నెట్టిల్లు


Sun,November 12, 2017 01:38 AM

దర్శకుడిగా రాణించాలనుకుంటున్న ఎంతోమంది యువ దర్శకులకు విజిటింగ్ కార్డ్ షార్ట్‌ఫిలిం. ప్రతిభను, సృజనాత్మకతను జోడించి నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు ఈతరం దర్శకులు. తమ ఆలోచనలకు పదును పెట్టి మంచి షార్ట్‌ఫిలింలను చిత్రీకరిస్తున్నారు. యూట్యూబ్‌లో విడుదలై ఎక్కువమంది నెటిజనులను ఆకట్టుకుంటున్న షార్ట్‌ఫిలిమ్స్‌లలో కొన్ని..

నివురు

Total views12,345(నవంబర్ 4 నాటికి)Published on Oct 28, 2017
నటీనటులు : విద్యాధర్ కగిట, సన్నీ నవీన్, వీరభద్రం, పవన్ కుమార్, రవితేజ, సిద్ధు
దర్శకత్వం: అభిలాష్.జె
ప్రతీ పనిలో పర్ఫెక్షన్ కోరుకునే ఓ కుర్రాడి కథ ఇది. బాగా చేయలేదన్న అనుమానం, ఇంకా బాగా చేయాలన్న తపన వల్ల చేసిన పని మళ్లీ మళ్లీ చేస్తాడు. ఏదైనా తనకు నచ్చినట్టు లేకపోతే దాన్ని నచ్చినట్టు సెట్ చేయడం ఆ కుర్రాడి అలవాటు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఓ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. ఇంట్లో చిందరవందరగా పడిఉన్న గిన్నెలను సర్దుతుండగా ఇంటి యజమాని రావడంతో అతని తల మీద కర్రతో బలంగా కొడుతాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికొస్తాడు. చీకటిగా ఉన్న గదిలో కొవ్వొత్తి వెలిగిస్తాడు. ఈలోపు కిటికీ చప్పుడవుతుంది. అది క్లోజ్ చేసి వచ్చే లోగా.. స్టడీ సర్టిఫికెట్స్ తగులబడిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుర్రాడి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా? యూట్యూబ్‌లో చూడండి.
Nivuru

ఏ పేరుతో పిలిచినా..

Total views 11,500(నవంబర్ 4 నాటికి)Published on Nov 2, 2017
నటీనటులు : ఎల్బీ శ్రీరాం, మాస్టర్ భార్గవ్, రాజశేఖర్ దీక్షితులు
దర్శకత్వం: ఎల్బీ శ్రీరాం
చిన్న నేపథ్యాన్ని తీసుకుని అల్లిన కథ ఇది. కానీ విలువైన సమాచారంతో పాటు సందేశం కూడా ఉన్నది. ఎల్బీ శ్రీరాం ఆలోచనల నుంచి వచ్చిన మరో అద్భుతమైన వీడియోగా చెప్పొచ్చు. మీలోని ఎన్నో ప్రశ్నలకు ఈ షార్ట్ ఫిలిం సమాధానం చెప్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మనవడిని తీసుకుని గుడికెళ్తాడు తాతయ్య ఎల్బీ శ్రీరాం. గుడిలో అడుగు పెట్టిన క్షణం నుంచి అనేక సందేహాలు అడుగుతుంటాడు మనవడు. గుడిలో మనవడు అడిగే సందేహాలను నివృత్తి చేస్తూ గుడిలో చేయాల్సిన పనులను వివరిస్తుంటాడు. చివరగా పేర్లు ఎన్ని ఉన్నా.. ఏ పేరుతో పిలిచినా ఎవరి శక్తి వాళ్లది అనే సందేశం ఇస్తారు. దేవుళ్లు ఎంతమంది? వాళ్లెవరు? మూడు రకాల పాపాల గురించి తెలియాలంటే ఈ షార్ట్‌ఫిలిం చూడాలి.
LBSRIRAM

ప్యారగన్

Total views 6,220(నవంబర్ 4 నాటికి)Published on Nov 2, 2017
నటీనటులు : ఒక జత షూస్
దర్శకత్వం: గురుప్రసాద్
నటీనటులు అని రాసి ఒక జత షూస్ అని రాశారేంటి అనుకుంటున్నారా? అవును.. ఈ కథలో షూసే హీరోహీరోయిన్లు. మనుషులు విడిపోతారు.. కానీ చెప్పులు విడిపోవడం అరుదు. ఒకటి తెగిపోతే.. కుట్టిస్తాం. పడేయాల్సి వస్తే రెండూ కలిపే పడేస్తాం. అంతటి గొప్ప ప్రేమ వాటిది. అది చెప్పుల గొప్పతనం కాదు. ప్రేమ గొప్పతనం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పళ్లైన కొన్ని రోజుల తర్వాత రోజూ పోట్లాడుకుంటారు. కానీ పుట్టినప్పటి నుంచి కలిసే ఉండే షూస్ మాత్రం ఒకదాన్ని మించి ఇంకోటి ప్రేమించడంలో పోటీ పడుతుంటాయి. గుడి దగ్గర విడిపోయి.. మళ్లీ అక్కడే కలుసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? యూట్యూబ్‌లో చూడండి. మనసుకు హత్తుకునే షార్ట్‌ఫిలిం. మ్యూజిక్, డైరెక్షన్ అన్నీ సూపర్బ్.
paragone

నేనూ మనిషినే..

Total views5,892(నవంబర్ 4 నాటికి)Published on Oct 27, 2017
నటీనటులు : నాగ్, ప్రియా, ఫిరోజ్ షేక్, లీలాక్రిష్ణ, రవికుమార్, ప్రేమ్ ఏడుకొండలు
దర్శకత్వం : ఫిరోజ్ షేక్
మనిషిలోని మానవత్వాన్ని, మనిషి తత్వాన్ని తట్టి లేపేందుకు చేసిన చిన్న ప్రయత్నమే ఈ షార్ట్‌ఫిలిం. ప్రేమలో ఓడిపోయి చావాలనుకున్న ఓ కుర్రాడిని బతికించేందుకు, చావకుండా ఆపేందుకు ఏమీ అక్కర్లేదు. నేనూ మనిషినే.. అనే భావన ఉంటే చాలు. చేయి చాచి దేహీ అని అడిగిన వారికి కొండంత సాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్లూ మనుషులే.. నేనూ మనిషినే అని ఆలోచించి తోచిన సాయం చేస్తే చాలు. ఈ భూమ్మీద ఉన్న వారందరూ హాయిగా, సంతోషంగా ఉండాలంటే.. ఏమీ అక్కర్లేదు.. నేనూ మనిషినే అనే విషయం గుర్తు పెట్టుకొని, తోటివారిని వాళ్లూ మనుషులే అనే భావనతో గౌరవిస్తే చాలు. ఇదే తత్వాన్ని సింపుల్‌గా మనసుకు హత్తుకునేలా చెప్పిన ఫిరోజ్ షేక్ ప్రయత్నం అభినందనీయం.
nenu-manishine

881
Tags

More News

VIRAL NEWS