నెట్టిల్లు


Sun,April 21, 2019 03:08 AM

మోసం.. కేవలం మనిషి మాత్రమే చేయగలడు ఇది. ఈ పాయింట్ ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ జీవితంలో ఆయన మోసపోయిన ఘట్టాల్ని చూపించాడు. ఇలా జీవితంలో జరిగే చాలా ఘట్టాలు సినిమా కథల్ని మించిపోతాయి. అలాంటి కథలు కావాలంటే ఎక్కడో వెతకాల్సిన పని లేదు. సమాజంలోనే బోలెడు దొరుకుతాయి. ఈ వారం యూట్యూబ్‌లో విడుదలైన షార్ట్‌ఫిలింస్‌లో చాలావరకు సమాజంలోంచి తీసుకున్న కథలే. ఆ షార్ట్‌ఫిలింస్‌లోంచి కొన్ని ఈ వారం నెట్టిల్లులో..

ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇంతే..


EmcetCounceling

దర్శకత్వం: షణ్ముఖ్ జశ్వంత్
ఇంటర్ తర్వాత ఏం చేయాలో తికమకపడే విద్యార్థుల కష్టాలు చూపించే ఫన్నీ షార్ట్‌ఫిలిం ఇది. ఎంసెట్ తర్వాత కౌన్సెలింగ్ జరిగే తీరును ఈ షార్ట్‌ఫిలింలో చూపించారు. కౌన్సెలింగ్‌లో తమకు నచ్చిన కోర్సును చేద్దామని పిల్లలు, తమ కలలను వారి ద్వారా తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో చూపించిన విధానం నవ్వు తెప్పిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు రాబట్టుకునేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వేసే ఎత్తులు నేటి విద్యావిధానాన్ని ఎత్తి పొడిచినట్టుగా ఉన్నాయి. పక్కింటి వాళ్లు తమ పిల్లల్ని ఏ కాలేజీలో చేర్పించి, మన పిల్లల్ని కూడా అదే కాలేజీలో చేర్పించే సీన్లు మనం ప్రతీ విద్యా సంవత్సరం ఆరంభంలో చూస్తుంటాం. ఆ సీన్లో ఈ షార్ట్‌ఫిలింలో కామెడీ బాగా పండించారు. పిల్లలను పెద్ద చదువులు చదివించాలని పల్లెటూరి నుంచి పొలం అమ్మి మరీ పెద్ద కాలేజీలో చేర్పించే తల్లిదండ్రుల తిప్పలు కూడా సున్నితంగా చూపిస్తూనే.. వారిని ప్రైవేట్ కాలేజీల్లో దోచుకునే తీరును ఎండగట్టాడు దర్శకుడు. చూడండి.. ఫన్నీగా సాగిపోయే.. సందేశమున్న షార్ట్‌ఫిలిం ఇది. చివరగా వచ్చే స్టూడెంట్ అగ్రికల్చర్‌లో సీటు కోసం అడుగుతాడు. అగ్రికల్చర్ ఇంజినీర్‌గా రైతులకు సేవ చేస్తూ, అన్నం పెట్టే గొప్ప చదువు చదువుదాం అంటూ ఇచ్చే మెసేజ్ బాగుంది.

Total views376,391+(ఏప్రిల్ 13 నాటికి) Published on Apr 6, 2019


దోస్తులు.. దోచుకుంటే?


dosthulu-dochukunte

దర్శకత్వం: మహేష్ విట్ట
నటీనటులు : మ్రహేష్ విట్ట, పటాస్ రవి, ప్రభు డంబో, దాసరి రామాంజనేయులు, అల్మట్టి నాని
అవసరానికి డబ్బులు తీసుకొని తిరిగి అడిగితే.. ఫ్రెండ్స్ చెప్పే సాకులు ఎలా ఉంటాయో ఈ షార్ట్‌ఫిలింలో చూడొచ్చు. మహేష్‌కి ఓ ఫ్రెండ్ కాల్ చేసి.. అరేయ్.. అర్జంటుగా డబ్బులు కావాలి. ఒకరికి ట్రాన్స్‌ఫర్ చేయాలి. నా దగ్గరేమో లిక్విడ్ క్యాష్ ఉంది. గూగుల్ పేలో నువ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చెయ్.. నేను నీ అకౌంట్‌లో వేసేస్తా అని పదివేలు తీసుకుంటాడు. నెలరోజులైనా తిరిగి ఇవ్వడు. అకౌంట్లో డబ్బులు వేయమంటే.. ఇదిగో.. అదిగో.. అంటూ కాలం గడుపుతాడు. తీరా నెల రోజుల తర్వాత మహేష్ కాస్త గట్టిగా అడిగేసరికి.. అసలు నేనెవ్వరి దగ్గర అప్పు చేయను. అలాంటిది నన్నే అంత మాటంటావా? అంటాడు. ఆ తర్వాత గతంలో మహేష్‌ని సినిమాకు తీసుకెళ్లిన ఫ్రెండ్ వచ్చి వెయ్యి రూపాయలు అడుగుతాడు. ఎక్కడివి అంటాడు మహేష్. మొన్న నిన్ను సినిమాకు తీసుకెళ్లినప్పుడు మూవీ టికెట్ 250, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ 250, పెట్రోల్ ఖర్చు అవన్నీ కలిపి వెయ్యి పది రూపాయలు అయినయ్. అని లెక్క చెప్తాడు. మహేష్ ఆ ఫ్రెండ్‌కి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. ఇలా నిత్యం ఎవరో ఒకరు డబ్బులు అడుగుతూనే ఉంటారు. ైక్లెమాక్స్‌లో మహేష్ ఇచ్చే ఫినిషింగ్ టచ్ భలే ఉంటుంది.

Total views 50,566+ (ఏప్రిల్ 13 నాటికి) Published on Apr 5, 2019


చిన్న చిన్ని ఆశ..


chinni-chinni-aasha

దర్శకత్వం: భరత్ పత్తిపాటి
నటీనటులు : దీపక్ యల్లాప్రగడ, శ్రీశుభ అద్దేపల్లి, వినోద్ ఎంబీడీ, సీతారాం సక్కప్రగడ, గురుచరణ్, సిద్ధు, భరత్
భరత్.. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పేరు చిన్ని. నెలరోజులుగా ఆ అమ్మాయిని పడేద్దామని ప్రయత్నించి ఓ రోజు చిన్ని ఆఫీస్ నుంచి ఇంటికెళ్తుంటే అడ్డుగా నిలబడి అడిగేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నెల రోజులుగా ప్రయత్నిస్తున్నా. నువ్వేమో ఏం చెప్పట్లేదు. సరే.. మౌనమే అర్ధాంగికారం అన్నారు పెద్దలు. నీక్కూడా ఇష్టమే అనుకుంటున్నా అంటాడు భరత్. దానికి చిన్ని భరత్ దగ్గరికి వచ్చి.. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మా ఇంట్లోవాళ్లు ఎవర్ని చూపించి పెండ్లి చేసుకొమ్మంటే అతడినే చేసుకుంటా అని చెప్పేసి వెళ్లిపోతుంది. మీ ఇంట్లోవాళ్లని ఒప్పించడానికి ఇండియా వెళ్తా. ఒప్పించే వస్తా. రెడీగా ఉండు పెండ్లికి అని చెప్తాడు భరత్. ఇంతలో వాళ్ల ఆఫీస్‌లో పనిచేసే ఓ అబ్బాయితో ఇంట్లోవాళ్లు ఆమెకు పెండ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఆ అబ్బాయి, చిన్ని ఇద్దరూ ఓ కేఫ్‌లో కలిసి మాట్లాడుకుంటారు. మరి భరత్ ఏమైనట్టు? చిన్నికి పెండ్లి ఎవరితో కుదరింది? భరత్‌తోనా? పెండ్లిచూపుల్లో కలిసిన అబ్బాయితోనా?

Total views 13,999+ (ఏప్రిల్ 13 నాటికి) Premiered Apr 6, 2019


శానే..


shaaney

దర్శకత్వం: నిఖిలేష్ కుమార్
నటీనటులు : రోహిత్, అచ్యుత్, పూజ, గణేష్, వంశీ, యోగి, జగన్
దిలీప్ కుమార్ సినీ నిర్మాత. ఏదో పనిలో బిజీగా ఉండగా.. విజయ్ అనే హీరో కాల్ చేసి ఇప్పుడే ఒక కథ విన్నాను. అద్భుతంగా ఉంది. డైరెక్టర్ కొత్త కుర్రాడు. మీ దగ్గరికి పంపిస్తున్నాను. మీకు కథ నచ్చితే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్తాడు. దానికి దిలీప్ కుమార్ నీకు కథ నచ్చితే ఓకే. పంపించు ఆ కుర్రాడిని అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కుర్రాడు నిర్మాత ఆఫీస్‌కి వస్తాడు. ఆ కుర్రాడు అంతకు ముందు ఏదైనా సినిమాకు పనిచేశాడా? అనుభవం ఉందా? అని అడిగి తెలుసుకుంటాడు నిర్మాత దిలీప్ కుమార్. ఆ కుర్రాడు ఫ్రెష్. అనుభవం కూడా ఉండదు. కానీ.. కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్‌లో ఉంటుంది. నిర్మాతకు ఆ కాన్ఫిడెన్స్ నచ్చి కథ చెప్పమంటాడు. ముందు కథ ఏ కోణంలో రాసుకున్నాడో కాన్సెప్ట్ చెప్తాడు. ఆ తర్వాత కథ చెప్పడం మొదలుపెడుతాడు. ఆ నిర్మాత కథ పూర్తిగా వింటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుర్రాడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడా? అనేది యూట్యూబ్‌లో చూడండి.

Total views 10,093+ (ఏప్రిల్ 13 నాటికి) Published on Apr 10, 2019

-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

274
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles