నీ మాటకోసం జీవితాంతం ఎదురుచూస్తూ..


Sun,October 7, 2018 01:52 AM

- తొలిప్రేమ
love
నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా వస్తుందిరా అని మా ఫ్రెండ్ చెప్పిన ఒకే ఒకమాట నన్ను ఇరకాటంలో పెట్టేలా చేసింది. మన బ్యాచ్ వాట్సప్ గ్రూప్‌లో తన నంబర్ కూడా ఉంది అని నంబర్ కూడా మెసేజ్ చేశాడు. నేను చనిపోయేలోగా ఆ మాట వినాలని తపిస్తున్నా. ఆమె నాకు దక్కలేదనే వేదనతో వెయ్యికిపైగా కవితలు రాశా. ఆమెకూ ఈ విషయం చెప్పాను.

అది 1987వ సంవత్సరం. చుట్టు వాగులు, తరగతి గది కిటీకీ నుంచి చూస్తే రైళ్ల రాకపోకలు. ఎంతో అందమైన పాఠశాల మాది. క్లాస్‌లో మాది ఇ సెక్షను. మా సెక్షన్లో 65 శాతం అమ్మాయిలే. సీతాకోక చిలుకల్లా ఉండేది మా క్లాస్. రెండు జడలతో గలగలా మాట్లాడుతూ ఎప్పుడూ చలాకీగా కనిపించే ఒక అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసులో అది ప్రేమ కాకపోయి ఉండొచ్చు. ఐతే ఇష్టమై ఉండొచ్చు. కానీ నాలో మాత్రం ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండె. నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డానంతే. ఆమె అందరికంటే అందంగా ఉండేది. చదువులోనూ ఫస్టే. మంచి సంస్కారవంతమైన అమ్మాయి. మా ఇద్దరి ఎత్తూ తక్కువే. అందుకే క్లాస్‌లో ముందరి బెంచీల్లో కూర్చునేవాళ్లం. అమ్మాయిల వరుస ముందు బెంచీలో చివరివైపు ఆమె.. అబ్బాయిల బెంచీలో చివరివైపు నేను.. ఇలా ఇద్దరం చూడ్డానికి పక్కపక్కనే కాబట్టి తరుచూ మాట్లాడుకునేవాళ్లం. అలా మా ఫ్రెండ్‌షిప్ పెరిగింది. కానీ ఆమె ఎవరితోనైనా మాట్లాడితే నాలో నేను బాధ పడేవాణ్ని. ఎందుకో ఏమో ఆమె నాతో మాత్రమే మాట్లాడాలనిపించేది. యోహన్ అనే అబ్బాయితో అప్పుడప్పుడు మాట్లాడేది. వాడు నాకు ఫ్రెండే కానీ నాకు కోపం వచ్చేది. ఇది ఎప్పుడూ బయటపెట్టలేదు. ఎవరిని బాధపెట్టలేదు. అలా రెండేళ్లు గడిచాయి.

తర్వాత అమ్మాయిలకు సెపరేట్‌గా స్కూల్ ఏర్పాటు చేశారు. దీంతో ఆమెను కలవడం వీలు కాకపోయేది. కనీసం చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నేను అత్యంత ఎక్కువగా ఇష్టపడే ఆమె కూడా నా నుండి విడిపోయింది. చాలా రోజులు బాధ పడ్డాను.

పోయిన సంవత్సరం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్కూల్‌లో మన బ్యాచ్ విద్యార్థుల గెట్ టు గెదర్ జరుగుతున్నది. నువ్వు తప్పనిసరిగా రావాలి అని మా ఫ్రెండొకడు ఫోన్ చేశాడు. వాస్తవానికి నాది బిజీ ప్రొఫెషన్. అందులోనూ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటుచేసింది ఆదివారం. ఐతే ఆదివారం నాడు నేను తప్పనిసరిగా ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. నేను రాలేనురా.. నాకు వీలుకాదు అని నేను చెప్పాను. నువ్వు రారా చాలా సంతోషపడ్తావ్ అని చెప్పాడు మా దోస్తు. స్నేహితులందర్నీ కలుసుకోవడం మంచి అవకాశం కాబట్టి వెళ్లాలని ఉంది. కానీ వెళ్లలేని పరిస్థితి. దీనికితోడు నాకు ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొనాలనే మా యాజమాన్యం ఆదేశం. విమానం టికెట్లు కూడా మా ఆఫీసు నుంచి బుక్ అయ్యాయి. నేను వెళ్లనంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది. ఉద్యోగం కూడా పోవచ్చు.
అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా వస్తుందిరా అని మా ఫ్రెండ్ చెప్పిన ఒకే ఒకమాట నన్ను ఇరకాటంలో పెట్టేలా చేసింది. మన బ్యాచ్ వాట్సప్ గ్రూప్‌లో తన నంబర్ కూడా ఉంది అని నంబర్ కూడా మెసేజ్ చేశాడు. ఇక నా ఆలోచనలకు అంతులేదు. మనసులో ఒకటే అలజడి. నేను ఫోన్‌చేస్తే మాట్లాడుతుందా? అసలు నేను గుర్తున్నానా? ఫోన్ చేస్తే ఏమంటుందో ఏమో? అనే ఆలోచనలు. ఏమైనా సరే ఒకసారి కాల్‌చేస్తా అని ధైర్యంతో ఫోన్‌కాల్ చేశాను. ఎవరూ? అనే గొంతు వినిపించింది. నేను కిరణ్‌ను మాట్లాడుతున్నా అన్నాను. ఏ కిరణ్? అన్నది. అదేనండీ మీ క్లాస్‌మేట్ కిరణ్‌ను అని చెప్పడంతో.. ఓహో.. మీరా? అన్నది. అవును. ఎలా ఉన్నారు? అని అడిగాను. కానీ ఆమె మాటలు బట్టి చూస్తే మరిచిపోయిందేమో అనిపించింది. ఏదో అలా మీరా? అన్నది కానీ నన్ను మర్చిపోయినట్టుంది. బాధనిపించింది. ఆ బాధను గుండెలోతుల్లో ఉంచుకొని.. సరే ఏదైతేముంది? కనీసం చూడొచ్చనే ఆశతోనైనా పాఠశాలకు వెళ్లాను. నా కనులు ఆ అపురూప సౌందర్యరాశి కోసమే వెదుకులాడాయి. అప్పటికీ ఆమె ఇంకా రాలేదు. సరే.. వస్తుందో రాదో కూడా తెలియదు.

కానీ ఎక్కడో చిన్న ఆశ ఉంది. ఆమె కచ్చితంగా వచ్చి తీరుతుందనే భరోసాతో ఇంకా ఎదురుచూశాను. అంతలోనే రానే వచ్చేసింది. అప్పుడు నా ఆశలకు రెక్కలొచ్చినట్లు అనిపించింది. పేరుపెట్టి పిలిచాను. కానీ పలుకలేదు. పక్కన ఉన్న క్లాస్‌మేట్‌తోపాటు ఆమె పేరుతో పిలిచా. ఇటురండి అన్నాను. వచ్చింది. అదే అందం. అమాయకత్వంతో కలిసిన వదనం. అదే చిరునవ్వు. నన్ను చూసి గుర్తుపట్టింది. అంత పక్కాగా నేను గుర్తులేకున్నా. నేను వాళ్ల క్లాస్‌మేట్‌నని చూచాయిగా స్పష్టతకు వచ్చింది. కానీ ఆమె ఎందుకో డల్‌గా ఉందనిపించింది. చిన్నప్పటిలా చలాకీగా లేదనిపించింది. అందరితో మాట్లాడుతున్నా ఏదో కోల్పోయిన గుర్తులు ఆమె ముఖంలో నాకు కనిపించాయి. ప్రయాణ బడలిక అని సరిపెట్టుకున్నా. ఎలాగోలో మాట్లాడుతూ మేము చివరిగా చదివిన క్లాస్‌రూంలోకి ఇద్దరం కలిసి అడుగుపెట్టాం. మా వెనుక మా క్లాస్‌మేట్స్. అక్కడ ఫొటోలు. అమె పక్కన నిల్చుని ఫొటోలు దిగాను. బెదురుగా భయపడుతున్నట్లు ఫొటోలు దిగింది. నాకు చిన్నప్పటి స్నేహితులను కలువడం ఎంతో సంతోషంగా అనిపిస్తే.. అంతకంటే రెట్టింపు సంతోషం ఆమెను కలుసుకోవడం అనిపించింది. నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. నంబరు కూడా తీసుకున్నాం. కార్యక్రమం అయ్యాక అందరం ఎవరింటికి వాళ్లం వెళ్లిపోయాం. కానీ నాలో ఎన్నో ఆలోచనలు. అలా ఆ రోజు నా జీవితంలో నాకు ప్రత్యేకంగా మారింది.

కొద్దిరోజులు గడిచాక ఒక రోజు ఆమె నుంచి ఫోన్. హా.. చెప్పూ అన్నాను. ఒక విషయం చెప్పాలి అన్నది. ఆ విన్నపంలో ఏదో ఆందోళన కనిపించింది. ఏదైనా సమస్యలో ఉందేమో అనుకొని నేనే ధైర్యం చెప్పాను. నేనేమీ అనుకోను. ధైర్యంగా చెప్పు అన్నాను. నాకో సహాయం చేస్తారా? అన్నది. అయ్యో.. భలేవారే. నా వల్ల అవుతుంది అనుకుంటే మీ కోసం కచ్చితంగా చేస్తాను అని భరోసా ఇచ్చాను. విషయం చెప్పింది. నాకు బాధనిపించింది. చేసిన సాయమేంటో చెప్పే అలవాటు నాకు లేదు. అయినా ఆడపిల్లకు సహాయం చేసి చెప్పడమూ సరికాదు. అందుకే సహాయం చేశానని చెప్తున్నాను.. కానీ అదేంటో మాత్రం చెప్పలేను. ఇక.. ఆమె అడిగిన వెంటనే నాకున్న రూట్‌లో ప్రయత్నించాను. తెలిసినవాళ్లను సంప్రదించి విషయం వివరించాను. నాతో ఉన్న అనుబంధం వల్ల వాళ్లు అడిగిన పని చేసిపెట్టారు. పని విషయంలో కొంత జాప్యం కావడంతో నాకు ఫోన్‌చేసి ఏమైందని అడిగే క్రమంలో ఇలా ఇద్దరి మధ్య అన్ని విషయాలూ చర్చకు వచ్చాయి. తన కుటుంబ పరిస్థితి వివరించి చెప్పింది. ఐతే ఇలా మళ్లీ మాటలు కలువడంతో రోజురోజుకూ మాట్లాడుకోవడం.. చాట్‌చేసుకోవడం కొత్తగా అనిపించింది. ఒక సందర్భంలో నేను.. నిన్ను ప్రేమించా, పెళ్లి చేసుకోవాలనుకున్నా. నీ కోసం తిరిగాను. అప్పటికే నీ పళ్లైయిపోయిందని తెలిసింది. చనిపోయేలోగా ఒక్కసారైనా చూడాలనుకున్నా. ఇప్పుడు చూశాను అని చెప్పాను. ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాననే విషయం చెప్పా. డిగ్రీ తర్వాత నీపై ప్రేమ మరింత పెరిగి. నీ గురించి ఆరా తీశాను. అప్పటికే నీకు మంచి సంబంధం రావడంతో పెండ్లి అయిపోయిందని తెలిసింది. దీంతో ఏమీ చేయలేక ఏడ్చుకుంటూ కూర్చున్నాను అని చెప్పాను. అవునా? ఐతే ఇప్పుడేం చెయ్యలేం కదా? అని ఆమె అన్నది.

ఒకసారి నేను జాబ్‌చేస్తున్న ప్రాంతానికి వచ్చింది. పని అయిపోయిన తర్వాత నాతో కలిసి భోజనం చేసింది. ఇలా అప్పుడప్పుడు వచ్చినప్పుడు కలిసి వెళ్తుండేది. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నది. ఈ క్రమంలో తన పనుల కోసం వస్తూ పని ముగిసాకా బస్సు ఎక్కి వెళ్లిపోతుంది. నా కోసం ఆమె రావాలని, నాతో ఉండాలని నాకు చాలా ఉంటుంది. ఆమె అది పట్టించుకోదు. ఒకసారి చాలాసేపు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తన మనసులోని కొంత బాధను నాతో పంచుకుంది. నేను తట్టుకోలేకపోయాను. ఒక్కటే చెప్పా. నాతో స్నేహం చేసే ఎవ్వరైనా నాతో స్వేచ్ఛగా మాట్లాడతారు. నువ్వూ అలాగే భావించి ఓపెన్‌గా చెప్పు అని ధైర్యమిచ్చాను. ఇది మనసులో నుంచి వచ్చిన కల్మషంలేని నిఖార్సయిన హామి.

నన్ను కలిసిన ప్రతీసారి నేను నా బైక్ మీద బస్టాండ్ నుంచి తీసుకువచ్చి తీసుకువెళ్తాను. అప్పుడు మాత్రమే మేం ఏదైనా మాట్లాడుకుంటాం. అది కూడా కుటుంబానికి సంబంధించినవి. ఇక మా మధ్య అలకలు, గొడవలు మామూలే. నేనే ప్రేమించడం కాదు ఆమె కూడా నా కోసం తపిస్తున్నది. నేను బాగుండాలని కోరుకుంటుంది. మొత్తానికి నేను మాత్రం ఇంకా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నా. చివరి శ్వాస వరకూ ప్రేమిస్తూనే ఉంటా. ఇప్పుడు తన కష్టాలన్నింటినీ అవలీలగా దాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి ఫొజిషన్‌లో ఉంది. కానీ నా గురించి ఆమె అంతరంగంలో ఏముందో ఇప్పటికీ తెలియదు. ప్రేమిస్తున్నానని ఒక్క మాట కోసం ఇప్పటికే దాదాపు 30 సంవత్సరాలుగా వేచి చూస్తున్నా. నేను చనిపోయేలోగా ఆ మాట వినాలని తపిస్తున్నా. ఆమె నాకు దక్కలేదనే వేదనతో వెయ్యికిపైగా కవితలు రాశా. అవి ఇప్పుడు లేవనుకోండి. ఆమెకూ ఈ విషయం చెప్పాను. నా జీవితానికి ఒకే ఒక కోరిక మిగిలి ఉంది. ఆమె నోటి నుంచి ప్రేమిస్తున్నాననే మాట వినాలి. నాకింకేవీ వద్దు. నను ప్రేమించాననే మాట కలలో నైనా చెప్పెయ్ నేస్తం.. కలకాలం బతికేస్తా అన్నట్లు ఉంది నా జీవితం.. నా ఆలోచనలు.
నీ ప్రేమ కోసం తపిస్తూ.. ఆవేదనను భరిస్తూ.. క్షణమొక యుగంగా బతకుతూ.. నీ మాటకోసం జీవితాంతం ఎదురుచూస్తూ.. ప్రాణమున్న శవంలా జీవిస్తూ..
నీ కిరణ్!

886
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles