నాడు సైనికుడు.. నేడు స్వరమాంత్రికుడు భువనచంద్ర


Sun,April 16, 2017 02:15 AM

ఆయన పాటలు కుర్రకారును హుషారెక్కిస్తాయి. మాటలు మాధుర్యాన్ని పంచుతాయి. ఆయన రాసిన
ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఆ పాటలు చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో అలసిన మనసును సేద తీర్చుతాయి. ఒక్కోసారి వానొచ్చెనంటే వరదొచ్చినట్లు పరుగులూ పెట్టిస్తాయి. ఆయన సాహిత్యం పచ్చని చిలుకలు తోడొస్తే గువ్వా గోరింకతో బొమ్మలాటలాడినట్లుంటుంది. ప్రతి పాట తేలికైన పదాలతో స్నేహానికన్న మిన్న లోకాన లేదన్నట్లు జీవితాన్ని ఓ ప్రయాణంలా సాగిస్తుంది. అంతటి భావసౌందర్య గీతాలకు ప్రాణం పోశారు భువనచంద్ర.తెలుగు సినిమా అభిమానులను తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న భువనచంద్ర అసలు పేరు ఊరకరణం గుర్రాజు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నూజివీడు దగ్గరలోని గుళ్లపూడిలో ఆగస్టు 17న జన్మించారు. అయితే ఆ తర్వాత వారి కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి వచ్చి స్థిరపడింది. చిన్నతనంలోనే కలం పట్టిన ఆయన సినీ మాటల రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా, గేయరచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారాయన.

bhuvanachandraభువనచంద్ర బాల్య జీవితంలో అనేక కోణాలు కనపడుతాయి. చిన్నతనంలోనే చందమామ వంటి కథల పుస్తకాలు మొదలు అనేక పుస్తకాలను కూడా చదివేవాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో గోడలపై కనిపించే సినిమా పోస్టర్లను చూసి అందులో ఉన్న గేయ రచయితలు ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ, శ్రీ.శ్రీ. ల పక్కన తన పేరు రాసుకుని మురిసిపోయేవాడు. ఇల్లు, స్థానికంగా ఉండే ఆశ్రమం, గ్రంథాలయంలోనే ఎక్కువగా గడుపుతూ తాత్వికజీవితాన్ని అనుభవించారు. చదువు పూర్తయిన తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సమయంలోనే చిన్నచిన్న వ్యాసాలు, కథలు రాసి వివిధ పత్రికలకు పంపేవాడు. 18 సంవత్సరాల సర్వీసులో దాదాపు నాలుగువేల పాటలు రాశాడు. సర్వీస్ పూర్తికాగానే ఓఎన్‌జీసీలో కొంతకాలం పనిచేసి సినీ రచయితగా ఎదగాలన్న ఆకాంక్షతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తిస్ధాయి రచయితగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. నాకూ పెళ్లాం కావాలి ఆయన తొలిచిత్రం. ఆ తరువాత వచ్చిన ఖైదీ నెం 786 లో ఆయన రాసిన-గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట/నిండూ నా గుండెలో మ్రోగిందిలే వీణపాట ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

ఆ తరువాత వచ్చిన సుమంగళి చిత్రం కోసం ఆయన రాసిన-
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ

దారిలో మమతలే పూవులై ప్రేమ మాధుర్యాలను కురిపిస్తాయి.. అంటూ ప్రణయగీతాన్ని సృష్టించారు. ఇంతలోనే మేఘాలు కమ్ముకుని జోరు వానందుకున్నట్లు -
వానవాన వెల్లువాయే- కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి.. అని గ్యాంగ్‌లీడర్‌లో తన చెలి చూపులే చిలిపి జల్లులై తడిపితే ఆ ఆనందాన్ని-
చల్లాచల్లని గాలుల్లో సాయం సమయంలో- సరసాలాడే మల్లెల జల్లుల్లో
ఒళ్లంతా తడిసీ ముద్దయిపోతుంటే- ఊ అనమందీ ఉల్లాసం అంటూ పాటందుకున్నాడు భువనచంద్ర కొబ్బరిబోండాం చిత్రంలో.
1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో భువనచంద్ర పనిచేశారు. సరిహద్దు గ్రామాల్లోంచి వెళుతున్నపుడు ప్రజలు ఇచ్చే రొట్టెలు, యుద్ధం చేసి తిరిగి వస్తుంటే దారి పొడవునా సెల్యూట్‌లు, పంజాబీ, గుజరాతీ మహిళలు కట్టిన రాఖీలు అపురూప జ్ఞాపకాలంటారు భువనచంద్ర.
1992లో వచ్చిన పెద్దరికం సినిమాలో ప్రియతమా.. ప్రియతమా, నీ నవ్వేచాలు పూబంతీ చామంతీ, చినరాయుడు చిత్రంలో బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట, స్వాతి ముత్యమాల ఒళ్లు తాకి తుళ్లిపోయింది, సీతారత్నంగారి అబ్బాయిలో మేఘమా మరువకే, సూరిగాడులో ఒకే ఒక ఆశ అదే నా శ్వాస పాటలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆమె సినిమాలో
ఊహల పల్లకిలో -ఊరేగుతున్నదీ వధువు
చిరుచిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు అని కొత్తగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచనలను అద్భుతంగా పండించారాయన.
రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో కుకుకూ కుకు కూ కుకుకూ ఎవరో నీవని అనకు కళ్లతోనే గుండె తట్టి చూడు-ప్రేమనాడి కాస్త పట్టి చూడు అంటూ ప్రేమలోని మాధుర్యాన్ని సులభరీతిలో వర్ణించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండిమబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం అని తొలిముద్దుకోసం రాసిన పాట మరో ప్రేమగీతం. ప్రేమలో పడితే ఎవరూ కనిపించరని, మాటలు వినిపించవంటారు తొలిప్రేమ చిత్రంలో..
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్లు తోమలా.. పౌడరు పుయ్యలా

అరె ఇంతలోనే ఎంత డేంజరై పోయేరా అంటూ తలపోస్తాడు. భువనచంద్ర పాటలన్నీ కూడా తేలికైన పదాలతో సామాన్యులకు అర్థమయ్యేరీతిలో ఉంటాయి. ఎలాంటి డబుల్ మీనింగ్ పదాలు, ద్వంద్వార్థాలు అయన పాటల్లో కనిపించవు. అచ్చతెలుగు సాహిత్యం ఆకట్టుకునే పదబంధాలు ఆయన పాటకు ప్రాణవాయువులు.
భువన చంద్ర పాటలు వింటుంటే మనకు తెలియకుండానే హమ్ చేస్తాం. అందుకేనేమో మిస్సమ్మలో-
నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్‌హాయ్ నాలో ఉంది జాయ్

మజాగ మస్త్ మారో యారో అంటూ తన పాటలోని గొప్పతనాన్ని చెప్పకనే చెబుతారు.
కిలిమాంజారో భళ భళి మాంజారో
కథకళి మాంజారో యారో యారో అని రోబోలో కొత్త ప్రయోగం చేసిన భువనచంద్ర మంజునాథలో ఓహో గరళ కంఠ..నీ మాటంటే ఒళ్లుమంట అంటూ శివుడంటే ఇష్టం లేని భక్తుడు దైవదూషణకు పాల్పడే సందర్భాన్ని సామాన్యీకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
సందర్భానుసారంగా తన కలంతో అద్భుతాలు ఆవిష్కరించగల సిద్ధహస్తులు భువనచంద్ర. సందర్భమేదైనా దానికి తగ్గ పదబంధాలను పేర్చి పాటలల్లగల నేర్పరి. మనసును హత్తుకునే పాటలెన్నింటికో ప్రాణప్రతిష్ట చేసిన భువనచంద్ర మరెన్నో పసందైన పాటలు రాయాలని ఆశిద్దాం.

bhuvanachandra1భువనచంద్ర తెలుగు సినిమా గేయ రచయితగానే అందరికీ తెలుసు. కానీ ఆయనలో ఒక గొప్ప దేశభక్తుడు ఉన్నాడు. ఆయన ముందు ఒక సైనికుడు అంటే ఎవరూ నమ్మరు. ఒక సైనికుడు పాటగాడుగా మారిన తీరు చాలామందికి ఆశ్చర్యమే. 30 సంవత్సరాలకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాటల రచయితగానే సుపరితుడైన భువనచంద్ర తన 17వ యేటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. అది మొదలు 18 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేశారు. తనకు ఎంత పేరొచ్చినా తను మాత్రం గర్వంగా భావించేది సైనికుడిగానే అంటారాయన. మళ్లీ జన్మంటూ ఉంటే తిరిగి సైనికుడిగానే పుట్టాలని కోరుకుంటానని కూడా అంటారు. అందుకే కర్నాటకలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ తనకు ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్‌ను భారత సైనికులకు అంకితమిచ్చారు.కేవలం పాటలే కాకుండా భువనచంద్ర అనేక కథలు, నవలలు కూడా రాశారు. ఆవి భువనచంద్ర కథలు పేరుతో పుస్తకంగా వచ్చాయి. అలాగే వాళ్లు అని ఒక ధారావాహిక కూడా రాశారు. చింతలపూడి ఆశ్రమానికి సంబంధించిన పుస్తకాలు కూడా అనేకం రాశారు.

తెలుగు సినిమాలకే కాకుండా తెలుగు డబ్బింగ్ సినిమాలకు కూడా ఆయన పాటలందించారు. వాటినీ సాధారణ తెలుగులో ఆద్భుతంగా రాయడం ఆయనకే చెల్లింది. ముత్తు సినిమాలో
ఒకడే ఒక్కడు మొనగాడు-ఊరే మెచ్చిన పనివాడు/విధికి తలొంచడు ఏనాడు-తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భారతీయుడు సినిమాలో
పచ్చని చిలుకలు తోడుంటే- పాడే కోయిల వెంటుంటే / భూలోకమే ఆనందానికి ఇల్లు- ఈ లోకంలో కన్నీరింక చెల్లు
ప్రేమలేఖ చిత్రంలో
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

వంటి పాటలన్నీ ఈ కోవకే చెందుతాయి.
Muthhu

కేవలం ప్రేమగీతాలే కాదు స్నేహానికి ప్రాణమిస్తానంటాడు భువనచంద్ర అందుకే పెళ్లిపందిరి చిత్రంలో
దోస్త్ మేరా ధోస్త్ తూహై మేరీజాన్
వాస్తవంరా ధోస్త్ నువ్వే నా ప్రాణం

మధుర స్వరాలంటి మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం అని స్నేహంలోని గొప్పతనాన్ని వివరిస్తాడు.

2673
Tags

More News

VIRAL NEWS