నాన్నంటే భయమే ఎక్కువ!


Sun,July 8, 2018 02:01 AM

ఇలాంటి కథాంశాలతో సినిమాలు చేయాలనే ప్రణాళికలను తానెప్పుడూ రచించుకోనని అంటున్నారు కల్యాణ్‌రామ్. కాలానుగుణంగా ఏది తన మనసుకు నచ్చుతుందో ఆ కథతోనే సినిమాలు చేస్తానని చెబుతున్నారు. సినిమాల పరంగా తాతయ్య, బాబాయ్ తనకు స్ఫూర్తినిచ్చారని, అలాగని వారి అడుగుజాడల్లో నడవకుండా స్వీయ ప్రతిభతో ఎదగాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. జయాపజయాలకు అతీతంగా నటుడిగా, నిర్మాతగా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారాయన. తన బాల్యజీవితం, సినిమాలు, తారక్‌తో అనుబంధం గురించి కల్యాణ్‌రామ్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలివి...

నరేష్ నెల్కి,సెల్: 9182777280

నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడు చాలా దూకుడుగా ఉండేవాణ్ణి. అందరితో గొడవలు పడుతుండటంతో నా అల్లరి భరించలేక అమ్మానాన్నలు హాస్టల్‌లో చేర్పించారు. ఎనిమిదో తరగతి వరకు అందరితో బాగా గొడవలు పడేవాణ్ణి. ఆ తర్వాత క్రమక్రమంగా మారిపోయాను. బాల్యజీవితం ఇంట్లో కంటే హాస్టల్‌లోనే ఎక్కువగా గడిచింది. చదువులో ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్. మరీ ఎక్కువగా మార్కులు వచ్చేవి కావు. అలాగని తక్కువ మార్కులు వచ్చేవి కావు. స్కూల్‌డేస్‌లో ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. వాలీబాల్, క్రికెట్ బాగా ఆడేవాణ్ణి. బ్యాడ్మింటన్ కొంత టచ్ ఉంది. చిన్నతనంలో నాన్నతో అనుబంధం కంటే భయమే ఎక్కువగా ఉండేది. రాజకీయాలు ఇతర వ్యవహారాలతో ఆయన బిజీగా ఉండేవారు. అప్పుడప్పుడు మాత్రమే మాకు కనిపించేవారు. అల్లరి చేస్తే నాన్నకు కోపం వస్తుంది అని అమ్మ ఎప్పుడూ జాగ్రత్తలు చెబుతుండేది. దాంతో నాన్నను చూసి భయపడేవాళ్లం. పదో తరగతి తర్వాత ఆయనతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికింది. అప్పటి నుంచి ఆయన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. కావాలని నాన్న నుంచి భయపడి తప్పించుకున్న సందర్భాలు నా జీవితంలో లేవు.

బాలగోపాలుడు సినిమాలో బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటించాను. బాబాయ్‌తో పాటు ఆ షూటింగ్ వాతావరణం చూసి సినిమాల్లోకి వస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మా అన్నయ్య జానకీరామ్ నన్ను హీరోగా చూడాలని కోరుకున్నారు. ఎప్పుడూ నాతో ఆ మాట చెబుతుండేవారు. అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండాలనుకుంటుంటే సినిమాలంటున్నావేంటి? అని ఆయనతో అనేవాణ్ణి. కానీ అన్నయ్య మాత్రం హీరో కావాలని పట్టుబట్టారు. అదే సమయంలో నన్ను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనతో రామోజీరావు మా నాన్న గారిని సంప్రదించారు. అలా నా మొదటి చిత్రం తొలిచూపులో ప్రారంభమైంది. తొలిరోజు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి భయానికి లోనయ్యానో అదే ఫీలింగ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. ప్రతి సినిమాకు భయపడుతుంటాను. అది ఎందుకో తెలియదు.
Kalyanram

సినిమా నటుల్ని, ఇండస్ట్రీని దూరం నుంచి చూడడం వేరు, ఈ రంగంలోనే ఉండటం వేరు. సినిమాల్లో స్థిరపడడంతో వచ్చే గౌరవం, ఇమేజ్ వేరుగా ఉంటాయి. అతనొక్కడే సినిమాకు ముందు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో నిలదొక్కుకోవడానికి చాలా శ్రమించాను . ఆ సమయంలో కుటుంబమే నాకు అండంగా నిలిచింది. సినిమాల్లోకి రావడానికి వారే నాకు స్ఫూర్తినిచ్చారు. ఒక్క సినిమాతోనే నీ జీవితం ముగిసిపోయినట్లుకాదు విజయం సాధించేదాకా ప్రయత్నించమని వారే నాకు మానసిక ధైర్యాన్నిచ్చారు. ఇతరులు చెప్పించి చేయడం కాకుండా నీ మనసు ఏది చెబుతుందో అదే చేయమని చెప్పారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం నాకు వందశాతం దొరికింది. సినిమాల్ని, నటనను వదిలివేయాలనే ఆలోచన ఎప్పుడూ నా మనసులోకి రాలేదు. సినిమానే నా వృత్తి. ఇది తప్ప నాకు మరొకటి తెలియదు. నా మనస్తత్వానికి ఈ రంగమే కరెక్ట్ అనిపించింది. ఎక్కడైతే పొగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలనే కసి నాలో మొదలైంది. హీరోగా నన్ను ఎందుకు అంగీకరించరనే నమ్మకంతో నాలోని తప్పుల్ని సరిదిద్దుకున్నాను. నటుడిగా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతోనే తొలి సినిమా నుంచి విభిన్నమైన కథాంశాలే ఎంచుకుంటూ వస్తున్నాను. ఇక నిర్మాతగా మారటానికి అతనొక్కడే సినిమా కారణమైంది. కథ బాగున్నా ఆ సినిమా నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేను నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నాను. అలా ఆ సినిమాతో నిర్మాతగా మారిపోయాను. ప్రతి హీరోకు ఓ మార్కెట్ ఉంటుంది. దానిని అనుసరించి సినిమాలు చేస్తే రిస్క్ అనేది ఉండదు. బడ్జెట్ దాటినప్పుడే భయాలు ఎక్కువగా ఉంటాయి. నా మార్కెట్ ఏమిటో తెలుసు కాబట్టి ఎప్పుడూ ఆ పరిమితుల్లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఎలాంటి కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయో ముందుగా ఎవరూ ఊహించలేరు.

సాధారణంగా అన్నయ్య ముందు ఫలానాగా ఉండకూడదు, వినయంగా ఉండాలనే కొన్ని చిన్న చిన్న పరిమితులు ఉంటాయి. కానీ, నాకు తారక్‌కు మధ్య అలాంటి ఆటిట్యూడ్ ఎప్పుడూ కనిపించదు. కష్టసుఖాలు మాట్లాడుకుంటాం. ఆ ఓపెన్‌నెస్ లేకపోతే బంధాలు నిలబడవు. ఒకసారి దాచడం మొదలుపెడితే అన్ని విషయాల్లో అలాగే ఉండాల్సివస్తుంది. దాంతో కోపాలు, అపార్థాలు మొదలవుతాయి. అలాంటి వాటికి మా మధ్య చోటు ఉండదు. ఒకరినొకరం అర్థం చేసుకునే పరిణతి మా ఇద్దరికి ఉంది కాబట్టే చాలా ఓపెన్‌గా ఉంటాం. తొలి సినిమా నుంచి నాన్నగారు నా కెరీర్‌లో ఎప్పుడూ జోక్యం కలుగచేసుకోలేదు. మీకు నచ్చింది చేయండి అని ఆయన ఎప్పుడూ చెబుతారు. అలా పనిచేసినప్పుడే ఇతరుల్ని తప్పు పట్టడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇతరుల సలహాలు సూచనలతో సినిమాలు చేస్తే వారి మూలంగానే వీరి తప్పు జరిగిందనే అపార్థాలకు తావు ఉండదు. సొంత నిర్ణయానికి కట్టుబడితే కష్టం, నష్టం ఏదైనా మనమే భరించవచ్చు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు.

నేను హీరోగా అడుగుపెట్టిన సమయంతో పోలిస్తే ప్రస్తుతం చిత్రసీమ ధోరణిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో మేకోవర్స్, ముంబై నుంచి హెయిర్ ైస్టెలిస్ట్‌లు, ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరూ ఉండేవారు కాదు. కాస్ట్యూమ్ డిజైనర్ డ్రెస్ సెలెక్ట్ చేస్తే అదే వేసుకొనేవాళ్లం. కాలక్రమేణా చాలా మార్పులు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మాధ్యమాల కారణంగా ప్రపంచ సినిమా ప్రేక్షకుల గుప్పిట్లోకి వచ్చింది. వాటికి అనుగుణంగా తెలుగు సినిమా గమనం మారింది. లుక్, కెమెరావర్క్ ఇలా చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పెరిగిపోయాయి. తాతగారు, బాబాయ్ సినిమాలు బాగా చూస్తాను. అయితే, వారిని చూసి ఏదో ఒకటి చేసేద్దాం అని కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలి. స్వీయప్రతిభతో నిలబడటానికే ప్రయత్నిస్తాను.

నటుడిగా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతోనే తొలి సినిమా నుంచి విభిన్నమైన కథాంశాలే ఎంచుకుంటూ వస్తున్నాను. ఇక నిర్మాతగా మారటానికి అతనొక్కడే సినిమా కారణమైంది. కథ బాగున్నా ఆ సినిమా నిర్మించడానికి
ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేను నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నాను.

577
Tags

More News

VIRAL NEWS

Featured Articles