నా కోసం వస్తుందని ఎదురుచూస్తున్నా!


Sun,April 15, 2018 02:42 AM

తన కోసం నేను పడిన తపన.. బాధ.. గడిపిన నిద్రలేని రాత్రులు.. కళ్లలో ఇంకిపోయిన కన్నీళ్లు ఇవే నా ప్రేమకు సాక్ష్యాలు. నా బాధను వర్ణించడానికి అక్షరాలు చాలడం లేదు. ఆ బాధ వర్ణణాతీతం. ఐదు నిమిషాల్లో నాకు కనిపించాలి అని ఎదురుచూసే నవ్య.. ఇప్పుడు నన్ను కాదని వేరొకరిని ప్రేమిస్తుందా? దీన్ని నేను నమ్మాలా? నమ్మకూడదా? నా వేదన ఎంతో ఉంది. ఇప్పటికీ తన గురించే ఎదురు చూస్తున్నా. నా కోసం వస్తుందని కనీసం ఇది చదివైనా నా ప్రేమను గుర్తిస్తుందని తపన పడుతున్నా.

గతి తప్పిన నా గతాన్ని.. నా కన్నీళ్లనూ.. నా వేదననూ గుర్తు చేసుకుంటున్నందుకు చెలిమె నిండిన కళ్లతో.. వ్యథతో నిండిన గుండెతో ఏదో చెప్పాలనిపిస్తున్నది. మాది నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట. నా పేరు పార్ధు. నాకు బాగా గుర్తుంది. నవ్య ఆ రోజు పింక్ కలర్ చుడీదార్ వేసుకున్నది. పాదాలకు పట్టీలు హారాల్లా కనిపిస్తున్నాయి. అమాయకమైన కాటుక కళ్లతో మా ఇంటి దగ్గర్లో ఉన్న వరుసకు అమ్మమ్మ అయ్యేవాళ్ల ఇంటికి వచ్చింది. నేను కూడా ఆ రోజు అక్కడే ఉన్నాను. వాళ్ల అమ్మమ్మ.. తాతయ్యలు కూడా అక్కడే ఉన్నారు. తను డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నది. వాళ్ల ఇల్లు.. మా ఇల్లు దగ్గర్లోనే ఉంటాయి. తన కళ్లతో అమాయకత్వం.. కాస్తంత సిగ్గు.. పొడువాటి జడ మొత్తానికి ఆమెను చూస్తుంటే జూనియర్ సావిత్రిలా కనిపిస్తుంది. ఆమెను చూసిన తొలిసారికే నేను ఫిదా అయిపోయా. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని ఏదేదో అంటుండేవాడిని. ఒకసారి ఆగలేకపోయాను. నవ్యతో ఎలాగైనా మాట్లాడాలి అనుకున్నా. ఏం సాకు చెప్తే బాగుంటుందా అని ఆలోచించా. ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. హాయ్ నవ్యా.. నీ దగ్గర ఇంటర్ బుక్స్ ఉన్నాయి కదా! అన్నాను. హా.. అవును. ఉన్నాయి. అయినా నీకెందుకు అవి? అన్నదామె. నాక్కాదు. మా చెల్లెకు కావాలి. ఉన్నాయంటున్నావ్ కదా? ఇవ్వొచ్చుగా? అన్నాను. ఓహో.. మీ చెల్లికా? సర్లే ఇస్తాను అన్నది తను. మరుసటి రోజు ఉదయం కలిసింది. పార్దూ.. బుక్స్ కావాలన్నావ్ కదా? ఇవ్వాలా మరి? అన్నది నవ్య. ఇవ్వు నవ్యా అన్నాన్నేను. ఆమె ఇచ్చిన బుక్స్ తీసుకున్నాను. చెల్లికి ఇచ్చాను. అన్నయ్యా ఈ బుక్ నా దగ్గర ఇంతకుముందే ఉన్నది. ఇదొక్కటి తిరిగి నవ్యకు ఇచ్చేసెయ్ అన్నది చెల్లె. సర్లే.. ఇచ్చేస్తా. వేరేవాళ్లకెవరికైనా అవసరం వస్తుంది కదా అన్నాను. బుక్ తీసుకొని ఇద్దామని వెళ్తున్నాను. కొంతదూరం వెళ్లగానే నాకో ఆలోచన వచ్చింది. నవ్య నా మనసుకు నచ్చింది. ఆమెను ఎలాగైనా వదలొద్దు అనుకున్నాను. ఇదే సరైన సమయం అని భావించా. ఆ పుస్తకాన్ని లవ్ లెటర్‌గా మార్చాలనుకొని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదటి పేజీలోనే నా ఫోన్ నెంబర్ రాసిచ్చాను.
Love-Story

ఆ రోజంతా నా మనసులో నవ్య గురించే ఆలోచనలు. ఎప్పుడు తన నుంచి ఫోనొస్తుందా అని రోజంతా ఎదురుచూశాను. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూసేవాడిలా ఉంది నా పరిస్థితి. ఎవరితో చెప్పుకోగలను? ఇలా ఏవేవో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి.
ఇంతలో ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హలో ఎవరు? అన్నాను. సన్నని గొంతుతో హలో.. నేను నవ్యను అని చెప్పింది. ఆమె గొంతు వినగానే ఏదో తెలియని ఆనందం కలిగింది. కాస్త భయంగా కూడా అనిపించింది.
పార్దూ. నువ్వు కావాలనే నీ ఫోన్ నెంబర్ బుక్‌లో రాశావు కదా? అన్నది గుర్రుగా. ఆ ప్రశ్నకు నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇంకోటి.. నేను అమ్మాయిలతో మాట్లాడడం జీవితంలో తొలిసారి. చూడు నవ్యా.. ఆ విషయం గురించి ఊరికే అడిగా. నేనేమీ అనలేదు. టాపిక్ డైవర్ట్ అయ్యింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ రోజు నుంచి మేం రోజూ మాట్లాడుకునేవాళ్లం. గంటల తరబడి ఫోన్లలో సంభాషించుకునేవాళ్లం. నా ఫోన్ కాల్ కోసం నవ్య.. ఆమె కాల్ కోసం నేను. ఇలా రోజూ ఎదురుచూస్తుండేవాళ్లం. కొన్నాళ్లకు నా ప్రేమ విషయం దివ్యకు చెప్పాను. అప్పుడు ఒక ఆశ్చర్యకర విషయం నాతో పంచుకున్నది. అది విని నేను షాకయ్యాను. యాక్చువల్లీ నేనే నీకు ప్రపోజ్ చేద్దామనుకున్నా. ఆలోపే నువ్వు చెప్పేశావ్ అన్నది. అంతే.. నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏదో సాధించానన్న ఫీలింగ్ కలిగింది. ఆ రోజు ఆనందంతో నిద్ర కూడా పట్టలేదు. మరుసటి రోజు నుంచి ఇద్దరం కలిసి ఎక్కడంటే అక్కడకు వెళ్లేవాళ్లం. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. మన కులాలు.. నేపథ్యాలు వేరు కదా. మనమెల్లప్పుడూ కలిసే ఉంటామా? అని ఇద్దరమూ చర్చించుకునేవాళ్లం. అంతవరకూ ఏం ఆలోచించకు. నిశ్చింతగా ఉండు. మనం కచ్చితంగా కలిసే ఉంటాం అన్నాన్నేను. ఏమో ఒక్కోసారి నవ్య ఇవన్నీ తలుచుకొని ఏడ్చేసేది కూడా. అప్పుడు నాకు బాధగా అనిపించేది. మూడు నెలలు గడిచాయి. ఏం జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి నవ్య నుంచి ఫోన్‌కాల్స్ తగ్గాయి. తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. కలుసుకోవడాలు లేవు. మాట్లాడుకోవడాల్లేవు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నదేమో అనుకున్నాను. దార్లో అయినా కలుసుకుందామని కాలేజ్ రూట్లో వెళ్లేవాడిని. బస్టాపుల్లో ఆగేవాడిని. ఒకసారి నవ్య కలిసింది. కానీ నన్ను చూసీ చూడనట్టు వ్యవహరించింది. నాకు అర్థం కాలేదు. ఎందుకిలా చేస్తుంది అనిపించింది.

నేనే కలుగజేసుకొని ఆగు నవ్యా అన్నా.నా రిక్వెస్ట్‌కు నవ్య భిన్నంగా స్పందించింది. చూడు పార్దూ నువ్వు ఇప్పటి నుంచి నాతో మాట్లాడకు. కనీసం కలువడానికి కూడా ప్రయత్నించకు. మా డాడీకి తెలిస్తే బాగోదు. నేను జరిగినదంతా మర్చిపోయా. నువ్వు కూడా మర్చిపో అని గట్టిగా చెప్పింది. అసలు ఏం జరిగింది అని అడిగా.. దానికి తను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి కనీసం వెనక్కి తిరుగకుండా వెళ్లిపోయింది. ఒక్క నిమిషం నా గుండె ఆగినట్టయింది. సంతోషం తప్ప బాధ తెలియని నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కళ్లవెంట కన్నీళ్లు ధారలాగ కారుతూనే ఉన్నాయి. ఊపిరి ఆడట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సంఘటన కలనా? నిజమా! ఆ రోజు నవ్య అలా మాట్లాడినప్పటి నుంచి నిద్రాహారాలకు దూరమయ్యాను. కనీసం ఏం జరిగిందో తెలుసుకుందామని ఆమె స్నేహితురాలు శ్రీషను కలిశాను. దానికి శ్రీష నేను నవ్యను అడిగి కనుక్కుంటాను అని చెప్పి వెళ్లిపోయింది. మరుసటి రోజు శ్రీషను కలిశాను. ఆమె కూడా ఉన్నట్టుండి మాట దాటేస్తున్నది. దూరం పెడుతున్నది. ఏదో రిక్వెస్ట్ చేసుకుందామని ప్రయత్నించినా ఇరిటేట్‌గా ఫీల్ అవుతున్నది. ఎందుకో అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది? ఏం జరిగినా సరే అని ధైర్యం చేసి శ్రీషను అడిగా. నువ్వెందుకు నన్ను దూరం చేస్తున్నావు. అని గట్టిగానే అడిగా. అందుకు శ్రీష.. నవ్య ఎవరినో లవ్ చేస్తుందట. నిన్ను మర్చిపొమ్మన్నది. తను కూడా మర్చిపోయిందట. ఇంకెప్పుడు తనను కలువొద్దని, తనని అడగవద్దని చెప్పిందని నాతో చెప్పింది.అది విన్న నా మనసు కకావికలమైపోయింది. నన్ను తప్ప వేరే వాళ్లను తన జీవితంలో ఊహించుకోలేనని చెప్పిన నవ్య.. ఒక్కసారి కాల్ చెయ్యకపోతే ఇంటికి వచ్చి మరీ కాల్ చేయమని చెప్పిన నవ్య.. నేను నిన్ను చూడాలి.. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఐదు నిమిషాల్లో నాకు కనిపించాలి అని ఎదురుచూసే నవ్య.. ఇప్పుడు నన్ను కాదని వేరొకరిని ప్రేమిస్తుందా? దీన్ని నేను నమ్మాలా? నమ్మకూడదా? అనేది అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కొన్ని రోజులుగా ఏడుస్తూనే ఉన్నా. ఒకరోజు నవ్యతో మాట్లాడుదామని, విషయం ఏమిటో కనుక్కుందామని తను కాలేజ్‌కి వెళ్లే రూట్‌లో వేచిచూశా. నాలుగేండ్లు గడిచినా ఇప్పటికీ అర్థం కాలేదు. నా సందిగ్ధానికి సమాధానం లేదు. యేండ్లు గడుస్తున్నా తనపై నా ప్రేమ చావట్లేదు. తనపై నాకున్న ప్రేమను ఐ లవ్ యూ అనే పదాలలో ఇమడ్చడం కూడా తక్కువే అవుతుందేమో. డియర్ నవ్యా.. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావని నీ కోసం ఎదురు చూస్తున్నాను.
నువ్వు లేనిదే నేను బతుకలేను. నన్ను మిస్ చేసుకోకు ప్లీజ్.. నీ పార్దూ.

తొలిప్రేమకు ఆహ్వానం!

ప్రేమ శాశ్వతం. ప్రేమ యథార్థం. ఈ ప్రపంచమంతా ప్రేమమయమైతే ఎంతో బాగుండనిపిస్తుంటుంది. అలాంటి ప్రేమలో తొలిప్రేమది మధురఘట్టం. ఒక రకంగా నిజమైన ప్రేమకు జ్ఞాపిక తొలిప్రేమ. కాలేజీ లైఫ్‌లో ప్రేమాభిమానాలను చూరగొన్న.. మీ లైఫ్‌లోకి తొంగిచూసిన.. తెరువని పేజీయై మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన, తడియారని తొలిప్రేమ గురించి రాసుకోవాలనుందా? మరొక్కసారి ఆ జ్ఞాపికను చూసుకోవాలనుందా? అక్షర రూపంలో అద్భుత కావ్యంగా మలుచుకునే అవకాశం మీకు మేము కల్పిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం!

ప్రేమ కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10,
బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

1179
Tags

More News

VIRAL NEWS