నా సినిమా గుండెలో పెట్టుకొని వెళ్లాలి!


Sun,December 3, 2017 02:35 AM

ఆయనకు సినిమా అంటే ఒక ఫేషన్. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి రావాలనుకున్నారు. కుదరలేదు. అయినా ఆయన ఏ ఉద్యోగం చేసినా మనసు సినిమా చుట్టే తిరిగేది. ఉద్యోగాలన్నీ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు. నిర్మాతగా అరంగేట్రం చేసి పెళ్లిచూపులు, మెంటల్‌మదిలో వంటి విజయవంతమైన సినిమాలు అందించారు రాజ్ కందుకూరి. ఆయన సినిమా ప్రస్థానం.నేను వరంగల్‌లో చదువుకున్నాను. చిన్నతనంలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ సినిమా పోస్టర్స్ చూడడం అలవాటు. వరంగల్ పెట్రోల్‌బంక్ ఏరియాలో ప్రతివారం పోస్టర్ మార్చేవారు. అక్కడ ఆగి పోస్టర్ చూడాలి. అలా ఆ పోస్టర్ మీదా ఎక్కడో ఒకచోట నా పేరు ఉండాలి అనుకునేవాణ్ని. ఏ క్రాఫ్ట్ అని తెలియదు. సినిమా అంటే నటించడం అంతే తెలుసు అప్పుడు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎడిటింగ్ ఉంటుంది. ఇదేం తెలియదు. సినిమా మీద పిచ్చి ఇష్టంతో వితౌట్ క్లారిటీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకునేది. కానీ అది లైఫ్ ఇవ్వదు. దాంట్లో ఎర్నింగ్ ఈజీ కాదు. ఆ క్రమంలో ఎంబీఏ చేసిన తర్వాత ఒక జాబ్ చేసిన, టీవీ కంపెనీ పెట్టిన. ఇట్ల రెండు మూడు రకాలుగా ప్రయత్నాలు చేసిన కానీ ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. కానీ దానిని నా వల్ల కాదని అర్థమై వదిలేసిన. ఎందుకంటే అక్కడ నాకెవరూ తెలియదు. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ట్రై చేసిన. చెన్నైకి లెటర్ రాసిన. పోటోలు పంపమన్నారు. పంపా. నువ్వు సెలక్ట్ అయ్యావు. ట్రైన్ చార్జీలు ఇస్తాం. ఎనిమిది రోజులు షూటింగ్ ఉంటుంది వెయ్యిరూపాయలు ఇస్తాం రమ్మన్నారు. అప్పుడు వెయ్యంటే బిగ్ ఎమౌంట్. కానీ మా మదర్ ఒప్పుకోలేదు. నేను కష్టపడ్డ మంచి ఆఫర్ వచ్చింది నేను ఎట్లయినా వెళ్తా అన్నా. కానీ నిన్ను పంపడం కుదరదు, చదువుకో ముందు. సినిమాకు పోతే నీకు డబ్బులు ఎవరిస్తారు? అంది. వెయ్యిరూపాయలు ఇస్తారు అని చెప్పా. దానికోసం సినిమాలకు వెళ్తే తరువాత ఉద్యోగం ఎవరిస్తారు నేను ఒప్పుకోను అని మదర్ అన్నారు. చాలా డిసప్పాయింట్ అయిన. ఆ తర్వాత బీకాం చేసిన, ఎంబీఏ చేసిన. ఎప్పుడు కూడా సినిమాలు చూసుడు ఇష్టం. ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూసేవాణ్ని. జేమ్స్‌బాండ్ సినిమాలు ఎక్కువగా చూసేవాణ్ని. లైఫంత దాని చుట్టే తిరిగేది. యండమూరి నవలలు ఎక్కువ చదివేవాణ్ని. ఆయన నవలలు సినిమాలుగా వస్తే చూడడం, తిరిగి నవల చదవడం.. డబ్బుడబ్బుడబ్బు, తులసీదళం ఇలా అన్నీ చూశా.
RajKandukuri

ప్రపంచం ఎటు తిరిగి సినిమా దగ్గరికే వచ్చేది. సోనీ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశా. నాకు నెక్ట్స్ ఇష్టమైందేంటంటే ఏదైనా జాబ్ చేయాలంటే అందులో కూడా సినిమా కనిపించాలె. ఆ కంపెనీలో ఆఫీసునిండా టీవీలు ఉండాలి. అటు చేసి మళ్లీ అక్కడ సినిమా వస్తది. తరువాత వీళ్లకింద పనిచేసి వాళ్లిచ్చే 2700లకు ఇంత కష్టపడి పనిచేయడం ఎందుకు అనిపించి మానేశా. నేనే వెస్ట్రన్ టీవీ షోరూం పెట్టా. అప్పుడు క్రికెట్ వచ్చిందంటే చూడడానికి షోరూంకు చాలామంది వచ్చేవారు. అందులో ఒకతను నా దగ్గరకు టీవీ చూడడానికి వచ్చేవాడు. ఒకసారి నన్ను మీకెమంటే ఇష్టం అని అడిగారు. సినిమాలంటే ఇష్టం అని చెప్పా. ఆయనకు కైకాల సత్యనారాయణ తెలుసు అని పరిచయం చేశాడు. కైకాల కొడుకు నా స్నేహితుడే. ఆయన ద్వారా ఆర్టిస్ట్ అశోక్ కుమార్ పరిచయం అయ్యారు. వారి ద్వారా సినిమా షూటింగ్‌లకు వెళ్లేవాణ్ని. అలా ఇండస్ట్రీ గురించి నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. తమ్ముడు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశా. అలా సినిమాల చుట్టే తిరిగేవాణ్ని. ఒకరోజు నేను అమెరికా నుండి వస్తూ థాయిలాండ్‌లో దిగా. అక్కడ గోల్డెన్ బుద్ధ టెంపుల్‌కు వెళ్లా. అదే టైంలో మా ఫాదర్ ఫోన్ చేశారు. నేను బుద్దుని మీదా ఒక స్క్రిఫ్ట్ రాశా. చేస్తావా అని అడిగారు. ఎలా చేయాలో తెలియదు. అయినా చేస్తా అన్నాను. తరువాత ఎక్కడున్నావు అని అడిగారు. ఇలా బుద్ధ టెంపుల్‌లో అని చెప్పా. అప్పుడు అయన వాటే కో ఇన్సిడెన్స్ అన్నారు. వచ్చాక అల్లాణి శ్రీధర్‌ను పెట్టుకుని గౌతమ బుద్ధ తీశా. దానికి నంది ఆవార్డు, దలైలామా పురస్కారం వచ్చాయి. ఏదీ ఎక్స్‌ఫెక్ట్ చేయకుండానే చేసిన ఆ సినిమాతో గుర్తింపు వచ్చింది. అలా అందులోనుండి బయటకు రాబుద్ది కాలేదు. మై హార్ట్ ఈజ్ బీటింగ్, అదోలా.. తీశా. కమర్షియల్‌గా ఆడలేదు. ఆ తర్వాత అరవింద్-2 కు కో-ప్రోడ్యూస్ చేశా.

ఆ తర్వాత గోల శీను సినిమా డైరెక్ట్ చేశా. సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం డిస్ట్రిబ్యూషన్ చేశా. అంతేకాదు దానికి ముందు నాంపల్లిలో లలితా డిగ్రీ కాలేజీ పెట్టా. బాగా నడిచింది. ఆ తరువాత అమెరికాలో సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్‌గా రెండేళ్లు చేశా. తరువాత అమెరికాకు గ్రైనెట్ డిస్ట్రిబ్యూట్ చేశా. డబ్బులు కూడా మిగిలాయి. అదే సమయంలో సినిమా చేసి ఇండస్ట్రీకి వచ్చా. నాకు డైరెక్టర్‌గా కంటే నిర్మాతగానే సంతృప్తి దొరికింది. నిర్మాతగానైతే మనం ఒక టాలెంట్‌కు అవకాశం ఇవ్వగలుగుతున్నాం. పదిమందికి లైఫ్ ఇచ్చిన వాళ్లమవుతున్నాం. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటాను నేను. అంటే క్రియేటివిటిలో ఫ్రెష్‌నెస్ అందంగా ఉంటుంది అని నమ్ముతా నేను. పెళ్లిచూపులుతో తరుణ్ భాస్కర్‌ను పరిచయం చేశా. ఆ సినిమాలో టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్లే. ఇప్పటి మెంటల్ మదిలో కూడా కొత్తవాళ్లకే అవకాశం ఇచ్చా. దీంట్లో నాకో తృప్తి ఉంది. వీళ్లు గెలిస్తే అది నా గొప్పవిజయంగా నేను భావిస్తా. వాళ్లు మరింత ఎదగాలి అని కోరుకుంటా. నేను ఏం చేసినా ఏదో కొత్త మార్క్ క్రియేట్ చేయాలనే అనుకుంటా. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఇదిగో ఇదీ నేను చేసిన అచీవ్‌మెంట్ అని చెప్పాలి. ఏదైనా ఒక లైన్‌లోకి ఎంటరైతే ఫెయిల్యూర్‌గా వెనక్కిపోవడం ఇష్టం లేదు. అలా చేస్తే ఓటమిని అంగీకరించిన వాణ్నవుతా.

వదిలేయాలా అని అనుకుంటున్న టైంలో పెళ్లిచూపులు నాకు టర్నింగ్ పాయింట్. నాకో నమ్మకం వచ్చింది. సినిమాకు భారీ బడ్జెట్, పెద్ద అర్టిస్ట్‌లు అవసరం లేదు. రెండు గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగే కథ, స్క్రీన్‌ఫ్లే ఉంటే చాలని అర్థమైంది. ఇప్పుడు మెంటల్ మదిలో కూడా అలాంటి విజయమే. అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్‌నే కథాంశంగా తీసుకున్నాం. నేను ఎంచుకునే ప్రతి కథలో హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలని కోరుకుంటా. అవి మన జీవితాలకు దగ్గరగా ఉన్నాయని ప్రేక్షకుడు అనుకోవాలి అనుకుంటా. నా కథలన్నీ ఒక సాధారణ మనిషి చుట్టే తిరుగుతాయి. సురేష్ బాబు నాకు ఆప్తుడు. ప్రతి సినిమా ఆయనకు చూపిస్తా. మాకు మంచి గైడెన్స్ ఇస్తారు. నా సినిమాలు కుటుంబమంతా కలసి చూడాలని కోరుకుంటా. ముఖ్యంగా నా సినిమా చూసిన వాళ్లెవరైనా కొంతైన గుండెలో పెట్టుకుని వెళ్లాలి అనుకుంటా. ఇప్పటివరకు ఏడు సినిమాలకు నిర్మాతగా, ఒక చిత్రానికి దర్శకునిగా చేశా. మా అబ్బాయి ఇంజినీరింగ్‌లో చేస్తున్నాడు. అమ్మాయి టెన్త్‌క్లాస్. చదువయ్యాక బాబును హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న. మా ఫాదర్‌తో అటాచ్‌మెంట్ ఎక్కువ. ఆయనలాగే లైఫ్ పట్ల ఫిలసాఫికల్‌గా ఉంటా. ఇండస్ట్రీలో పర్మినెంట్‌గా ఉండాలని రాలేదు. కొన్నాళ్లు ఇందులో కావాల్సిన తృప్తి దొరికింది. మే బీ నలుగురికి లైఫ్ ఇవ్వగలిగితే చాలు. ఈ కాంక్రీట్ జంగీల్‌కు దూరంగా నేచర్‌కు దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది.

1178
Tags

More News

VIRAL NEWS