నెట్టిల్లు


Sun,January 7, 2018 02:15 AM

అనాదిగా

నటీనటులు : పవన్ రమేష్, శిరీష, నిఖల్, చలం, శ్రావణి, రజిత, రామ్, నవ్య,
దర్శకత్వం: పృధ్విరాజ్
ఫిల్మోత్సవం : మొదటి బహుమతి
అనాదిగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులోన్మాదాన్ని వేలెత్తి చూపిస్తూ తీసిన షార్ట్‌ఫిలిం ఇది. మానవత్వాన్ని మరిచి అగ్రకులం, అణగారిన కులం అంటూ సాటి మనుషుల్ని హీనంగా చూసే సమాజాన్ని ప్రశ్నించాడు దర్శకుడు. ఓ దళిత అమ్మాయిని ఓ కుర్రాడు ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే అగ్రకులానికి చెందిన వ్యక్తి ఆ అమ్మాయి మీద అత్యాచారానికి ప్రయత్నిస్తాడు. ఆ కుర్రాడు అతడిని అడ్డుకుంటాడు. అప్పటి నుంచీ ఎప్పటికైనా వీరిద్దరి సంగతి చూడాలని ప్రయత్నిస్తుంటాడు ఆ అగ్రకులానికి చెందిన వ్యక్తి. ఆ డ్రామా, కులతత్వం, తక్కువ కులం అంటూ చేసే చీత్కరింపులు అన్నీ ఆలోచింపచేస్తాయి. తెగిపోయిన చెప్పులు కుట్టించుకునేందుకు వచ్చిన కుర్రాడు అక్కడ కనిపించిన అమ్మాయి మీద మనసు పడడం, ఆమె మనసు గెలుచుకోవడం కోసం ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి సైకిల్ తొక్కుతూ వెళ్లడం, చెరువులో చేపలు పడుతూ మోతుకాకు మీద పువ్వు పంపించడం అన్నీ ఒకప్పటి బి. నర్సింగ్‌రావు సినిమాలో సీన్లను తలపించాయి. చూసేవారిని ఉన్నఫళంగా యాభయేళ్లు వెనక్కి తీసుకెళ్లి కథకు కనెక్ట్ చేసిన దర్శకుడి తీరు బాగుంది.
Anadiga

నేను బ్రతికే ఉంటాను

నటీనటులు : శివ రామ్‌రెడ్డి, సుజాత,
కుమారస్వామి, శ్యామ్, డామ్నికా,
శ్రీకాంత్, లావణ్య, నాగేష్
దర్శకత్వం : జి. కుమారస్వామి
ఫిల్మోత్సవం : రెండవ బహుమతి
ప్రస్తుత రోజుల్లో తెలుగు భాష పరిస్థితిని కళ్లకు కట్టాడు దర్శకుడు. పరదేశీ సంప్రదాయాలు, పరదేశీ భాషలకు అలవాటు పడి అమ్మా అని పిలవడం కూడా మోటుగా భావించేవారికి ఈ షార్ట్‌ఫిలిం మంచి సమాధానం. ప్రపంచ భాషల్లో తెలుగు వెలుగుకు ఉన్న గొప్పదనాన్ని, తెలుగులో ఉన్న తియ్యదనాన్ని దర్శకుడు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఒక తెలుగు మాష్టారు తెలుగును ఎంతలా ప్రేమిస్తాడో.. ప్రస్తుత రోజుల్లో తెలుగు మాష్టార్లు ఎదుర్కొంటున్నంత అవమానాలను బాగా చూపించాడు. తెలంగాణలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత తెలుగుకు దక్కిన గౌరవాన్ని, తెలుగును కాపాడుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతను అందరికీ పంచాడు దర్శకుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటను చాటుతూ చికాగోలో తెలుగు నేర్పడానికి తెలుగు మాష్టారు బయల్దేరే సీన్, పదవీ విరమణ సందర్భంలో ఎప్పుడూ తెలుగు మాట్లాడే తెలుగు పంతులు ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఆ తర్వాత తన మనసులోని భావాలను తెలుగులో చెప్పి జేజేలు అందుకుంటాడు.
nenu-brathike-untanu

గావురం

నటీనటులు : విక్రమ్‌సూర్య, సిద్ధూరెడ్డి,
పరీక్షిత్, అనూష
దర్శకత్వం: వీరస్వామి
ఫిల్మోత్సవం : మూడవ బహుమతి
ఒక ఇంట్లో అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే బంధాన్ని కళ్లకు కట్టిన షార్ట్‌ఫిలిం ఇది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కడుతూ, ప్రేమానుబంధాలను కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. బోనాలు, బతుకమ్మ పండుగలను సైతం అద్భుతంగా చూపించి తెలంగాణ పండుగల గొప్పదనాన్ని చాటిచెప్పాడు. గావురంగా పెంచుకున్న చెల్లెను అత్తారింటికి సాగనంపిన తర్వాత అన్న చెల్లెకు పళ్లై పోయిందన్న విషయం మరిచిపోయి అన్నం పెట్టమని పిలుస్తాడు. ఇరవై ఏండ్లు గావురంగా పెంచిన చెల్లెకు పెండ్లి చేసిన తర్వాత ఆ ఇంటిసభ్యులు కన్నీటితో సాగనంపే, బియ్యం పోసే దృశ్యాలు మనసును కరిగించేలా ఉన్నాయి. బావ, బామ్మర్దుల మధ్య ఉండే ప్రేమ, మామా, అల్లుళ్ల మధ్య అలకలు, ప్రతీ సీన్ పల్లెప్రేమలను కళ్లకు కట్టింది. చెల్లెకు బిడ్డ పుట్టిందని అమ్మ నిరుత్సాహంగా ఉంటే.. చెల్లెకు మనం లేమా..? ఆడబిడ్డ పుడితే నారాజ్ ఎందుకైతున్నవ్. భవిష్యత్ అంతా ఆడబిడ్డలదే అనే డైలాగ్ మనసుకు హత్తుకుంటుంది.
Gavuram


తంగేడుపూలు

నటీనటులు : సంఘీర్, రోహిణి ఆరెట్టి, అంజి ఎస్కే, చైత్ర, పరమేష్, మిసిమి, రోహిత్, గణేష్
దర్శకత్వం : వాల్మీకి వడ్డేమని
ఫిల్మోత్సవం : ప్రత్యేక బహుమతి
అన్నాచెల్లెళ్ల బంధం. ఈ సృష్టిలో అన్నింటికంటే బలమైంది. అలాంటి బంధాన్ని ప్రకృతి కలిపితే ఆ బంధం ఇంకెంత దృఢంగా ఉంటుంది. అన్న కంటే ముందే ప్రతీ సద్దుల బతుకమ్మ నాడు అన్న ఫ్రెండ్ ఆ చెల్లెకు తంగెడుపువ్వు తెచ్చిస్తడు. అన్నను ఎంత బతిమిలాడినా లేవడు. అలాంటిది చెల్లె లేని సంఘీర్ మాత్రం స్నేహితుడి చెల్లెను తన చెల్లెలా చూసుకుంటాడు. ఆ చెల్లె కూడా ప్రతీ రాఖీ పౌర్ణమి నాడు అన్న కంటే ముందు తనకు తంగేడు పువ్వు తెచ్చిచ్చే అన్నకే రాఖీ కడుతుంది. పళ్లైన తర్వాత తొలి రాఖీపౌర్ణమి నాడు ఆ చెల్లె తనకు రాఖీ కట్టడానికి వస్తుందేమో అని సంఘీర్ తినకుండా ఎదురుచూస్తూ ఉంటాడు. పండుగనాడు ఊరికి వచ్చిన ఆ చెల్లె కూడా నేరుగా తల్లిగారింటికి పోకుండా సంఘీర్ ఇంటికే వచ్చి అక్కడే సంఘీర్‌తో పాటే తన అన్నకు కూడా రాఖీ కడుతుంది. అన్నాచెల్లెల్ల బంధం, తంగెడుపూల అందం ఈ షార్ట్‌ఫిలింలో బాగా చూపించారు.
thangedu-pulu

880
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles