పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి శివాలయం!


Sun,April 8, 2018 04:18 AM

ఊరంతా ఆలయాలు.. పరిసరాలన్నీ శాసనాలున్న చారిత్రాత్మక ప్రదేశం పొట్లపల్లి. క్రీస్తుశకం 1066లో పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలపు శిలా శాసనం పొట్లపల్లి చరిత్రను.. ఆధ్యాత్మిక నేపథ్యాన్ని తెలుపుతున్నది. కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు 1055-75 మధ్య కాలంలో పొట్లపల్లిలో శివాలయం నిర్మించారు. ఒకప్పుడది గొప్ప ఆలయంగా వెలుగొందింది. ప్రజలు మొక్కులు తీర్చుకొనే ఆధ్యాత్మిక కేంద్రంగా.. రాజులు పరిపాలన చేసే పాలనా కేంద్రంగా విరాజిల్లి చరిత్రలో తనకంటూ ఓ పేజీ సృష్టించుకున్న పొట్లపల్లి శివాలయ విశిష్టతనే ఈవారం దర్శనం.

-అరవింద్ ఆర్య పకిడే, సెల్: 70972 70270

shiva-layam-potalpalli2
ఎక్కడ ఉన్నది?: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్నది.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి సిద్దిపేట 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్దిపేట నుంచి హుస్నాబాద్ 40 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునేవాళ్లు నేరుగా సిద్దిపేట చేరుకొని అక్కడ్నుంచి హుస్నాబాద్ వెళ్లి అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పొట్లపల్లి శివాలయం ఉంటుంది.

విశిష్టత: పొట్లపల్లి శివాలయాన్ని మొదటి ప్రోలరాజు నిర్మించాడు. ఒక్క శివాలయమే కాకుండా పొట్లపల్లిలోని ప్రతీ కట్టడం చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్నదే. ప్రతీ గజం స్థలంలో ఏదో ఒక విశిష్ట కట్టడం నిర్మించి ఉంది. ఒకప్పుడు పొట్లపల్లి జైనుల కేద్రంగా విరాజిల్లింది. బృహత్ శిలాయుగం నాటి మానవుల సమాధులు.. నాగజాతికి చెందిన నాగులమ్మలు పొట్లపల్లిలో కనిపిస్తాయి. కాకతీయుల వారసులుగా శైవ మతస్తులు పొట్లపల్లిలో పంచమఠ పీఠాన్ని ఏర్పాటుచేసి 300 యేండ్లు పరిపాలించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తున్నదని స్థానికులు చెబుతున్నారు.

శివలింగోద్భవం: పొట్లపల్లికి చెందిన కుమ్మరి పోచయ్య ఇంట్లో కాకతీయుల కాలంనాటి అరుదైన శివలింగం బయల్పడింది. తమ మేలుకోరే శివుడు వెలిశాడని గ్రామస్తులు కొలిచి పూజించారు. అప్పటివరకు చినుకు కూడా పడని పరిస్థితిలో శివలింగం బయల్పడిన తర్వాత కుంభవృష్టితో వర్షం కురిసిందట. సాక్షాత్తు వరుణ దేవుడే వచ్చి శివలింగానికి జలాభిషేకం చేశాడని భక్తుల నమ్మకం. అప్పట్నుంచి స్వామివారిని స్వయంభు రాజరాజేశ్వరుడిగా నిత్యం కొలుస్తూ పూజలు చేస్తున్నారు.

shiva-layam-potalpalli
శైవమత ప్రచార కేంద్రం: త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుని కాలం నాటి కన్నడ శాసనమొకటి ఇక్కడ లభించింది. దీనిప్రకారం మహా సామంతుడు రేగొండ చంద్రయ్య రాజు ఈ దేవాలయానికి కానుకలు ఇచ్చాడు. ఆ కాలంలో ఈ ప్రాంతం పేరు పొట్ల పల్లియ. ఈ గ్రామంలో 5 మఠాలు ఉండేవి. ఆ మఠాలలో వేలాది మునులు తపస్సుచేసేవారట. శాసనానికి మూడువైపులా ఇదే విషయం చెక్కి ఉన్నది. మొదటి వైపు 27 వరుసలు.. రెండోవైపు 21 వరుసలు మూడో వైపు శాపం చెక్కి ఉన్నాయి. శాసనం రెండవ పక్కలో నకరేశ్వర దేవాలయ ప్రసక్తి ఉన్నది. ఎల్లమ్మగుట్ట.. బోడగుట్టలో ఈ పాలకులకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి.

పంచ మఠాలు: ఎల్లమ్మగుట్ట దిగువన ఐదు తలలతో నాగుల విగ్రహాలు నాగదేవతను ఆరాధిస్తూ ప్రతిష్టించిన ఏడు నాగులమ్మల విగ్రహాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 230 నుంచి క్రీస్తుశకం 100 వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ గ్రామం ఉండేది. అప్పుడు పొట్లపల్లిలో సుమారు 400ల బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవట.

వారు నివసించిన స్థలాన్నే ఇప్పడు బ్రాహ్మణుల దిబ్బగా పిలుస్తున్నారు. శాతవాహనుల అనంతరం కళ్యాణి చాళుక్యులు పరిపాలన చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. రెండో ప్రోలరాజు.. రెండో బేతరాజులు పొట్లపల్లిని పరిపాలించారు. వీరి పాలనలో ఇక్కడ పంచమఠ స్థానాలు ఉండేవి. పొట్లపల్లి రామాలయానికి సాగు నీరును తోడే మోట రాట్నాన్ని కళ్యాణి చాళుక్యరాజు త్రిలోకమల్లదేవుని మహాసామంతుడు- రేగొండ రాజు చంద్రయ్య క్రీస్తుశకం 1066లో దానం చేసినట్లుగా ఆలయ శిలాశాసనంలో ఉన్నది. పద్మాసనంలో ధ్యాన ముద్రలో ఉన్న నల్ల రాతితో చెక్కిన జైన తీర్థంకరుడి విగ్రహం మల్లన్న ఆలయం ఎదురుగా ఉంది. ఈ విగ్రహం రెండు భుజాలు నరికివేశారు. గ్రామం మధ్యలో ఒక బురుజు ఉంది. దీని పైభాగంలో ద్వారపాలకుడి విగ్రహం ఉంది. రామాలయం 28 స్తంభాలతో నిర్మించి ఉన్నది.

ప్రాచీన సమాధులు:

పొట్లపల్లి సమీపంలో ఎల్లమ్మగుట్ట ఉంటుంది. గుట్టకింద భాగంలో బృహత్ శిలాయుగంనాటి సమాధులు కనిపిస్తాయి. వీటి సంఖ్య సుమారు 40కి పైమాటే. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జైకిషన్.. రీసెర్చ్ స్కాలర్‌లు స్మృతి చరణ్, రిషబ్, తత్‌గత్, పరిశోధకుడు నాగేంద్ర శర్మ ఈ సమాధులపై ఆధ్యయనం చేశారు. ఇవి క్రీ.పూ. 2500 నాటివిగా గుర్తించారు. ఈ సమాధులకు ఆవల పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, వినాయకుడు.. హనుమంతుడి విగ్రహాలున్నాయి. ఇక్కడ ప్రతీయేటా ఉత్సవాలు జరుగుతాయి.

815
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles