పండ్లలో రారాజు..


Sun,April 21, 2019 02:41 AM

పలు రకాలు!పండ్ల రారాజు.. మామిడి పండు!ఈ కాలంలో విరివిగా దొరికేవి కూడా ఇవే!ఆ మామిడి నిగారింపు.. వేసవి వేడిని కూడా మరిపిస్తుంది..ఉక్కపోతలోనూ అందరి దృష్టిని మరలుస్తుంది.. ఆ రంగు.. రుచి.. మధురాతి మధురంగా అనిపిస్తుంది.. అయితే ఈ మామిడి పండ్లలో చాలా రకాలున్నాయి.. మార్కెట్‌లో అమ్మకందార్లు ఏవేవో పేర్లు చెప్పి.. పండ్లను కొనిపించేస్తారు.. అసలు ఆ పండ్లు ఏంటో.. వాటి రుచి ఎలా ఉంటుందో? ఇవన్నీ తెలిసినప్పుడు మామిడి రాజాని.. మరింత ఆనందంగా ఆస్వాదించొచ్చు.. అందుకే మామిడిలోని పలు రకాల పండ్ల ప్రత్యేక కథనమే ఇది..

-సౌమ్య పలుస
Mango

బంగినపల్లి

ఏప్రిల్ నుంచి జూన్:మార్కెట్‌లో మొదట హిట్ కొట్టే మామిడి రకం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండ్లు విరివిగా కాస్తాయి. దేశంలోనే కాదు.. ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ పండు పై తొక్క ముదురు పసుపు రంగులో మెరిసిపోతుంటాయి. కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఈ పండ్లు నోరూరిస్తాయి. ఫైబర్ తక్కువగా ఉండే పండ్లు కచ్చితంగా చాలా బాగుంటాయి.

పైరీ

మే నుంచి జూన్ :ఈ మామిడి పండు ముక్కను నోట్లో వేసుకుంటే తేనె పోసుకున్నట్టే ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే ఈ పండు ఒక్కటిగా కాకుండా ఎక్కువగా తీసుకెళుతుంటారట. కొన్ని పండ్లు కాస్త పుల్లగా కూడా ఉన్నా ఎంతో కమ్మగా ఉంటాయి. గుజరాత్‌లో ఆమ్స్ చేయడానికి కేసర్ మామిడి పండ్లు దొరక్కపోతే వీటిని వాడుతారు. వీటిలో నాణ్యత పెద్దగా ఉండదు. కాబట్టి కొన్న వెంటనే వీటిని తినేస్తే మంచిదట.

నీలమ్

మే నుంచి జూలై:సువాసన పండ్ల రారాజుగా పిలుస్తారు ఈ రకం పండ్లను. సీజన్ మొత్తం దొరికే ఈ పండ్లలో.. జూన్‌లో దొరికేవి. మరింత టేస్టీగా ఉంటాయి. తొలకరి సమయంలో పండ్లు హైదరాబాద్‌లో ఎక్కువగా దొరుకుతుంటాయి. కాకపోతే అన్ని దేశాల్లో కూడా ఈ మామిడి పండ్ల తోటలు ఉన్నాయి. తొక్క పలుచగా ఉండే ఈ పండ్లు ఆరెంజ్ రంగులో మెరిసిపోతుంటాయి.

ఆల్ఫాన్సో

మే నుంచి జూన్:
మామిడి పండ్లలోనే రారాజుగా పేరుగాంచింది ఈ రకం పండు. ఆల్ఫాన్సో పండ్లు మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉండే పండ్లుగా చెబుతారు. మహారాష్ట్రలో ఈ పండ్లు ఎక్కువ కాస్తాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కాత ఉంటుంది. జుర్రుకునే పండ్లలో వీటి ధర కూడా ఎక్కువే. విదేశాలకు ఎగుమతి అయ్యే పండ్లలో ఇవే టాప్.


దుసేహరీ

జూన్ నుంచి జూలై:మన దగ్గర రసాలుగా వీటిని పిలుస్తారు. ఈ రకం పండ్లను మెత్తగా చేసి జ్యూస్‌ని జుర్రుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో ఈ పండ్లు విరివిగా దొరుకుతాయి. లక్నో గార్డెన్‌లో ఈ మామిడి తోట ఉండేదట. 18వ శతాబ్దంలో నవాబుల కాలం నుంచే ఈ పండ్ల కాత ఉందని ప్రతీతి. ప్రస్తుతం మనకు మార్కెట్‌లో దొరికే పండ్లు లక్నో నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉన్న మలిహబాద్ నుంచి దిగుమతి అవుతాయి.

లంగ్రా

జూలై మధ్యవారం నుంచి ఆగస్టు:వేరే భాషలో దివ్యాంగులను ఈ పేరుతో పిలుస్తారు. కానీ ఈ మామిడి పండ్లకు ఈ పేరు ఎలా పెట్టారో ఇప్పటికీ చిత్రంగానే ఉంటుంది. వారణాసిలో దీని పుట్టక జరిగిందని అంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ పండ్లకు పాపులారిటీ ఎక్కువ. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో కూడా పండ్లు అడపాదడపా కనిపిస్తాయి. పైన తోలు ఆకుపచ్చగా ఉన్న పండు మాత్రం చాలా తియ్యగా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఎక్కువ.

చూజా

జూలై నుంచి ఆగస్టు:మామిడి పండ్ల సీజన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయిందనిపిస్తుంది చాలామందికి. అన్ని రకాల పండ్లు కేవలం రెండు నెలలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఎక్కువ కాలం దొరికే పండ్లు ఏవంటే.. చూజానే చూపిస్తారు. బీహార్ నుంచి వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. బాగా పసుపుగా ఉండే ఈ పండ్లు పాకిస్తాన్‌లో కూడా ఎక్కువగా పండుతాయి.ఇవి విదేశాలకు ఎగుమతి అవుతాయి.

హిమ్‌సాగర్

మే:తక్కువ రోజులు దొరికే ఈ పండ్లు వెంటనే తినేయాలి. ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండవు. బెంగాలీలు ఈ రకం పండ్లను ఇష్టంగా తింటారు. ఫైబర్ తక్కువగా ఉండే వీటిలో గుజ్జు ఎక్కువ ఉంటుంది. అందుకే మిల్క్‌షేక్‌లకు ఈ పండ్లను ఎక్కువగా వాడుతారు. ఆరెంజ్, పసుపు రంగుల మేళవింపుతో ఉండే పండ్లు నాలుగువారాల పాటే ఉంటాయి కాబట్టి త్వరపడాలంటున్నారు మామిడి పండ్ల ప్రియులు.

కేసర్

జూన్ నుంచి జూలై మొదటివారం :ఎక్కువ వాసనతో నిండిపోయే పండ్ల రకంలో ఈ రకం మొదటగా వినిపిస్తుంది. ఈ పండ్ల లోపల గుజ్జు కొద్దిగా కుంకుమపువ్వు రంగులో కనిపిస్తుంది. పూర్తి పసుపు కాకుండా ఆకుపచ్చ కాకుండా ఉంటాయి. అహ్మదాబాద్, గుజరాత్ రాష్ర్టాల్లో ఈ పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పండ్లతో గుజరాత్‌లో అమ్స్ తయారుచేస్తారు. తియ్యదనాన్ని ఇష్టపడేవాళ్లు ఈ పండ్లను ఎంచుకోండి.

తోతాపురి

జూన్ నుంచి జూలై:అన్ని రకాల మామిడి పండ్లతో పోలిస్తే ఈ పండ్లను గుర్తించడం చాలా సులువు. కింద వైపు షార్ప్‌గా అంటే.. చిలుకముక్కలా ఉంటుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఈ పండ్లు విరివిగా కాస్తాయి. మిగతా మామిడి పండ్లలాగా ఈ పండ్లు అంత తియ్యగా ఉండవు. కాకపోతే కాస్త ఉప్పు, కారం చల్లుకొని తింటే మాత్రం టేస్టీగా ఉంటాయి. అంతేకాదు.. మామిడితో తయారు చేసే కొన్ని ప్రొడక్ట్‌ల కోసం ఈ పండ్లను విరివిగా వాడుతారు.

313
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles