నవ యవ్వన భారత్!


Sun,January 7, 2018 04:34 AM

ప్రపంచం భారత్ వైపు చూస్తున్నది. ఎందుకంటే, భారత్‌కు కళ్లు.. కాళ్లూ అయి నడిపిస్తున్న యువజనం ఉంది కాబట్టి. భారతదేశ భవిష్యత్‌ను ఉన్నతంగా లిఖించి ప్రపంచానికి అందించే సత్తా ఆ యువతలో ఉంది కాబట్టి. భావి తరానికి వెలుగు కణాల్ని విరజిమ్మే దివ్వెలుగా.. క్రమశిక్షణతో పనిచేసే సైన్యంగా భాసిల్లుతున్నది కాబట్టి. ఘట్టమేదైనా.. రంగమేదైనా.. రాణించడానికి మేము రెడీ అనే ధీమాతో.. భరోసాతో ప్రచండ శక్తియై ముందుకు సాగుతున్నది కాబట్టి. నేలమీద సిరులు పండించే రైతన్నగా.. నింగికి నిచ్చెనలేసే శాస్త్రవేత్తగా.. పాలనలో ప్రజామోదయోగ్యమైన నేతలుగా.. జాతి ఆకాంక్షలు నెరవేరుస్తూ.. దేశానికి దిశా నిర్దేశనం చేసే ఆలోచనలూ అందిస్తున్నది కాబట్టి. సామాజిక.. రాజకీయ.. ఆర్థిక.. సాంకేతిక రంగాల్లో అంతకంతకూ అభివృద్ధిని విస్తరింపజేస్తున్నది కాబట్టి. ఈ నెల 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆ నవ యవ్వన భారతం గురించి, యువతరం గురించి ఈ వారం ముఖచిత్ర కథనం.ఆకాశమే హద్దుగా నిగ్గుదేలుతున్నది భారత యువసైన్యం. అవకాశాల భారతావనికి ఇక ఆకాశమే హద్దు అంటూ డెలాయిట్ అనే సంస్థ చేసిన అధ్యయనం కళ్లకు కట్టింది. 130 కోట్లు దాటిన భారత జనాభాలో 65 % మంది 35 సంవత్సరాల లోపువారేనన్న వాస్తవం భవిత మనదేనన్న ధీమాను కలిగిస్తున్నది. యువ జనాభా తగ్గిపోయి వయసు పైబడిన వారి జనాభాతో ఆసియా దేశాలు చింతిస్తున్న తరుణంలో రానున్న దశాబ్దం పాటు ఈ ఖండానికి భారత శక్తి.. యుక్తులే దిక్కంటూ ఈ సర్వే తేటతెల్లం చేసింది. ప్రగతిలో మనం ఎంత మాత్రం వెనుకబడి ఉండటానికి వీల్లేదన్న వాస్తవాన్ని ఇది నిగ్గు తేల్చింది. ముఖ్యంగా వృద్ధ జనాభా పెరిగిపోతున్న ఆసియా దేశాల అవసరాలను అన్ని రంగాల్లో సగానికి పైగా తీర్చగలిగే శక్తి భారత్‌కే ఉందని ఈ నివేదిక తెలిపింది. జనాభాలో వస్తున్న మార్పులు.. ఆసియాలో అధికార సమతూకాన్ని మారుస్తున్నాయని.. ఆ రకంగా చూస్తే యువజన బంగారు గనిని సొంతం చేసుకున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని డెలాయిట్ స్పష్టం చేసింది.
Youth

ఉజ్వల ప్రగతికి దారి:

అత్యధిక జనాభా కలిగిన చైనాలో సగటు వయసు 35 సంవత్సరాలు. జపాన్‌లో 47 సంవత్సరాలు. అయితే భారత ప్రజల సగటు వయసు 27.3 సంవత్సరాలు. దీన్ని బట్టే చెప్పొచ్చు.. దేశ ఉజ్వల ప్రగతికి దారులు తీస్తున్నది నవతరమే. విద్యా పరంగానూ.. నైపుణ్యంలోనూ ఎవరికీ తీసిపోని రీతిలో సత్తా చాటే అవకాశం పుష్కలంగా ఉంది. మహిళల ప్రాముఖ్యం.. ప్రాతినిధ్యం కూడా పెరిగే అవకాశం ఉన్నందువల్ల యువ జనాభాతో ఆర్థిక పరమైన ప్రయోజనాలు అపారంగా సిద్ధించే అవకాశం ఉంది.

అద్భుతమైన మానవ వనరులు:

యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే.. లోకమే మారిపోదా.. చీకటే తొలగిపోదా అన్నట్టుగా భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తున్నది మాత్రం ముమ్మాటికీ యువతరమే. దీన్నిబట్టే చెప్పొచ్చు ఈ దేశం యువత చేతుల్లో ఉంది అని. అగ్రరాజ్యమైన అమెరికా మొత్తం జనాభా.. ఇండియా యువ జనాభాతో సమానమంటే మరి అందరి దృష్టీ యువతపైన ఉండక వేరే దానిపైన ఎందుకు ఉంటుంది? దేశ జనాభాలో అరవై శాతం యువతే అంటే మనకు అద్భుతమైన మానవ వనరులున్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఆ మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకుంటే.. జాగ్రత్తగా కాపాడుకుంటే వారిని దేశ ప్రగతిలో భాగస్వాములను చేస్తే.. ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఇంకా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చంటున్నారు విశ్లేషకులు.

యువ నాయకత్వం:

పారిశ్రామి.. ఆర్థిక రంగాల్లోనే కాదు.. పాలనారంగంలో కూడా యువతరం ఆసక్తి కనబరుస్తున్నది. అధినాయకత్వం నుంచి కింది స్థాయి టీమ్ లీడర్ వరకు యువత మంచి నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తున్నది. నాయకుడు యువకుడు అయినప్పుడు.. యువత ఆలోచనలేంటి? వారి గోల్స్ ఎలా ఉంటాయి? వారి అవసరాలేంటి? వంటి విషయాలు వెంటనే పసిగట్టగలుగుతాడు. ఇప్పుడు ఇండియా అదే దారిలో వెళుతున్నది. ఈ సమూహంలో నుంచి వెళ్లినవాళ్లు ఎంతోమంది యంగ్ పొలిటీషియన్స్‌గా రాణిస్తున్నారు. యువతకు ఉండే అవసరాలను తెలుసుకుని పాలనలో కొత్తదనాన్ని చూపిస్తున్నారు. అలాంటివాళ్లలో తెలంగాణ కూడా ఒకటి కావడం విశేషం. పెరుగుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుని దానిని పాలనాపరమైన చర్యల్లోనూ భాగస్వామ్యం చేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్న సంఘటనల్ని నిత్యం చూస్తున్నాం.
Youth2

జయహో యువ జనతా:

స్టార్టప్స్.. పాలిటిక్సే కాదు.. విద్య.. ఉద్యోగ.. ఉపాధి.. ఉత్పత్తి రంగాల్లోనూ.. త్రివిధ దళాల్లోనూ.. భారత సైన్యంలోనూ యువతరం సత్తా చాటుతున్నది. క్రీడల్లో అయితే దేశానికే ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా అద్భుతమైన ప్రదర్శనలిస్తూ క్రీడా భారత్‌గా దేశాన్ని నిలబెడుతున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఇన్ని మానవ వనరులు ఉన్నా.. ప్రతీ దేశానికి ఉన్నట్టే మనకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే బాధ్యత.. అవసరం యువతదే కాబట్టి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. ఇంకొందరికి అవకాశం కల్పించేలా యువతరం ఆలోచనలు చేయాలి. వాటిలో ముందుగా అవినీతిని అంతమొందించాలి. పేదరికాన్ని నిర్మూలించాలి. తీవ్రవాదం.. ఉగ్రవాదాలను తుదముట్టించాలి. చివరగా మానవ విలువలను పరిరక్షిస్తే 2020 నాటికి ఇండియా నవ యవ్వన దేశమే కాదు.. అభివృద్ధి సూచికలోనూ అందరికంటే ముందుంటుందని నిపుణులు చెప్తున్నారు.

రంగమేదైనా.. యువతరంగమే:

భారతదేశంలో సృజనాత్మకతకు కొదువలేదు. క్రియేటివిటీని ఎలా అప్లయ్ చేయాలో తెలిసిన వాళ్లలో భారత యువత ముందుంటుందట. అందుకే ఇప్పుడు అద్భుత ఆవిష్కరణలకు మన దేశం వేదికైంది. కొత్త కొత్త స్టార్టప్‌లు ఏర్పాటు చేసి సాంకేతిక రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన ఘనత ఇండియాదేనని అమెరికా ప్రతినిధులు పలుమార్లు వెల్లడించారు. ఇటీవల ఇవాంకా ట్రంప్ కూడా భారతదేశ యువతరాన్ని ప్రశంసించారు. యువత ఎన్నో ఆలోచనలను.. కలలను సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టుకున్న కార్యక్రమమే స్టార్టప్ ఇండియా. తెలంగాణ సర్కారు.. యంగ్ మినిష్టర్ కేటీఆర్ నేతృత్వంలో టీహబ్ ప్రారంభించింది. స్టార్టప్ అంటే డబ్బున్న శ్రీమంతులు చేసే పని కాదు. పిడికెడు మందికి ఉపాధి కలిపించేది కూడా స్టార్టపే. మేకిన్ అంటే భారత్‌లో తయారీ మాత్రమే కాదు.. భారత్ కోసం ఉత్పత్తి చేసే మేక్ ఫర్ ఇండియా అనే దిశగా యువతను నడిపిస్తున్నారు.
Youth1

అగ్రగామిగా నిలపాలి:

ఏ దేశంలో లేనంత యువ శక్తి భారతదేశానికి ఉన్నది. ఇంత అద్భుతమైన మానవ వనరులున్న మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఆలోచించి వ్యవస్థాగతంగా దాన్ని వినియోగిస్తే రాబోయే రోజుల్లో ఇండియా అందరికంటే ముందు ఉంటుంది. యువత తమ ప్రతిభకు పదును పెట్టి అన్ని అంశాలను సమాజ దృష్టితో ఆలోచించాలి. ఆధునికతలో.. అభివృద్ధిలో దేశం ముందుకెళ్లడానికి ఒక ఉద్యమంలా పనిచేయాలి. మన ముందు ఉన్న సవాళ్లను అధిగమిస్తూ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి.
డాక్టర్ నాగేందర్

పిప్పర్మెంట్లు అమ్మేవాడు:

రాకేశ్ ఉడియర్. అతి సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. ఐదేళ్ల వయసున్నప్పుడే తండ్రి ఆనారోగ్యం పాలవడంతో కుటుంబ భారం రాకేశ్‌పై పడింది. వాళ్లమ్మ ఇళ్లలో పాచి పని చేసి కుటుంబాన్ని నడిపేది. అమ్మకు భారం తగ్గించేందుకు రాకేశ్ రైళ్లలో పిప్పర్‌మెంట్లు.. కూల్‌డ్రింక్స్ అమ్ముతూ రోజూ పది రూపాయలు సంపాదించేవాడు. చదువుపై ఉన్న ప్రేమను చంపుకోలేక.. టీచర్లను బతిమిలాడి మధ్యాహ్నం పూట స్కూల్‌కి వెళ్లేవాడు. అలా ఓ జిమ్‌లో స్వీపర్‌గా చేరాడు. జిమ్‌లో ట్రైనర్ లేనప్పుడు ఇతనే సలహాలిస్తుండేవాడు. రాకేశ్ ఆసక్తిని గమనించిన ఒకతను ఓ బాబూ.. నేను జిమ్ పెడతా. దాంట్లో ట్రైనర్‌గా చేస్తవా అనడిగాడట. రాకేశ్ ఓకే అన్నాడు. అప్పటిదాకా అతనికి చదువు లేదు. ప్రొఫెషన్ ట్రైనర్ అవ్వాలని ఆన్‌లైన్ కోర్స్ చేశాడు. అమెరికా.. దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. విదేశాళ్లో ఐదేళ్లు ట్రైనర్‌గా పనిచేసి ఇండియా వచ్చాడు. ముంబైలోని గోల్డ్స్ జిమ్‌లో ట్రైనర్‌గా మారి సల్మాన్‌ఖాన్.. ఆమిర్‌ఖాన్.. దియామీర్జా వంటి సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారాడు. ఇప్పుడు రాకేశ్ అంటే బాలీవుడ్‌లో ఫేవరెట్ ఫిట్‌నెస్ ట్రైనర్.
Youth3

గ్యారేజ్ నుంచి ఫార్ములా రేస్:

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన చిత్తేశ్ మందోడి ఒక ఆటొమొబైల్ గ్యారేజీలో పనిచేసేవాడు. పనిలో భాగంగా డ్రైవింగ్‌పై మక్కువ ఏర్పడింది. సొంతంగా గ్యారేజీ నడపలేని స్థితి అయినప్పటికీ అతను మాత్రం రేసర్ కావాలని కలలుగన్నాడు. అలా ఒకసారి శివాజీ మొహిత్ అనే వ్యక్తి ప్రోత్సాహంతో అవకాశం రేసింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. రొటాక్స్ జూనియర్ టైటిల్ సాధించాడు. ఎప్పటికైనా ఫార్ములా వన్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.
Youth4

ఒంటికాలితో ఎవరెస్ట్ ఎక్కింది:

నీటిని చూసి భయపడితే ఈత ఎప్పటికీ రాదు. ఒకటికి రెండుసార్లు నీళ్లలో దూకితేనే ఈత అంతేంటో చూస్తాం. అలానే.. విజయం సాధించాలంటే ఏ రంగంలోనైనా రిస్క్ ఉంటుంది. వైఫల్యాలూ ఉంటాయి. వైఫల్యాలను చూసి యువత భయపడొద్దు. నెగెటివి మైండ్‌సెట్ మార్చుకోవాలి. నిరాశ.. నిస్పృహలు ఇసుమంత కూడా మనసులో ఉండొద్దు. ఆశావహంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో అరుణిమనే ఆదర్శంగా తీసుకోవచ్చు. దోపిడీ దొంగలను ప్రతిఘటించి రైలు నుంచి కిందకు తోసివేయబడ్డ అరుణిమ ఒక కాలు కోల్పోయింది. అయినా ఆత్మ విశ్వాసంతో బతికే ఉంది. తనకు తాను ఓదార్చుకుని.. సాధారణ వ్యక్తి కన్నా మిన్నగా ఎదిగి ఒంటికాలితో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అద్భుతాలు చేయగల యువత మన దగ్గర ఉన్నారు కాబట్టి మిగతావాళ్లు అరుణిమ లాంటివాళ్లను చూసి స్ఫూర్తి పొందాలి.
Youth5

గుమస్తా నుంచి అధిపతి:

చోటూ శర్మ ఒకప్పుడు గుమస్తా. ఇవాళ పది కోట్ల టర్నోవర్ చేసే సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధిపతి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన చోటూ శర్మ పగలు గుమాస్తాగా పనిచేస్తూ రాత్రిపూట చదువుకునేవాడు. కిందామీదా పడి రాత్రిళ్లు కంప్యూటర్ కోర్స్ చేసి మైక్రోసాఫ్ట్ డెవలపర్‌గా సర్టిఫికేట్ సంపాదించాడు. దాని ద్వారా ఆప్టెక్ కంప్యూటర్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా చేరాడు. డబ్బులు సరిపోకపోవడంతో రెండు గదులు కిరాయికి తీసుకుని కంప్యూటర్ సెంటర్ ఏర్పాటుచేశాడు. బోధనా విధానాలు నచ్చడంతో ఆర్నెళ్లలోనే వందకు పైగా స్టూడెంట్స్ చేరారు. చోటూ శర్మ దగ్గర కోచింగ్ తీసుకున్నవాళ్లకు పెద్ద కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్ రావడంతో మార్కెట్లో ఆయనకు డిమాండ్ పెరిగిపోయింది. అలా 2007లో సీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థను స్థాపించాడు. వెయ్యి మంది స్టూడెంట్స్‌కి సేవలందిస్తున్న ఈ సంస్థలో 150కి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక ఆదాయం పదికోట్లకు పెరిగిపోవడం.. తన దగ్గర నేర్చుకున్నవాళ్లు సమాజానికి సేవలందిస్తుండటంతో చోటూ శర్మ సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా నిలబడ్డాడు.
Youth6

నాడు మార్కెటింగ్.. నేడు ఎండీ:

హైదరాబాద్ బస్తీల్లో గల్లీ గల్లీ తిరుగుతూ మినరల్ వాటర్ బాటిల్స్ సప్లయ్ చేసిన సంజయ్ ఎనిశెట్టి ఇప్పుడు 50కే వెంచర్స్ అనే సంస్థకు సీఈఓ. సంజయ్ ఓయూ స్టూడెంట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువులో అంతంత మాత్రమే కాబట్టి ఏదైనా స్వయం ఉపాధి అయితే బావుంటుందని హైదరాబాద్ బస్తీల్లో మినరల్ వాటర్ బాటిల్స్ సప్లయ్ చేసేవాడు. మార్కెటింగ్‌లో ఆయన క్వాలిటీస్ నచ్చిన ఒకతను అడ్వర్‌టైజింగ్ కంపెనీలో ఉద్యోగానికి రిఫర్ చేశాడు. ఉద్యోగమైతే చేస్తున్నాడు గానీ సాధించాల్సింది వేరే ఉందనే విధంగా ఆయన ఆలోచన ఉన్నది. అందుకే సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్నాడు. మహేశ్ అనే ఫ్రెండ్ సహకారంతో స్ట్రాబెరీ పీపుల్ అనే హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాడు. వెంచర్ క్యాపిటలిస్ట్ గురించీ తెలుసుకున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్.. ఫైనాన్స్ గురించి అవగాహన ఏర్పరచుకున్నాడు. ఆఫ్రికా వెళ్లి ఏంజెల్ నెట్‌వర్క్ ప్రారంభించాడు. ఇండియా తిరిగొచ్చి 50కే వెంచర్స్ ఏర్పాటుచేశాడు. ఇప్పుడు 50కే నెట్‌వర్క్‌లో 18 కంపెనీలు.. 2 ఎగ్జిట్ సంస్థలు.. 100కు పైగా ఇన్వెస్టర్లు.. మెంటార్లు ఉన్నారు. దానికి సంజయ్ ఎండీ కమ్ సీఈఓ.
Youth7

బాధ్యత అందరిది:

స్వామి వివేకానందుణ్ణి స్ఫూర్తిగా.. ఆదర్శంగా తీసుకుని మనం జరుపుకొంటున్న యువజన దినోత్సవం కాబట్టి ఆయన ఆశయాలను గౌరవించాల్సిన అవసరమూ ఉన్నది. ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ పెడదారి వర్గమూ యువతలో లేకపోలేదు. కాబట్టి అలాంటివాళ్లెవరైనా పెడదారిని వీడాలి. యువకులను చైతన్యపరచాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉన్నది కాబట్టి యువత నడవడికపై దృష్టిసారించాలి. విజయం పొందిన వారి నుంచి మంచిని నేర్చుకుని యువతరం శక్తి చాటాలి. నవ భారత్‌ను నిర్మించాలి.
ప్రొఫెసర్ ఎంఎస్ రావు

వీరిని చూసి స్ఫూర్తి పొందండి:

కొలంబస్ బయల్దేరేటప్పుడు ఒక్కడే. కానీ నేడు అతను ప్రపంచానికే దారి ఇచ్చాడు. కొలంబస్ లాగానే కొత్తగా ఆలోచించేవాళ్లను ప్రజలు పిచ్చివాళ్లంటారు. కానీ అలాంటివాళ్లే చరిత్ర తిరగరాస్తారు. యువత కూడా అన్ని రంగాల్లో కొత్తగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎంత ఎక్కువ సంఖ్యలో యువజనం ఉన్నప్పటికీ సరైన రీతిలో అప్లయ్ చేసుకుంటేనే కదా మెరుగైన ఫలితాలు రాబట్టేది. కాబట్టి వ్యక్తిగా.. సంస్థాగతంగా.. రాణించాలంటే డబ్బుపై దృష్టిని తగ్గించాలి. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్లు కొత్త మార్గాలను చూడలేరు. ఆ ఆలోచన.. ఆవిష్కరణ కార్యరూపం దాల్చి అద్భుతమైన ఫలితాలను పొందితే డబ్బు అనేది ఆటోమేటిగ్గా వస్తుంది. అందుకే మరింత మంది స్ఫూర్తి పొందేందుకు కొంతమంది కృషిని.. పట్టుదలను పరిచయం చేస్తున్నాం. వారిని ఆదర్శంగా తీసుకుని.. ఆదర్శ భారత్‌ను నిర్మిద్దాం.

ఐరాస అభివృద్ధి సూచిక:

మనకు రెండు రకాల ఆస్తులున్నాయి. ఒకటి మేధో సంపత్తి. రెండోది యువశక్తి. మేధో సంపత్తి.. యువశక్తి రెండూ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. ఈ లెక్కన భారత్ మిగతా దేశాల కంటే అన్ని రంగాల్లో ముందు వరుసలోనే ఉందని చెప్పొచ్చు. ఉదాహరణకు.. యువత జనాభా 1971లో 168 మిలియన్స్ ఉంటే.. 2011 నాటికి అది 422 మిలియన్స్‌కు చేరింది. దీన్నిబట్టి భారతదేశాన్ని చైనా.. ఇండోనేషియా దేశాల కంటే యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా.. నవ యవ్వన భారత్‌గా పేర్కొనవచ్చు. భారత్‌లో పనిచేసే వారి సంఖ్యలో పెరుగుదల.. ఆధారపడే వారి సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సూచిక ప్రకారం ఆధారపడే వారి సంఖ్యలో తగ్గుదల.. పనిచేసే వారి సంఖ్యలో పెరుగుదల ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినట్లే. వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియ ద్వారానే జాతి పునర్నిర్మాణం సాధ్యం అనేది భారతదేశం నమ్మిన సిద్ధాంతం.
Youth8

లెక్కల ప్రకారం చూసినా: ఒక ప్రైవేటు సంస్థ చూపించిన లెక్కల ప్రకారం..
-ఇండియాలో 0-14 సంవత్సరాల వయసున్నవాళ్లు 27.71% మంది ఉన్నారు.
-అలాగే 15-24 మధ్య ఉన్నవాళ్లు 17.99% మంది ఉన్నారు.
-25-54 సంవత్సరాల వయసున్నవాళ్లు 40.91% మంది ఉన్నారు.
-55-64 మధ్య వయసున్నవాళ్లయితే కేవలం 7.3% మాత్రమే ఉన్నారు. అరవై అయిదేళ్లకు పైబడిన వారైతే కేవలం 6.09%గా ఉన్నట్లు జనాభా లెక్కలు చెప్తున్నాయి.
-ఇక భారత ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే.. ఇండియాలో 10-24 వయసుగల వాళ్లు 30% ఉండగా.. 15-35 ఏండ్ల లోపున్న వారు 60% ఉన్నారు.
-2020 నాటికి ఇది 64%కి చేరుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే ఉంటారన్నమాట.
-ఇండియా జనాభాలో యువజనులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారట. అది 69.8%గా లెక్కల్లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశంగా ఇండియా తయారవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
Youth9

907
Tags

More News

VIRAL NEWS