నెట్టిల్లు


Sun,March 17, 2019 12:57 AM

తెర మీద కనిపించే ప్రతీ పాత్ర, మనం చూసే ప్రతీ కథ ఎవరో ఒకరి జీవితానికి కచ్చితంగా కనెక్ట్ అయే ఉంటాయి. అది ప్రేమైనా, త్యాగమైనా, జీవితమైనా, బాధైనా, కష్టమైనా. అలాంటి ఎన్నో కథల కలబోతలతో వచ్చిన ఈ వారం షార్ట్‌ఫిలింస్ నెట్టిలుల్లో మీకోసం..నీ కొరకే నేను వేచి ఉంటా..

Total views 38,292+ (మార్చి 9 నాటికి)
Published on Mar 5, 2019
దర్శకత్వం: నరేష్ కావటి
నటీనటులు : ప్రవీణ్ రాథోడ్, కాజల్ మోనా, హరీష్ చిట్యాల, నవాజ్, భాను, శివసాయి
ప్రేమ అనే రెండక్షరాలన్ని ఎంతమంది, ఎన్ని రకాలుగా విడమరిచి చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. ఇద్దరు మనుషుల్ని కలుపాలని నిత్యం ప్రయత్నించే ప్రేమ గురించి తీసిన షార్ట్‌ఫిలిం ఇది. ప్రేమ అందరికీ కొత్త అనుభూతిని ఇచ్చినట్టే ఈ షార్ట్‌ఫిలిం కూడా కొత్త అనుభూతిని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ దర్శకుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ముగ్గురు కుర్రాళ్లు పిట్టగోడ మీద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. ఇంతలో ఆ ముగ్గురిలో ఒకడి అల్లుడు మహా అయితే నాలుగేళ్లుంటాయి. పరుగెత్తుకుంటూ వచ్చి మామా.. అమ్మమ్మ పిలుస్తుంది అని పిలుస్తాడు. ఆ కుర్రాడు వెళ్లడు. ఆ చిన్నపిల్లాడు ఇంటికెళ్లిపోతాడు. ఇంతలో అటు నుంచి ఓ అందమైన అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఆమెను చూసి ఆ పిల్లాడి మామ మనసు పారేసుకుంటాడు. ఆమెనే తదేకంగా చూస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ బైక్ వచ్చి ఆ అమ్మాయిని గుద్దేయబోతుంటే ఆ కుర్రాడు వచ్చి కాపాడుతాడు. ఆ అమ్మాయి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్లిపోతుంది. ఆ తర్వాత అ అబ్బాయి ఆమె గురించే ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.అదర్స్

Total views 15,437+ (మార్చి 9 నాటికి)
Published on Mar 6, 2019
దర్శకత్వం: గౌని సాయికుమార్
నటీనటులు : అజారుద్దీన్, ప్రసన్నారావు, భవ్య కొండ, విశ్వజ్ అంబటి, విద్యాసాగర్, రాజారాం, సమీర్ మహ్మద్, కృతిన్, పాషాభాయ్, ధరమపు వినయ్
కొందరు అందరూ ఉన్నా.. ఎవరూ లేని జీవితాన్ని అనుభవిస్తుంటారు. ఏదో కోల్పోయినట్టే బతుకుతుంటారు. కొందరు కేవలం ఆశల మీదనే జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ.. ఆశలే నిరాశలైతే.. ప్రాణాలు తీసుకునే వారు కూడా ఉంటారు. అలాంటి కథే ఇది. ఇక కథలోకి వెళ్తే.. ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది. నా బర్త్ డే సందర్భంగా అందరికీ పార్టీ ఇస్తున్నా అని అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి కాల్ చేసి పిలుస్తుంది. ఆ అబ్బాయి సరే అని ఫోన్ కట్ చేస్తాడు. సాయంత్రం కాగానే లవ్ బ్రేకప్ అయిన ఫ్రెండ్‌తో కలిసి బీర్లు తాగుతుంటాడు. అదే సమయంలో బర్త్‌డే పార్టీకి పిలిచిన అమ్మాయి లవ్ బ్రేకప్ అయిన అబ్బాయికి ఫోన్ చేసి అరేయ్.. బర్త్ డే పార్టీకి నువ్వు రాకు. మావాడు చూస్తే ఫీలవుతాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరో ఇంట్లో స్కూల్ అమ్మాయి బర్త్‌డేకి చాక్లెట్లు కొంటా.. డబ్బులియ్యమని తండ్రిని అడుగుతుంది. ఆ తండ్రి నా దగ్గర లేవు అని కోప్పడుతాడు. షార్ట్‌ఫిలిం నిండా ఇలాంటి కథలే ఉంటాయి. కోరికలు తీరని వారు కొందరైతే.. కోరుకున్నవన్నీ అందినా.. అసంతృప్తితో బతికేవారు కొందరు. అలాంటి కథలతో తీసిన ఈ షార్ట్‌ఫిలిం మీరూ చూడండి.తన జ్ఞాపకాల్లో..

Total views 9,296+ (మార్చి 9 నాటికి)
Published on Mar 3, 2019
దర్శకత్వం: శ్యాం
నటీనటులు : మణి, వింధ్య, వినయ్, రామక్రిష్ణ, వర్ష
ఆకాశ్ అనే కుర్రాడిది చాలా పాజిటివ్ మైండ్‌సెట్. ప్రతీ జీవితం రెండు పదాలతో ముడిపడి ఉంటుందనే జీవిత సత్యాన్ని నమ్ముతాడు. అది ప్రేమ, స్నేహం. స్నేహితులు, సంగీతమే ప్రపంచంగా గడిపే ఆకాశ్‌కి అమృత అనే అమ్మాయి పరిచయమవుతుంది. అప్పటి నుంచి ఆమె ఆలోచనలతోనే గడుపుతాడు. ప్రాణంగా భావించే స్నేహితుడితో గొడవ పెట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి కూడా వదిలి వెళ్లిపోతుంది. అంతేకాదు.. వేరే అబ్బాయితో కలిసి తిరుగుతుంది. ప్రతిరోజూ ఆమె గురించే ఆలోచించే ఆకాశ్ ఆమె ఎడబాటును తట్టుకోలేకపోతాడు. ఒకరజు ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ సమయంలో అమృత తన బావతో కలిసి రోడ్డు మీద కనిపిస్తుంది. ఆమెను చూడగానే తట్టుకోలేక ఆకాశ్ వెళ్లి అమృతతో మాట్లాడుదామని ప్రయత్నిస్తాడు. అమృత మరో ఆలోచనే లేకుండా.. ఆకాశ్‌ని చెంపమీద కొడుతుంది. అసలు అమృత, ఆకాశ్‌ల ప్రేమ ఎలా కలిసింది? ఒకరంటే ఒకరు ప్రాణంగా బతికిన వాళ్లు ఎందుకు విడిపోయారు? ఆకాశ్ తన స్నేహితులతో ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ షార్ట్‌ఫిలిం చూడండి.శక్తి

Total views 6,800+ (మార్చి 9 నాటికి)
Published on Mar 8, 2019
దర్శకత్వం: శివరాజ్ మన్నె
నటీనటులు : స్నిగ్ధ భవ, ప్రభాత్, సుప్రియ
సైన్యంలో పనిచేస్తున్న భర్తతో ఫోన్‌లో మాట్లాడే సీన్‌తో ఓపెన్ అవుతుంది. ఆయనతో మాట్లాడుతుండగానే అవతలి వైపు పెద్ద పేలుడు శబ్దం. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఏం జరిగిందో ఊహించిందామె. సైన్యంలో పనిచేస్తున్న భర్తల ప్రాణాలు గాల్లో దీపాలని ఆ భార్యలకు తెలుసు. అయినా గుండె నిబ్బరం చేసుకొని జీవితాన్ని కాదు.. కాదు.. రోజులు వెల్లదీస్తుంటారు. ఓ వైపు తన భర్త దేశానికి సేవ చేస్తున్నాడు, జాతికి రక్షణనిస్తున్నాడన్న గర్వం, ఆనందం ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏ శత్రుమూక దాడిలో గాయపడుతాడో, ప్రాణాలు కోల్పోతాడో అన్న భయాన్ని పైకి కనిపించకుండా గుప్పిట్లో దాచుకుంటారు. అలా శత్రు దాడిలో ప్రాణాలు కోల్పోయిన భర్త గుర్తుగా సైన్యం ఆయన షర్ట్ పంపిస్తారు. కొన్నిరోజులు భారంగా గడుపుతుంది. ఆ తర్వాత తను కూడా భర్తలాగే సైన్యంలో చేరాలని నిర్ణయం తీసుకుంటుంది. సైన్యంలో చేరి భర్త ఆశయాన్ని కొనసాగిస్తుంది. మొన్నటి మహిళా దినోత్సవం సందర్భంగా సెల్యూట్ చేస్తూ ఈ షార్ట్‌ఫిలిం అంకితం చేశారు.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles