడానికే పుట్టానని మా నాన్న తిడుతుండేవాడు అని ఆయన ఒక సందర్భంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు.


varikupaalayadagiriవరికుప్పల యాదగిరి.. ఒకప్పుడు ఈ పేరు సినిమాలతో సంబంధం ఉన్నవారికే సరిగా తెలియదు. కానీ రేసుగుర్రం సినిమాలో సినిమా సూపిస్తా మామా నీకు సినిమా చూపిస్తా మామ అనే పాట మాత్రం లక్షలాది శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతటి సూపర్‌హిట్ పాట రాసింది వరికుప్పలనే. ఆ ఒక్క పాట ఆయన జీవితాన్నే మార్చేసింది. సినిమా పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. వరుసగా పెద్ద హీరోల పాటలు రాసే అవకాశాలు రావడంతో ఆయనలోని రచయితకు చేతినిండా పని దొరికినైట్లెంది.
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఎన్నో ప్రేమ హృదయాలను కొల్లగొట్టిన పాట. 2001లో వచ్చిన అద్భుత ప్రేమకావ్యం సంపంగిలోనిది. ఈ సినిమాలోని పాటలన్నీ యాదగిరి రాసినవే. అంతేకాదు అత్యంత జనాదరణ పొందిన అందమైన కుందనాల బొమ్మరా పాట పాడింది కూడా యాదగిరినే. అందులోనే

ప్యాంటేస్తే గానీ తెలియలేదురా మామో
నాకు సైట్ ఏసే వయస్సొచ్చిందని
అంటూ యుక్తవయస్సుకు వచ్చిన నవతరం పాడుకునే పాట. గతంలో వచ్చిన పాటలకు భిన్నంగా మాటలు, పాటలు కలగలిపి రాసిన పాట. ఈ పాట కూడా అందర్నీ అలరించింది.
పూర్తిగా ప్రేమకథా చిత్రమైన సంపంగిలో పాటలన్నీ దేనికవే భిన్నంగా సాగాయి. ప్రేమ విఫలమవుతుందన్న బాధలో కథానాయకుడు పాడే పాట..

గుండెనెందుకిచ్చావురా.. దేవుడా
ఎండమావి చేశావురా దేవుడా..
అంటూ రోదిస్తూ పాడే పాట కఠిన హృదయాలను సైతం కదిలిస్తుంది. అయితే నిజానికి యాదగిరికి ఈ సినిమా మొదటిది కాదు. అంతకుముందే 1998లో వచ్చిన ప్రేమపల్లకిలో రెండు పాటలు రాశాడు.
వరికుప్పల యాదగిరి 1976 ఏప్రిల్ 14న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తిరుపతి, ఇద్దమ్మ. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. భార్య రమాదేవి, పిల్లలు ఇందుశ్లోక, మిన్ను మయూఖ.

చిన్నతనం నుంచి పేదరికాన్ని అనుభవించిన యాదగిరిరెండో తరగతి చదువుతున్న సమయం నుంచే పాటలు పాడేవాడు. గ్రామంలో జరిగే భజన కార్యక్రమాల్లో తండ్రితో కలసి పాల్గొనడం మూలంగా పాటలు పాడే కళ ఆయనకు అబ్బింది. ఇంటర్ తర్వాత పై చదువులు చదివే అవకాశం లేకపోవడంతో సినిమాల్లో పాడాలనే సంకల్పంతో హైదరాబాద్ బాట పట్టాడు. అవకాశాల కోసం వెతుక్కుంటున్న సమయంలోనే ప్రేమపల్లకి సినిమాకు రాసే వచ్చింది. అలా గాయకుడు కావాల్సిన యాదగిరి రచయితగా రూపాంతరం చెందారు. మొదట్నుంచీ కూడా పాటలు రాసుకుని పాడే అలవాటు ఉండడంతో రాయడం ఆయనకు ఏ మాత్రం కష్టమనిపించలేదు.

ప్రేమపల్లకి సినిమాలోని సాహిత్యం నచ్చిన రామోజీరావు వరికుప్పలను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఆయనకు ఫిలింసిటీలో ఉద్యోగం కల్పించాడు. అక్కడ ఆడియో లైబ్రరీ ప్రాజెక్ట్ కోసం ఆయనను నియమించారు. అదే సమయంలో సానా యాదిరెడ్డి బ్యాచిలర్స్ సినిమాకు రెండు పాటలు స్వరపరిచి పాడారు యాదగిరి. ఫిలింసిటీలో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన యాదగిరి యాదిరెడ్డి మరో చిత్రం సంపంగికి రాసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇందులోని పాటలన్నీ యాదగిరి రాసినవే. అయితే ఆ చిత్రం తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఆ సమయంలోనే ఇష్టం సినిమాకు ఓ పాట రాసి ట్యూన్ చేయమని దర్శకుడు విక్రమ్ పిలిచాడు. ఆ సినిమా నిర్మాత రామోజీరావుకి పాట నచ్చడంతో సినిమా కోసం ప్రత్యేకంగా ఏదైనా కంపోజ్ చేయమన్నాడు. ఆయన ప్రోత్సాహంతో బల్లలూ, ప్లేట్లూ, గ్లాసులూ, సీసాల్లాంటి వాటి సాయంతో ప్రయోగాత్మకంగా ఓ పాట చేస్తే దాన్ని చిత్ర సంగీతంలో జతచేశాడు.

యావూరు యావూరే చిన్నదానా..
ఉన్నాయె సోకులు చానా
నా వద్దకొస్తావా ఓ సారైనా .. ఓ చిన్న ముద్దీవే మైనా

ఇష్టం సినిమా కోసం యాదగిరి రాసి పాడిన గీతం. ప్రేమలో పావనీ కళ్యాణ్ సినిమా కోసం అడగక్కర్లేదు నా బావ ఎక్కడని అంటూ సాగే పాటను ఆయనే రాశారు. ఆ తరువాత తొట్టిగ్యాంగ్, ఎవడిగోల వాడిదే, ఆదిలక్ష్మి, జ్ఞాపకం, పెళ్లయింది కానీ.., స్టూడెంట్, సవాల్, మంజీరా, అభిమాని, భగీరథుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి.. చిత్రాలకు సంగీతం అందించి, పాటలు పాడినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. చనిపోవడం, పెళ్లి, పిల్లలు వంటి వాటితో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి దర్శకుడు సురేందర్‌రెడ్డి పిలిపించుకుని తనతో కలసి పనిచేయమని కోరాడు. అలా ఉన్న సమయంలో రేసుగుర్రం సినిమా మొదలైంది. ఆ సినిమాకు యాదగిరికి పాటలు రాసే అవకాశం వస్తుందో రాదో అనుకున్న సమయంలో మూడు పాటలు ఆయనతో రాయించారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన పవర్ సినిమా కోసం వరికుప్పల రాసిన మాస్ సాంగ్ ప్రేక్షకులను అలరించింది. తిట్ల పురాణంలా ఉండే ఈ పాట నేటి యువతకు ఎంతో కనెక్ట్ అయ్యింది.

బద్మాసు పిల్లా బేకార్ పిల్ల
నీ కడుపు కాలా నన్నే ముంచేసినవే..
అంటూ తిట్టినట్లు సాగుతుందీ పాట.
మంచు లక్ష్మీ నటించిన దొంగాట చిత్రంలో ఆమె పాడిన గీతం
యాందీరో.. యాందీరో అసలేందిరో మీ మగళ్లలో అంత ఇర్ర ఈగిపోయే గొప్ప.. పాట కూడా యాదగిరి రాసిందే.
అనుకున్న లక్ష్యాన్ని సాధించి తెలుగు సినిమా పరిశ్రమలో వరికుప్పల యాదగిరి మంచి రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదగాలని మనమూ ఆశీద్దాం.

వరికుప్పల యాదగిరి పాటల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆయన పాటలు తక్కువ సమయంలోనే జనాదరణ పొందాయి. ఇటీవల వచ్చిన ధృవ చిత్రంలోనూ ఆయన పాట అందరినీ అలరించింది.
పరేషానురా పరేషానురా
ప్రేమన్నదే పరేషానురా
అంటూ ప్రేమలో పడిన యువతి ఎలా ఉంటుందో వివరించే పాట.
కష్టాల కడలిని దాటొచ్చిన యాదగిరి కెరీర్ ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది. కష్టాన్ని మరిచి కొత్తజీవితాన్ని ప్రారంభించడంతో పాటు భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలనుకుంటున్నాడు.

మూడిట్లోనూ ప్రవేశం :


గాయకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన యాదగిరి రచయితగా మారినప్పటికీ తన గానాన్ని మాత్రం వదిలేయలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ పాటలు పాడుతూ తన గానతృష్ణను తీర్చుకుంటున్నారు. అలా బ్యాచిలర్, రావే నా చెలియా, సంపంగి, జూన్.. జులై, మందారం, భగీరథుడు, బ్రోకర్, ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి, అభిమాని, రేపల్లెలో రాధా, మహాత్మా, పవర్ చిత్రాల్లో కొన్ని పాటలు పాడారు. అలాగే భగీరథుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అభిమాని చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ సేవలందించారు.

సినిమా చూపిస్తా మామా
నీకు సినిమా చూపిస్తా మామ
సీను సీనుకీ నీతో సీటీ కొట్టిసా ్తమామ
పాట తెలుగు వాళ్లను ఊపేసిన పాట. ఈ పాటను యూట్యూబ్‌లో కోటీ తొంభై లక్షల మంది వీక్షించారు. అంతమంది వీక్షించిన తొలి తెలుగు పాట కూడా ఇదే. రేసుగుర్రంలోనే యాదగిరి రాసిన రేసుగుర్రం రేసుగుర్రంతో పాటు ఓ మై స్వీటీ, ఓ మై స్వీటీ అనే రెండు పాటలు కూడా కోటిన్నరమందికి పైగా చూశారు. ఈ ఒక్క సినిమా యాదగిరి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తరువాత అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

దశ మార్చిన రేసుగుర్రం


యాదగిరికి రేసుగుర్రం చిత్రానికి మూడు పాటలు రాసే అవకాశం వచ్చింది. అందులోని సినిమా చూపిస్తా మామ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆయన దశ తిరిగింది. రేసుగుర్రం తరవాత రవితేజ సినిమా పవర్, డిక్టేటర్, కరెంటు తీగ, శౌర్య, చుట్టాలబ్బాయి, కృష్ణాష్టమి, కిక్ 2 లాంటి సినిమాల్లో పాటలకు మంచి గుర్తింపు లభించింది.
మధుకర్ వైద్యుల, సెల్: 80966 77409

1861
Tags

More News

మరిన్ని వార్తలు...