నది పలికిన వాక్యం -Poem


Sun,April 24, 2016 01:00 AM

అందరూ ఉల్లాసంగా నవ్వుతుంటరు
అనుకోకుండా ఒక పరిచిత రూపం
తలుక్కుమంటుంది
నీ జ్ఞాపకాల పొట్లం తెరుచుకుంటుంది

poem నీవు ఓ మూలకు జారిపోతవు
సమూహపు ముచ్చట్లు దూరంగా
వినబడుతుంటయి
ఎంతకూ ఆగవు మనసు ఊటలు

ఆకాశంలో తారలు మొలకెత్తుతయి
తెల్లవార్లూ
పక్క దొర్లుతనే ఉంటది
తూర్పు ఎరుపెక్కే సమయాన
నిద్రిస్తున్న
నీ కంటి దిగుడు బాయిలో
కొన్ని కన్నీటి చారికలు ఆరిన చిహ్నాలు
మేల్కొని వుంటయి!

ప్రవహిస్తున్న నదికి మలినమంటదు
చైతన్యపు మదికి దు:ఖముండదు
పడి లేచిన కెరటానికి అలుపుండదు

సమాజపు నదిలో
అసమానతల మకిలీలు
విడువడమే ధర్మం
కంటి నది
కన్నీటి ఛాయలో
దు:ఖపు వరదకు
వీడ్కోలిచ్చిందందుకే

మానేటి గలగలల అలల వాగొడ్డున
మనసు నది పలికిన వాక్యం
జీవితాన్ని తెరిచి అంకితమిస్తుంది
నదిలో తళుక్కుమంటుంది

నీ జ్ఞాపకాల పొట్లం తెరచాపలెత్తుతుంది.

విలాసాగరం రవీందర్, 94409 32934

817
Tags

More News

VIRAL NEWS