నేటి కీర్తి రేపటి స్ఫూర్తి


Sun,November 12, 2017 01:20 AM

14న బాలల దినోత్సవం సందర్భంగా ..
బాల్యం ఒక అరుదైన పుష్పం. అది అన్నిపూదోటల్లో వికసించదు. బాల్యం ఎంతో మధురం. అది జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి బాల్యానికి నడకలు నేర్పితే భవిష్యత్తు పరుగులు పెడుతుంది. బుడిబుడి అడుగుల ప్రాయం నుంచే సానబెడితే వారు ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. చిన్నతనంలో పిల్లల ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించగలిగితే ప్రపంచాన్నే అబ్బురపరుస్తారు. ఇప్పటికే పలువురు చిన్నారులు వయస్సుకు మించిన ప్రతిభతో ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నారు. నవంబర్14 బాలల దినోత్సవం సందర్భంగా అలాంటి చిచ్చరపిడుగుల
విజయగాథలే ఈ కథనం.
బాడ్మింటన్‌లో పి.వి. సింధూ, క్రికెట్లో ధోనీ, టెన్నిస్‌లో సానియా మీర్జా...ఇది నిన్నటి మాట. కాలం మారింది. కోయిల పాటకు తీసిపోని గానం, నెమలి ఆటను మరిపించే నాట్యం, బ్రూసిలీని గుర్తుచేసే సాహస విన్యాసాలు. ఇవే కాదు. అంతకు మించి, విభిన్న రంగాల్లో వైవిధ్య ప్రతిభతో తమను తాము ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకుంటున్న రేపటితరమిది.

పీకా మాధ్వికా

కరీంనగర్‌కు చెందిన శేషాద్రి, మమతల కూతురు పీకా మాధ్వికా చాక్‌పీస్‌ల మీదా అతిచిన్న వినాయక విగ్రహాలను చెక్కి గిన్నీస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది. స్థానిక పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల మాధ్వికా గతంలో ఏకవరుసలో 8 సెంమీ పొడవున్న చాక్‌ఫీస్‌ల మీద కేవలం 60 సెకండ్లలో 12 చిన్న గణేష్ చిత్రాలను చెక్కి లిమ్కాబుక్‌ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
madhivika

లక్ష్మీ శ్రీజ

లక్ష్మీశ్రీజ వయసు తొమ్మిదేళ్లు... తెలివితేటలు మాత్రం అమోఘం... రాజధానుల నుంచి రాజకీయాల వరకు ఏది అడిగినా చెప్పేస్తుంది... తన ప్రతిభా పాటవాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఔరా అనిపించింది! ఎన్నో రికార్డులు సొంతం చేసుకుందీ బాలమేధావి!ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన వేల్పుల కిరణ్, సుధారాణి కుమార్తె శ్రీజ. దేశాలు, రాష్ర్టాలు, రాజధానులు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, రాజ్యాంగం ఆమోదించిన భాషలు, సవరణలు, జాతీయ బ్యాంకుల వివరాలు, యూనివర్సిటీలు, దేశంలోని వివిధ పార్టీలు, వాటి గుర్తులు, కంపెనీలను ఈ చిన్నారి అవలీలగా చెప్పేస్తుంది. తెలంగాణ చరిత్ర వివరాలు తెలంగాణ నియోజకవర్గాల పేర్లను 58 సెకన్లలో చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్‌ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. జనరల్ నాలెడ్జికి సంబంధించి 816 ప్రశ్నలకు కేవలం 21 నిమిషాల 12 సెకన్లలో జవాబులు చెప్పి తెలుగు, తెలంగాణ బుక్‌ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ చరిత్రపై గంటకుపైగా విద్యార్థులకు, కొందరు అధ్యాపకులకు తరగతులు చెప్పి ప్రశంసాపత్రం అందుకుంది. లక్ష్మిశ్రీజ ప్రతిభను తెలుసుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. కేసీఆర్‌ను కలిసిన శ్రీజ తెలంగాణ చరిత్ర నుంచి మొదలు స్వాతంత్య్రం వచ్చాక ఫస్ట్ ఎస్సార్సీ ఏర్పాటు, 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. అనంతం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం తీరుతెన్నులు, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అయిన వివరాలు, అపాయింటెడ్ డే సహా రాష్ట్ర మంత్రులు, వారి శాఖల వివరాలు గుక్కతిప్పుకోకుండా ముఖ్యమంత్రికి వివరించింది. సీఎం కేసీఆర్ గురించి, సీఎంగా తన పాలనలోని పథకాల గురించి చెబుతుంటే ఆశ్చర్యపోయారు. ఆమె భవిష్యత్తు చదువులకోసం కేసీఆర్ పది లక్షల చెక్కు అందజేశారు.
LAXMI-SRIJA

శ్రీఖుషి సన

మంచిర్యాల జిల్లాకు చెందిన బేబి శ్రీ ఖుషి సన వయస్సు కేవలం రెండున్నర సంవత్సరాలు. కానీ తన ప్రతిభతో మేథావుల్ని సైతం అబ్బుర పరుస్తుంది. మంచిర్యాలకు చెందిన వ్యాపారి గిరీష్‌కుమార్, సుధతిల కూతురైన ఈ చిన్నారి వందలాది ఇంగ్లీష్ పద్యాలు, తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు అవలీలగా చెప్పగలదు. అందులోనూ మూడు భాషల్లో అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీల్లోనూ మాట్లాడడం పాప ప్రత్యేకత. వీటితో పాటు ఆన్‌లైన్ పజిల్స్, మొబైల్ ఫోన్ పజిల్స్‌ను తక్కువ సమయంలో పూరించగలదు. అన్ని దేశాల పేర్లు, కూరగాయలు, పండ్లు, జంతువుల పేర్లను స్పెల్లింగ్స్‌తో సహా చెప్పడమే కాక మూడు భాషల్లోకి తర్జుమా చేయగలదు. తన ప్రతిభతో ఇప్పటికే వండర్, జీనియస్, గోల్డెన్‌స్టార్, యూనివర్సల్, తెలుగు బుక్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు దక్కించుకుంది. ఈ చిన్నారి ప్రతిభను గుర్తించి జూన్2న తెలంగాణ ప్రభుత్వం జిల్లాస్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందజేసింది.
Sri-Kushi

తోట శ్రీశాంత్ సుగీత్

హైదరాబాద్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో అయిదో తరగతి చదువుతున్న శ్రీశాంత్ కరాటేలో ముందుకు దూసుకుపోతున్నాడు. చిన్న వయసులోనే తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈమధ్యే జరిగిన మూడో అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2017లో మొదటి బహుమతితో బంగారు పతకం పట్టేశాడు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో దాదాపు మూడువేల మందికిపైగా పాల్గొన్నారు. సబ్ జూనియర్ల విభాగంలో 65 మంది పిల్లలు పాల్గొంటే ఎన్నో దశలు దాటుకుంటూ విజయం సాధించాడు శ్రీశాంత్. 5 ఏళ్ల వయసు నుంచే కరాటే నేర్చుకుంటున్న శ్రీశాంత్ ఈ ఏడాది జరిగిన తెలంగాణ రాష్ట్ర పోటీల్లో మొదటి బహుమతి సాధించి జాతీయ పోటీలకు వెళ్లాడు. ఇప్పటి వరకూ జిల్లా, రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో 14 పతకాలు గెలుచుకున్నాడు.
ThotaSrikanth

పొనుగోటి నితిన్

నల్లగొండ జిల్లాకు చెందిన పి.లక్ష్మినరసింహారావు, రేణుక దంపతుల కుమారుడు పొనుగోటి నితిన్. ఎనిమిది సంవత్సరాల ఈ బుడతడు మెమొరీ ఈవెంట్స్‌లో తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతి తక్కువ సమయంలో భూగోళం, ప్రపంచం, దేశ సంబంధిత ప్రశ్నలకు జవాబులు చెప్తూ పలు రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. కేవలం 5 నిమిషాల్లో 750 ప్రశ్నలకు జవాబులు చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు.

గద్దల యామిని శ్రీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన యామిని తల్లిదండ్రులు బసవయ్య, నాగమణి. ఈ పాప వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు. ఈ పాప ఒక కొత్త ప్రతిభతో అందరి ప్రసంశలూ అందుకుంటున్నది. వేమన శతక పద్యాలను రివర్స్‌లో చెప్పడం ఈమె ప్రత్యేకత. సుమారు 100 శతకాలను మొదటి లైన్ నుండి చివరి లైన్ వరకూ నాలుగు వందల లైన్లలో ప్రతి పద్యాన్ని రివర్స్‌లో చెప్పడం యామిని ప్రతిభకు నిదర్శనం. తన టాలెంట్‌తో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.

రిమ్షా ఫిర్డుస్

ఆదిలాబాద్ జిల్లా బెలా మండలం దెహగాం గ్రామానికి చెందిన జుబెర్ ఆహ్మాద్, ఆసిఫున్ నిసాల కూతురు రిమ్షా ఫిర్దుస్. రెండు సంవత్సరాల పదినెలల ఈ పాప సుమారు 213 దేశాలు వాటి రాజధానులు, భారతదేశ రాష్ర్టాలు రాజధానులు, భారతదేశ తొలి ఉద్యోగుల పేర్లు (ఉదా: తొలి లేడీ డాక్టర్, తొలి ఐపీఎస్), రసాయన చర్యలు వాటి ఫలితాలు ఇలా వివిధ రంగాలకు చెందిన సుమారు 1500 ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పగలదు. ఆమె ప్రతిభను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం కల్పించారు.
Rimsha-Firdous

మకిన ప్రశాంత్

పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు చెందిన మకిన రమేష్, సంధ్యల పది సంవత్సరాల కుమారుడు ప్రశాంత్. వంద సంవత్సరాల క్యాలెండర్‌ను సెకన్ల కాలంలో చెప్పగలడు. 1901 నుండి 1999 వరకు గల క్యాలెండర్‌ను లెక్కించి మనం తేదీ చెప్తే తను వారం, రోజుతో సహ చెప్పగలడు. అతి తక్కువ సమయంలోనే వంద సంవత్సరాల తేదీలు, రోజులు చెప్పడం ప్రశాంత్ ప్రత్యేకత.
Makina--Prashanth

జి. అమృతరెడ్డి

హైదరాబాద్‌కు చెందిన అమృతరెడ్డి ఏడవ తరగతి చదువుతోంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ కలిగిన ఈ పాప గత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకర్షించింది. 1098 మేకులు కలిగిన అంపశయ్య మీద 2 నిమిషాల 58 సెకన్ల పాటు పడుకోవడంతో పాటు 36 గ్రానైట్ రాళ్లను తన పొట్ట మీద పగులగొట్టించుకుని కొత్త రికార్డు సాధించింది. గతంలో 365 టైల్స్‌ను అలాగే పగలగొట్టించుకుని రికార్డు సాధించింది. ఆమె తండ్రి గోపాల్‌రెడ్డి కరాటే మాస్టర్ కావడంతో కఠోరసాధన చేసి ఈ ఫీట్ సాధించానని అమృత చెబుతుంది. ఒలంపిక్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావడమే తన లక్ష్యమని ఈ చిన్నారి చెబుతోంది.
Amruthareddy

వి. తనుజారెడ్డి, వి. దివ్యారెడ్డి

హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు కరాటేలో రాణిస్తున్నారు. కరాటే మాస్టర్ గోపాల్‌రెడ్డి వద్ద శిక్షణ తీసుకుంటున్న వీరిద్దరూ గాంధీ జయంతిని పురస్కరించుకుని అద్భుతమైన ఫిట్ చేసి అలరించారు. స్థానిక జీవీఆర్ కరాటే అకాడమీలో వీరిద్దరూ కేవలం 5 నిమిషాల వ్యవధిలో తమ పొట్టలపై 146 స్లాబ్‌లను పగులగొట్టించుకుని కొత్త రికార్డు సాధించారు. ఈ అద్భుత సాహసాన్ని వండర్‌బుక్‌లో నమోదు చేశారు.
TANUJA-REDDY

సాహితి అర్రోజు

కరీంనగర్‌కు చెందిన 17 సంవత్సరాల సాహితి ఆల్ఫా మైండ్ ఇన్నోవేషన్స్‌లో తన ప్రతిభను చాటుకుంటున్నది. ఈమె ఏకకాలంలో ఏడు మెమొరీ ఫీట్స్ చేసి ఆందర్నీ ఆశ్చర్యపరిచింది. సప్తంశ సాధనం పేరుతో చేసిన ఈ ఫీట్‌లో 100 స్పోకెన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం, 100 ర్యాండమ్ నెంబర్లు, 100 బైనరీ నెంబర్లు, పై తో వచ్చే 1100 డెసిమల్ విలువలు, 100 మంది కౌరవులు పేర్లు, 100 పీరియాడిక్ టేబుల్‌లోని ఎలిమెంట్స్, 100 ర్యాండమ్ వర్డ్ తోకమేక ఇలా పలు అంశాలను ఏకకాలంలో చేసి వండర్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
SAHITHI-ARROJU

బండారి సాత్విక

కరీంనగర్‌కు చెందిన చిన్నారి బండారి సాత్విక మిర్రర్ రివర్స్ రైటింగ్‌లో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది. తను రాసే ప్రతి అక్షరాన్ని చదువాలంటే అద్దం ముందుకు వెళ్లాల్సిందే. కేవలం పేర్లనే కాదు. మహాత్మాగాంధీ, మధర్ థెరిస్సా, అబ్దుల్ కలాంల జీవిత చరిత్రలను రివర్స్‌లో రాసి కొత్త ఘణతను సాధించింది. మరో విశేషం ఏంటంటే ఈ మూడింటిని కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషల్లో మూడు గంటల్లో రాయడం గమనార్హం.
BANDARI-SAATHVIKA

పుప్పాల సంహిత

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పోతనకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు పుప్పాల రవీంధ్రనాథ్, లతల కుమార్తె అయిన ఆరేళ్ల సంహిత నాట్యంలో ప్రత్యేకతను చాటుకుంటున్నది. భరతనాట్యం, జానపదం, కూచిపూడి ఇలా అన్ని రకాల డ్యాన్సుల్లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నది. గత సంవత్సరం 60 నిమిషాల పాటు ఏకధాటిగా క్లాసికల్, సెమీ క్లాసికల్ నృత్యాలు చేసి వండర్‌బుక్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ఐదు సంవత్సరాల వయస్సులోనే 70కి పైగా ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించింది.
shamhitha

డేనియల్ ఫ్రాన్సిస్

ఈ బుడతడి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్‌బుక్ ఆఫ్ రికార్డు, యూనివర్సల్ రికార్డు ఫోరం సర్టిఫికెట్, గోల్డెన్ స్టార్, వరల్డ్ అమెజింగ్ రికార్డు, సూపర్ కిడ్స్ రికార్డు తదితర రికార్డులు సొంతం చేసుకున్నాడు. సికింద్రాబాద్ సమీపంలోని బోయినపల్లికి చెందిన అనిత, కరుణ్‌ల కుమారుడు డేనియల్. పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్‌క్లాస్ చదువుతున్నాడు. ఈ చిన్నారి మూడేళ్ల వయస్సులోనే 37 సెకండ్లలో బైబిల్‌లోని 66 చాఫ్టర్స్ పేర్లను, అలాగే దేశంలోని అన్ని రాష్ర్టాలు వాటి రాజధానులను కేవలం 25 సెకండ్లలో చెప్పి అబ్బురపరిచాడు. అంతేకాదు ప్రపంచంలోని అన్ని దేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ముఖ్యమైన నాయకులు వంటి విషయాలను కూడా చాలా తేలికగా చెప్పగలడు. మొత్తం మీదా వేర్వేరు విషయాలకు సంబంధించి 300 ప్రశ్నలకు సులభంగా సమాధానాలు చెప్పడంలో డేనియల్ దిట్ట.
DANIEL-FRANCIS-MAKINA

హరిత పద్య కవితార్చన

భద్రాద్రి జిల్లాకు చెందిన చిగురుమళ్ల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం స్ఫూర్తితో వృక్ష శతకం పేరుతో మూడు లైన్లతో వంద పద్యాలు రాశాడు. ఈ పద్యాలను దమ్మాయిపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన 22మంది విద్యార్థులు కేవలం 15 నిమిషాల్లోనే ఆలపించి రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ప్రతిభకు సానపెడితే విజయాలు సాధించగలరని వీరు మరోసారి నిరూపించారు.
haritha-haram

మెరుగు హంసిని

పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మెరుగు రాజమౌళి, మంజుల కూతురైన నాలుగేళ్ల హంసిని తన మేథాశక్తితో అందరినీ ఆబ్బురపరుస్తున్నది. భారతదేశ రాష్ర్టాలు, రాజధానులు, ప్రధానులు, సంస్కృత శ్లోకాలు, వేమన పద్యాలు, జనరల్ నాలెడ్జికి సంబంధించిన ఏ ప్రశ్న అడిగిన ఠక్కున సమాధానం చెబుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఇప్పటికే పలు టెలివిజన్ చానల్స్ ఈ అమ్మాయి ప్రతిభను ప్రపంచానికి తెలియజేశాయి.
hamsini

తంగెళ్లపల్లి ప్రశాంత్ ఆదిత్య

హైదరాబాద్‌కు చెందిన చంద్రబాబు, జ్యోతి దంపతుల కుమారుడు మాస్టర్ తంగెళ్లపల్లి ప్రశాంత్ ఆదిత్య. ఐదేళ్ల ఈ బుడతడు అపార జ్ఞాపకశక్తితో అలరిస్తున్నాడు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోగ్రఫీ, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల పేర్లు, శాఖలు, నినాదాలు, శ్లోకాలు, భారతదేశ రాష్ర్టాలు, రాజధానులు, పర్యావరణ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అన్ని చారిత్రక ప్రదేశాలు, తెలంగాణలోని స్మారక కట్టడాలు, సౌరకుటుంబం, తెలంగాణ కొత్త జిల్లాలు, ఆయా జిల్లా కలెక్టర్లు, ప్రముఖ కార్లు, కంపెనీ బ్రాండ్స్ ఇలా అనేక విషయాలను అడిగిన వెంటనే చెప్పడంలో ప్రశాంత్ ప్రావీణ్యం కనపరుస్తున్నాడు.
Tangellapally

కనుగంటి జయదేవ్ రెడ్డి

పది సంవత్సరాల ఈ చిన్నారి మెంటల్ అర్థమెటిక్స్‌లో తనకు తనే సాటి అని నిరూపిస్తున్నాడు. హైదరాబాద్ ఈసీఐఎల్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన కనుగంటి జయదేవ్‌రెడ్డి స్కేటింగ్ చేస్తూ ఎలాంటి చాక్‌పీస్ ఉపయోగించకుండా పెద్ద పెద్ద లెక్కలను పరిష్కరిస్తాడు. మరోవైపు చేతిలో రుబిక్‌క్యూబ్ గడులను కలుపుతూ ఈ సాధన చేయడం విశేషం. వండర్‌కిడ్స్ అర్థమెటిక్స్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సాధన చేసి తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నాడు.
Kanuganti-Jayadev

మౌంట్ రెనాక్‌పై మన బిడ్డలు

నాగరిక సమాజానికి దూరంగా.. అడవుల్లో, మారుమూల పల్లెల్లో చదువుకునే గిరిజన బడుగు బలహీన వర్గాల బిడ్దలు వారు 31మంది పిల్లలు.. వారిలో 16మంది బాలికలు ఎవరెస్ట్ తర్వాత అత్యంత ఎత్తయిన కాంచనగంగ పర్వత సానువుల్లోని ఒక మంచు పర్వతమైన మౌంట్ రెనాక్‌ను అధిరోహించారు! త్రివర్ణ పతాకాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంచుకొండలపై రెపరెపలాడించారు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఈ అరుదైన ఘనత సాధించారు. హిమాలయాల్లోని కాంచనగంగ పర్వతసానువుల్లో సముద్ర మట్టానికి 17000 అడుగుల ఎత్తున ఉండే మౌంట్ రెనాక్‌ను సెప్టెంబర్7న వీరు అధిరోహించారు. వీరంత చెంచు, కొలెం, గోండు గిరిజన తెగలకు చెందినవారు. అయినప్పటికీ తమకు కనీస ప్రోత్సాహం అందిస్తే తాము ఎంతటి ఎత్తుకైనా ఎదుగుతామని ఈ విద్యార్థులు నిరూపించారు. ఇంతటి కఠినమైన టాస్క్ పూరి ్తచేసిన ఈ విద్యార్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు.
Renak

చార్మీ శ్రీ మాతు

హైదరాబాద్‌కు చెందిన మాతు కుమార్ కూతురైన 12 సంవత్సరాల చార్మీ శ్రీ 3 గడుల ఇంటలెక్చువల్ రుబిక్‌క్యూబ్ పజిల్ కలర్స్‌ను స్కేటింగ్ చేస్తూ కేవలం 3 నిమిషాల్లోనే మ్యాచింగ్ చేసి రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ సమయంలో తన మేథోశక్తితో ఈ రికార్డు సాధించడం విశేషం.
Charmy-Shree-Mathu

స్ఫూర్తి యాదగిరి

హైదరాబాద్‌కు చెందిన జితేందర్ యాదగిరి, చైతన్యల కూతురు స్ఫూర్తి యాదగిరి. 17 సంవత్సరాల స్ఫూర్తి భారతీయ సినిమా రంగంలో చిన్నవయస్సు ప్లేబ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందారు. సింగర్‌గానే కాకుండా మ్యూజిక్ కంపోజర్, రచయితగా కూడా గుర్తింపు పొందారు. అతి చిన్నవయస్సులో ప్లేబ్యాక్ సింగర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గాయకురాలిగా స్ఫూర్తి రికార్డు నెలకొల్పారు. కేవలం 11 సంవత్సరాల వయస్సులో యమహోయమ సినిమాలో ఫిమెల్ ఫ్లేబ్యాక్ సింగర్‌గా ప్రవేశించారు. ఇప్పటికే పలు భాషల్లో పాటలు పాడిన స్ఫూర్తి వర్తమాన ఫిమెల్ సింగర్‌గా దుబాయ్‌లో జరిగిన గామా ఆవార్డ్స్ ఫంక్షన్‌లో ఆవార్డు అందుకున్నారు. అలాగే లిటిల్ క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్-2015 ఆవార్డు కూడా అందుకుంది.
Spoorthi-Yadagiri

1432
Tags

More News

VIRAL NEWS